ఒకప్పుడు రైళ్లలో పిప్పరమెంట్లు అమ్మేకుర్రాడు.. సల్మాన్, అమీర్ ఫేవరెట్ ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాడు

ఒకప్పుడు రైళ్లలో పిప్పరమెంట్లు అమ్మేకుర్రాడు.. సల్మాన్, అమీర్ ఫేవరెట్ ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాడు

Friday April 14, 2017,

3 min Read

జీవితం చాలా విచిత్రమైంది. ఏ రోజున ఎలాంటి మలుపు తిరుగుతుందో ఊహించడం కష్టం. ఆ మలుపు జీవితంలో గెలుపుగా మారితే అంతకంటే సంతోషం మరొకటి లేదు. ఈ స్టోరీలో రాకేశ్ ఉడియర్ లైఫ్ కూడా అలాంటి టర్నింగే తీసుకుంది. ఒకప్పుడు రైళ్లలో చాక్లెట్లు, పిప్పరమెంట్లు అమ్ముకునే కుర్రాడు- ఇప్పుడు బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ కు ఫిట్నెస్ ట్రైనర్ అయ్యాడు.

image


రాకేశ్ పుట్టింది మధ్యతరగతి కుటుంబంలో. తండ్రి హమిల్టన్ సైకిల్ కాంట్రాక్టర్. రాకేశ్ కి ఐదేళ్లప్పుడు నాన్నకి గుండెపోటు వచ్చింది. సంపాదించే పెద్దదిక్కు హాస్పిటల్ పాలు కావడంతో, పూటగడవడం కష్టంగా మారింది. చికిత్స చేయించడానికి డబ్బుల్లేవు. స్కూల్ ఫీజు కూడా కట్టలేని దైన్యస్థితి. ఇంటి అద్దె కష్టంగా మారింది. చేసేదేం లేక మురికివాడకు షిఫ్టయ్యారు. ఇల్లు గడవడానికి రాకేశ్ కూల్ డ్రింక్స్ అమ్మడం మొదలుపెట్టాడు. రోజుకి పదిరూపాయలు వచ్చేవి.

అమ్మ ఇళ్లలో పాచిపని చేసేది. అన్న టీ కొట్టు నడిపేవాడు. ఇంతమంది పనిచేయగా వచ్చిన ఆ కాస్త డబ్బులతో రాకేశ్ ఒక స్కూల్లో చేరాడు. అందరూ పొద్దున్నే బడికిపోతే ఈ కుర్రాడు మధ్యాహ్నం ఒంటిగంటకు వెళ్లేవాడు. అప్పటి దాకా రైళ్లలో పెప్సీకోలా, పిప్పరమెంట్లు అమ్మేవాడు. వచ్చిన డబ్బులతో పుస్తకాలు, నోట్ బుక్సు కొనుక్కునేవాడు.

భవన నిర్మాణ కూలీగా కూడా కొన్నాళ్లు పనిచేశాడు. పెద్దపెద్ద బండలు అలవోకగా ఎత్తేవాడు. అలా కండరాలు గట్టిగా తయారయ్యాయి. కొన్నాళ్లకు మంచి ఫిజిక్ తేలింది. ఆ తర్వాత ఓ దాబాలో పనిచేశాడు. అక్కడ ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు. ఇతని కండలు చూసి.. ఇక్కడెందుకు పనిచేస్తున్నావ్.. నాకు తెలిసిన ఒక జిమ్ ఉంది.. అందులో చేరు అన్నాడు. అలా రాకేశ్ జిమ్ లో మొదట స్వీపర్ గా జాయిన్ అయ్యాడు.

image


ఆ జిమ్ కి చాలామంది వస్తుంటారు. అందులో ఒకతను బాగా పొద్దుపోయాక వస్తాడు. ఆ టైంలో జిమ్ బాగా రద్దీగా ఉంటుంది. వచ్చిన వ్యక్తి ఇంట్రస్ట్ గమనించాడు రాకేవ్. మెల్లిగా దగ్గరికి వెళ్లి అలా కాదు.. ఇలా అని తనకి తెలిసిన కిటుకులు చెప్పాడు. రాకేశ్ చెప్పే తీరు నచ్చింది అతనికి. వెంటనే అతను నేను జిమ్ పెడతాను.. నువ్వే దానికి ట్రైనర్ అన్నాడు. రాకేశ్ నోటమాట రాలేదు. అతను చెప్పిన మాటతో జీవితం ఊహించని మలుపు తిరిగింది.

