గ్రామీణులకు ఫ్యాషన్ డిజైనింగ్ నేర్పిన తమన్నా !

ఆమె ఫ్యాషన్ డిజైనర్.. కావాలంటే.. ఏ సిటీలోనో కలర్ ఫుల్ లైఫ్ గడపొచ్చు. కానీ ఆమె సమాజం గురించి ఆలోచించింది. తను పుట్టి పెరిగిన గ్రామాల్లో సాటి స్త్రీల గురించి ఆలోచించింది. తనకొచ్చిన విద్య తోనే వారి జీవితాల్లో వెలుగులు నింపాలనుకుంది. సాహసోపేతమైన ఈ ఆలోచనకు ఆచరణ రూపమే.. హమారా సాహస్..

0

‘‘ఇక్కడ స్త్రీలకు చాలా కష్టాలున్నాయి. ఈ కష్టాలకు ప్రధాన కారణం, వారికి బయట ప్రపంచంలో ఏం జరుగుతోందో తెలియదు. ఉద్యోగమో, వ్యాపారమో చేయడానికి వారికి నైపుణ్యం లేదు. ’’ అంటారు తమన్నా భాటి. అందుకే పది నెలల క్రితం ఆమె ఓ నిర్ణయం తీసుకున్నారు.

తనకొచ్చిన ఫ్యాషన్ డిజైనింగ్ తోనే వారికి ఓ లాభసాటి వ్యాపకం కల్పించాలనుకున్నారు. అనుకున్న వెంటనే హమారా సాహస్ అనే ఓ స్వచ్ఛంద సంస్థకు ప్రాణం పోసారు. రాజస్థాన్‌లో స్త్రీల కోసం స్త్రీలే నడుపుకునే ఏకైక స్వచ్ఛంద సంస్థ ఇదే. ‘‘ఒక మహిళ గా సాటి మహిళల బలాలు, బలహీనతలు, అవసరాలు, అడ్డంకులు నాకు తెలుసు.. ఈ అవగాహనతోనే వారికి వీలైనంత మేలు చేయడానికి ప్రయత్నిస్తున్నాం.’’ అంటారామె.

‘‘నాకు పెళ్ళి అయ్యాక పొరుగునే వున్న రతనాడ గ్రామంలో స్త్రీల దయనీయ పరిస్థితిని గమనించాను. చాలామంది బాల్యవివాహాలు చేసుకుని చిన్నప్పుడే తల్లులైన వాళ్లు. చిన్నప్పుడే ఇంటిని చూసుకునే బాధ్యతలు తలకెత్తుకుని, స్కూళ్ళకి చదువుకి దూరమైన వాళ్ళు. వీళ్ళకేదైనా చేయాలనిపించింది. ఒక ఫ్యాషన్ డిజైనర్ గా నేను చూసిన రంగుల ప్రపంచమేంటో వారికి కూడా చూపించాలనిపించింది.’’ 

అని పది నెలల క్రితం ఈ సంస్థను ప్రారంభించడం వెనుక వున్న ఉద్దేశాన్ని వివరించారు తమ్మనా భాటీ . అప్పటికే పదేళ్ళు ఓ ఎన్ జీవోలో పని చేసిన అనుభవమున్న తమ్మన్నా భాటీ తాజా ఆలోచనకు ఆమె ఇంట్లో కూడా ఎదురు చెప్పలేదు.

హమారా సాహస్‌లో మహిళలు
హమారా సాహస్‌లో మహిళలు

జోధపూర్ జిల్లా, రతనాడా గ్రామంలో హమారా సాహస్ సేవలు మొదలయ్యాయి. మట్టికుండలు చేసుకుని బతుకీడ్చే ఈ గ్రామ ప్రజలు అత్యంత పేదరికంలో మగ్గుతున్నారు. ఇక్కడి మగాళ్ళకు తాగడం, భార్యలను, పిల్లలను వేధించడమే పని. దీంతో ఇంటి బాధ్యతనంతా స్త్రీలే మోయాల్సి వస్తుంది. అయితే, అందుకు తగ్గ శక్తి సామర్థ్యాలు వారికి లేవు.

ఈ పరిస్థితిలో మార్పు రావాలి.. ఇక్కడి మహిళ జీవితాల్లో వెలుగు నింపాలి.. అని హమారా సాహస్ ప్రయత్నం మొదలు పెట్టింది. సంకల్పం మంచిదైతే, ప్రయత్నం ఫలించి తీరుతుంది. రతనాడాలో హమారా సాహస్ ప్రయత్నం కూడా అలాగే ఫలించింది. ఇక్కడ శిక్షణ పొందిన చాలా మంది మహిళలకు ప్రభుత్వ సంస్థల్లో ఉపాధి దొరికింది. ఆ తర్వాత హమారా సాహస్ తన కార్యకలాపాలను జలోరి గేట్ ప్రాంతానికి మార్చింది.

‘‘మేరీ కోమ్ ను ఆదర్శంగా తీసుకుని మా పని మొదలు పెట్టాం. అన్ని కష్టాల మద్యే ఆమె అన్ని విజయాలను సాధించగలిగినప్పుడు, ఇక్కడ వున్న అడ్డంకులు పెద్ద సమస్య కాదనిపించింది.’’ అని తొలి నాళ్ళను గుర్తు చేసుకున్నారు.. భాటి.

