ఆడవాళ్లకు నిజంగా ఇది శుభవార్తే..!!

నచ్చినట్టుగా షూ డిజైన్ చేసి ఇస్తున్న లక్నో స్టార్టప్

ఆడవాళ్లకు నిజంగా ఇది శుభవార్తే..!!

Thursday April 14, 2016,

4 min Read


ఒక‌ అమ్మాయికి ప‌ర్ఫెక్ట్ షూ ఇవ్వండి, ఆమె ప్ర‌పంచాన్ని గెలుచుకుని వ‌స్తుంది- ఒక సంద‌ర్భంలో మార్లిన్ మ‌న్రో అన్న మాట‌లివి!

నిజ‌మే! మ‌గ‌వాళ్ల‌కయితే ఫ‌ర‌వాలేదు గానీ, లేడీస్ కు మాత్రం షూ కొన‌డం పెద్ద త‌ల‌నొప్ప వ్యవహారమే..! వంద షాపులు తిరిగినా న‌చ్చిన షూ దొర‌క‌దు! దొరికినా డిజైన్ బాగుండ‌దు! లేదంటే క‌ల‌ర్ న‌చ్చ‌దు! హీల్ స‌రిపోదు! ఒక్క జ‌త బూట్లు కొన‌డానికి ఆడ‌వాళ్లకు సవాలక్ష ప్రాబ్లమ్స్! అయితే ఇప్పుడిక ఆ ఇబ్బంది లేదు. మీరు మెచ్చిన‌, న‌చ్చిన షూ స్వయంగా మీరే త‌యారు చేసుకోవచ్చు. అదెలాగో మీరే చ‌ద‌వండి..!!

ప‌ర్పుల్ హైడ్! క‌స్ట‌మైజ్డ్ షూ డిజైన్ కంపెనీ! అంటే క‌స్ట‌మ‌ర్ల‌కు న‌చ్చిన విధంగా బూట్లు త‌యారు చేసివ్వ‌డమన్న‌మాట‌! ఇండియాలో ఇది స‌రికొత్త కాన్సెప్ట్. ఏడాది కింద‌ట ఉత్త‌ర ప్ర‌దేశ్ కు చెందిన ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఈ కంపెనీని ప్రారంభించారు. ఐఐఎం ఇండోర్ ఎంబీఏ గ్రాడ్యుయేట్ రిష‌భ్ సింగ్, శుభమ్ గుప్తా, చిన్మ‌యి సెహ‌గ‌ల్. ఆ ముగ్గురు యువకులే కంపెనీ ఫౌండ‌ర్లు.

image


షూ డిజైన్ చేసుకోవ‌డం ఎలా?

ముందుగా ప‌ర్పుల్ హైడ్ వెబ్ సైట్ లోకి లాగిన్ కావాలి. త‌ర్వాత డిజైన్ యువ‌ర్ షూ ఆప్ష‌న్ ఎంచుకోవాలి. వెంటనే ఒక త్రీడీ టూల్ ఓపెన్ అవుతుంది. అందులో స్టైల్, క‌ల‌ర్స్, హీల్ టైప్, హీల్ హైట్- ఇలా ర‌క‌ర‌కాల ఆప్ష‌న్లు ఉంటాయి. అందులో షూ టెంప్లేట్ ను సెలక్ట్ చేసుకొని మ‌న‌కు న‌చ్చిన విధంగా డిజైన్ చేసుకోవడ‌మే!

ప‌ర్పుల్ హైడ్ వెబ్ సైట్ లో బాలెట్ ఫ్లాట్స్, పంప్స్, శాండ‌ల్స్, ఆక్స్ ఫ‌ర్డ్స్, యాంకిల్ బూట్స్ దొరుకుతాయి. 70 ర‌కాల క‌ల‌ర్ కాంబినేష‌న్స్ ఉన్నాయి. 20 కోట్ల ర‌కాలుగా షూ డిజైన్ చేసుకోవ‌చ్చ‌ట‌! త్రీడీ టూల్ లో షూని రొటేట్ చేసుకుంటూ డిజైన్ మార్చుకోవ‌చ్చు. నచ్చితే వెంట‌నే ఆర్డ‌ర్ ఇవ్వొచ్చు. లేదంటే కార్ట్ లో యాడ్ చేసుకొని త‌ర్వాతైనా కొనుక్కోవ‌చ్చు. ఆర్డ‌ర్ వ‌చ్చిన రెండు వారాల్లోగా డెలివ‌రీ ఇచ్చేస్తారు. సెల‌క్ట్ చేసుకున్న మెటీరియ‌ల్, డిజైన్ ను బ‌ట్టి ఒక్కో షూ జ‌త‌కు రూ.2 వేల నుంచి రూ.5 వేల వ‌ర‌కు చార్జ్ చేస్తున్నారు.

