వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు. ఎంతో మందికి శివానీ గుప్తా స్ఫూర్తి

వైకల్యం శరీరానికే.. మనసుకు కాదు. ఎంతో మందికి శివానీ గుప్తా స్ఫూర్తి

Monday October 26, 2015,

6 min Read

చాలామంది చిన్న చిన్న సమస్యలకే బెంబేలెత్తిపోతారు. కాలికి చిన్న గాయమైనా, కడుపు నొప్పి వచ్చినా భూమ్యాకాశాలను ఏకం చేస్తారు. కానీ శివానీ గుప్తా స్టోరీ వింటే సమస్యే జడుసుకుంటుంది. ఒకటి కాదు.. రెండుసార్లు ఘోరమైన యాక్సిడెంట్లకు గురైనా, జీవిత భాగస్వామిని కోల్పోయినా, జీవితమే చీకటైనా శివానీ అందరిలా భయపడిపోలేదు. తాను ధైర్యంగా జీవించడమే కాదు, తనలాంటి వారు కూడా ఎలాంటి భయాలు లేకుండా ఉద్యోగాలు చేసుకునే వాతావరణం కల్పించారు. భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతులు మీదుగా జాతీయ అవార్డు గెలుచుకున్నారు.

శివానీ గుప్తా ఢిల్లీకి చెందిన ఓ స్వతంత్ర మహిళ. దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఆమె విద్యనభ్యసించారు. స్వతంత్రంగా జీవించడం, తన కాళ్లపై తాను నిలబడటం ఆమెకు ఎంతో ఇష్టం. అలాగే తాను కన్న కలలను సాకారం చేసుకునేందుకు ఎంతటి కష్టానైనా ఎదుర్కొనేందుకు ఆమె సిద్ధం.

అనుకున్నట్టుగానే ఆమె జీవితంలో ఎన్నో మంచి ఘటనలు జరిగాయి. ఐహెచ్‌ఎం నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి 20 ఏళ్ల వయసులోనే ఢిల్లీలో ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో గెస్ట్ రిలేషన్స్ ఆఫీసర్‌ ఉద్యోగంలో చేరారు. తన ఇంట్లో జరిగిన పార్టీకి ఫ్రెండ్స్‌ను ఇన్వైట్ చేయడం వరకూ అంతా అనుకున్నట్టుగానే జరిగింది.

ఆ రోజు పార్టీలో చాలా రాత్రి వరకూ ఎంజాయ్ చేశారు. ప్రతి ఒక్కరు ఇంటికి వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది. ఓ మహిళా స్నేహితురాలిని ఆమె బస చేస్తున్న హోటల్‌ వద్ద డ్రాప్ చేసేందుకు శివానీ అంగీకరించింది. కానీ ఆమెకు తెలియదు.. ఆ రైడ్ తన జీవితాన్నే మార్చేస్తుందని.

శివానీ ప్రయాణిస్తున్న వెహికిల్ పెను ప్రమాదానికి గురైంది. పర్యవసానం 22 ఏళ్ల శివానీ స్పైనల్ కార్డు తీవ్రంగా దెబ్బతిన్నది. దీంతో ఆమెలో ఒక భాగం పూర్తిగా పట్టు తప్పింది.

ఆమె మళ్లీ కోలుకుని, జీవితాన్ని సాఫీగా సాగిస్తుందని చెప్పడం నిజంగా అబద్ధమే అవుతుంది. కానీ ఎంతటి గాయాన్నైనా కాలం మాన్పిస్తుంది. అలాగే శివానీ కూడా కాలంతోపాటు నెమ్మదిగా కోలుకుంది.

శివానీ గుప్తా

శివానీ గుప్తా


గుర్తింపు సంక్షోభం..

కొత్త పరిస్థితులు తలెత్తిన నేపథ్యంలో ఆమె తనను తాను సంభాళించుకోలేకపోయింది. ఆమెకు గుర్తింపు సంక్షోభం తలెత్తింది. ఈ ప్రమాదంతో తన జీవితం పెను మార్పులకు లోనవుతుందని ఆమెకు తెలుసు. కానీ ఈ స్థాయిలో మార్పులు జరుగుతాయని ఆమె ఊహించలేదు.