అప్పటికీ రాకేశ్ కి చదువు లేదు. ప్రొఫెషన్ ట్రైనర్ అవ్వాలనే ఉద్దేశంతో ఆన్ లైన్ కోర్స్ చేశాడు. ఊహించినట్టుగానే సర్టిఫికెట్ సంపాదించాడు. అమెరికా, దుబాయ్ వెళ్లడానికి అవకాశం వచ్చింది. అక్కడ ఐదేళ్లు కోచ్ గా చేయడానికి మంచి ఆఫర్ ఇచ్చారు. ఐదేళ్లు విదేశాల్లో ట్రైనర్ గా మంచి పేరు సంపాదించాడు. తర్వాత ఇండియాకి వచ్చాడు. ఒక ఫ్రెండ్ కోరిక మేరకు గోల్డ్స్ అనే జిమ్ లో హై ప్రొఫైల్ వ్యక్తులకు శిక్షణ ఇచ్చేందుకు ఒప్పుకున్నాడు. అలా రాకేశ్ జర్నీలో బాలీవుడ్ ఎంటరైంది.

దియా మీర్జా, పుల్కిత్ సామ్రాట్, డైజీ షా, కునాల్ కపూర్ లాంటి వాళ్లకు ట్రైనర్ గా పనిచేశాడు. అర్బాజ్ ఖాన్ పుణ్యమా అని ఏకంగా ఖాన్ ఫ్యామిలీకే కోచ్ అయ్యాడు. ఆ క్రమంలోనే దబాంగ్ సినిమా కోసం సల్మాన్ ఖాన్ కు ట్రైనర్ అయ్యాడు. రాకేశ్ తర్ఫీదు ఇచ్చే తీరు సల్లూ భాయ్ ని ఆకట్టుకుంది.

ఒకసారి ముంబైలోని తాజ్ హోటల్లో ఒకరికి ట్రైనింగ్ ఇస్తుంటే అమీర్ ఖాన్ చూశాడు. అప్పుడు అమీర్ ధూమ్-3 చేస్తున్నాడు. మరో ఆలోచన చేయకుండా రాకేశ్ నంబర్ తీసుకున్నాడు. అనుకున్నట్టుగానే అమీర్ నుంచి కాల్ వచ్చింది. పీకే సినిమా కోసం నాకు ట్రైనర్ గా వస్తావా అనేది ఆ ఫోన్ కాల్ సారాంశం. కానీ రాకేశ్ ఒప్పుకోలేదు. ఎందుకంటే ఆల్రెడీ సల్మాన్ ఖాన్ కి చేస్తున్నాను.. వీలుకాదు క్షమించాలి అన్నాడు. విషయం తెలుసుకున్న సల్మాన్ ఖాన్ – పర్లేదు అమీర్ పిలుస్తున్నాడు కదా వెళ్లు.. నాకు నువ్విచ్చిన ట్రైనింగ్ సరిపోతుంది అన్నాడు. సల్లూభాయ్ అర్ధం చేసుకోవడంతో అమీర్ తో డేట్స్ కుదిరాయి.

కొన్నాళ్లకు ఇద్దరికీ డేట్స్ అడ్జస్ట్ చేసుకుని ట్రైనింగ్ ఇచ్చాడు. అప్పుడు సల్మాన్ సుల్తాన్ చేస్తుంటే అమీర్ దంగల్ సెట్స్ మీద ఉన్నాడు.

ప్రస్తుతం రాకేశ్ బాలీవుడ్ స్టార్లకు అత్యంత ప్రియమైన ఫిట్ నెస్ ట్రైనర్. ఒకప్పుడు తినడానికి తిండిలేని పరిస్థితి నుంచి ఇవాళ హై ప్రొఫైల్ వ్యక్తులకు ఆత్మీయుడయ్యాడు. ఆకలి కోసం కండలు కరిగించి.. అదే కండలతో జీవితాన్ని సార్ధకం చేసుకున్నాడు.

ఇప్పుడు ఫిట్నెస్ ట్రైనర్ రాకేశ్ అంటే సాదాసీదా వ్యక్తికాదు. దేశంలోనే మోస్ట్ ప్రిఫరబుల్ ట్రైనర్.