విభిన్నమైన పోరాటంతో పర్యావరణ పరిరక్షణ

తెలుగు ప్రజలందరికీ తెలిసిన పర్యావరణవేత్త..ఎక్కడ కాలుష్య సమస్య ఉన్నా.. ముందుండే పోరాడే వ్యక్తి..పొలిటికల్ సైన్స్ పాఠాలు బోధిస్తూనే పర్యావరణంపై ప్రేమ..హైదరాబాద్ చుట్టుపక్కల జనజీవనం పరోక్షంగాఈయన పుణ్యమేపటాన్‌చెరు, కూకట్‌పల్లి,నాచారం ప్రాంతాలపై దశాబ్దాల పోరాటం..మూసీలో మంచి నీళ్లు పారించాలి.. అదే నా కోరిక..పర్యావరణవేత్త ప్రొఫెసర్ పురుషోత్తం రెడ్డి అంతరంగం..

విభిన్నమైన పోరాటంతో పర్యావరణ పరిరక్షణ

Saturday September 12, 2015,

5 min Read

ప్రొఫెసర్‌గా విద్యార్థులకు పొలిటికల్ సైన్స్ పాఠాలు బోధిస్తూనే.. పర్యావరణంపై ఎనలేని ప్రేమ పెంచుకున్నారు. ప్రజలకు కష్టాలను కలిగిస్తూ.. పర్యావరణానికి చేటుచేసే ఏ సమస్య వచ్చినా.. ఆయనే ముందుకొచ్చి పోరాడేవారు. సిరీస్ ఫ్యాక్టరీ, నాచారం, పటాన్‌చెరు, నాగార్జున సాగర్‌లో న్యూక్లియర్ రియాక్టర్ ఏర్పాటును అడ్డుకోవడం, మెకనైజ్డ్ కబేళాల ఏర్పాటుకు అడ్డుకట్ట.. ఇలా ఆయన ఎన్నో పోరాటాలు చేసి విజయం సాధించారు. ఏడు పదుల వయస్సులో ఇప్పటికీ మూసీ నదిలో మంచి నీరు పారించడమే ఆయన ధ్యేయం. జనాలంతా ఆయనను ప్రేమగా ప్రొఫెసర్ సాబ్‌ అంటారు. ఆయనే ప్రొఫెసర్ కె. పురుషోత్తం రెడ్డి.

తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ పర్యావరణవేత్తగా చిరపరిచితమైన వ్యక్తి పురుషోత్తం రెడ్డి. విద్యావేత్తగా, పర్యావరణ సంరక్షణ పోరాటయోధుడిగా.. ఎంతో మందికి మార్గదర్శకం. ఉస్మానియా యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా ప్రారంభమైన ఆయన ప్రస్థానం పొలిటకల్ సైన్స్ హెడ్ ఆఫ్ డిపార్ట్‌మెంట్, బోర్డ్ ఆఫ్ స్టడీస్ (పొలిటికల్ సైన్స్) ఛైర్మన్ , రెండు సార్లు ఓయు టీచర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌గా తన వృత్తిగత జీవితంలో ఎన్నో మైలురాళ్లను ఆయన అధిగమించారు.

ప్రొ. కె. ఫురుషోత్తం రెడ్డి, పర్యావరణవేత్త

ప్రొ. కె. ఫురుషోత్తం రెడ్డి, పర్యావరణవేత్త


కుటుంబ నేపధ్యం

పురుషోత్తం రెడ్డిది నల్గొండ జిల్లా. వ్యవసాయ ఆధారితమే అయినా బాగా ఉన్నత కుటుంబం. వాళ్ల తండ్రి చదువు, సామాజిక సేవకే అధిక ప్రాధాన్యం ఇచ్చేవారు. అరబిందో ఫిలాసఫీని ఫాలో అయ్యేవారు. భూదాన్ ఉద్యమ సమయంలో వెయ్యి ఎకరాలను ధారాధత్తం చేశారు. తల్లిదండ్రుల నుంచి అబ్బిన గుణాలతో చిన్నప్పటి నుంచి సమాజాన్ని ఓ ప్రత్యేక కోణంలో చూడడం అలవడింది పురుషోత్తం రెడ్డికి. 1948లో అంతా హైదరాబాద్ వచ్చి ఇక్కడే స్థిరపడిపోయారు. ఆ తర్వాత తన కెరీర్ అంతా ఓయుతోనే ముడిపడింది.