‘‘ఈ వైక్యలం అర్థమేమిటో నాకు తెలియదు. దానితో ఎలా జీవితం సాగించాలో కూడా అర్థం కాలేదు. 22 ఏళ్ల వయసులో నేను ఎన్నో కలలు కన్నాను. నా భవిష్యత్ ప్రణాళికలో వైకల్యానికి చోటే లేదు. కానీ ఇలాంటి పరిస్థితులతో పోరాడటం ఎలాగో అవగాహనే లేదు. ఈ పరిస్థితితో గుండె పగిలింది. ప్రపంచాన్ని నేను ఎదుర్కోగలను అని నేను భావించే వరకు నేను లాంగ్ జర్నీ చేయాల్సి వచ్చింది’’ అని శివానీ వివరించారు. వైక్యలం కారణంగా హోటల్‌లో ఆమె తన జాబ్‌ను కూడా కోల్పోవాల్సి వచ్చింది.

‘‘వైక్యలంతో ఉన్నవారిని కార్పొరేట్ సంస్థలు ఉద్యోగంలో కొనసాగిస్తారని అనుకోవడం భ్రమే. ప్రపంచం మొత్తం ఆర్థిక మాంద్యం ఉందని, అందువల్లే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నామని హోటల్ యాజమాన్యం నాకు చెప్పింది. అలా చెప్పడంతో నేను ఉద్యోగం కోసం ఎలా పోరాడాలో అర్థం కాలేదు. ప్రత్యామ్నాయం లేదన్న వాస్తవం అంగీకరించక తప్పలేదు.

ఎగిసిన కెరటం..

కానీ.. శివానీ ఆత్మవిశ్వాసం ముందు విధి సైతం తలవంచక తప్పలేదు. తొందర్లోనే శివానీ కోలుకున్నారు. తన పనులు తానే చేసుకుంటూ, తనలోని కళను మేల్కొలిపి ప్రపంచంలో తనకూ చోటుందని ఆమె నిరూపించుకున్నారు. ఈ సారి పెయింటింగ్ ద్వారా తన సత్తా చాటేందుకు ఆమె ప్రయత్నించారు.

‘‘పెయింటింగ్స్ వేయడం ప్రారంభించాను. నా చేతులు పట్టుతప్పాయి. కానీ కొద్ది కొద్దిగా కదిలిస్తూ పెయింటింగ్స్ వేస్తూ వచ్చాను. అది ఓ చికిత్సగా మారింది. ఆ తర్వాత నేను వేసిన పెయింటింగ్స్‌ను విక్రయించడం మొదలుపెట్టాను. ఎక్కడ ఎగ్జిబిషన్లు, మేళాలు, ఈవెంట్స్ జరిగినా నేను అక్కడ వాలిపోయేదాన్ని. నా పెయింటింగ్స్‌, కలెక్షన్స్‌ను ప్రదర్శనకు పెట్టాను. నాకు తెలుసు నేనో గొప్ప ఆర్టిస్టును కానని. నా పెయింటింగ్స్ అమ్ముడవుతాయో లేదోనన్న డైలమా నన్ను వేధిస్తుండేది. కేవలం వికలాంగురాలిని అన్న సానుభూతితో మాత్రమే తీసుకుంటున్నారని అనిపించేది. దీంతో మరో రంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నాను’’ అని శివానీ వివరించారు.

అదే సమయంలో యూకేలో ఓ రిహాబిలిటేషన్ సెంటర్‌లో రెండు నెలలు గడిపే అవకాశం శివానీకి లభించింది. అలాంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆమెకు అదే తొలిసారి. తన శారీరక స్థితి సరిగా లేకపోయినప్పటికీ ఆ కార్యక్రమంలో ఆమె ఎంతో నేర్చుకుంది.

పరోపకారం..

