మన భాషలో టైపింగ్‌కు కేరాఫ్ లిపికార్

లాంచ్ అయిన ఎనిమిది వారాల్లోనే లక్ష డౌన్‌లోడ్స్

మన భాషలో టైపింగ్‌కు కేరాఫ్ లిపికార్

Monday April 18, 2016,

5 min Read


టెక్నాలజీ రోజు రోజుకు విస్తరిస్తోంది. ఇంటర్నెట్‌తో ప్రపంచమే కుగ్రామంగా మారిపోయింది. ఇన్నాళ్లు కేవలం నగరాల్లోనే ఇంటర్నెట్ వినియోగముండేది. ఇప్పుడది గ్రామాల్లోకి కూడా చేరింది. ఇంతకాలం ఇంటర్నెట్ అంటే ఇంగ్లీష్ అనే అనుకునేవారు. ఇప్పుడు సీన్ మారిపోయింది. ఇంగ్లీష్ రాకపోయినా గంటల తరబడి చాటింగ్ చేయొచ్చు. ముచ్చట్లు పెట్టొచ్చు. వెబ్‌సైట్లు చదవొచ్చు. వెబ్‌సైట్లలో రాయొచ్చు. ఇలాంటి మార్పుకు కారణం ప్రాంతీయ భాషల్లో టైపింగ్ చేసుకునే అవకాశం. గతంలో కూడా టైపింగ్ కీబోర్డ్స్ ఉన్నప్పటికీ, ఆ కీబోర్డ్స్ లే అవుట్‌లను మనసులో గుర్తుంచుకోవాల్సి ఉండేది. దీంతో చాలామంది ఆ కీబోర్డ్స్‌పై ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇప్పుడు లిపికార్ అందుబాటులోకి వచ్చింది. ఎలాంటి ఇంగ్లీష్ అవసరం లేకుండా, మనసులో లే అవుట్‌ను గుర్తుంచుకోకుండా మన భాషను మరింత స్పీడ్‌గా టైప్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది లిపికార్. 2011లోనే ఆరంభమైనప్పటికీ, ఈ ఏడాది జనవరిలో యాప్ లాంచ్ అయినప్పటి నుంచి లిపికార్‌కు ఎదురే లేకుండా పోతోంది. కేవలం ఎనిమిది వారాల్లోనే లక్షమంది పెయిడ్ యూజర్లను సంపాదించిందంటే లిపికార్ ఏస్థాయిలో దూసుకెళ్తుందో అర్థం చేసుకోవచ్చు.

‘‘నీ ఎదురుగా ఉన్న వ్యక్తికి అర్థమయ్యే భాషలో మాట్లాడితే అది అతని తలకెక్కుతుంది. కానీ అతని భాషలో మాట్లాడితే హృదాయానికి చేరుతుంది’’

ఇది నల్లజాతి సూర్యుడు నెల్సన్ మండేలా భాష గురించి చెప్పిన సూక్తి. ఇది అక్షరాల నిజం.

టెక్నాలజీతో ప్రపంచం కుగ్రామంగా మారింది. ఇంటర్నెట్ ద్వారా దేశదేశాల సంస్థలు ప్రజలకు దగ్గరైపోతున్నాయి. వచ్చే రెండేళ్లలో ఈ టెక్నాలజీ మరింత విజృంభించనుంది. ఇంగ్లీష్‌లో కాదు ప్రాంతీయ భాషల్లో సైతం ప్రకంపనాలు సృష్టించనుంది. ఇంగ్లీష్‌లో కంటెంట్ ఉంటే సరిపోదని, ప్రాంతీయ భాషల్లో కూడా ఉంటేనే వ్యాపారం వృద్ధి చెందుతుందని ఓ సర్వేలో తేలింది.

లిపికార్ ఫౌండర్ నేహా గుప్తా

లిపికార్ ఫౌండర్ నేహా గుప్తా


మన దేశంలో చాలామందికి మాతృభాష మీద మమకారం ఎక్కువ. ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా, సొంత భాషలో వచ్చే దినపత్రికలను చదవకుండా ఉండలేరు. ఎకనామిక్స్ టైమ్స్‌ను చివరి అక్షరం వరకు చదివినా, మన తెలుగు పత్రికలను తిరగేయకుండా వుండలేరు. మాతృభాషపై ఇంత మమకారం ఉన్నప్పటికీ, డిజిటల్ మీడియాలో మాత్రం కొన్ని ఇబ్బందులను ఎదుర్కొవాల్సి వస్తోంది. ప్రాంతీయ భాషలో చదవాలన్నా, రాయాలన్నా చాలా కష్టపడేవారు. ఈ సమస్యలను పరిష్కరించేందుకే 2011లో లిపికార్ ప్రారంభమైంది. ఎంఎస్ ఆఫీస్, వెబ్‌సైట్స్, బ్రౌజర్ ప్లగిన్స్, కీబోర్డ్ యాప్స్, యాండ్రాయిడ్ ఫోన్స్‌ వంటి వాటిలో 18 భాషల్లో ఉపయోగించుకునేందుకు ఈ సాఫ్ట్‌వేర్‌ను రూపొందించారు. కేంద్ర ప్రభుత్వం, లాంగ్వేజ్ పార్ట్‌నర్ రివేరా లాంగ్వేజ్ టెక్నాలజీ సహకారంతో మార్చి 11న ఢిల్లీలో యువర్‌స్టోరీ నిర్వహించిన భాషా ఫెస్టివల్‌లో లిపికార్‌ను ప్రదర్శించారు.

