తన స్టార్టప్ విఫలమవడానికి ఏడు కారణాలు చెబ్తున్న ప్రదీప్ గోయల్

రాంగ్ రూట్లో ప్రారంభమైన ప్రయాణంకాలంతోపాటు మార్పులు తీసుకురావడంలో విఫలంస్టార్టప్స్ చేయకూడనివేంటి ?ఎలాంటి ఆలోచనలు స్టార్టప్స్‌కు పనికిరావుతన అనుభవాన్నే ఓ కథగా మార్చిన రచయిత ప్రదీప్ గోయల్

తన స్టార్టప్ విఫలమవడానికి ఏడు కారణాలు చెబ్తున్న ప్రదీప్ గోయల్

Thursday May 21, 2015,

4 min Read

స్టార్టప్స్.. ఇప్పుడిదే హాట్ టాపిక్. ప్రతీ ఒక్కరూ సొంత కంపెనీ ప్రారంభించేందుకు తహతహలాడుతున్నారు. విజయగాధలు చదివి, తాము కూడా అలాంటిదే ఏదో ఒకటి చేయాలని తపన పడుతున్నారు. అయితే ఇలా మొదలైన వాటిలో 90శాతం కంపెనీలు ముూడేళ్లు కూడా నడవకుండానే మూతపడుతున్నాయనే విషయాన్ని వదిలేస్తున్నారు. స్కూల్‌జీనీ కూడా అనే స్టార్టప్ కూడా ఇలాగే ప్రారంభమై... ఏడాదిలోనే చరిత్రకు కూడా అందకుండా మాయమైపోయింది. 2013లో మొదలైన స్కూల్‌జీనీకి... 2014లోనే మూతపెట్టాల్సి వచ్చింది.

image


పరాజయం వెనుక 7 కారణాలు

  1. మార్కెట్ వాలిడేషన్

" స్కూల్స్ గురించి వివరాలిచ్చి, రివ్యూలు అందించే విధంగా... జొమాటో లాంటి ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని భావించాం. అయితే పేరెంట్స్ స్కూల్స్ గురించి వెదికేది కేవలం అడ్మిషన్స్ టైంలోనే. ఆ తర్వాత పట్టించుకోరు. దీంతో విద్యను కాకుండా మరేదైనా రంగాన్ని ఎంచుకుందామని భావించాం. అంతో ఇంతో స్కూల్స్ గురించి తెలిసి ఉండడంతో... పేరెంట్స్, టీచర్స్ సమాచారం పంచుకునేలా ఓ ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని తలచాం. ఇప్పుడున్న విద్యావ్యవస్థలో ఇది చాలా అవసరమని నా భావన. తల్లిదండ్రులు, పాఠశాలల మధ్య అనుబంధం పెరగాలంటే దీనికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకున్నా"

'మొదటి అడుగు వేసే ముందే మార్కెట్ రీసెర్చ్ చేయాలి'

మార్కెట్‌కు సూటవుతుందో లేదో తెలుసుకోకుండానే... ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రారంభమయిపోయింది. ఒక వేళ కొన్ని స్కూల్స్‌తో అయినా ముందే ఒప్పందాలు చేసుకుని ఉంటే... పరిస్థితి వేరేగా ఉండేది.

2. పర్ఫెక్షన్ కోసం తాపత్రయం

సహజంగా స్టార్టప్ స్థాయిలోనే పర్ఫెక్ట్‌గా ఉండే ప్రోడక్ట్ ఏదీ ఉండదు. సహజంగా చేయాల్సిందేంటంటే ఎంత తొందరగా వీలైతే అంత త్వరగా కాన్సెప్ట్ డిజైన్ పూర్తవ్వాలి, అభివృద్ధి చేయాలి, ఆచరణలో పెట్టాలి, లాంఛ్ చేయాలి, అంతే ఫాస్ట్‌గా ఫెయిలవ్వాలి, నేర్చుకోవాలి, సక్సెస్ అయ్యే వరకూ చేస్తూనే ఉండాలి. కానీ స్కూల్‌జీనీ విషయంలో జరిగింది వేరు. పర్ఫెక్ట్‌గా ఉండే అద్భుతమైన ప్రోడక్ట్ కోసం ఎంతో టైం, మరెంతో డబ్బు వెచ్చించేశారు.

'లాభాలు చిన్నమొత్తంలోనే ఉండే ఉత్పత్తిని త్వరగా లాంఛ్ చేయాలి, దాన్ని కస్టమర్ల అభిరుచుల మేరకు అభివృద్ధి చేయాలి'

"ఒక వేళ దీన్ని ముందే లాంఛ్ చేసి ఉంటే చాలావరకూ వనరులు ఆదా అయ్యేవి. అరకొరా ఫీచర్లతో లాంఛ్ చేసినా... కస్టమర్లకు డెమో వెర్షన్ అందుబాటులో ఉండేది. మొదటి నెలలోనే ఇవ్వాల్సిన డెమో వెర్షన్.. ఆరు నెలలకి కానీ ఇవ్వలేకపోయామంటే.. ఎంతగా ఎదురుచూశామో అర్ధమవుతుంది."