'' మా నాన్నకు హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో మొక్కల నర్సరీ ఉండేది. కుతుబ్‌ షాహీలు కట్టించిన పురాతన బావి మా నర్సరీలోనే ఉండేది. ఆ నీళ్లనే మేం మొక్కలకు ఉపయోగించేవాళ్లం. అద్భుతమైన ఆ బావి కాస్తా.. సిరీస్ ఫ్యాక్టరీ కారణంగా మొత్తం విషతుల్యం అయింది. ఆ ఒక్క బావే కాదు.. చుట్టుపక్కల కొన్ని కిలోమీటర్ల వరకూ.. భూగర్భ జలమంతా పూర్తిగా కలుషితమైంది. నేను అప్పటికే ఉస్మానియాలో రీడర్, సీనియర్ టీచర్. ఈ పరిస్థితికి పరిష్కారం లేదా.. అని మా తల్లిదండ్రులు నన్ను అడిగారు. ఇలా పర్యావరణ వ్యతిరేకులపై పోరాటానికి అప్పుడే బీజం పడింది '' అని గుర్తుచేసుకుంటారు పురుషోత్తం రెడ్డి.

తొలి విజయం

సిరీస్ ఫ్యాక్టరీ కారణంగా.. వేలాది కుటుంబాలు అప్పట్లో అనేక కష్టాలు అనుభవించాయి. గ్రౌండ్ వాటర్ తాగడానికి కాదు కదా.. చేత్తో ముట్టుకునేందుకు కూడా ధైర్యం సరిపోని పరిస్థితి. నీళ్లు రంగుమయై, ఆయిల్ తెట్టకట్టేది. పరిస్థితి చేజారిపోతోందని గమనించిన ప్రొఫెసర్ మరికొంత మందితో కలిసి 1985సిటిజన్స్ ఎగైన్‌స్ట్ పొల్యూషన్ (cap) ప్రారంభించారు. ఫ్లోరోసిస్ విమోచన సమితి అధ్యక్షులు డా. కె. గోవర్ధన్ రెడ్డితో కలిసి స్థానికులందరితో సమావేశాలు ఏర్పాటు చేసి వాళ్లందరిలో అవగాహన పెంచి మద్దతు కూడగట్టారు.

'' అప్పటికే 1984 ఆఖరులో జరిగిన భోపాల్ గ్యాస్ దుర్ఘటన దేశాన్ని మొత్తం కుదిపేస్తోంది. పర్యావరణంపై తీవ్రస్థాయిలో జనాలకు ఆందోళన మొదలైంది. సరిగ్గా అప్పుడే మేం కూడా ఈ విషయమై కోర్టుకు వెళ్లాం. దీంతో వాస్తవాలు గమనించడానికి హై కోర్టు... ఒక అడ్వకేట్స్ కమిషన్ ఏర్పాటు చేసింది. దానితో మీడియా ఫోకస్ కూడా మరింత పెరిగింది. జనాలూ ఆలోచించడం మొదలుపెట్టారు. అదే మా మొదటి విజయం '' అంటారు ప్రొ. పురుషోత్తం రెడ్డి.

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ వేదికపై ప్రసంగిస్తూ..

కౌన్సిల్ ఫర్ గ్రీన్ రెవెల్యూషన్ వేదికపై ప్రసంగిస్తూ..


విజయంతో పెరిగిన వినతులు

సిరీస్ ఫ్యాక్టరీపై విజయం సాధించిన తర్వాత నాచారం ప్రజలు కూడా ఉద్యమ బాటపట్టారు. యూనివర్సిటీలో పనిచేస్తున్న ప్రొఫెసర్ దగ్గరికి వచ్చి తమ సమస్యను పరిష్కరించాలని కోరారు. ప్రొఫెసర్ కోదండరామ్, ప్రొ. వకీల్‌తో కలిసి నాచారం ఇండస్ట్రియల్ ఏరియాపై అంతా దృష్టిపెట్టారు. రిలే హంగర్ స్టైక్, ధర్నాలు చేయడంలో వారంలోనే సమస్యకు పరిష్కారం లభించింది. నాచారం తర్వాత జీడిమెట్ల, పటాన్ చెరు ప్రజలు కూడా ముందుకు కదిలారు. సరైన ప్రణాళిక లేకుండా పటాన్‌చెరులో పారిశ్రామికీకరణ జరగడం వల్ల మొదటి దశలోనే ఇరవై గ్రామాలు అక్కడ పూర్తిగా నాశనమయ్యాయి. ఎలాంటి ముందస్తు పరీక్షలు, వాటి పర్యవసనాలపై అధ్యయనం చేయకపోవడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమైందని గుర్తించారు.