హమారా సాహస్.. ఓ ప్రయత్నం

రతనాడ్ మహిళలకు ఆర్ధిక స్వావలంబన ఇవ్వడమే హమారా సాహస్ తొలి ప్రాధన్యంగా పెట్టుకుంది. ఇందుకోసం తమనా భాటి తనకొచ్చిన విద్యనే పెట్టుబడిగా మార్చారు. అక్కడి మహిళలకు, కుట్లు, ఎంబ్రాయిడరీ, హస్తకళల్లో శిక్షణ ఇచ్చారు. పేదరికంతో మగ్గిపోయే ఇక్కడి మహిళలు ఈ శిక్షణ తర్వాత సొంత కాళ్ళ మీద నిలబడగలిగారు. దాని వల్ల వారికి కాస్త ఆరోగ్యవంతంగా.... ఆత్మ గౌరవంతో బతకడం అలవాటైంది.

సవాళ్లు

కేవలం ఆర్ధికంగా బలోపేతం చేయడంతోనే హమారా సాహస్ సరిపెట్టుకోలేదు. ఈ గ్రామంలో వున్న ఇతర రుగ్మతలను కూడా రూపుమాపాలనుకుంది. ఆడపిల్ల పుట్టగానే ప్రాణాలు తీసేయడం, అంటరాని తనం, నిరక్షరాస్యత, వరకట్నం, బాల్య వివాహాలు.. ఇలాంటి వాటన్నిటినీ అరికట్టే ప్రయత్నం చేసింది. ‘మా ప్రయత్నానికి పిల్లలు, వృద్ధులు సహకరించారు కానీ, మధ్యవయస్సు వాళ్ళు మాత్రం ఎదురు తిరిగారు. ’ అని గుర్తు చేసుకున్నారు.. భాటీ.

‘‘నిజానికి ఇక్కడున్న చాలా సమస్యలకు మూలం లింగవివక్ష అని అర్థమైంది. దీన్ని పోగొట్టి , స్త్రీ పురుషులు ఇద్దరూ సమానమే అని వీరికి అర్థం కావాలంటే, యువతరాన్ని విద్యావంతుల్ని చేయడమొక్కటే దారి అని మాకనిపించింది..’’ అని చెబుతారు..తమ్మనా..

ఇందుకోసం హమారా సాహస్.. మూడు నాలుగు స్థాయిల్లో తన పని మొదలు పెట్టింది. ముందుగా కొంతమంది వలంటీర్ల సాయంతో పిల్లలకు ఉచిత ప్రాథమిక విద్య అందించింది. దీని వల్ల తల్లులకు ఇంట్లో పిల్లల్ని చూసుకునే పనితగ్గింది. వాళ్ళు వ్రుత్తి విద్యను నేర్చుకోవడానికి సమయం చిక్కేది. అటు పిల్లలకు కూడా చదువుకోవడం వల్ల వాళ్ళ ఆలోచన పరిథి పెరిగింది. స్త్రీ పురుష సమానత్వం, ఆత్మ గౌరవం, ఇతరులను గౌరవించడం లాంటి లక్షణాలు వారిలో అలవడ్డాయి.

పేదరికంలో మగ్గిపోయే స్త్రీలకు అవసరమైన వృత్తి నైపుణ్యాన్ని అందించడంతో పాటు, వారిలో నాయకత్వ లక్షణాలు పెంపొందించడంపై కూడా హమారా సాహస్ దృష్టి సారించింది. దీని వల్ల వారు మరింత ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలు తీసుకోగలిగారు. పేదరికం వారిలో నింపిన అనేక అవలక్షణాలు ఈ శిక్షణ తర్వాత పోయాయి. వారు మరింత స్వావలంబనతో, సంతోషంతో కనిపించేవాళ్ళు..’’ అని చెప్తున్న తమ్మనా కళ్ళలో కూడా ఆనందం కనిపించింది.

ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందుతున్న మహిళలు
ఎంబ్రాయిడరీలో శిక్షణ పొందుతున్న మహిళలు

‘‘అయితే, దీనికంతా నిధుల సమీకరణ అతి పెద్ద సవాలుగా మారింది. ప్రభుత్వాల నిధులు రావాలంటే, నియమాలు అడ్డుపడతాయి. కనీసం ఏడాది నిండిన సంస్థలకు కానీ, ప్రభుత్వాలు నిధులివ్వవు. అలా నిండాక కూడా నిధులు చేతికి రావడానికి ఎంత కాలం పడుతుందో చెప్పలేం. ప్రస్తుతానికి స్థానిక దాతలు, స్వచ్ఛంద సేవకుల మీదనే ఆధారపడి ఈ సంస్థను నడుపుతున్నామని’’ చెప్పారు తమ్మనా.

‘‘సౌందర్యానికి ప్రతీకల్లాంటి ఇక్కడి మహిళలు స్వావలంబనకి కూడా మారు పేరు కావాలి. వాళ్ళ మీద వాళ్ళకి గౌరవం పెరిగితేనే, సమాజం కూడా వారిని గౌరవిస్తుంది.’’ ఆ రోజు రావాలన్నదే తమ్మనా భాటీ ఆశ.. ఆశయం..