తిరుపతి లడ్డూ నష్టం రూ. 140 కోట్లు  

1

వజ్ర వైఢూర్యాలు, నవరత్న ఖచిత కిరీటాలు, ఆపాదమస్తకం ఆభరణాలు, కట్నకానుకలు, నిత్యం వస్తు, వాహన, ధన, కనకరాశితో తులతూగే తిరుమల తిరుపతి దేవస్థానం.. లడ్డూ మూలంగా నష్టాన్ని భరిస్తోందంటే ఆ వార్త నమ్మశక్యం కాదు. కానీ పచ్చినిజం. నగదు రాకడే గానీ పోకడ తెలియని టీటీడీ.. లడ్డూ ప్రసాద విక్రయాల్లో లాభం అనే మాటనే మరిచిపోయింది. మీరు నమ్ముతారో నమ్మరోగానీ, ఉచిత లడ్డూ పంపిణీ, సబ్సిడీ మీద ఇచ్చేవి.. ఇలా అన్నీ కలిపి గత మూడుళ్లుగా ప్రసాదంపై దేవస్థానానికి ఏటా రూ.140 కోట్ల నష్టం వస్తోందట.

వాస్తవానికి తిరుపతి లడ్డూ ఖరీదు రూ.32.50పైసలు. కానీ గత 11 ఏళ్లుగా సబ్సిడీపై 25 రూపాయలకో లడ్డూని విక్రయిస్తున్నారు. వెంకన్న సామి లడ్డూ అంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచింది. ఆ పరిమళం, ఆ తియ్యదనం, రుచి, శుచికి మరేదీ సాటిరాదు. అదొక అద్భుత ప్రసాదం. రోజుకి కొన్ని లక్షల మంది దేవుణ్ని దర్శించుకోడానికి వస్తుంటారు. వారందరికీ లడ్డూ పంపిణీ చేయడానికి దేవాలయ ప్రాంగణంలో భారీ వంటశాల ఉంది. టన్నుల కొద్దీ నెయ్యి, శెనగపండి, చక్కెర, జీడిపప్పు, కిస్ మిస్, ఎలాచీ లాంటి భారీ ముడిసరుకుతో రోజుకి కొన్ని లక్షల లడ్డూలు పోటు నుంచి పోటెత్తుతుంటాయి.

2016లో మొత్తం 10 కోట్ల లడ్డూలు అమ్ముడయ్యాయి. అందులో ఉచిత దర్శనం కోసం వచ్చిన భక్తుల ఒక లడ్డూని పది రూపాయలకే అమ్మారు. ఎందుకంటే వాళ్లు గంటల తరబడి క్యూలైన్లో వేచివుండి, శ్రమకోర్చి శ్రీవారిని దర్శించుకున్నందుకు, దయతో దేవస్థానం వారు పదిరూపాయలకో లడ్డూ చొప్పున విక్రయిస్తుంటారు. ఆ అమ్మకాల్లో ఏడాదికి 23 కోట్ల నష్టం వాటిల్లింది.

ఇకపోతే నడకదారిన వచ్చే భక్తులకు తలా ఒక లడ్డూని ఉచితంగా ఇస్తారు. ఎందుకంటే 11 కిలోమీటర్ల పొడవునా ఉన్న వేలాది మెట్లను ఎక్కి, ఏడు కొండలు దాటుకుంటూ వచ్చి దేవుడిని దర్శించుకుంటారు. అలాంటి వారిని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో టీటీడీ మనిషికో లడ్డూ ఫ్రీ ఇస్తోంది. దాంట్లో ఏడాదికి వస్తున్న నష్టం రూ.22.7 కోట్లు. ఇక మరో 70 లక్షల మంది 300 రూపాయల స్పెషల్ ఎంట్రీపై, రూ.500 రూపాయల విఐపీ ఎంట్రీపై స్వామివారిని దర్శించుకుంటారు. వాళ్లందరికీ తలా రెండు లడ్డూలు ఫ్రీగా ఇస్తుంటారు.

ఇలా అన్నీ కలుపుకుంటే ఏడాదికి రూ. 140 కోట్ల నష్టం అని తేలింది. మొత్తానికి భక్తులకు అత్యంత ప్రియమైన లడ్డూ దేవస్థానానికి మాత్రం చేదుగా మారింది. అయినా ప్రపచంలోనే అత్యంత ఖరీదైన దేవదేవుడికి.. ప్రసాదం మిగిల్చే నష్టం ఏపాటిదని పలువురు భక్తులు అభిప్రాయపడుతున్నారు.