కూరగాయల షాపుల్లోనూ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్

కూరగాయల షాపుల్లోనూ క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్

Saturday August 29, 2015,

4 min Read

చిన్న చిన్న వ్యాపారులకు.. ఇంటర్నెట్ సదుపాయం ఉండదు, కార్డులను తీసుకునే స్తోమత ఉండదు. డబ్బు ఇచ్చుకో.. సరుకు పుచ్చుకో అనేదే వీరి కాన్పెస్ట్. కానీ వీరి దగ్గర కూడా క్యాష్ లేకుండా మనకు అవసరమైనవి తీసుకునే సదుపాయం ఉంటే ఎలా ఉంటుందా అన్న ఆలోచనతో FTక్యాష్ ను రూపొందించారు సంజీవి చాదక్. ఇప్పుడు మంచి ఆదరణ పొందుతున్న ఈ FT క్యాష్ వెనుక ఓ చిన్న కథ ఉంది. 

ఒక రోజు సంజీవ్ తమ వీధిలో కూరగాయలు అమ్మే చిన్న దుకాణదారుడికి ఫోన్ చేసి కావల్సిన కూరగాయల లిస్టు చెప్పడం మొదలుపెట్టారు. అప్పుడు ఆ వ్యాపారీ తాను బిజీగా ఉన్నానని... వాట్సప్‌లో మెసేస్ చేయమని సూచించాడు. దాంతో సంజీవ్ ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సంజీవ్ ఆఫీసులో ఉన్నప్పుడు కూరగాయలు పంపించారు. అంతా సజావుగా సాగిపోయింది.

అయితే డబ్బు చెల్లింపు విషయంలో చిన్న సమస్య తలెత్తింది.‘‘ ఆ దుకాణదారుడు నేను ఇంట్లో ఉన్న సమయంలో ఓ కుర్రాడిని పంపి డబ్బు వసూలు చేసుకున్నాడు. అప్పుడే నాకు ఒక ఆలోచన తట్టింది. చిన్నచిన్న వ్యాపారులకు కూడా ఎలక్ట్రానిక్ టెక్నాలజీ ద్వారా వెంటనే డబ్బు చెల్లించే విధానం ఉంటే బాగుంటుందని నాకు అనిపించింది ’’ అంటారు సంజీవ్. అలా ఆ ఆలోచన నుంచి పుట్టిందే FTక్యాష్. ఇదొక మొబైల్ ఫ్లాట్‌ఫామ్, దీని ద్వారా ఆఫ్ లైన్ చిల్లర వర్తకులు సైతం మొబైల్ పేమెంట్స్‌ను తీసుకోవచ్చు. తమను తాము ప్రచారం చేసుకోవచ్చు, వినియోగదారులకు ప్రోత్సహకాలు అందించొచ్చు.

ఒకవైపు ఈ కామర్స్ వేగంగా విస్తరిస్తోంది, కానీ మొత్తం రిటైల్ అమ్మకాల్లో కేవలం ఒక్క శాతం మాత్రంలో దీని పరిధిలో ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. ‘‘FTక్యాష్ ... మిగతా 99 శాతం చిల్లర అమ్మకాలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని మేం ఆశిస్తున్నాం ’’ అంటున్నారు సంజీవ్. మా ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా చాలా వరకు చిన్న చిన్న వ్యాపారులతోనే జరుగుతాయని ఆయన చెబుతున్నారు. అంటే పాలవాళ్లు, కూరగాయలు అమ్మేవాళ్లు ఇలా ఆఫ్‌లైన్‌లో ఉన్నవాళ్లేనంటున్నారు.

FTక్యాష్ టీమ్ సభ్యులు

FTక్యాష్ టీమ్ సభ్యులు


చిల్లర వర్తకులు, వినియోగదారులతో పనిచేయడం

FT క్యాష్ వల్ల చిన్న చిన్న వ్యాపారులంతా ఆన్‌లైన్ సదుపాయం లేకపోయినా నగదు చెల్లించే విధానాన్ని చాలా వరకు తగ్గించుకోగలుగుతారు. తమ తోటి వ్యాపారులకు, సర్వీస్ ప్రొవైడర్లకు కూడా క్యాష్ లెస్ విధానంలోనే చెల్లింపులు జరుపుతూ ఆ సదుపాయాలను ఆస్వాదిస్తారు. వినియోగదారుల మొబైల్ ఫోన్లకే బిల్లు వస్తుంది, వారు మొబైల్ ఫోన్ల నుంచే బిల్లు చెల్లించగలుగుతారు. ‘‘వ్యాపారులు ఈ ఫ్లాట్‌ఫామ్ ఉపయోగించుకుని స్థానికంగా పెద్దఎత్తున ప్రచారం చేసుకోవచ్చు, తమకు నమ్మకమైన వినియోగదారులకు ఆఫర్లు ప్రకటించుకోవచ్చు.’’ అంటారు సంజీవ్.

