స్టార్టప్ కంపెనీలు బెంగళూరుకు ఎందుకు క్యూ కడుతున్నాయంటే..?

స్టార్టప్ కంపెనీలు బెంగళూరుకు ఎందుకు క్యూ కడుతున్నాయంటే..?

Thursday March 17, 2016,

4 min Read


ఇండియన్ సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగళూరులో ఐటీ కంపెనీలకు కొదవలేదు. హైదరాబాద్, చెన్నై, గుర్గావ్‌లాంటి నగరాలు పోటీ ఇచ్చినా బెంగళూరువైపు చాలా కంపెనీలు మొగ్గుచూపుతాయి. ఇప్పుడు స్టార్టప్ రంగంలోనూ బెంగళూరు దూసుకెళుతోంది. ఓ వైపు హైదరాబాద్ మరోవైపు గుర్గావ్‌లు కూడా ఆకర్షిస్తున్నప్పటికీ చాలా స్టార్టప్ కంపెనీలు బెంగళూరులోనే పురుడు పోసుకుంటున్నాయి. అసలు బెంగళూరుపై ఐటీ, స్టార్టప్ కంపెనీలకు ఎందుకంత ప్రేమ.. ఇదే విషయాన్ని వివరిస్తున్నారు అప్పీనెస్ ఇంటెరాక్టీవ్ సీఈవో వికాశ్ వివాంభరన్.. 

అంట్రప్రెన్యురల్ జర్నీని బెంగళూరులో ఎందుకు ప్రారంభించారని చాలా మంది అడుగుతుంటారు. ఆ నిర్ణయం తీసుకోవడానికి ప్రభావితం చేసిన కారణాల గురించి కూపీ లాగుతుంటారు. అయితే బెంగళూరును ఎంచుకోవడానికి ఎన్నో కారణాలున్నాయి.

2011లో స్వయం ఉపాధి కెరీర్‌ను ఎంచుకున్నాను. అంతకుముందు డిసెంబర్ 31, 2010 వరకు సిలికాన్ ఇండియాలో సీనియర్ ప్రాడక్ట్ మేనేజర్, ఆన్‌లైన్ ఎడ్యుకేషన్‌ డైరక్టర్‌గా పనిచేశాను.

అసలు.. బెంగళూరు పేరు వింటేనే వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. అక్కడి కన్నడీగులు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. విభిన్న సంస్కృతికి నిలయం. బెంగళూరు గురించి చెప్పేముందు ఈ నగరం చరిత్ర గురించి వివరిస్తాను. భారత్‌కు స్వాతంత్రం రాకముందే వివిధ సంస్కృతులకు వేదిక బెంగళూరు. కొన్ని ప్రాంతాలు బ్రిటీష్ ఎంపైర్‌ కిందికి, మరికొన్ని మద్రాస్ ప్రెసిడెన్సీ ఆధిపత్యంలో, ఇంకొన్ని మైసూర్ మహరాజా ఆధీనంలో ఉండేవి. మైసూరు రాజుల ఆధీనంలో ఉన్న బసవన్నగుడి, మల్లేశ్వరం ప్రాంతాల్లో ఎక్కువగా కన్నడిగులుండేవారు. కంటోన్మెంట్, కేఆర్ పురం వంటి ప్రాంతాల్లో తమిళులు, తెలుగు మాట్లాడేవారు నివసించేవారు.