ఈ ఏడాది జనవరిలో లిపికార్ తమ ఫ్రీ వెర్షన్ యాప్‌ను లాంచ్ చేసింది. ఆవిష్కరించిన తొలి ఎనిమిది వారాల్లోనే ఒక లక్ష యాక్టీవ్ మంత్లీ యూజర్లను సొంతం చేసుకుంది.

యువర్‌స్టోరీ నిర్వహించిన భాషా పండుగ

యువర్‌స్టోరీ నిర్వహించిన భాషా పండుగ


లిపికార్‌ ప్రతిభను 2011లోనే యువర్‌స్టోరీ గుర్తించింది. భాషా ప్రేమికులకు లిపికార్‌ అవసరం ఎంతో అప్పుడే ప్రపంచానికి చాటింది. ఆ సమయంలోనే లిపికార్ ఫౌండర్ నేహా గుప్త తమ సంస్థ ఏర్పాటు గురించి యువర్‌స్టోరీతో పంచుకున్నారు.

‘‘లిపికార్ ఆలోచన అనుకోకుండా వచ్చింది. వాస్తవానికి ఈ ఐడియా మా నాన్నది. కాన్సెప్ట్, పేటెంట్ రైట్స్ రెండూ ఆయనకే చెందుతాయి. చూసేందుకు ఇది సులభంగానే కనిపిస్తున్న దీని వెనుక ఎంతో శ్రమ ఉంటుంది. ఆ డిజిటల్ లెడ్ స్ర్కోలింగ్ డిస్ ప్లేపై కనిపించాలంటే ఆపరేటర్ ఎప్పటికప్పుడు టైప్ చేస్తూ ఉండాలి. నిమిష నిమిషానికి డిస్ ప్లే మారిపోతూ ఉంటుంది. ఆ సందేశాలు కంప్యూటర్లో టైప్ చేస్తే ఎలా ఉంటుంది అన్న ఆలోచన మాకు వచ్చింది. దాని పర్యవసానమే లిపికార్’’ అని నేహ వివరించారు.

లిపికార్ ఎందుకు..?

చక్కగా రీసెర్చ్ చేసి, కొద్దిపాటి ఎండ్ యూజర్ సమస్యలను కూడా పరిష్కరం చూపేదే అత్యుత్తమ ప్రాడక్ట్. లిపికార్ కూడా అదే కోవలోకి చెందుతుంది. చేతివేళ్లతో టకటకా కొడితే.. దాని ఫీచర్లు కళ్లలో కనిపిస్తుంటాయి.

ఇంగ్లీష్‌లో పట్టు అవసరంలేదు: 

లిప్యాంతరీకరణ కోసం హిందీ లేదా ప్రాంతీయ భాషా పదాలను తరచుగా ఇంగ్లీష్‌లో పలుకాల్సి ఉంటుంది. ఇలా చేయాలంటే ఇంగ్లీష్‌పై మంచి పట్టు అవసరం. అయితే లిపికార్ యూజర్లకు మాత్రం ఇంగ్లీష్ అల్ఫాబెట్స్ శబ్దం తెలిసుంటే సరిపోతుంది. ఈ టైపింగ్ పద్ధతిని ఉపయోగించి ఎలాంటి అంచనాలు అవసరం లేకుండా కచ్చితత్వంతో టైప్ చేయగలుగుతారు.

సులభ, స్పష్టమైన టైపింగ్ పద్ధతి:

లిపికార్ ఫొనోటిక్ శబ్దాలు, టైపింగ్‌కు ఉపయోగించే క్వార్టీ కీబోర్డు ఆధారంగా పనిచేస్తుంది. ఇన్‌స్క్రిప్ట్ లేదా యాపిల్ వంటి కీబోర్డులకు లే అవుట్‌లను మనసులో గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఏదైనా టైప్ చేయాలంటే అక్షరాలు ఎక్కడున్నాయో మనసులోనే ఆలోచించాలి. ఈ విధానాన్ని పాటించడం చాలా కష్టం. కానీ లిపికార్‌లో అలాంటి సమస్యలేదు.