ఈ కంపెనీ చాలా తక్కువ ఖర్చుతో, సమర్ధవంతంగా పని చేసే డిజిటల్ ఫ్లాట్ ఫామ్‌ను అందుబాటులోకి తెచ్చింది. వ్యాపారులు తమ పరిసరాల్లోని వినియోగదారులను గుర్తించి, స్ధానికంగా తమ ఆఫర్ల గురించి తెలియజేసి, వారి నుంచి పేమెంట్లను ఎలక్ట్రానిక్ రూపంలో పొందవచ్చు. డబ్బులు చెల్లించడానికి వారు రావల్సిన పని ఉండదు లేదా వ్యాపారులు వెళ్లాల్సిన అవసరం లేదు. దీని వల్ల వారు ఎక్కువ మందిని చేరుకోగలుగుతారు.

FT క్యాష్ ప్రారంభించక ముందు సంజీవ్ డచ్ బ్యాంక్, ఇండియాలో సీఈవోగా పనిచేశారు. దీపికా కొఠారి దీనికి సహ వ్యవస్థాపకురాలు. ఆమె అంతకు ముందు గ్రాంట్ తోరన్టన్‌లో పనిచేశారు. ఈ ఇద్దరూ కలిసి తమ ప్రయాణాన్ని 2014లో మొదలుపెట్టారు. దాదాపు మూడు నెలల పాటు చర్చలు, ఫీల్డ్ సర్వేలతో గడిపారు. వినియోగదారులు, వ్యాపారులతో ముఖాముఖి మాట్లాడారు.

కార్యకలాపాలు మొదలయ్యాయి

‘‘ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మొదట్లో మేం ఎటువంటి నమూనా లేకుండా దీని గురించి వివరించడం మొదలుపెట్టాం. వినియోగదారులు, చిల్లర వర్తకుల ప్రతిస్పందన ఎలా ఉంటుందో అంచనా వేయాలనుకున్నాం. చిల్లర వర్తకులకు ఈ కాన్సెప్ట్ అర్ధమయ్యేలా వివరించడానికి పెద్ద పోరాటమే చేయాల్సి వచ్చింది. మా ఉత్పత్తి ఒక రూపు సంతరించుకున్న తర్వాత మేం ఒక డెమో చూపించడం ద్వారా దీని గురించి ప్రజలకు తెలియజేయడం మొదలుపెట్టాం. దీనికి రెండు వర్గాల నుంచి మంచి స్పందన లభించింది ’’ అంటున్నారు సంజీవ్.

టీమ్ సభ్యులు వ్యాపారులతో చర్చించినప్పుడు ఒక విషయం గుర్తించారు. ఈ ఆలోచన మంచి ఫలితాలను ఇస్తోందని అర్ధమైంది. మేం ఉహించినదానికన్నా చిన్న చిన్న షాపుల వాళ్లు సైతం తమ వ్యాపారాల కోసం టెక్నాలజీని వాడుకునేందుకు సిద్ధంగా ఉన్నారు, అయితే, వారి అవసరాలు తీర్చగలిగే ఉత్పత్తి ఏదీ వారికి అందుబాటులో లేదు.

వ్యాపారుల దృక్కోణంలో ఇదో కొత్తది. దీనికి అలవాటు పడటడానికి సమయం పడుతుందని భావించేవారని సంజీవ్ చెబుతున్నారు. ఈ వ్యాపారులంతా దశాబ్దాల తరబడి ఒకే రకమైన వ్యాపార విధానాలకు అలవాటుపడిపోయారు. వాళ్లలో మార్పు చాలా నెమ్మదిగా వస్తుంది. అయితే, మొదటగా కొంత మందికి దీనిని అలవాటు చేస్తే... ఆ తర్వాత మిగతా వాళ్లు కూడా దీనికి మారతారని టీమ్ నమ్మింది.

పెరుగుదల మరియు లావాదేవీలు

ఈ ప్లాట్ ఫామ్‌ను జూన్‌లో ప్రారంభించారు. మొదటగా ముంబైలోని పోవాయ్ ప్రాంతంలో మొదలుపెట్టి ఆ తర్వాత నగరంలోని ఇతర ప్రాంతాలకు విస్తరింపజేశారు. ఆ కంపెనీ అనతి కాలంలోనే 150 మంది వ్యాపారులను చేర్చుకోగలిగింది, మొత్తం 10 లక్షల రూపాయల కార్యకలాపాలు నిర్వించగలిగింది.