సాంకేతికంగా ఉన్న సమస్యలేంటో అక్కడ అందరికీ అర్థమయ్యేలా చేశారు. సమస్యలు - పరిష్కారంపై అవగాహన పెంచారు. డా. ఎ.కిషన్‌రావుతో కలిసి అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌ను కలవడం.. ఆయన వెంటనే స్పందించడం.. 22 పరిశ్రమలు మూతబడడం చకచకా జరిగాయి. అయితే ఈ వ్యవహారం కోర్టు వరకూ వెళ్లడంతో ఈ కేసులను పరిశ్రమల తరపున వాదించేందుకు ఎక్కడెక్కడి నుంచో సీనియర్ అడ్వొకేట్లు వచ్చారు. నాలుగు గంటల సుదీర్ఘ వాదనల తర్వాత మా వాదనే గెలిచిందని ఆ రోజులను గుర్తుచేసుకుంటారు ప్రొఫెసర్. కాలుష్యం అదుపులోకి వచ్చేంతవరకూ 22 పరిశ్రమలు మూసేయాల్సిందేనని హై కోర్టు తీర్పు చెప్పడంతో తమ ఆనందానికి అవధులు లేవని వివరించారు.

మూడు దశాబ్దాలుగా సాగుతున్న పోరాటం వల్లే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతం కనీసం జనాలు జీవించే పరిస్థితి ఉంది అనడంలో అతిశయోక్తి కాదు. అప్పుడు ఎవరూ పోరాటం చేయకపోయి ఉంటే.. విషజలాలను భూమిలోకి, నదుల్లోకి వదలడం, విష వాయువుల దెబ్బకు.. ఆ ప్రాంతాలన్నీ నివాసయోగ్యంగా ఉండేవి కావు. ఈ వ్యవహారం సుప్రీం కోర్టు వరకూ వెళ్లింది. అప్పట్లో ఈ కేసులన్నింటినీ కాలుష్య పీడిత ప్రజల తరపున సీనియర్ అడ్వొకేట్ ఎం.సి.మెహతా వాదించారు. దాని పర్యావసానంగానే సుప్రీం కోర్టు 38 ఆర్డర్లను ఇచ్చింది. ఆ తర్వాతే పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ యాక్టివ్‌గా పనిచేయాల్సి వచ్చింది. అయితే అప్పటి కేసులు ఇప్పటికీ కొన్ని కోర్టుల్లో నడుస్తూనే ఉన్నాయి.

సిటిజన్స్ అగైన్‌స్ట్ పొల్యూషన్ వరుస విజయాలను న్యూయార్క్ టైమ్స్‌ కూడా ఎలుగెత్తిచాటింది. 1991లో వీళ్ల కథనాన్ని ప్రచురించి ప్రపంచ స్థాయి గుర్తింపును తీసుకు వచ్చింది.

తీవ్రత దాల్చిన ఉద్యమం

1987 ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వం నాగార్జున సాగర్‌లో అణువిద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలని చూసింది. దీనికి వ్యతిరేకంగా ప్రొ. టి. శివాజీరావుతో కలిసి పురుషోత్తం రెడ్డి పెద్ద ఉద్యమమే చేపట్టారు. అణువిద్యుత్ కేంద్రానికి ఈ ప్రాంతం అనుకూలం కాదని తెగేసి చెప్పారు. నాలుగు జిల్లాల ప్రజలను ఏకీకృతం చేసి కేంద్రం నిర్మాణాన్ని ఆపు చేయించలిగారు. అణువిద్యుత్ ప్లాంట్‌ ఏర్పాటు చేద్దామని నిర్ణయించిన తర్వాత.. వెనక్కితగ్గి విరమించడం.. అనేది మొదటిసారిగా తమ పోరాటంతోనే సాధ్యమైందంటారు ప్రొఫెసర్.