image


భారత్‌కు స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇస్రో, బీహెచ్‌ఈఎల్, బీఈఎల్, హెచ్‌ఏఎల్‌ వంటి ప్రభుత్వ రంగ సంస్థల కేంద్ర కార్యాలయాలు బెంగళూరులోనే ఏర్పాటయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు ఇక్కడ నివాసమేర్పర్చుకునేవారు. ఉత్తర భారత దేశం నుంచి వచ్చిన వారు హిందీలో, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ల నుంచి వచ్చినవారు వారి మాతృభాషలో పలుకరించుకునేవారు. దీంతో బెంగళూరు విభిన్న సంస్కృతులకు నిలయంగా మారిపోయింది. అన్ని రాష్ట్రాల ప్రజలకు బెంగళూరు సొంత రాష్ట్రంగా మారిపోయింది. దీంతో ప్రపంచం నలుమూలల నుంచి ప్రజలు వస్తుండటంతో రోజురోజుకు బెంగళూరు విస్తరించింది. అంతేకాదు బెంగళూరు ప్రజలు మొదటి నుంచి కొత్తదనాన్ని ఆస్వాదిస్తారు. కొత్త విషయాలను నేర్చుకునుందుకు ఆసక్తి చూపడమే కాదు.. ఎవరైనా ట్రై చేస్తుంటే వారికి మద్దతు ఇస్తారు.

వ్యవస్థాపక కెరీర్‌ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్న సమయంలో ఓ స్నేహితుడు తన కార్యాలయాన్ని షేర్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. నా ఆఫీస్ సెటప్ పెట్టుకునేందుకు ఎంతో సహకరించారు. ఇలాంటి విధానం గురించి నేను యువ అంటర్‌ప్రెన్యూర్లకు చెప్తుంటాను... మీకు ఆఫీస్ కానీ, ఇల్లు కానీ ఉండి ఉంటే, దాన్ని ఇతరులతో షేర్ చేసుకునేందుకు మీ ఫ్రెండ్స్‌తో, మీ కుటుంబ సభ్యులతో మాట్లాడండి. ఇలా చేయడం మంచి విధానం. ఒక సంస్థ సెటిల్ అయ్యే వరకు ఖర్చులో కొంత తగ్గుతుంది. ఖర్చు, పనే కాదు.. మంచి మద్దతు కూడా లభిస్తుంది.

అంటర్‌ప్రెన్యూర్‌లకు కావాల్సిన వసతులు..

విజయవంతమైన వ్యాపారాన్ని నడపాలంటే అంట్రప్రెన్యూర్లకు సుహృద్భావ వాతావరణం ఉండాలి. అందుకు కావాల్సినవి..

టాలెంట్: దేశంలోనే అత్యుత్తమ సాంకేతిక నైపుణ్యం ఉన్న యువకులకు బెంగళూరులో కొదవలేదు. ఒకవేళ మీరు టెక్నాలజీ కంపెనీని స్థాపించాలనుకుంటే అందుకు బెంగళూరును మించిన ప్లేస్ మరొకటి ఉండదు. ఈ కారణంతోనే ప్రపంచంలోని పలు అంతర్జాతీయ కంపెనీలు తమ కార్యాలయాలను బెంగళూరుకు తరలి వస్తున్నాయి. వెండర్లు, సర్వీస్ ప్రొవైడర్ల విషయంలోనూ ఎన్నో అవకాశాలు బెంగళూరులో లభిస్తాయి.

నేర్చుకునేందుకు అవకాశాలు: ఎంత అనుభవమున్నా, ప్రతి అంటర్‌ప్రెన్యూర్ ఎప్పటికప్పుడూ ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉండాలి. ముఖ్యంగా స్టార్టప్ కంపెనీ నిర్వహిస్తుంటే ఒంటరిగా పనిచేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాంటి సమయంలో ట్రెండ్స్ గురించి ఎప్పటికప్పుడు తెలుసుకుంటుండాలి. లేకపోతే పోటీలో వెనుకపడిపోవడం ఖాయం. కానీ బెంగళూరులో తెలుసుకోవడానికి ఎన్నో అవకాశాలున్నాయి. ముఖ్యంగా స్టార్టప్స్, అంట్రప్రెన్యూర్షిప్‌ల గురించి ఎన్నో సమావేశాలు జరుగుతుంటాయి. చాలామంది అంట్రప్రెన్యూర్లు సమావేశాలకు హాజరై తమ విజయగాథలను అందరితోనూ పంచుకుంటారు. అంతేకాదు ఓటమి చెందిన వారు సైతం తమ వైఫల్యాలకు గల కారణాలను వివరిస్తారు.

మార్కెట్: ఇంతకుముందు చెప్పినట్టుగానే బెంగళూరు స్టార్టప్ కంపెనీలకు మంచి వేదిక. సంస్థను ప్రారంభించి వీధులల్లోకి వెళితే చాలు తొలి కస్టమర్ దొరికిపోతాడు. కొత్త విధానాలను పాటించేందుకు ప్రజలు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అప్పటివరకు పరిచయంలేని పరిష్కారాలను ప్రయత్నిస్తారు.

నెట్‌వర్కింగ్: ప్రత్యర్థి గురించి భయపడటమే అందరూ చేసే ప్రధాన పొరపాటు. కలిసి పనిచేయడం, నేర్చుకోవడమే అన్నిటికన్నా ముఖ్యం. ఇలా చేస్తే అవకాశాలు, ఐడియాలు ఎప్పటికప్పుడూ వస్తూనే ఉంటాయి. బెంగళూరులో ఎన్నో నెట్‌వర్కింగ్ ఈవెంట్స్ ఎప్పుడూ ఉంటూనే ఉంటాయి. ఫౌండర్‌కు ఫోన్ చేసి నేరుగా మాట్లాడొచ్చు. ఇలా నేను ఎన్నోసార్లు చేశాను కూడా. ఎవరూ ఎప్పుడూ కూడా నాకు నో చెప్పలేదు. ఇద్దరు ఫౌండర్లు కలిసినప్పుడు వారు మాట్లాడుకునేందుకు ఎన్నో కామన్ విషయాలుంటాయి.

వినోదం: కష్టించి పనిచేయు.. ఎంతో ఆనందించు. ఇదే సరైన మార్గం. చాలామంది అంటర్‌ప్రెన్యూర్లలో ఇది చాలా కామన్. వినోదాన్ని ఆస్వాదించేందుకు అందరూ ముందుంటారు. ఎప్పుడూ పనే అంటే శరీరం త్వరగా అలిసిపోతుంది. కష్టించి పని చేసిన తర్వాత బీర్ కొట్టి సేదదీరేందుకు బెంగళూరులో ఎన్నో ప్రదేశాలున్నాయి.

బెంగళూరులో ఎప్పుడూ ఏదో ఓ పార్టీ జరిగే ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. ఇలాంటి ప్రదేశాల్లో మనలాంటి వారు ఎంతో మంది వస్తుంటారు.

కోరమంగళ, ఇందిరా నగర్, హెచ్‌ఎస్‌ఆర్ వంటి శివార్లలో అహ్లాదరకర వాతావరణం ఉంటుంది. ఇలాంటి ప్రాంతాల్లో చాలా స్టార్టప్ కంపెనీలు పుట్టుకొస్తున్నాయి. ఇందుకు ముఖ్య ఉదాహరణ ఫ్లిప్‌కార్ట్. ఇదొక్కటే కాకుండా ఓలా క్యాబ్స్, స్విగ్గీ, లోకల్ ఓయే, మొమో, హాకర్ ఈర్త్‌, ఇన్‌స్టామోజో, గ్రాబ్‌హౌజ్ వంటి విజయవంతమైన స్టార్టప్ కంపెనీలు కోరమంగళలోనే ప్రారంభమయ్యాయి.

స్టార్టప్ కంపెనీలే కాకుండా, ఈ ప్రాంతంలో ఎన్నో కో వర్కింగ్ స్పేస్‌, ఇన్వెస్టర్లు, యాక్సిలేటర్లు, ఈవెంట్ స్పేస్‌లు అందుబాటులో ఉంటాయి. సంస్థను ప్రారంభించేందుకు ఇంతకంటే మంచి ప్రదేశం లేదనడానికి ఈ ఉదాహరణలు చాలు. ఈ ప్రాంతాలన్నీ యూత్, వైబ్రంట్, కాస్మోపాలిటన్ కల్చర్ తో నిండివుంటుంది.