FTక్యాష్‌కి ఆదాయం... వ్యాపారుల దగ్గర నుంచి ట్రాన్సాక్షన్ ఫీజు రూపంలో లభిస్తుంది. దీంతో పాటుగా వ్యాపారులు తమ ప్రకటనలు, ఆఫర్లు వినియోగదారులకు చేరవేయడం కోసం కూడా FTక్యాష్‌కి అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి అదనంగా ఈ నెట్వర్క్ ద్వారా ఇతర మార్గాల్లో కూడా ఆదాయం సకూర్చుకోవాలని వీరు భావిస్తున్నారు.

‘‘మేం లక్ష్యంగా పెట్టుకున్న వ్యాపార సెగ్మెంట్లో గత ఏడాది, ఏడాదిన్నర కాలంగా చర్చలు బాగా జరుగుతున్నాయి. ఐదేళ్ల క్రితం స్మార్ట్ ఫోన్లను చాలా తక్కువగా ఉపయోగించేవారు, కానీ ఇప్పుడు చిన్న చిన్న వ్యాపారులు సైతం స్మార్ట్ ఫోన్లు ఉపయోగిస్తున్నారు. వాట్స్ అప్ లాంటి అప్లికేషన్లను తమ వ్యాపార అభివృద్ధికి విరివిగా వాడుకుంటున్నారు. వినియోగారుల తీరు కూడా మారుతోంది, తమకు సౌకర్యంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఒక కూరగాయల వ్యాపారికి ఇవ్వాల్సిన డబ్బుల్ని ఆదివారం ఉదయం అతడు ఇంటికి వచ్చినప్పుడు కాకుండా, తమ ఆఫీసులో కూర్చునే చెల్లించాలనుకుంటున్నారు’’ అంటారు సంజీవ్.

క్యాష్‌లెస్ కార్యకలాపాలకు మార్కెట్

భారతదేశంలో తమకు కావల్సిన మార్కెట్ వేగంగా పెరుగుతోందని ఈ టీమ్ నమ్ముతోంది. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారులు సైతం టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు. దాని సాయంతో తమ వ్యాపారాలను వృద్ధి చేసుకోవాలని చూస్తున్నారు. FTక్యాష్ అటువంటి వ్యాపారులతో భాగస్వామ్యం నెలకొల్పి వారి వ్యాపార అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామంటోంది.

‘‘ మేం వేగంగా విస్తరిస్తున్నాం. మార్చి 2016 నాటి మా ప్లాట్‌ఫామ్ మీద 2,000లకు పైగా వ్యాపారులు ఉంటారు. మన దేశంలో అతిచిన్న వ్యాపారులు ఎదుర్కొంటున్న సమస్యను మేం పరిష్కరిస్తున్నాం. సమీపంలో ఉండే చిన్న చిన్న వ్యాపారులు సైతం ఆన్‌లైన్ వర్తకులతో పోటీపడే విధంగా తీర్చిదిద్దాలన్నదే మా లక్ష్యం. అదే విధంగా వినియోగదారులకు ఆన్ లైన్ వర్తకులు ద్వారా అందే అన్ని సదుపాయలు అందిస్తాం.’’ అని చెబుతున్నారు సంజీవ్.

అభివృద్ధి చెందిన ఆర్ధిక వ్యవస్థల్లో, చెల్లింపుల్లో ఉన్న ఇబ్బందులను తొలగించేందుకు ఇటువంటి ఫ్లాట్ ఫామ్స్ కొన్ని ఉన్నాయి. ఫ్లింట్, లెవిల్ అప్ వంటి అప్లికేషన్లు మొబైల్ ద్వారా డబ్బు చెల్లించే విధానాన్ని ప్రోత్సహిస్తున్నాయి. భారతీయ మార్కెట్లు ఇంకా పెద్ద సంఖ్యలో క్యాష్ లెస్ కార్యకలాపాలను అచరణలో పెట్టాల్సి ఉంది. 11 శాతం మంది పట్టణ ప్రాంత ప్రజలు క్యాష్ లెస్ కార్యకలాపాలను అనుసరిస్తున్నారు. ఐడిఎఫ్ మరియు ఐఏఎంఏఐ కలిసి విడుదల చేసిన ఓ రిపోర్టు ప్రకారం భారదేశపు మార్కెట్లు కేవలం 0.43 శాతం మాత్రమే క్యాష్ లెస్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్టు తేలింది.