45వ శ్వేతసౌధాధీశుడు డొనాల్డ్ ట్రంప్  

అమెరికా ప్రయోజనాలకే ప్రియారిటీ -ట్రంప్

0

ట్రంప్.. కంపు అన్నారు. వ్యాపారికేం తెలుసు రాజకీయాలని ఎద్దేవా చేశారు. పాలనా అనుభవం లేదని ఎగతాళి చేశారు. సర్వేలన్నీ హిల్లరీకే పట్టంకట్టాయి. ఊహాగానాలన్నీ ఆమె చుట్టే తిరిగాయి. చివరికి మీడియా కూడా ట్రంప్ గెలవడం కష్టమని తేల్చిపారేసింది. ఎన్నో విమర్శలు. మరెన్నో వివాదాలు. చివరికి ట్రంప్ అమెరికా ఎన్నికల సరళినే ప్రశ్నించారు. రిగ్గింగ్ జరిగిందని ఆరోపించారు. సొంత పార్టీలోనే రెబల్ గా మారారు.

కానీ చివరికి అవన్నీ గాల్లో కలిసిపోయాయి. సర్వేలు తూచ్ అన్నాయి. ఊహాగానాలు ఊసులోనే లేకుండా పోయాయి. విమర్శలు జాడలేవు. బడా బడా సంస్థలు అమెరికా ప్రజల తీర్పుకు బోల్తాపడ్డాయి. అన్ని అవరోధాలను బద్దలు కొట్టుకుంటే రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి ట్రంప్ దూసుకుపోయారు. 45వ అమెరికా అధ్యక్షుడిగా ఏనుగు మీదెక్కి శ్వేతసౌధాధీశుడయ్యాడు.

గెలుపు మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత ఏర్పాటు చేసిన సభలో ట్రంప్ చాలా డిగ్నిఫైడ్ గా మాట్లాడారు. మునుపటిలా ప్రసంగంలో దూకుడు లేదు. చిత్రవిచిత్రమైన హావభావాలు కనిపించలేదు. బాడీ లాంగ్వేజీ పూర్తిగా మారిపోయింది. ప్రశాంతంగా, బాధ్యతాయుతంగా మాట్లాడారు. ప్రజల అభిమానాన్ని చూరగొనేలా ప్రతీ మాటను ఆచితూచి మాట్లాడారు.

అమెరికా పూర్వవైభవాన్ని తీసుకువచ్చేందుకు అందరూ పాటుపడాలని డొనాల్డ్ ట్రంప్ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. తన దృష్టిలో రిపబ్లికన్లు, డెమోక్రాట్లు వేర్వేరు కాదని ప్రకటించారు. ప్రపంచంలో అమెరికా ఎప్పుడూ నెంబర్ వన్నే అన్నారు. రిపబ్లికన్ పార్టీ నిర్వహించిన ప్రచారాన్ని మహోద్యమంతో పోల్చారాయన. విజయం కోసం హిల్లరీ ఎంతో తీవ్రంగా పోరాడిందని కొనియాడారు.

ఏదేమైనా అమెరికా ప్రయోజనాలకే తన ప్రియారిటీ అని స్పష్టం చేశారు. అమెరికా ప్రపంచంలోనే బలమైన ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే పక్కా ప్లాన్ తన దగ్గర వుందన్నారు. ఎలాంటి కష్టాన్నైనా ఎదుర్కునే సత్తా అమెరికాకు వుందని ట్రంప్ విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రపంచ దేశాలతో మిత్రధర్మం పాటిస్తునే అమెరికా ప్రయోజనాలను కాపాడతనని ట్రంప్ స్పష్టంచేశారు.

ఈ సందర్భంగా ట్రంప్ తన తల్లిదండ్రుల గురించి ప్రస్తావించారు. వాళ్ల నుంచి ఎంతో నేర్చుకున్నానని అన్నారు. సోదరుడు రాబర్ట్ గురించి సభలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. భార్య, కుమారులు, కుమార్తెలు తనకు ప్రచారం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. క్యాంపెయిన్ లో పాల్గొన్న జనరల్స్, అడ్మిరల్స్కు కృతజ్ఞతలు తెలిపారు.

45వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ శ్వేతసౌధానికి వెళ్లడానికి ఇంకా టైం ఉంది. 2017 జనవరి 20 మధ్యాహ్నం అమెరికా అధ్యక్షుడిగా వాషింగ్టన్ డీసీలోని యూఎస్ కాపిటల్ భవనంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు. తొలుత ఉపాధ్యక్షుడు , తర్వాత అధ్యక్షుడు ప్రమాణ స్వీకారం చేస్తారు. అదే రోజు బరాక్ ఒబామా అధ్యక్ష పీఠం నుంచి దిగిపోతారు. 

Related Stories

Stories by team ys telugu