ఇతరులకు సేవ చేయడంలోనే తృప్తి ఉంటుంది. దీన్ని అక్షరాలా పాటించారు శివానీ. 1996లో యూకే ప్రొగ్రామ్ నుంచి వచ్చిన వెంటనే ఈ సేవను దేశవ్యాప్తంగా ప్రచారం చేశారామె. అప్పుడే దేశంలో ఇండియన్ స్పైనల్ ఇంజ్యూరీ సెంటర్‌ ఏర్పాటైంది. సంస్థ ఏర్పాటు అనేది అప్పుడొక భావన దశలో మాత్రమే ఉంది. గాయాలతో బాధపడుతున్న వ్యక్తులను ఓదార్చేందుకు దాన్ని ఏర్పాటు చేయాలనుకున్నారు. ఆ సంస్థలో చేరిన శివానీ తనలాంటి పరిస్థితులను ఎదుర్కొంటున్న పేషంట్లకు ఓదార్పు వచనాలు చెప్పారామె. అలా ఆ రెండేళ్ల పాటు పేషంట్లలో మనో దైర్యాన్ని నింపారు శివానీ గుప్తా.

శివానీ గుప్తా

శివానీ గుప్తా


‘‘ప్రజల్లో అవగాహన కల్పించడం అప్పుడు చాలా అవసరం. మాలో ఆశ నింపేందుకు ఎవరూ కూడా స్వతంత్రంగా ముందుకు రాని పరిస్థితి అది’’ అని శివానీ చెప్పారు.

ఆమె సాధారణ స్థితికి చేరుకోవడంతో బీజింగ్‌లో యూఎన్ఈఎస్సీఏపీ నిర్వహించిన ప్రొగ్రామ్‌కు ఆహ్వానం వచ్చింది. ఆ సెమినార్ ఉద్దేశం ఏంటంటే.. నాన్ హ్యాండిక్యాపింగ్ ఎన్విరాన్‌మెంట్లో వికలాంగులకు శిక్షణ ఇప్పించడం. అందరిలాగే ప్రపంచంతో పోరాడాలంటే అలాంటి శిక్షణ పొందడం తన హక్కని ఆమె భావించింది. అలాగే అలాంటి శిక్షణ ఇప్పించడం ప్రభుత్వ బాధ్యత కూడా.

భారత్ వచ్చిన వెంటనే ఎన్జీవోలు, భారత ప్రభుత్వం తరఫున వరుసగా ఐదు వర్క్‌షాప్స్‌ను వివిధ రాష్ట్రాల్లో నిర్వహించారామె. వికలాంగుల్లో మానసిక స్థైర్యం నింపేందుకు ప్రభుత్వ ప్రతినిధులు తీసుకోవాల్సిన చర్యలతో ప్లాన్‌ను కూడా రూపొందించారు. అయితే అవన్నీ వృథా అయ్యాయి. ఆ కార్యక్రమాలు కేవలం ప్రసంగాలతోనే, తూతూ మంత్రంగా ముగిశాయి.

‘‘ఈ వర్క్‌షాప్స్ చాలావరకు వృథా అయ్యాయి. ప్రత్యక్షంగా కనిపిస్తున్నా కూడా వాస్తవాన్ని ఆ ప్రతినిధులు గ్రహించలేకపోయారు. దీంతో ఈ సమావేశాలకు హాజరైనవారు ఏమీ గ్రహించలేకపోయారు. మరింత చిత్తశుద్ధి, మరింత సుదీర్ఘమైన శిక్షణ కార్యక్రమం అవసరం’’ అని శివానీ వివరించారు.

అలాగే డిజెబిలిటీపై వచ్చిన ఓ పుస్తకానికి శివానీ గుప్తా సహ రచయితగా కూడా వ్యవహరించారు. కానీ తన జ్ఞానాన్ని పూర్తిగా వినియోగించలేకపోయానని ఆమె భావించారు.

శివానీ గుప్తా

శివానీ గుప్తా


వికలాంగులకు సాయం చేస్తూ..

‘‘నేను మరింత నేర్చుకోవాల్సిన అవసరముందని నాకు అనిపించింది. అందుకే ఆర్కిటెక్చర్ డిజైన్‌లో పీజీ కోసం యూకేలో ఎడెక్సెసెల్‌లో చేరాను. అలాగే ఇంక్లూజివ్ ఎన్విరాన్‌మెంట్‌లో యూకేకే చెందిన యూనివర్సిటీ ఆఫ్ రీడింగ్‌లో ఎంఎస్సీ కూడా పూర్తిచేశాను’’ అని ఆమె చెప్పారు.

వికలాంగులు ఎదుర్కొనే సమస్యలకు పరిష్కారం కోసం శివానీ అమూల్యమైన కృషి చేశారు. తను స్వయంగా వికలాంగురాలు కావడంతో, వారు ఎదుర్కొంటున్న అవసరాలను గుర్తించారు. పరిశోధన చేసి ఏర్పాటు చేసిన ఆర్గనైజేషన్స్ తరపున వికలాంగులకు సాయం చేసేందుకు ముందుకొచ్చారామె. అలా 2006లో యాక్సెస్ ఎబిలిటీ పేరుతో ఓ సంస్థను ప్రారంభించారు.

‘‘అన్ని రకాల వికలాంగుల ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సాయం చేయడమే మా ప్రధాన కర్తవ్యం. ప్రైవేట్ సెక్టార్, హాస్పిటాలిటీ, రిటైల్, ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ ఇలా వికలాంగులను ఉద్యోగాలిచ్చేందుకు అంగీకరించే సంస్థలకు మేం ఓ ప్రణాళికను రూపొందించి ఇచ్చాం. వికలాంగులకు అవసరమైన, అనుకూలంగా పరిస్థితులు కల్పించేందుకు ఎలాంటి మౌలిక వసతులు ఏంటో వివరించాం’’ అని శివానీ తెలిపారు.

శివానీ తీసుకున్న నిర్ణయం ఆమెను అంతర్జాతీయంగా నిలబెట్టింది. జనీవాలోని మానవ హక్కుల కమిషనర్‌తో కూడా కలిసి పనిచేసేలా చేసింది. పరిస్థితులు మళ్లీ శివానీకి అనుకూలంగా మారడం ప్రారంభించాయి. ప్రపంచంలో శివానీ మరోసారి తానేంటో గుర్తింపు సంపాదించుకుంది..

దెబ్బ మీద దెబ్బ..

కాని మనిషి ఒకటి తలిస్తే విధి మరోటి తలుస్తుంది. 2009 పరిస్థితులు మళ్లీ తిరగబడ్డాయి. మరో ప్రమాదం... శివానీ నిర్మించుకుంటూ వచ్చిన జీవితాన్ని కుప్పకూల్చింది. ఈ సారి జీవిత భాగస్వామి, తాను కోలుకునేందుకు ఇన్నాళ్లూ ఆసరాగా నిలబడి, తన మనోధైర్యానికి మూలస్థంబమైన భర్తను కూడా కోల్పోయింది. అలాగే ఆ ప్రమాదానికి ఆమె మామ గారు కూడా బాధితుడయ్యారు.

జీవిత భాగస్వామిని కోల్పోవడంతో తీవ్రంగా నష్టపోయిన శివానీ, మళ్లీ తను ధైర్యంగా జీవితంతో పోరాడాల్సిన సమయం ఆసన్నమైందని గుర్తించింది. కాలంతోపాటు ముందుకు కెళ్లాల్సిన అవసరముందని గ్రహించింది. ఆమెకే కనుక ప్రపంచంలో గుర్తింపు సాధించాలన్న తపన ఉండి ఉండకపోతే రెండు ఘోరమైన విపత్తుల నుంచి బయపడగలిగి ఉండేదే కాదు. ఈసారి రచనల ద్వారా దుర్ఘటనను మర్చిపోయేందుకు ప్రయత్నించారామె. ‘‘నో లుకింగ్ బ్యాక్’’ పేరిట ఆటో బయోగ్రఫీని రాశారు.

‘‘నా గురించి నేను రాసుకుంటున్నప్పడు, నాకు జరిగిన ఎన్నో ఘటనలు నా కళ్లముందు కదిలాయి. నా ఆత్మకథలోనే అన్నింటికీ సమాధానాలు లభిస్తాయని నేను గుర్తించాను. నేను పరిస్థితులను నియంత్రించలేనప్పుడు ప్రశాంతంగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను’’ అని శివానీ పేర్కొన్నారు.

జాతీయ అవార్డు.. రోల్ మోడల్..

అసమానమైన సంకల్పం.. శివానీని మహామహుల సరసన నిలిపింది. రెండు ఘోరమైన ప్రమాదాలు ఎదుర్కొన్నా, మొక్కవోని పట్టుదలతో జీవితాన్ని సాగించినందుకుగాను ఎన్నో అవార్డులు, సత్కారాలు ఆమె పాదాక్రాంతమయ్యాయి. వికలాంగులకు ఉపాధి అవకాశాలను పెంచేందుకు ఆమె చేసిన ప్రయత్నానికి గాను ఎన్‌సీఈపీఆర్డీ హెలెన్ కెల్లర్ అవార్డు వరించింది. రోల్ మోడల్‌గా నిలిచినందుకు కెవిన్‌కేర్ ఎబిలిటీ మాస్టర్ అవార్డు, వికలాంగ విద్యార్థులకు సాయం చేసినందుకుగానూ స్నోడాన్ అవార్డ్, సమాజంలో అసమానతలను రూపుమాపేందుకు ప్రయత్నించే మహిళలకు ఇచ్చే నీరజభానోత్ అవార్డు శివానీ గుప్తాను వరించాయి.

తనకెంతో ఇష్టమైన ప్రఖ్యాత శాస్త్రవేత్త, మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం చేతుల మీదుగా కూడా ఆమె ఓ ప్రతిష్ఠాత్మక అవార్డు స్వీకరించారు. కేంద్ర సాంఘీక సంక్షేమ శాఖ ప్రతిఏటా ఇచ్చే ఓ జాతీయ అవార్డును కలాం చేతుల మీదుగా శివానీ అందుకున్నారు. ‘‘అన్ని అవార్డుల్లో నాకు ప్రత్యేకమైనది నీరజ్ భానోత్ అవార్డ్. నా షరతు మేరకు నిర్వాహకులు ప్రత్యేకంగా స్టెయిర్ కేసులపై ర్యాంప్‌లను ఏర్పాటు చేశారు. దీంతో నేను స్వయంగా వేదికపైకి వెళ్లగలిగాను. ర్యాంప్స్ నిటారుగా ఉన్నప్పటికీ నేను నెమ్మదిగా వెళ్లాను. అదంతా ఆలోచనా విధానమే’’ అని శివానీ చెప్పారు.

గుడి బయట ఉంటే ఎవరో బిచ్చమేసిపోయారు

ప్రతిరోజు కాకపోయినప్పటికీ తాను కలిసిన చాలామంది శివానీపై సానుభూతి చూపించినవారే. ‘‘భారత్‌లో వైకల్యం అంటే వద్దనకుండానే జాలీ, సానుభూతి చూపిస్తారు. ఓ రోజు నాకు ఓ మహిళ 25 పైసలు దానంగా ఇచ్చింది. అందుకు కారణం నేను గుడి బయట కూర్చుని ఉండటమే. అందునా వైకల్యంతో ఉండటంతో నన్ను బెగ్గర్‌గా భావించి ఆ మహిళ దానం చేసింది. ఇలాంటి ఆలోచనా ధోరణి మనలో చాలమందికి ఉంటుంది. అది ఎప్పటికీ అలాగే ఉండిపోతుంది. వైకల్యం కూడా మనలో ఓ గుణంలాంటిదేనని చాలామంది అర్థం చేసుకోరు. రష్యాలాంటి దేశాలకు వెళితే, వారి భాష మాట్లాడకుంటే మనం వికలాంగులమే. అలాగని మనం అన్ని రంగాల్లో పనికిరామని భావం కాదు కదా.. అలాగే వికలాంగుల్లో మరెన్నో సామర్థ్యాలు ఉండి ఉంటాయి’’ అని శివానీ వివరించారు.

వైకల్యం ఉన్నప్పటికీ ఈమె పనికిరాదు అన్న భావనకు చాలా దూరం. ఆశ, ధైర్యం, స్ఫూర్తి వంటి విషయాల్లో శివానీ ఓ ఐకాన్. చిన్న సమస్యలకే తల్లడిల్లిపోయే ఎందరికో శివానీ ఓ స్ఫూర్తి.

‘‘ఓపిగ్గా వ్యవహరించండి. ఎలా రాసి పెట్టి ఉంటే అలా జరుగుతుంది. కానీ ఎల్లప్పుడూ కృతజ్ఞ‌త‌గా ఉండండి’’ అని ఆమె తన స్టోరీని ముగించారు.