మాజీ సైనికులను కార్పొరేట్ ప్రపంచంలోకి ఆహ్వానిస్తోన్న ఫౌజ్‌నెట్

సైనికుడు అంటే సరిహద్దుల్లోని శత్రువులను చీల్చి చెండాడతాడు. అవసరమైతే.. దేశం కోసం ప్రాణాలను పణంగా పెడతాడు. అయితే ఈ రెండూ చేయడానికి... అకుంటిత దీక్ష, గుండెబలం, కండబలం, పట్టుసడలని స్థైర్యం, మనోనిబ్బరం... అన్నింటికీ మించిన క్రమశిక్షణ ఎంతో అవసరం. దేశ సంరక్షణార్ధం చలి, ఆకలిని తట్టుకుంటూ.. నిద్రాహారాలకు దూరంగా గడిపేస్తున్న జవాన్ల నరనరాన జీర్ణించుకున్న ఈ లక్షణాలే ఇప్పుడు కార్పొరేట్ ప్రపంచాన్నీ ఆకట్టుకుంటున్నాయి.

0

అయితే.. దేశ కోసం ప్రాణాలను సైతం లెక్కచేయని సైనికుల శౌర్యం.. కార్పొరేట్ సంస్థల్లో కేవలం సెక్యూరిటీ, మానవ వనరుల విభాగానికి మాత్రమే పరిమితం అయిపోతున్నాయి. శత్రు సైనికులను అదుపు చేయడంలో పనికి వచ్చిన వారి నైపుణ్యాలు రిటైర్మెంట్ అందుకున్నాక ఎవరికీ అక్కరకు రాకుండా పోతున్నాయి. ఈ పరిస్థితిలోనే మార్పు తీసుకురావాలని IIM ముంబైలో పనిచేస్తున్నప్పుడే నిర్ణయించుకున్నారు కెప్టెన్ వెంకటరమణారావు. మాజీ సైనికులకు కార్పొరేట్ ప్రపంచంలోనూ సమున్నత స్థానం కల్పించే సంకల్పంతో "ఫౌజ్‌నెట్ " ను స్థాపించారు.

కెప్టెన్ వెంకట్, కల్నల్ ప్రసాద్, ఫౌజీ నెట్ వ్యవస్థాపకులు
కెప్టెన్ వెంకట్, కల్నల్ ప్రసాద్, ఫౌజీ నెట్ వ్యవస్థాపకులు
"సమస్య రెండు వైపులా ఉందని నేను గుర్తించాను. మాజీ సైనికులు అత్యంత అనుభవజ్ఞులు, నాయకత్వ లక్షణాలు కలిగిన వారై ఉండి కూడా కార్పొరేట్ సంస్థలకు తమ నైపుణ్యాలపై అవగాహన కల్పించలేకపోతున్నారు. సైన్యాధికారుల సామర్థ్యంపై సదరు సంస్థలకు అవగాహన ఉన్నప్పటికీ వారికి సరైన అవకాశాలను కల్పించలేకపోతున్నాయ"ని అంటారు కెప్టెన్ వెంకట్.

రిటైర్మెంట్ పొందిన తన సహచరులు ఇతర సంస్థల్లో ఉద్యోగాలు పొందేందుకు పడుతున్న ఇబ్బందులే కెప్టెన్ వెంకట్ ఆలోచనలకు బీజం వేశాయి. అప్పుడే తన సహచరుడైన ఫ్లైట్ లెఫ్టినెంట్ శ్రీనాథ్ సహకారంతో తమ సహచరుల నైపుణ్యాలకు అనుగుణంగా కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాల కోసం ప్రొఫైల్స్‌ను సిద్ధం చేయడం ప్రారంభించారు. వారి కృషి త్వరలోనే మంచి ఫలితాలను అందుకుంది. IIM లక్నోలోని డిఫెన్స్ MBA బ్యాచ్‌లకు 1:5 నిష్పత్తిలో ఉద్యోగాలు కల్పించేందుకు పలు సంస్థలు ముందుకు వచ్చాయి.

అయితే ఫౌజ్‌నెట్‌ను స్థాపించడంలో కెప్టెన్ వెంకట్ కూడా కొన్ని అడ్డంకులను ఎదుర్కొనక తప్పలేదు. ప్రారంభంలో అన్ని వైపుల నుంచి ఎన్నో సవాళ్లు ఉత్పన్నమయ్యాయి. కుటుంబ సభ్యుల ఒత్తిడి, ఆర్ధిక సమస్యలు వారిని ఉక్కిరిబిక్కిరి చేశాయి. కానీ, అన్నింటినీ అధిగమించి ముందుకు వెళ్లడానికే నిర్ణయించుకున్నారు.

"మేము ఎంచుకున్నది విభిన్నమైన మార్గం కావడంతో... మాజీ సైనికుల నైపుణ్యాలపై కార్పొరేట్ సంస్థలకు సరైన అవగాహన కల్పించడం కష్టతరమైంది. మరోవైపు రిటైర్మెంట్‌ను ప్లాన్ చేసుకుని, ఇతర రంగాల్లో ముందుకు సాగడంపై మాజీ సైన్యాధికారులకు అవగాహన కల్పించే ప్రక్రియ కూడా ఎంతో వ్యయప్రయాసలతో కూడుకున్నది. దీనికి తోడు పెట్టుబడి సమస్యలు కూడా చుట్టుముట్టాయి. ప్రారంభంలో ఇతర నియామకాలు, అభ్యర్ధులను ఆకట్టుకునేందుకు పలు శిక్షణా తరగతులను కూడా నిర్వహించామ"ని చెబుతారు కెప్టెన్ వెంకట్.

మార్కెటింగ్

కేవలం నోటి మాట ద్వారానే ఫౌజ్‌నెట్ కు విపరీతమైన ఆదరణ లభించింది. తమ సంస్థ ద్వారా వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉద్యోగాలు సంపాదించిన మాజీ సైన్యాధికారులే వీరి ప్రచారకర్తలుగా మారారు. ఫౌజీనెట్ ద్వారా లబ్ధిపొందిన పలు సంస్థలు సైతం.. తమ సర్కిల్ లోని ఇతరులకూ ఈ సంస్థ గురించి సిఫార్సులు చేస్తున్నాయి.

తమ సంస్థ ద్వారా ఇప్పటివరకూ 5వేల మంది మాజీ సైన్యాధికారులకు వివిధ కార్పొరేట్ సంస్థల్లో ఉన్నత ఉద్యాగాలు కల్పించినట్లు చెబుతారు ఫౌజీనెట్ వ్యవస్థాపకులు. సైన్యంలో ఉద్యోగ విరమణ పొందిన అనంతరం తమ కెరీర్‌లకు సరికొత్త దిశానిర్దేశం చేసుకోవాలనుకుంటోన్న సుమారు లక్షా యాభైవేల మందికి తమ నైపుణ్యాలకు తగ్గట్టు ప్రొఫైల్స్‌ను సిద్ధం చేసింది ఫౌజీనెట్. 250 కార్పొరేట్ సంస్థలకు ఏదో ఒకక రూపంలో మిలటరీ హైరింగ్ అడ్వైజరీ సేవలు అందిస్తోంది.

ప్రస్తుతం తమ సేవలను విస్తరించే పనిలో ఉన్న ఫౌజీనెట్ వ్యవస్థాపకులు... భవిష్యత్తులో మరింత ధృఢమైన టెక్నైలజీ ద్వారా పటిష్ఠమైన బృందాన్ని నిర్మించేందుకు కృషి చేస్తున్నారు.

WEBSITE