ల‌క్నో బాయ్స్..

క‌స్ట‌మ‌ర్ల అభిరుచుల‌కు త‌గ్గ‌ట్టుగా ఫుట్ వేర్ త‌యారు చేయ‌డ‌మంటే మాట‌లు కాదు! ఆ మాట‌కొస్తే ఇండియాలో అలాంటి కంపెనీలే లేవు. ఈ-కామ‌ర్స్ రంగంలో ఏదైనా స్టార్ట‌ప్ మొద‌లు పెట్టాల‌ని రిష‌భ్ ముందు నుంచీ అనుకునేవాడు. ఓసారి అమెరికాలో త‌న ఫ్రెండ్స్ ఒక్క జ‌త బూట్ల కోసం వంద షాపులు తిర‌గ‌డం గ‌మ‌నించాడు. అప్పుడే అతడికి ఈ ఐడియా త‌ట్టింది. గూగుల్ లో కొట్టి చూస్తే.. యూఎస్, ఆస్ట్రేలియాలో క‌స్ట‌మైజ్డ్ షూ కంపెనీలు ఉన్న‌ట్టు తెలిసింది. స‌రిగ్గా ఇలాంటి బిజినెస్ ఇండియాలో మొద‌లు పెడితే ఎలా ఉంటుందా అని ఆలోచించాడు. ఇండియాలో ఉన్న స్నేహితుల‌తో త‌న బిజినెస్ ఐడియా షేర్ చేసుకున్నాడు. వాళ్లు కూడా ఓకే అన్నారు. అంతే... అమెరికాలో ఉద్యోగానికి టాటా చెప్పి ల‌క్నోలో వాలిపోయాడు.

ఫుట్ వేర్ రంగం గురించి ముగ్గురికీ బొత్తిగా అవ‌గాహ‌న లేదు. దాంతో ఎలాంటి క్వాలిటీ షూ ఇవ్వాలో అర్థమ‌య్యేది కాదు. కాన్పూర్, ఆగ్రా షూ త‌యారీ కంపెనీల్లో కొంత రీసెర్చ్ చేశారు. రాయ్ బ‌రేలీ, నోయిడాల‌ చెందిన ఫుట్ వేర్ డిజైన్ నిపుణుల‌తో మాట్లాడారు. ఒక ఐడియాకు వ‌చ్చిన త‌ర్వాత ప‌ర్పుల్ హైడ్ కంపెనీకి కొబ్బ‌రికాయ కొట్టారు!

image


షూ వేసుకున్నంత ఈజీ కాదు..!!

ల‌క్నో, కాన్పూర్ న‌గ‌రాలు ఫుట్ వేర్ త‌యారీకి ఫేమ‌స్. పైగా అక్క‌డ కార్మికులు కూడా పెద్ద సంఖ్య‌లో ఉంటారు. దాంతో ప‌ర్పుల్ హైడ్ కంపెనీ ల‌క్నోలో ఒక చిన్న త‌యారీ యూనిట్ ను ఏర్పాటు చేసింది. ఇందుకోసం ఫౌండ‌ర్లు త‌లా 15 ల‌క్ష‌ల పెట్టుబ‌డి పెట్టారు. గంప‌గుత్త‌గా బూట్లు త‌యారు చేసే ఇత‌ర మ్యానుఫ్యాక్చ‌ర‌ర్ల‌కు ఈ క‌స్ట‌మైజ్డ్ షూ కాన్సెప్ట్ ఏంటో అర్థం కాలేదు. దాంతో ఫౌండ‌ర్లకు మొద‌ట్లో క‌ష్టాలు త‌ప్ప‌లేదు.

ప్రారంభంలో మౌత్ టాక్, సోష‌ల్ మీడియాతో బిజినెస్ స్ప్రెడ్ అయింది. ఈ ఏడాది ఫేస్ బుక్ లో వ్యాపార ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నారు. రివ్యూలు కూడా పాజిటివ్ గా వ‌స్తున్నాయి. ప్ర‌స్తుతం రోజుకు వెయ్యి మంది వెబ్ సైట్ చూస్తున్నారు. చాలా మంది త‌మ‌కు న‌చ్చినట్టు షూ డిజైన్ చేసుకొని కార్ట్ లో యాడ్ చేసుకుంటున్నార‌ని రిష‌భ్ అంటున్నారు.

