ఈ వైన్ షాప్‌ ఓన్లీ ఫర్ లేడీస్ !

ఈ వైన్ షాప్‌ ఓన్లీ ఫర్ లేడీస్ !

Wednesday January 13, 2016,

3 min Read

ఆడవాళ్ల కోసం స్పెషల్ వైన్ షాపా? మరీ అంత ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఏం.. తాగడం ఒక్క మగాడి హక్కేనా? లేడీస్ మందుకొట్టొద్దా? వాళ్లు తాగొద్దని రాజ్యాంగంలో రాసిపెట్టుందా? మగాళ్లు తాగారంటే అదేదో లోకకల్యాణం కోసం. అదే లేడీస్ డ్రింక్ చేస్తే కలికాలమా? అలా అనుకునే అనాగరికులతో మనకు పనిలేదు. అలాంటి వాళ్లు రెండు అరచేతులు మూతికి అడ్డం పెట్టుకుని, గుండెలు బాదుకున్నా పట్టించుకోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. తాగాలనుకుంటే వచ్చి తాగండి. కొనుక్కొని వెళ్తే వెళ్లండి. ఎవరినో చూసి భయపడాల్సిన పనిలేదు..అంటూ మగువల కోసమే ప్రత్యేకంగా ఢిల్లీలో ఓ వైన్ షాప్ తెరిచారు.

image


ఎందుకు తాగావని మగాళ్లను అడిగితే లక్ష కారణాలు చెప్తారు. టెన్షన్ తట్టుకోలేక అని, ప్రెజర్ పడలేక అని, బాధలు మరిచిపోడానికని, సెలబ్రేషన్ అనీ, పార్టీ అనీ, వీకెండ్ అనీ. మరి మహిళలు పురుషుల్లా కాదా? వాళ్లకు ఈతిబాధలుండవా? భావోద్వేగాలకు అతీతులా? కష్టమొస్తే చున్నీతో కన్నీళ్లు తుడుచుకుని, హాపీగా ఉంటే ఆపీ తాగి గమ్మున ఉండిపోవాలా?

సవ్వాలే లేదు. ఉదాహరణకు మెట్రో నగరాలే చూసుకుంటే- మగాళ్లు ఎంత వర్క్ చేస్తున్నారో మహిళలూ అంతే! వాళ్లకు వర్క్ ప్రెజర్ ఎంత వుందో వీళ్లకూ అంతే ఉంది. వాళ్లకెంత టెన్షన్ ఉందో వీళ్లకూ ఉంది. మరి అలాంటప్పుడు మగమహారాజులు మందుకొట్టి రిలాక్స్ అవొచ్చుగానీ- లేడీస్ కు అలాంటి రిలీఫ్ అవసరం లేదా?

అయినా సరే- మనదేశంలో- దర్జాగా వైన్ షాపుకి వెళ్లి కౌంటర్ ముందు నిలబడి నచ్చిన బాటిల్ కొనుక్కునే ధైర్యంతో కూడిన స్వేచ్ఛ మగువలకు ఎక్కడుంది చెప్పండి? ఒకవేళ కొందామని డేర్‌ చేసి షాప్ ముందుకు వెళ్లీ వెళ్లగానే-ఎంతమంది ఎగాదిగా చూస్తారని!? అంతమంది మధ్యలో ఎలాగోలా సందుచేసుకుని -భయ్యా ఏక్ వోడ్కా ఫుల్ బాటిల్ దో అని అనగానే – ఆడగొంతు విని అవాక్కైపోతారు! చుట్టుపక్కలంతా పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతారు? ఈవెన్ ఓనర్‌ సైతం. ఆ సైలెన్స్ ని ఎంతకాలం భరించాలి? అవతలివాడి కామెంట్ బిగ్గరగా ఉండకపోవచ్చుగాక. కానీ మనసుకి సూటిగా గుచ్చుకుంటుంది. మగవాళ్లు దర్జాగా తాగొచ్చు. ఎక్కడంటే అక్కడ. అదే ఆడవాళ్లు మాత్రం చాటుమాటుగా కానిచ్చేయాలి!