గత ఐదేళ్లుగా లిపికార్ యూజర్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. యూజర్లు తమపై ఉంచిన నమ్మకమే లిపికార్ టీమ్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతోంది.

‘‘ఆరంభంలో లిపికార్‌ను లాయర్లు, రచయితలు, టీచర్లు, చిన్న వ్యాపారులు, ప్రకటనకర్తలు వంటి ప్రొఫెషనల్స్ మాత్రమే ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం లిపికార్ పెయిడ్ యూజర్లలో 40% వ్యక్తిగత ఉపయోగానికి అంటే ఫేస్‌బుక్, ఈ-మెయిల్స్ వంటి వాటికి వినియోగిస్తున్నారు. వెరైటీ వంటకాలను తయారు చేసే విధానాన్ని కూడా రాసేందుకు మా లిపికార్ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారు. ప్రాంతీయ భాష విస్తృతమవుతుందనడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ అక్కర్లేదు’’ - నేహ 

పుణెలోని లిపికార్ కార్యాలయంలో బ్యాక్‌ఎండ్ వ్యవహారాలు పర్యవేక్షించే ఉద్యోగులు  

పుణెలోని లిపికార్ కార్యాలయంలో బ్యాక్‌ఎండ్ వ్యవహారాలు పర్యవేక్షించే ఉద్యోగులు  


వ్యక్తిగత యూజర్లకు లిపికార్ పీసీ లైసెన్స్ ధర రూ.1749. తమ వెబ్‌సైట్‌ ద్వారా ఆరంభంలో అమ్మకాలు జరిగేవని, ఇప్పుడు తమతో ఒప్పందం కుదుర్చుకున్న డీలర్ల ద్వారా సాఫ్ట్‌వేర్‌ను విక్రయిస్తున్నామని నేహ తెలిసారు. అలాగే వెబ్‌సైట్లకు వెబ్ ప్లగిన్ లైసెన్స్‌ను కూడా లిపికార్ విక్రయిస్తోంది. పీసీ వెర్షన్‌కు మూడు వేల మంది పెయిడ్ కస్టమర్లున్నారని, అందులో 15% రిపీటెడ్ కస్టమర్లని నేహ వివరించారు. లిపికార్ హెచ్‌సీఎల్, ఐటీసీ, వాట్స్‌ఆన్‌ఇండియా వంటి సంస్థలకు బల్క్ లైసెన్స్‌లను కూడా విక్రయిస్తోంది.

సూపర్ స్టార్ ప్రాడక్ట్‌గా ఎదగడం ఎలా?

స్టార్టప్ రంగంలో సంచలనం సృష్టిస్తున్న నేహా గుప్తాకు ఇదే తొలి స్టార్టప్ కాదు. గతంలో ఓ ఈ-కామర్స్ కంపెనీకి కో ఫౌండర్‌గా వ్యవహరించారు. ఒకానొక సమయంలో లిపికార్ లాభసాటి వ్యాపారం కాదని చాలామంది నేహను వెనక్కి లాగే ప్రయత్నం చేశారు. కొద్ది పాటి ఏంజెల్ ఇన్వెస్ట్‌మెంట్‌ను పక్కనపెడితే.. దాదాపు సొంతమూలధనంతోనే సంస్థను ప్రారంభించారు నేహ. మార్కెట్‌ను దున్నిపారేస్తున్న తమ ప్రాడక్ట్‌ను ఎలా ప్రారంభించారో నేహ యువర్‌స్టోరీకి వివరించారు. సంస్థను ఎలా విజయవంతంగా నడపాలో ఆమె వివరించారు.

చిన్నగా ప్రారంభించు: 

తొలిసారే పెద్ద ఎత్తున ప్రారంభించేందుకు ప్రయత్నించొద్దు. మా ఫస్ట్ వెర్షన్ మొబైల్ యాప్‌ను చాలా సింపుల్‌గా ఎలాంటి ఫ్యాన్సీ యూఐ లేకుండా, బేసిక్ ఫంక్షనాలిటీతోనే కేవలం మూడు వారాల్లోనే ప్రారంబించాం. మాకు వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కస్టమర్ల ఏం కోరుకుంటున్నారు, ఎలాంటి ఫీచర్లు ఉండాలి, పోటీ తట్టుకోవాలంటే ఏం చేయాలన్నదానిపై ఓ నిర్ణయానికొచ్చాం.