ఆ తర్వాత మెకనైజ్డ్ కబేళాలకు వ్యతిరేకంగా పోరాటం, హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువుల పరిరక్షణ సహా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల్లోని వివిధ జిల్లాల్లో మంచినీటి గురించి అనేక ఉద్యమాలకు నాయకత్వం వహించారు.

image


గాంధీగిరి పోరాటాలే

మూడు దశాబ్దాలపాటు సాగిన అనేక ఉద్యమాలు, పోరాటాలన్నీ పూర్తిగా గాంధేయ మార్గంలోనే సాగాయంటే ఆశ్చర్యపోకతప్పదు. ముందుగా సమస్య ఏంటో గుర్తించి దాన్ని సామాన్యులకు అర్థమయ్యేలా వివరించడం, పరిష్కారానికి ఉన్న మార్గాలేంటో అన్వేషించడం పురుషోత్తం రెడ్డి అంట్ టీం బాధ్యత. గ్రౌండ్ స్థాయిలో సమస్యలను అధ్యయనం చేసి కోర్టులకు వెళ్లడం, స్థానిక ప్రజలందరినీ ఏకీకృతం చేయడంలో విజయం సాధించేవారు. ఏ రోజు కూడా ఆవేశంగా వెళ్లిన సందర్భాలు లేనేలేవంటారు ప్రొఫెసర్. ఇన్ని రోజుల్లో పోలీసులు అదుపులోకి తీసుకున్న ఘటనలు కూడా లేవని, అసలు ఆ అవసరమే రాలేదని చెప్తారు.

ఒకటి రెండు సార్లు ఫోన్లో బెదిరింపు కాల్స్ మినహా.. అంత భయపడిపోయే పరిస్థితులు కూడా ఎదురుకాలేదని వివరిస్తారు.

మూసీలో మంచి నీరు పారాలి

మూడు దశాబ్దాల పోరాటం తర్వాత కూడా ఆయనలో ఒక కోరిక మాత్రం ఇప్పటికీ బలంగా ఉండిపోయింది. మూసీ కోసం ఎంత కష్టపడినా ఫలితం దక్కలేదనే బాధ కనిపిస్తుంది. హైదరాబాద్ కాలుష్యమంతా మూసీలోకి పారడం వల్ల సమస్యను అంత త్వరగా పరిష్కరించలేకపోతున్నామనే అసంతృప్తి మనకు కనిపిస్తుంది.

' మూసీ పరిరక్షణ నా భాధ్యత. నా చేతనైనంత వరకూ అందులో మంచి నీళ్లుపారేలా చేయడం నా లక్ష్యం ' అంటారు ప్రొఫెసర్.

పర్యావరణంపై ఆయన చేస్తున్న పోరాటానికి కొద్దిరోజుల క్రితమే జస్టిస్ కుల్‌దీప్ సింగ్ జాతీయ అవార్డ్ దక్కింది. ఇది తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తోందని చెబ్తారు. అదే సమయంలో ఈ అవార్డును కాలుష్య పీడిత, ఫ్లోరైడ్ బాధిత ప్రజలకు అంకితం చేస్తున్నట్టు వివరించారు. అనారోగ్యం, కష్టాలతో పోరాడుతూ.. వాళ్లు ధైర్యంగా జీవించడాన్ని చూసి తాను ఎంతో నేర్చుకున్నట్టు చెబ్తారు.

జస్టిస్ కుల్‌దీప్ సింగ్ అవార్డును అందుకుంటూ..

జస్టిస్ కుల్‌దీప్ సింగ్ అవార్డును అందుకుంటూ..


సోషల్ ఆంట్రప్రెన్యూర్లకు సలహా

'' ఈ నాటి యువత ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలపై దృష్టిసారించాలి. 

తగ్గిపోతున్న ఓజోన్ పొర, గ్లోబల్ వార్మింగ్, క్లైమేట్ ఛేంజ్, తరుగుతున్న జీవ వైవిధ్యం, పెరుగుతున్న ఎడారీకరణ, అణురియాక్టర్ల ముప్పు, వేస్ట్ మేనేజ్‌మెంట్ వంటివి ముఖ్య అంశాలు. వీటి పరిష్కారంలోనే మనకు అవకాశాలు ఉన్నాయి. వాటిని వెతుక్కోవాలి. ప్రపంచానికి అవసరం ఉన్న క్లిష్టమైన ఏరియాల్లో ఫోకస్ చేస్తే.. అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇవన్నీ బిజినెస్ మోడల్‌లో టేకప్ చేయాలి '' .