ఆడవాళ్లకు అలాంటి బాధ ఉండొద్దనే ఉద్దేశం ఏర్పాటు చేసిందే ఓన్లీ ఫర్ లేడీస్ లిక్కర్ షాప్. దేశంలోనే ఇది మొదటి లిక్కర్ బొటిక్. ఈస్ట్ ఢిల్లీలోని స్టార్ సిటీ మాల్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉంటుంది. పిజా హట్ తర్వాత షాప్ అదే. గ్లాస్ కర్టెన్లతో చూడముచ్చటగా కనిపిస్తుంది . ఎంట్రీలో పింక్ స్ట్రిప్ మీద ఎక్స్ క్లూజివ్ సెక్షన్ ఓన్లీ ఫర్ లేడీస్ అని తాటికాయంత అక్షరాలు. అద్దాల గోడలు. ఇంటీరియర్ సూపర్‌. వెళ్లామా కొన్నామా అని ఉండకుండా- లోపల సోఫా. కాసేపు రిలాక్సవొచ్చు. కొన్ని మేగజైన్లుంటాయి. టైముంటే కొద్దిసేపు తిరగేయొచ్చు. బీరు, బ్రాందీ, వైను, రమ్ము, జిన్ను, వోడ్కా. ఎనీ బ్రాండ్. నిర్భయంగా కొనుక్కోవచ్చు. షాపంతా తిరిగితిరిగి చూడొచ్చు. టేక్ యువర్ ఓన్ టైం. అన్నట్టు, అందులో కౌంటర్ మీద ఓనర్ సహా, సిబ్బంది మొత్తం లేడీసే. ఇంకా బిందాస్. వెకిలిచూపులుండవు. వెర్రి కామెంట్లుండవు.

ఢిల్లీలో మాదే మొదటి లేడీస్ లిక్కర్ బొటిక్. మా షాప్ తర్వాత గూర్గావ్‌, సాకేత్, డిఫెన్స్ కాలనీల్లో కూడా ఓపెన్ చేశారు- ఓనర్ రోహిత్ అరోరా

ఒకప్పుడు సిటీలో వైన్ షాపులంటే ఎక్కడో ఇరుకు సందుల్లో, గల్లీల్లో ఉండేవి. ఇప్పుడవి మెయిన్ రోడ్డుకెక్కాయి. హైపర్ మార్కెట్లోకీ ఎంటరయ్యాయి. అయినా సరే, లిక్కర్‌ స్టోర్‌లో అడుగుపెట్టాలంటే ఆడవాళ్లకు భయం. వైన్ షాపులంటే ఒకరకమైన నిషిద్ధ ప్రాంతాలు. షాప్ ముందు నిలబడ్డానికి తటపటాయించాలి. అలాంటి వాతావరణం పూర్తిగా మారిపోవాలనే ఉద్దేశంతోనే ఇలాంటి ఎక్స్ క్లూజివ్ లిక్కర్ షాప్ ఓపెన్ చేశామంటున్నాడు రోహిత్ అరోరా

ఆల్కహాల్ ఆరోగ్యానికి హాని చేస్తుంది. బాటిల్ మీద లేబుల్ ఉంటుంది. అయినా తాగేవాళ్లు తాగుతారు. ఇష్టంలేని వాళ్లు ముట్టుకోరు. సిగరెట్ కూడా అంతే. పెట్టెమీద తాగొద్దు పోతారు అని రాసిపెట్టి వుంటుంది! అయినా స్మోక్ చేసేవాళ్లను ఆపలేం. ఇక్కడ మ్యాటర్ అలవాట్ల మీద కాదు. ఎంకరేజ్ చేయాలని ఎంతమాత్రమూ కాదు. ఏది మంచో, ఏది చెడో వారివారి విచక్షణ ప్రకారం నడుచుకుంటారు. ఎటొచ్చీ వాదనంతా పురుషులు- స్త్రీలు- వారికున్న స్వేచ్ఛ, సమానత్వం మీదనే. స్టోరీ అంతా సదరు టాపిక్ మీదనే అని గమనించగలరు.