ముగ్గురు మహిళలకు ఒకరోజు మంత్రి పదవి ఇచ్చిన రాజస్థాన్ సర్కారు

ముగ్గురు మహిళలకు ఒకరోజు మంత్రి పదవి ఇచ్చిన రాజస్థాన్ సర్కారు

Thursday January 26, 2017,

2 min Read

జనవరి 24. జాతీయ బాలికా దినోత్సవం. సాధారణంగా ఆ రోజు బాలికల గురించీ, సమాజంలో వారి హక్కుల గురించి, వారి జీవితం గురించి, వాళ్లు ఎదుర్కొంటున్న కష్టాల గురించీ పాలకులు, అధికారులు నాలుగు లెక్చర్లు దంచి, పత్రికల్లో టీవీల్లో కనిపించడం కోసం నాలుగు కార్యక్రమాలు జరిపి, చేతులు దులుపుకుంటారు. ఇదంతా కామన్ గా జరిగేదే. అయితే, రాజస్థాన్ ప్రభుత్వం మాత్రం కొంచెం విభిన్నంగా ఆలోచించింది. నేషనల్ గర్ల్ చైల్డ్ డేని మొక్కుబడి కార్యక్రమంలా కాకుండా పదిమందికీ ఆదర్శంగా నిలిచేలా వినూత్నంగా ఆలోచించింది.

image


సమాజంలో వివక్షకు గురవుతున్న బాలికల తరుపున గొంతు వినిపిస్తున్న ముగ్గురు యువతులను ఎంపిక చేసి, వారికి ఒకరోజు మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి పదవి ఇచ్చింది రాజస్థాన్ ప్రభుత్వం. అంటే ఏక్ దిన్ కా మంత్రి అన్నమాట. రాజస్థాన్ మహిళా మంత్రి అనిత భదేల్ చేతుల మీదుగా.. జశోద గమెటి, సోనా బైర్వా, ప్రీతి కన్వర్ అనే ముగ్గురు మహిళలు ఒకరోజు గౌరవ మంత్రి పదవి స్వీకరించారు. వాళ్ల చేతుల మీదుగా 10,500 మంది అంగన్ వాడీ కార్యకర్తలకు మొబైల్ ఫోన్స్ అందజేశారు. వారితోపాటు 282 సూపర్ వైజర్లకు ఐపాడ్స్ ఇచ్చారు.

మంత్రి పదవి కోసం ఎంపిక చేసిన ఆ ముగ్గురు యువతులు బాలికల హక్కుల కోసం పోరాడుతున్నారు. వివక్ష చూపిస్తున్న సమాజాన్ని నిగ్గదీస్తున్నారు. బాల్యవివాహాలపై అలుపెరుగని పోరాటం చేస్తున్నారు. వారి ధైర్యాన్ని మెచ్చిన మంత్రి అనిత భదేల్.. ఆ ముగ్గురిని ఒకరోజు మినిస్టర్ పదవి ఇచ్చి గౌరవంగా తన సీట్లో కూర్చోపెట్టారు. ఆ రోజంతా వాళ్లే మహిళా సంక్షేమ శాఖ మంత్రులుగా అవసరమైన ఉత్తర్వులు జారీ చేశారు.

అబ్బాయిల కంటే అమ్మాయిలేం తక్కువ కాదు అని చెప్పడానికే ఈ నిర్ణయం తీసుకున్నామని మంత్రి అనిత స్పష్టం చేశారు. బాలికలకు స్వేచ్ఛ ఇస్తే ఆకాశమే హద్దుగా దూసుకెళ్లి, నింగీనేలా తమదే అని చాటిచెప్తారన్నారు. వారికి తగిన అవకాశాలు ఇస్తే తామేంటో నిరూపించుకుంటారని మంత్రి ఉద్ఘాటించారు. తద్వారా బాలికల్లో ఆత్మవిశ్వాసం పెరుగుతుందని అనిత తెలిపారు. సమాజంలో వివక్షకు గురవుతున్న అమ్మాయిల తరుపున పోరాటం చేసేవాళ్లకు ప్రభుత్వం పూర్తిసహకారం అందిస్తుందని, వాళ్లకు చేయూతనందివ్వడం కోసం అనేక పథకాలు రూపకల్పన చేశామని మంత్రి అన్నారు.