బెంగ‌ళూరు, పుణె, ముంబై, గుర్గావ్, ఢిల్లీ, కోల్ క‌తా మెట్రో న‌గ‌రాల నుంచి ఎక్కువ‌గా ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయి. వారిలో 20 నుంచి 35 ఏళ్ల లోపు వ‌ర్కింగ్ విమెనే ఎక్కువ‌! సెల‌బ్రిటీలు కూడా వీరికి క‌స్ట‌మ‌ర్లే! బాలికా వ‌ధు ఫేమ్ శివ‌శ‌క్తి సచ్ దేవ్ కూడా ప‌ర్పుల్ హైడ్ లో ఒక జ‌త షూ కొనుక్కుంది.

మొదటి ఆర్డర్..

మొద‌టి షూ ఆర్డ‌ర్ త‌న‌కింకా గుర్తుందంటారు రిష‌భ్. అల‌హాబాద్ నుంచి బ్లాక్ బ్యాక్ యాంకిల్ బూట్ల కోసం ఫ‌స్ట్ ఆర్డ‌ర్ వ‌చ్చింద‌న్నారు. ఆ స‌మ‌యంలో త‌మ టీం ఆనందానికి అవ‌ధుల్లేవని చెప్పారు. క‌స్ట‌మైజ్డ్ షూల‌కు మ‌రింత ప్ర‌చారం క‌ల్పించి టైర్-2, టైర్-3 సిటీల నుంచి కూడా ఆర్డ‌ర్లను ఆక‌ర్షిస్తామ‌ంటున్నారు.

ప్ర‌స్తుతానికి ఇత‌ర బ్రాండ్ల‌తో కొలాబ‌రేట్ కావాల‌న్న ఉద్దేశం లేదంటున్నారు ఫౌండ‌ర్లు. సీడ్ ఫండ్ వ‌చ్చిన త‌ర్వాత ఐపాడ్, టాబ్లెట్స్ ద్వారా ఆఫ్ లైన్ రిటైల్ మోడ‌ల్ తేవాల‌నుకుంటున్నామ‌ని తెలిపారు. వ‌చ్చే మే నెల‌లో యాప్ లాంఛ్ చేస్తామ‌న్నారు. ప్ర‌స్తుతం నెల‌కు వంద ఆర్డ‌ర్లు వ‌స్తున్నాయ‌ని, దాన్ని వెయ్యికి పెంచ‌డ‌మే త‌మ ల‌క్ష్యమ‌ని చెప్తున్నారు. ముందు ముందు మెన్ షూ, లేడీస్ బ్యాగ్స్, వాలెట్స్ తేవాల‌న్న ఆలోచ‌న కూడా ఉంద‌ట‌.

ఇప్పుడిప్పుడే ఇండియాలోకి..

ఫుట్ వేర్ రంగంలో చైనా త‌ర్వాతి స్థానం భార‌త్ దే! ప్ర‌పంచంలోని మొత్తం ఫుట్ వేర్ ఉత్ప‌త్తిలో మ‌న వాటా 13 శాతం. ఇండియాలో స‌గ‌టున ఒక్క‌రికి ఒక షూ జ‌త మాత్ర‌మే ఉంటే.. మిగ‌తా దేశాల్లో రెండు నుంచి మూడు జ‌త‌లు ఉంటున్నాయి. దేశీయ ఫుట్ వేర్ ఇండ‌స్ట్రీ విలువ రూ.20 వేల కోట్లు. ఈ రంగం విస్త‌ర‌ణ‌కు ఇంకా అవ‌కాశాలున్నాయి. ప‌ర్పుల్ హైడ్ జ‌స్ట్ బిగినింగ్ మాత్ర‌మే. పెరుగుతున్న‌ ఫ్యాష‌న్ ఇండ‌స్ట్రీ, టెక్నాల‌జీ స‌పోర్ట్ ని బ‌ట్టి చూస్తే.. ఫుట్ వేర్ రంగంలో మ‌రిన్ని నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు వచ్చే అవ‌కాశ‌ముందంటున్నారు నిపుణులు.

పర్పుల్ అంటే రాయ‌ల్! హైడ్ అంటే లెద‌ర్! ఈ పేరుకు త‌గ్గ‌ట్టుగా హై ఎండ్ బ్రాండ్స్ త‌యారు చేస్తామ‌ని రిష‌భ్ చెప్తున్నారు. అది సిండ్రెల్లా కోసం డిజైన్ చేసే గ్లాస్ షూ అయినా కావొచ్చు లేదా, ఇండియ‌న్ షూ ల‌వ‌ర్స్ కోసం త‌యారు చేసే రాయ‌ల్ లెద‌ర్ బూట్లు అయినా కావొచ్చ‌ని చెప్పారు.

ఇలా తయారు చేయండి