కట్టుబాట్లను తెంచుకుని క్రికెట్ కోచ్ గా గెలిచిన కశ్మీరీ యువతి

సకీనా అక్తర్ స్ఫూర్తిదాయక కథ

కట్టుబాట్లను తెంచుకుని క్రికెట్ కోచ్ గా గెలిచిన కశ్మీరీ యువతి

Wednesday December 28, 2016,

2 min Read

ఒకటే చిరకాల కోరిక. టీమిండియా తరపున ప్రాతినిధ్యం వహించాలి. కానీ సామాజిక కట్టుబాట్లు అడ్డొస్తున్నాయి. అమ్మానాన్న రూపంలో కూడా ఎలాంటి హోప్స్ లేవు. మెల్లిగా కలల సౌధం కూలిపోతోంది. అలా జరగడానికి వీల్లేదు. ప్యాషన్ వదలడం కంటే ప్రాణం వదలితే హాయిగా ఉంటుంది. ఆ సంకల్ప బలమే ఆమెను లక్ష్యం దిశగా నడిపిస్తోంది. ఒక్కో అవరోధాన్ని దాటుకుంటూ వస్తోంది.

సకీనా అక్తర్. శ్రీనగర్ డౌన్ టౌన్ మున్వరాబాద్ నివాసి. టిపికల్ కశ్మీరీ లైఫ్ స్టయిల్. బురఖాల మాటునే మాట్లాడాలి. పరదాల చాటున ఉండాలి. ఈ కట్టుబాట్లు తెంచుకుని రావడమంటే దుస్సాహసమే. అందునా క్రికెటర్ అవుతానంటే ఒప్పుకునేవారెవరు. ముందు ఇంటినుంచే మొదలవుతుంది ఎదురుదెబ్బ. అందుకు సకీనా మినహాయింపేం కాదు.

చిన్నప్పుటి నుంచే క్రికెట్ అంటే పిచ్చి. ఆడపిల్ల అయివుండి కూడా అబ్బాయిల టీంలో ఆడేది. ఎంతైనా అమ్మాయి కదా.. పెద్దగా ఆడనిచ్చేవారు కాదు. ఆట అరకొరగా అబ్బింది. ఆ తర్వాత హైస్కూల్. ఇక అక్కడ క్రికెట్ అన్న ఊసే లేదు. కారణం సామాజిక కట్టుబాట్లు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎదుగుతున్న అమ్మాయి మగరాయుడిలా ఆటలేంటని.. ఒక అప్రకటిత నిషేధం ఆట నుంచి దూరం చేసింది. 

మళ్లీ ఇంటర్ లో బ్యాట్ పట్టకునే అవకాశం వచ్చింది. అలా జిల్లాస్థాయి, రాష్ట్ర స్థాయి మ్యాచుల దాకా వెళ్లింది. 1998లో మొదటిసారి అండర్-19 మ్యాచ్ ఆడింది. ఆ టోర్నీలో సకీనా విమెన్ ఆఫ్ ద సిరీస్. బెస్ట్ బౌలర్ కూడా. అత్యధిక పరుగులు చేసింది కూడా తనే.

image


శ్రీనగర్ లోని విమెన్స్ కాలేజీలో జాయిన్ అయ్యాక ఆటే ప్రపంచమైంది. కాలేజీ బంక్ కొట్టి గ్రౌండులోనే రోజంతా ప్రాక్టీస్ చేసిన సందర్భాలు అనేకం. మెల్లిగా పేరెంట్స్ సపోర్ట్ దొరికింది. కానీ కెరీర్ మీద ఫోకస్ కూడా చేయాలి అని సర్దిచెప్పారు. వాళ్ల మాటలు వింటూనే ఇటు ఆటపై ఏకాగ్రత పెట్టింది.

కాలేజీ తర్వాత కశ్మీర్ యూనివర్శిటీలో సీటు. అక్కడ నిర్ణయించుకుంది.. తనేం కావాలో.. తన లక్ష్యమేంటో. ఫస్ట్ సెమిస్టర్ పూర్తికాగానే ట్రాక్ మార్చింది. ఢిల్లీలో డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ లో జాయిన్ అయింది. అక్కడ బీసీసీఐ కోచింగ్ కోర్స్ లో A లెవల్ పాస్ పాసైంది. తర్వాత స్పోర్ట్స్ కౌన్సిల్ కశ్మీర్(ఎస్సీకే)లో పనిచేసింది. ఆ టైంలో ఎన్నో క్యాంపులు నిర్వహించింది. అందులో మొదటిది పోలో గ్రౌండులో నిర్వహించిన క్యాంపు. అందులో వేర్వేరు స్కూళ్ల నుంచి వచ్చిన దాదాపు 250 మంది అబ్బాయిలు పార్టిసిపేట్ చేశారు. అదొక మరిచిపోలేని క్యాంప్ అంటారామె. 

అయినా సరే ఏదో వెలితి. ఈలోగా కొన్ని ఉద్యోగాలకు అప్లయ్ చేసింది. 2007లో కశ్మీర్ యూనివర్శిటీ లో కాంట్రాక్ట్ బేస్డ్ క్రికెట్ కోచ్ జాబ్ వచ్చింది. బాయ్స్, గళ్స్ కు కలిపి సకీనా అక్తర్ కోచ్. ప్రస్తుతానికి కశ్మీర్ లో ఉన్న ఏకైక క్వాలిఫైడ్ కోచ్ ఆమెనే. అండర్ 19 గళ్స్ టీమ్ కి కోచ్ గా వ్యవహరిస్తున్న సకీనా.. ఏదో ఒక రోజు నేషనల్ కోచ్ అవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది.