దేశంలోనే మొదటిసారిగా మాజీ మహిళా ఖైదీల కోసం చంచల్ గూడ జైలు పెట్రోల్ పంప్

0

ఖైదీలంటే సమాజంలో చిన్నచూపు. జైలు నుంచి బయటికొచ్చినా అవమానాలు తప్పవు. అందునా మహిళా ఖైదీలంటే వేరే చెప్పనవసరం లేదు. అలాంటి వారికి తెలంగాణ జైళ్ల శాఖ అందమైన జీవితాన్ని ప్రసాదించింది. వారి కోసం ప్రత్యేకంగా పెట్రోల్ బంకు పెట్టి ఆత్మగౌరవంతో బతికే ఉద్యోగాలిచ్చింది.

కీర్తి వాళ్ల ఇళ్లు సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి దగ్గరుంటుంది. క్షణికావేశంలో ఏదో నేరం చేసి జైలుపాలైంది. మూడు నెలల తర్వాత రిలీజయి బయటికొచ్చింది. జైలు జీవితం గడిపి వచ్చిందన్న ఒకే ఒక కారణంతో ఆమెకు ఎవరూ పని ఇవ్వలేదు. బతుకే అవమానంగా తోచింది. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఓరోజు అనుకోకుండా చంచల్ గూడ జైలు నుంచి ఫోన్ వచ్చింది. మంచి జాబ్ ఇప్పిస్తాం... చేస్తావా అని అడిగారు. కీర్తికి ప్రాణం లేచొచ్చింది. పరుగు పరుగున వెళ్లింది. ఇంటర్వ్యూలో సెలక్ట్ అయింది. పది రోజులు జైల్లో ట్రెయినింగ్ ఇచ్చారు. ఆ సమయంలో పోలీసులు ఇచ్చిన ధైర్యం జీవితం మీద ఎనలేని భరోసా కలిగించింది. మహిళా పెట్రోల్ బంకులో కీర్తి ఇప్పుడొక ఉద్యోగి. కీర్తిలాంటి ఎందరో విడుదలైన మహిళా ఖైదీలకు జైళ్ల శాఖ ఉపాధి కల్పించింది.

ఖైదీల్లో పరివర్తన తేవాలి. వారికి మరో జీవితాన్ని అందివ్వాలి. ఇదే లక్ష్యంతో తెలంగాణ జైళ్ల శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. అందులో భాగంగా మాజీ ఖైదీల కోసం కొన్ని పెట్రోల్ బంకులు నడుపుతోంది. అయితే తొలిసారిగా మహిళా ఖైదీల కోసం కూడా పెట్రోల్ బంకు స్థాపించింది. చంచల్ గూడ జైలు దగ్గర ఏర్పాటు చేసిన ఈ బంకుని హోం మంత్రి నాయిని నరసింహారెడ్డి ప్రారంభించారు. ఏ దిక్కూ లేని మాజీ మహిళా ఖైదీలకు ఈ బంకు కొత్త జీవితాన్ని ఇస్తుందని నాయిని అన్నారు.

మహా పరివర్తన్ కింద ఖైదీల్లో మార్పు తేవడానికి జైళ్ల శాఖ డీజీ వీకే సింగ్ మహిళా పెట్రోల్ బంకును మంజూరు చేశారు. ఆల్రెడీ రిలీజ్ అయి వెళ్లిపోయిన మహిళా ఖైదీలను సంప్రదించారు. వారిల్లో ఔత్సాహికులను సెలెక్ట్ చేసి 10 రోజుల పాటు శిక్షణ ఇచ్చారు. నెలకు 12 వేల జీతం ఇవ్వాలని నిర్ణయించారు. మొత్తం 25 మందిని ఎంచుకున్నారు. అందరూ షిఫ్టుల వారీగా పనిచేస్తారు. సేల్స్ పెరిగినా కొద్దీ కొత్తవాళ్లకు అవకాశం కల్పిస్తామంటున్నారు జైలు అధికారులు. 

ఇంతకు ముందు 42 మంది మాజీ ఖైదీలకు ఇలాగే టైలరింగ్, బ్యూటీ పార్లర్లలో ఉపాధి కల్పించారు. మరికొంత మంది బేకరీ, నోట్ బుక్, టైలరింగ్, క్యాండిల్స్ తయారీ, ఫుడ్ కోర్టులో శిక్షణ పొంది వేర్వేరు చోట్ల పనిచేస్తున్నారు. పెట్రోల్ బంకులో పనిచేసే మహిళల చేతికి యూనిఫాం ఇచ్చినప్పుడు వాళ్ల కళ్లలో కలిగిన ఆనందం మాటల్లో చెప్పలేనిదని జైలు సూపరింటిండెట్ సమీరా బేగం అంటున్నారు.

జైల్లో ఉన్నప్పుడు బయటికెళ్లి ఎలా బతకాలన్న టెన్షన్ వారిలో ఉండేది. ఎవరు ఉద్యోగం ఇస్తారో అని భయపడ్డ సందర్భాలే ఎక్కువ. ఇప్పుడా దిగుల్లేదు. తెలంగాణ జైళ్ల శాఖ వారికి గౌరవప్రదమైన జీవితాన్ని అందించింది. ఇకపై ఎలాంటి నేరం చేయమని మాజీ మహిళా ఖైదీలు అంటున్నారు. కష్టపడి పనిచేసి కుటుంబాన్ని పోషించుకుంటామన్న ధైర్యం వారి కళ్లల్లో కనిపించింది.

Related Stories

Stories by team ys telugu