కోరమంగళలోని కోస్టా కాఫీ స్టార్టప్ ప్రారంభించాలనుకునేవారికి, ఇన్వెస్టర్లకు కేరాఫ్‌ అడ్రస్. ఆసక్తికరమైన అంట్రప్రెన్యూర్లను కలుసుకునేందుకు, వారితో మాట్లాడేందుకు అంతకంటే మంచి వేదిక దొరకనే దొరకదు.

కోరమంగళను నేను ఎందుకు ఎంచుకున్నానంటే..

1. అందుబాటు: ఏదైనా సంస్థ ప్రారంభించే ముందు అన్నిటి కంటే యాక్సెసబిలిటీయే ముఖ్యం. ప్రజలు సులువగా వచ్చేందుకు అవకాశం ఉండాలి. కోరమంగళకు ప్రజా రవాణా సౌకర్యం చాలా బాగుంది.

2. సౌకర్యాలు: కోరమంగళలో అన్నిరకాల సౌకర్యాలు లభిస్తాయి. క్లయింట్లతో, స్టాఫ్‌తో మాట్లాడేందుకు ఎన్నో ఫుడ్ జాయింట్స్ ఉన్నాయి. జీవితమంటే ఆఫీస్ పని ఒక్కటే కాదు. ఎన్నో వ్యక్తిగత పనులుంటాయి. లంచ్ సమయంలోనే బిల్లులు పే చేసేందుకు, బ్యాంక్ కార్యకలాపాలు నిర్వహించేందుకు కోరమంగళలో మంచి అవకాశాలున్నాయి. పబ్లిక్ గ్రౌండ్స్, పార్క్స్, మల్టీప్లెక్సెస్, హాస్పిటల్స్, మేజర్ సర్వీస్ సెంటర్స్, అకామిడేషన్స్ ఫెసిలిటీస్, హోటల్స్ వంటి ఎన్నో సౌకర్యాలు ఇక్కడ ఉన్నాయి. యువ టాలెంట్‌ను ఆకర్షించేందుకు ఇవి ఎంతో సాయం చేస్తాయనడంలో సందేహం అక్కర్లేదు.

3. రెస్టారెంట్స్: బెంగళూరులో ఎక్కువ శాతం ప్రజలు ప్రయాణాల్లోనే సమయాన్ని గడుపుతుంటారు. ఇలాంటి వారికి ఎక్కడో ఒక చోట తినడాన్ని ఇష్టపడుతారు. కోరమంగళలో ఎన్నో రెస్టారెంట్లున్నాయి. వివిధ పనులు మీద ఇక్కడికి వచ్చేవారికి, ఉద్యోగులకు లంచ్ చేసేందుకు ఎన్నో అవకాశాలున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే కోరమంగళలో ఉంటే ఇంట్లో ఉన్నట్టే. ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏం కావాలంటే అది లభిస్తుంది.

4. రక్షణ: నా వరకు చెప్పాలంటే బెంగళూరులో కోరమంగళను మించిన సురక్షిత ప్రాంతం మరోటి లేదు. రాత్రి వేళల్లో పనిచేస్తున్నప్పుడు రక్షణ గురించి ఎవరూ భయపడాల్సిన పనిలేదు. స్టార్టప్ సంస్థలకు ఇదెంతో కీలకం.

5. ట్రెండీ: కోరమంగళ బెంగళూరులో అన్ని ప్రాంతాల కంటే ఆధునికమైనది కూడా. కోరమంగళ అడ్రెస్ అంటే అదో హోదా వంటిది. నాణ్యమైన క్లయింట్లను పొందేందుకు ఇదెంతో ఉపయోగపడుతుంది.

6. ఖర్చు: ఖర్చు విషయంలో కూడా కోరమంగళ స్టార్టప్ ఫ్రెండ్లీ ప్లేస్. ఇతర ప్రాంతాలతో పోలిస్తే కాస్త ప్రత్యేకమైనది కూడా.

అందుకే స్టార్టప్ కంపెనీని పెట్టుందుకు నేను బెంగళూరునే ఎంచుకున్నాను. అని ముగించారు వికాశ్.