అందుబాటులో ఉండండి: 

మీ ప్రాడక్ట్‌తో యూజర్ ఏం చేస్తున్నారో ఎప్పటికప్పుడు గమనిస్తుండండి. ప్రాడక్ట్‌ను ఉపయోగిస్తున్నప్పుడు ఎలా వ్యవహరిస్తున్నారో చూడండి. ఏ పరిస్థితుల్లో ప్రాడక్ట్‌ను వదులుకోవాలని యూజర్ అనుకుంటున్నారో తెలుకోండి. ఇలాంటివే నన్ను ప్రాడక్ట్‌పై మరింత దృష్టిపెట్టేలా చేశాయి. ఇలాంటివే మీ శక్తిమంతమైన పార్ట్‌నర్‌ను దగ్గరి చేయడంలో ఉపయోగపడుతాయి. మీకు వచ్చిన క్లయిమ్స్ డాటా మీ దగ్గరుంటే యూజర్లు మిమ్మల్ని మరింత సీరియస్‌గా తీసుకుంటారు.

మార్పుకు సిద్ధంగా ఉండండి:

 ఆరంభంలో మేం ఎక్కువగా పీసీ ప్రాడక్ట్స్‌పైనే దృష్టిపెట్టాం. అయితే గత రెండేళ్లుగా మొబైల్ యాప్స్, వెబ్‌సైట్ ప్లగిన్స్‌పై ఫోకస్ పెట్టాం. మొబైల్ ప్లాట్‌ఫామ్‌పై మా విజయం అన్ని కీబోర్డుల మాదిరి లిపికార్ కాదని నిరూపించింది. సమస్యను నిజంగా పరిష్కరిస్తుందని యూజర్లలో విశ్వాసాన్ని నింపింది. మొబైల్ యాప్ పీసీ సేల్స్‌ను పెంచేందుకు ఎంతో ఉపయోగపడింది. చాలామంది ప్రజలు స్థిరమైన టైపింగ్ అనుభవం కావాలనుకుంటున్నారు. ‘‘సాధారణంగా డెసిషన్ మేకింగ్ పవర్స్ ఉన్నవారు, ఇంగ్లీష్‌ ఫ్లూయంట్‌గా మాట్లాడేవారు లిపికార్ కంటే కూడా చక్కగా లిప్యంతరీకరణ చేసుకోవచ్చు. అయితే ఇంగ్లీష్ మాట్లాడని కస్టమర్లకు లిపికార్ ఏ విధంగా సాయపడుతుందో వారు చూడలేరు’’ అని తనకు ఎదురైన సమస్యల గురించి నేహ వివరించారు. పెద్ద పెద్ద సంస్థలతో పని నెమ్మదిగా సాగుతుందని ఆమె పేర్కొన్నారు. ‘‘పెద్ద పెద్ద డీల్స్ సాదారణంగా తొమ్మిది నెలల్లో పూర్తవుతాయి. మిగతా మూడునెలల్లో పేమెంట్ పూర్తి చేస్తారు’’ అని ఆమె చెప్పారు.

image


పైరసీ ప్రతాపం..

భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ డబ్బు పెట్టి కొనుగోలు చేసుందకు కొన్ని ఆటంకాలున్నాయని ఆమె తెలిపారు. చాలామంది పైరసీవైపే మొగ్గుచూపుతారని చెప్పారు. ఆడోబ్, మైక్రోసాఫ్ట్, ఇతర పెద్ద సంస్థలే తమ ప్రాడక్ట్‌లను భారత్‌లో అమ్ముకోలేకపోయాయి. పెద్ద ఎత్తున జరిగిన పైరసీకి అవి కూడా బాధితులుగా మారాయి. పెయిడ్ యాప్స్‌కు ఇండియాలో అంత క్రేజ్ లేదు అని ఆమె వివరించారు.

మరికొంతమందితో ఒప్పందం కుదుర్చుకుని, పీసీ, వెబ్, మొబైల్ ప్రాడక్ట్స్‌ను మరింతమంది యూజర్లకు దగ్గరచేయాలన్నదే లిపికార్ ప్రధాన లక్ష్యం. ‘‘పీసీ వెర్షన్‌లో అద్భుతమైన అటాచ్ రేట్ (>75%) కనిపిస్తోంది. అందుకే పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోవాలనుకుంటున్నాం. భారతీయ కంటెంట్‌ను చాలా వెబ్‌సైట్లు సపోర్ట్ చేస్తున్నాయి. స్మార్ట్‌ఫోన్ ఉత్పత్తిదారులతో కూడా ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. వెబ్ ప్లగిన్స్‌ను కూడా మరింత అగ్రెసివ్‌గా ముందుకు తీసుకెళ్లాలనుకుంటున్నాం’’ అని నేహా గుప్తా వివరించారు. ఇంటర్నెట్‌లో ప్రాంతీయ భాషలకు పట్టం కడుతున్న లిపికార్ మరింత విజయం సాధించాలని యువర్‌స్టోరీ కోరుకుంటోంది.

Website: