నేటి బడా కంపెనీలన్నీ ఒకప్పుడు అపార్ట్‌మెంట్లలో పుట్టినవే!

సాధించాల‌న్న ప‌ట్టుద‌ల ఉండాలే కానీ.. డ‌బ్బులు, వ‌స‌తులు లేకపోయినా అనుకున్న‌ది చేరుకుంటారు. ప్ర‌పంచంలో టాప్ కంపెనీల్లో చాలా ఇలా ఆరంభంలో క‌ష్టాల్లో ప‌య‌నించిన‌వే. అమెరికాలో అయితే గ్యారేజీలు.. ఇండియాలో అపార్ట్‌మెంట్‌లు.. కొత్త కొత్త ఆలోచ‌న‌ల‌కు స్టార్టింగ్ పాయింట్లుగా మారుతున్నాయి.

నేటి బడా కంపెనీలన్నీ ఒకప్పుడు అపార్ట్‌మెంట్లలో   పుట్టినవే!

Wednesday May 13, 2015,

3 min Read

మైక్రోసాఫ్ట్‌, ఆపిల్‌, హెచ్‌పీ, అమోజాన్‌.. ప్ర‌పంచ సుప్ర‌సిద్ధ కంపెనీల‌న్నింటికి ఓ కామ‌న్ ఫ్యాక్ట‌ర్ ఉంది. అదేంటో తెలుసా.. అన్ని గ్యారేజీలోనే పురుడుపోసుకున్నాయి. చాలామంది టెక్నాల‌జీ దిగ్గ‌జాల‌కు ఇలాంటి గ్యారేజీ స్టోరీలు అనేకం. ఆరంభంలో చాలామంది ఇలా గ్యారేజీలో త‌మ కెరీర్‌ను ఆరంభించిన‌వారే ఎక్కువ‌గా క‌నిపిస్తారు సిలికాన్ వ్యాలీలో. ఆపిల్ సృష్టిక‌ర్త స్టీవ్ జాబ్స్‌, స్టీవ్ వొజ్నియాక్ కూడా గ్యారేజీలోనే క‌లిసి ప‌నిచేసి తొలి మాకింతోష్ కంప్యూట‌ర్‌ను ఆవిష్క‌రించ‌గ‌లిగారు. మ‌న‌మిప్పుడు చూస్తున్న ఫొటో మాకింతోష్‌పై వారిద్ద‌రూ ప‌నిచేస్తున్న‌దే.

image


అపార్ట్‌మెంట్ స్టార్ట‌ప్స్‌

ఇండియా సిలికాన్ వ్యాలీగా పేరొందిన బెంగ‌ళూరులోనూ ఇలాంటి స్టోరీలు చాలా ఉన్నాయి. అయితే ఇక్క‌డ గ్యారేజ్‌ల‌కు బ‌దులుగా అపార్ట్‌మెంట్లు. రెండు బెడ్‌రూంల అపార్ట్‌మెంట్ల‌లో ఆరంభ‌మైన స్టార్ట‌ప్ కంపెనీలు ఇప్పుడు ఆకాశాన్నంటే బిల్డింగ్‌ల్లోకి త‌మ వ్యాపారాన్ని వృద్ధి ప‌ర్చుకున్నాయి. అవీ ఇవీ ఎందుకు మ‌న యువ‌ర్‌స్టోరీ ప‌య‌నం కూడా బెంగ‌ళూరులోని ఉల్సూర్‌లో ఓ చిన్న అపార్ట్‌మెంట్‌లోనే మొద‌లుపెట్టింది.

2BHKలో మొద‌లైన ఫ్లిప్‌కార్ట్ ప‌య‌నం

ఫ్లిప్‌కార్ట్‌.. రోజుకు కోట్ల బిజినెస్ చేస్తున్న ఈ కామ‌ర్స్ కంపెనీ. 2007లో ఆన్‌లైన్ బిజినెస్‌లోకి అడుగుపెట్టింది. అమెజాన్‌లో ప‌నిచేసే స‌చిన్‌, బిన్ని బ‌న్సాల్‌.. ఆన్‌లైన్ వెబ్‌సైట్ ప్రారంభించాల‌నుకుని బ‌య‌ట‌కొచ్చేశారు. చెరో రెండు ల‌క్ష‌ల పెట్టుబ‌డి. ప్ర‌తీ నెలా త‌ల్లిదండ్రుల ద‌గ్గ‌రి నుంచి ప‌దేసి వేల రూపాయ‌ల‌ను అల‌వెన్స్‌గా తెచ్చుకునేవారు. 18 నెల‌ల‌పాటు కఠోరంగా శ్ర‌మించి ఫ్లిప్‌కార్ట్‌ను అభివృద్ధి చేశారు. బెంగ‌ళూరు శివారు ప్రాంత‌మైన కోర‌మంగ‌ళ‌లో ఓ రెండు బెడ్‌రూమ్‌ల అపార్ట్‌మెంట్‌లో వీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. సీన్ క‌ట్ చేస్తే.. ప్ర‌స్తుతం వీరికి మూడు బిల్డింగ్స్ ఉన్నాయి. వీరికి మొద‌ట వ‌చ్చిన ఆర్డ‌ర్ కూడా ఆంధ్ర‌ప్ర‌దేశ్ నుంచే. ప్ర‌ఖ్యాత ర‌చ‌యిత జాన్ వుడ్ రాసిన 'లీవీంగ్ మైక్రోసాఫ్ట్ టు చేంజ్ ద వ‌రల్డ్' పుస్త‌కం కావాలంటూ ఓ తెలుగు సాహితీప్రియుడు ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేశారు.

image


టెర్ర‌స్‌లో మొద‌లైన ట్యాక్సీ ఫ‌ర్ ష్యూర్‌

ట్యాక్సీ రంగంలో సంచ‌ల‌నాలు సృష్టిస్తున్న ట్యాక్సీ ఫ‌ర్ షూర్ కూడా ఇలాంటి ప‌రిస్థితుల్లోనే పురుడుపోసుకున్న‌ది. కానీ దీని ఆవిర్భావం కాస్త డిఫ‌రెంట్‌. ఓ రోజు ఇద్ద‌రు స్నేహితులు బెంగ‌ళూరులోని ఓ బార్‌లో ఫూటుగా మందు కొట్టారు. ఇంటికి వెళ్దామంటే అటు ఆటో కానీ, ఇటు ట్యాక్సీలు కానీ దొర‌క‌డం లేదు. అప్ప‌టికైతే ఎలాగొలా ఇంటికి చేరినా.. ఆ రోజు ప‌డిన ఇబ్బందిని మాత్రం ఆ ఇద్ద‌రు మిత్రులు మ‌ర్చిపోలేదు. వారే అప్ర‌మేయ ఆర్‌, ర‌ఘునంద‌న్ జీ.. త‌మ‌కు ఎదురైన ఇబ్బందులు మ‌రొక‌రికి రాకూడ‌ద‌న్న ఉద్దేశ‌మే వారిని ట్యాక్సీ ఫ‌ర్ షూర్‌ను ఆరంభించేలా చేసింది. జేపీ న‌గ‌ర్‌లోని ఓ అపార్ట్‌మెంట్ టెర్ర‌స్‌లో వంద చ‌ద‌ర‌పు అడుగుల రూమ్‌లో ఒకే ఒక్క ఉద్యోగి అశోక్ ర‌వితో వీరు బిజినెస్ స్టార్ట్ చేశారు. ఆ త‌ర్వాత ఆఫీస్ నిర్వ‌హ‌ణ కోసం మ‌రో ముగ్గురిని ప‌నిలోకి తీసుకున్నారు. చిన్న గ‌ది కావ‌డంతో స‌మావేశాలు పెట్టుకునేందుకు చాలా ఇబ్బంద‌య్యేది. దీంతో ఉద్యోగుల‌కు ఆటంకం క‌ల‌గ‌కుండా టెర్ర‌స్‌పై ఓపెన్ ప్లేస్‌లో ఇన్వెస్ట‌ర్ల‌తో మీటింగ్‌లు పెట్టేవారమని అప్ర‌మేయ‌.. అప్ప‌టిరోజుల‌ను గుర్తుచేసుకుంటారు. ఆ త‌ర్వాత బిజినెస్ విస్త‌రించ‌డంతో ఓ పెద్ద భ‌వ‌నంలోకి కార్యాల‌యాన్ని మార్చేశారు. ప్ర‌స్తుతం ప‌ది న‌గ‌రాల్లో ఈ ట్యాక్సీ ఫ‌ర్ షూర్ కార్య‌క‌లాపాలు నిర్వ‌హిస్తోంది. ఇంత డెవ‌ల‌ప్ అయినా.. తాము బిజినెస్ ఆరంభించిన ఆ టెర్ర‌స్ రూమ్‌ను మాత్రం వారు వ‌దులుకోలేదు. ఇప్పుడ‌క్క‌డ టీమ్ పార్టీలు నిర్వ‌హిస్తున్నారు. వీటిని ఉద్యోగులు ముద్దుగా టెర్ర‌స్ పార్టీల‌ని కూడా పిల్చుకుంటారు.

image


అభివృద్ధికి ల్యాడ‌ర్‌

ఫ‌ర్నిచ‌ర్ ఈ -స్టోర్‌ అర్బ‌న్ ల్యాడ‌ర్ ది కూడా సేమ్ స్టోరీ. పోటీదారుల‌తో పోలిస్తే చాలా చిన్న‌త‌క్కువ స్పేస్ ఉన్న అపార్ట్‌మెంట్‌లో బిజినెస్‌ను ఆరంభించిందీ సంస్థ‌. ర‌త‌న్ టాటా కూడా ఈ సంస్థ‌లో పెట్టుబ‌డి పెట్టారంటే సంస్థ భ‌విష్య‌త్ ఏంటో ఆలోచించొచ్చు. అర్బ‌న్ ల్యాడ‌ర్‌ను స్టార్ట్ చేసిన ఆషిష్ గోయ‌ల్‌ది ఆరంభంలో ముళ్ల‌బాట ప‌య‌న‌మే. మెకిన్సే నుంచి ఏసీకే మీడియా వ‌ర‌కు త‌న కెరీర్‌ను మార్చుకుంటూ వ‌చ్చిన గోయ‌ల్ ఆ త‌ర్వాత బెంగ‌ళూరుకు షిఫ్ట‌య్యారు. ఆషీష్‌, రాజీవ్‌ల ఇళ్లు ఉన్న ప్రాంతాల్లో ఫ‌ర్నిచ‌ర్ షాప్‌లుండేవి కావు. ఈ కార‌ణంగానే వారు దేశీయ ఫ‌ర్నిచ‌ర్ ఈ కామ‌ర్స్ సంస్థ‌ను ప్రారంభించి రెండేళ్ల వ్య‌వ‌ధిలోనే దేశంలో అతి పెద్ద సంస్థ‌గా తీర్చిదిద్దారు. బెంగ‌ళూరులోని ఓ చిన్న ఇంట్లో ఆర్బ‌న్‌లాడ‌ర్ కార్యాల‌యం ఉండేది.

image


సంచ‌ల‌నాల రెడ్‌బ‌స్‌

ఎర్ర‌బ‌స్సు ఎక్కొచ్చావా.. అంటూ ఫ్రెండ్స్‌ను ఎగ‌తాళి చేస్తుండ‌టం చాలా సార్లు విని ఉంటాం. ఇప్పుడా ఎర్ర‌బ‌స్సే స్టార్ట‌ప్ కంపెనీల్లో తారాజువ్వాలాగా దూసుకెళ్తోంది. దేశీయ స్టార్ట‌ప్ కంపెనీల్లో రెడ్‌బ‌స్‌ది తిరుగులేని చ‌రిత్ర‌. రెడ్‌బ‌స్ కూడా అనుకోకుండా ఆరంభ‌మైన‌దే. అది 2005 దివాళీ సీజ‌న్‌. ఫ‌ణీంద్ర ఊరెళ్దామంటే, విప‌రీత‌మైన ర‌ష్ కార‌ణంగా టికెట్లు దొర‌క‌లేదు. నిర్వ‌హ‌ణ స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్లే ఇలా టికెట్ల‌కు ఇబ్బంది ప‌డాల్సి వ‌చ్చింద‌ని ఫ‌ణీంద్ర గ్ర‌హించారు. ఇలాంటి స‌మ‌స్య‌నే ఎదుర్కొన్న మిత్రుడితో త‌న అనుభ‌వాల‌ను పంచుకొన్నారు ఫ‌ణీంద్ర‌. బిట్స్ పిలానీలో చ‌దువుకుని ఒకే ఫ్లాట్‌లో ఉంటున్న వీరిద్ద‌రూ క‌లిసి రెడ్‌బ‌స్‌ను ప్రారంభించారు. కొన్నేళ్ల త‌ర్వాత‌.. అంటే గ‌త ఏడాది నెస్ప‌ర్స్ ఐబిబో రెడ్‌బ‌స్‌ను రూ.800 కోట్లు వెచ్చించి సొంతం చేసుకుంది.

image


ఈ విజ‌య‌గాథ‌ల‌ను చూస్తే.. మ‌న ప‌క్క అపార్ట్‌మెంట్‌లో కూడా ఏదో ఒక స్టార్ట‌ప్ కంపెనీ ఉండి ఉండొచ్చు. మ‌న పొరుగువారే ఏదో ఒక‌రోజు ఇలా హెడ్‌లైన్‌లో నిలుస్తారేమో.. ఒక‌సారి అటువైపు కూడా లుక్కేయండి.. విజ‌యం సాధించాలంటే డ‌బ్బు, వ‌స‌తి కాదు ప‌ట్టుద‌ల‌, శ్ర‌మించాల‌న్న త‌ప‌న ఉండాల‌ని ఈ స్టార్ట‌ప్ కంపెనీలు నిరూపించాయి