ఐదు దశాబ్దాల తర్వాత బీఎస్ఎఫ్ లో లేడీ కమాండెంట్

ఐదు దశాబ్దాల తర్వాత బీఎస్ఎఫ్ లో లేడీ కమాండెంట్

Wednesday March 29, 2017,

2 min Read

బీఎస్‌ఎఫ్‌. సరిహద్దు భద్రతాదళం. అక్కడ విధులు నిర్వర్తించడం అనుకున్నం తేలిక కాదు. ఉగ్రమూకల చొరబాట్లను అడ్డుకోడానికి అత్యంత ధైర్య సాహసాలు కావాలి. నిత్యం డేగకళ్లతో పహారా కాయాలి. ప్రాణాలకు తెగించి పోరాడాలి.

అయితే, బేసిగ్గా ఇలాంటి ఉద్యోగాలు మగవాళ్లు మాత్రమే చేయగలరు.. వారికే శక్తిసామర్ధ్యాలు ఉంటాయనేది సమాజంలో నాటుకుపోయిన భావన. అందుకేనేమో గత ఐదు దశాబ్దాలుగా బీఎస్‌ఎఫ్‌లో లేడీ జవాన్ అన్నమాటే లేదు. అలాంటి చరిత్రను తిరగరాసింది తనుశ్రీ పరీక్‌. రాజస్థాన్ బికనీర్‌ కి చెందిన 25 ఏళ్ల ఈ లేడీ సోల్జర్ బీఎస్‌ఎఫ్ లో మొట్టమొదటి మహిళా ఫీల్డ్ ఆఫీసర్‌గా రికార్డ్ క్రియేట్ చేసింది. గత 51 ఏళ్లలో బీఎస్ఎఫ్ ఆఫీసర్ ర్యాంకులో మహిళలు లేరన్న లోటుని తీర్చేసింది.

image


2014లో యూపీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన తనుశ్రీ మహారాష్ట్ర తేకన్ పూర్ బీఎస్‌ఎఫ్ అకాడమీలో చేరారు. 52 వారాల పాటు అనేక అంశాల్లో శిక్షణ పొందారు. మొన్న జరిగిన పాసింగ్ ఔట్ పరేడ్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి రాజ్‌ నాథ్ సింగ్ తనుశ్రీపై ప్రశంసల వర్షం కురపించారు. బీఎస్‌ఎఫ్ లో ఫీల్డ్ ఆఫీసర్ ఒక మహిళ కావడం ఎంతో గర్వంగా ఉందని అన్నారు. తనుశ్రీని స్ఫూర్తిగా తీసుకుని యువతులు బీఎస్‌ఎఫ్‌ లో సేవలు అందించడానికి ముందుకు రావాలని రాజ్ నాథ్ పిలపునిచ్చారు.

67 మంది ట్రైనీ ఆఫీసర్లకు తనుశ్రీ టీం లీడర్‌ గా వ్యవహరిస్తారు. అందులో 51 మంది డైరెక్ట్ ఎంట్రీ ఆఫీసర్ ర్యాంక్ ఉన్నవారే. మిగిలిన వారు ప్రమోషన్ మీద వచ్చారు. అసిస్టెంట్ కమాండెంట్ గా తనుశ్రీ పంజాబ్ లోని ఇండో పాక్ బోర్డర్ లో ఆమె బాధ్యతలు చేపట్టారు.

1965లో ఏర్పాటైన బీఎస్ఎఫ్ పాక్, బంగ్లా సరిహద్దు రక్షణలో రాజీలేని పోరాటం చేస్తోంది. ఈ రక్షణ దళంలో రెండున్నర లక్షల మంది జవాన్లు దేశానికి సేవలందిస్తున్నారు. మిలటరీ తర్వాత, భూ, జల, వాయు దళాల్లో పహారా కాసే ఏకైక ఫోర్స్ బీఎస్‌ఎఫ్. ఒక్కమాటలో చెప్పాలంటే బీఎస్‌ఎఫ్‌ దేశానికి మొదటి రక్షణ రేఖ మాత్రమే కాదు.. మొదటి రక్షణ గోడ కూడా. దేశంలోని అత్యంత గౌరవనీయ సేవల్లో ఇదీ ఒకటి. అలాంటి క్లిష్టమైన సర్వీస్ లోకి మహిళ ఒక ఆఫీసర్‌ గా రావడం జాతి గర్వించాల్సిన విషయం.