3. పోటీదారుల బాటలోనే అడుగులు

స్కూల్‌జీనీ లాంఛ్ చేశాక... చేదుగా ఉన్నా నిజాన్ని అంగీకరించక తప్పలేదు. కస్టమర్లు దీనిపై ఇంట్రస్ట్ చూపలేదు. పోటీదారులేం చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం జరిగింది. ఆ వెంటనే అలాంటి ఉత్పత్తికి బదులుగా... అదే అమ్మాలనే ప్రయత్నం చేసింది స్కూల్‌జీనీ టీం.

“నువ్వు ఎక్కడ బాగా చేయగలవో దానిపై దృష్టి పెట్టు. పోటీదారులు సక్సెస్ అయినదానిపై కాదు”

"మా పోటీదారుల నుంచే సేల్స్ టీం రిక్రూట్ చేసుకున్నాం. అదే బాటలోనే అమ్మేందుకు ప్రయత్నించాం. అదే తరహా మార్కెటింగ్ మెటీరియల్ రెడీ చేశాం. ఆఖరికి మా ప్రోడక్ట్ కూడా ఆ కంపెనీల మాదిరిగానే ఉండేలా జాగ్రత్తపడ్డాం. అయినా సక్సెస్ చెంతకు చేరలేకపోయాం. కారణం ఆ మార్కెట్‌లో వాళ్లు పర్ఫెక్ట్, మేం కాదు."

4. అనవసర ఖర్చులు

"ఆఫీస్, ఫర్నిచర్, ఎలక్ట్రికల్స్ వంటి వాటిపై విపరీతంగా ఖర్చు చేశాం. మేం చేసినవన్నీ వృథానే. ఇదంతా మా ఇంటి నుంచే చేసే అవకాశం ఉన్నా.. అనవసరంగా ఆర్భాటాలకు పోయాం"

“ ప్రోడక్ట్ డిజైన్, డెవలప్మెంట్, రిలీజ్‌లకు మాత్రమే ఎక్కువ ఖర్చు చేయాలి”

స్టార్టప్ సంస్థలు టాలెంట్ ఉన్నవారికి రిక్రూట్ చేసుకునేందుకు ఎక్కువే ఖర్చు చేయాలి. అన్ని పనులు చేసుకోలేరు కాబట్టి.. దీనిపై పెట్టుబడి తప్పదు. నిజానికి నా పరాజయానికి డబ్బు కారణం కాదు. కానీ ఆ డబ్బుతో హైరింగ్, డెవలప్మెంట్ వంటి వేరే ఏదైనా చేసే ఉండాల్సింది.

5. లోపించిన విజన్

ప్రారంభించిన కంపెనీపై కనీసం మాకు ఓ అంచనా కూడా లేదు. రెండేళ్ల తర్వాత ఏ స్థాయిలో ఉండాలి. మూడేళ్లకు ఏం చేయాలి, ఐదేళ్లకు ఎక్కడ ఉండాలివంటి ఆలోచన కూడా లేదు. చెప్పేదొకటి, చేసేదొకటిగా తయారైంది వ్యవహారం. వేలకొద్దీ స్కూల్స్ నుంచీ డేటా సేకరించాలని మా ఆలోచన. కానీ బడా స్కూళ్లకు మాత్రమే మా సాఫ్ట్‌వేర్ అమ్మే ప్రయత్నం చేశాం. అభివృద్ధి గురించి అంచనా కూడా లేదు."

'స్టార్టప్‌లకు విజన్ చాలా అవసరం, కాలానికి అనుగుణంగా దృక్పథాలు మార్చుకుంటూ... గోల్ కొట్టేవరకూ ప్రయత్నించాలి'

సరైన వ్యక్తులు కానివారి ప్రభావం మా ఆలోచనలపై కనిపించింది. స్టార్టప్‌ అనుభవం లేని వారితో విపరీతంగా చర్చించాం. వాళ్లంతా కార్పొరేట్ జాబ్స్‌లో సక్సెస్ అయినవాళ్లు. నా సలహా ఏంటంటే... కార్పొరేట్ రంగంలోని వ్యక్తుల నుంచి సలహాలు తీసుకోవద్దు. వాళ్లు చెప్పేది తప్పు కాకపోవచ్చు. అయితే స్టార్టప్‌ల విషయంలో వారి అనుభవం పని చెయ్యదు. సొంతదారి నిర్మించుకోవాలి. కొత్త ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉండాలి.

6. ఆలస్యం అమృతం విషం

కఠిన నిర్ణయాలు తీసుకోగలిగిన స్థాయి నుంచే స్టార్టప్ జర్నీ మొదలవ్వాలి. నిర్ణయాలు ఆలస్యమవుతున్న కొద్దీ.. ఆ ప్రభావం అభివృద్ధిపై స్పష్టంగా కనిపిస్తుంది. వ్యవస్థాపకులు కలిసి కూర్చుని, మాట్లాడుకుని సమస్యలను పరిష్కరించుకుని, తుది నిర్ణయానికి త్వరగా వచ్చేయాలి. అది మంచైనా చెడైనా సరే. ఫౌండర్లకు త్వరగా సరైన నిర్ణయాలు తీసుకునే సమర్ధత ఉండాలి. కట్టుబడి ఉండాలి. లేకపోతే ఇవాళ రాత్రో నిర్ణయం తీసుకుని... మళ్లీ పొద్దునకల్లా మార్చేసుకుంటారు.

"ఇలాంటివే జరిగాయి స్కూల్‌జీనీ విషయంలో. విక్రయ భాగస్వామ్యాలు, కొత్త సేల్స్ ఛానల్స్ ఏర్పాటు, ప్రోడక్ట్ రోడ్ మ్యాప్, వాటా పంపకం, ప్రొడక్ట్ లాంఛింగ్, చివరకు కంపెనీ మూసేయడం విషయంలోనూ ఇదే జరిగింది."

కాలంతో పాటు మా ఆలోచనల్లోనూ చాలా మార్పొలొచ్చాయి. అభిప్రాయబేధాలు ఏర్పడ్డాయి. ఒకరు కొత్తది ఏదైనా చేద్దామంటే... మరొకరు సక్సెస్ అయినవాళ్లని కాపీ కొట్టేస్తే చాలంటారు. ఎవరైనా కంట్రిబ్యూట్ చేయగల ఓపెన్ కల్చర్‌ అంటే.. అంతా సీక్రెట్‌‍గా నడిచే డెవలప్మెంట్, సేల్స్‌కి విధానానికి పరిమితం అవుదామంటారు.

ఇద్దరి వైరుధ్యాలు, కలిసి చేద్దామనే తపన లేకపోవడం... నిర్ణయాల్లో ఆలస్యానికి దారి తీసింది. స్కూల్‌జీనీ కనుమరుగవడంలో ఇది కూడా ప్రధాన కారణం.

7. సరైన మార్గదర్శకులు లేకపోతే ఇంతే

మెంటార్స్(గురువు) విషయంలో స్టార్టప్‌లు నిజాయితీగా టైం వెచ్చించాలి. నిజాయితీగా చెప్పాలంటే... మేం పెద్దగా ప్రయత్నించలేదు ఈ విషయంలో. బ్యాడ్ టైంలో మార్గదర్శకులు మనకు అండగా నిలబడతారు. మన ప్రతీ అడుగునూ శోధిస్తారు. అనుభవంతో కూడిన వారి విజ్ఞానం మన అభివృద్ధికి బాటలు వేస్తుంది. అంతర్గత సమస్యలకు పరిష్కారం చూపే తెలివితేటలు వారిదగ్గరే ఉంటాయి.

ఇప్పుడు మేం స్కూల్‌జీనీకి పని చేయడం లేదు. అయినా సరే ఇదో గొప్ప అనుభవం మాకు. నన్ను, నా సామర్ధ్యాన్ని నమ్మి తనతో పని చేసే అవకాశం ఇచ్చినందుకు నా సహవ్యవస్థాపకుడు అమిత్‌కు నేను చాలా రుణపడి ఉన్నా. కార్పొరేట్ ఉద్యోగాల దగ్గరే ఆగిపోయిన నన్ను... స్టార్టప్ లోకంలోకి తెచ్చిన వ్యక్తి అమిత్.

ఆ తర్వాత పరిస్థితిని దార్లో పెట్టుకోగలిగి, ఆ అనుభవాన్ని భవిష్యత్తుకు ఉపయోగించుకోగలిగితే... పరాజయం అన్నిసార్లూ చెడ్డవేం కావు.

ఏం చేస్తే వర్కవుట్ కాదో తెలుసుకోగలిగా. దాంతో అవే తప్పులు మళ్లీ చేయకూడదని నేర్చుకున్నా. ప్రస్తుతం నేను సహ వ్యవస్థాపకుడిగా చేరిన స్టార్టప్ సంస్థ పాకెట్ సైన్స్ కోసం... స్కూల్‌జీనీ అనుభవం చాలా ఉపయోగపడుతోంది.

---

రచయిత గురించి

ఈ ఆర్టికల్‌ను ఇంగ్లీష్‌లో రాసింది ప్రదీప్ గోయల్. పారిశ్రామికవేత్తగా మారేందుకు ఉద్యోగాన్ని వదిలేశారీయన. ప్రస్తుతం moneycircle.comపేరుతో పర్సనల్ ఫైనాన్స్ బ్లాగ్ నిర్వహిస్తున్నారు. తన అనుభవాన్నే ఓ కథగా.. yourstoryతో పంచుకున్నారు ప్రదీప్ గోయల్.