రైతుకు రొక్కం - దేహానికి ఆరోగ్యం.."24 మంత్ర ఆర్గానిక్"

రైతుకు రొక్కం - దేహానికి ఆరోగ్యం.."24 మంత్ర ఆర్గానిక్"

Wednesday March 02, 2016,

3 min Read


ఇప్పుడంతా ఆర్గానిక్ మంత్రమే. అలవిమాలిన ఆహారపుటలవాట్లతో అనారోగ్యం కొనితెచ్చుకుంటున్న నవతరానికి కనిపిస్తున్న ఒకే ఒక్క ఆశాకిరణం ఆర్గానిక్ ఫుడ్. ఎలాంటి పురుగుమందులు, రసాయనాలు వాడకుండా చేసిన సాగుతో వచ్చే ఫలసాయమే ఆర్గానిక్ ఫుడ్. దీని ప్రాధాన్యతను ప్రభుత్వాలు కూడా గుర్తిస్తున్నాయి. దేశంలోనే తొలిసారిగా సిక్కిం వందశాతం ఆర్గానిక్ వ్యవసాయం చేస్తున్న రాష్ట్రంగా ప్రసిద్ధికెక్కింది. ఈ ఘనతను సిక్కిం దక్కించుకోవడంలో హైదరాబాద్ కు చెందిన శ్రేష్ట నేచురల్ బయోప్రొడక్ట్స్ సంస్థది కూడా విశేషమైన పాత్రే. ఆర్గానిక్ ఫుడ్ మార్కెట్ లో నెంబర్ వన్ గా ఉన్న "24 మంత్ర" బ్రాండ్ ఈ సంస్థదే.

2003లో సిక్కింను పూర్తిగా ఆర్గానిక్ సాగు చేస్తున్న రాష్ట్రంగా మార్చేందుకు నిర్ణయం తీసుకున్నారు. పైలట్ ప్రాజెక్టుల కింద 8,150 హెక్టార్లలో ఆర్గానిక్ సాగును ప్రొత్సహించారు. సత్ఫలితాలు ఇవ్వడంతో 2010 సిక్కిం ఆర్గానిక్ మిషన్( SOM )ను లాంచ్ చేశారు. ఐదేళ్లలో సిక్కింలోని 77 వేల హెక్టార్లలో పూర్తిగా ఆర్గానిక్ వ్యవసాయాన్ని చేస్తూ చరిత్ర సృష్టించారు. వీటిలో ఇరవై శాతం అంటే 11 వేల హెక్టార్ల బాధ్యతను శ్రేష్ట నేచురల్ బయోప్రొడక్ట్స్ సంస్థ తీసుకుంది. ఆ భూమి యజమానులైన ఆరు వేల మంది రైతులకు ఆర్గానిక్ సాగుపై అవగాహన కల్పించారు. విజయం సాధించారు.

ఈ విషయంలో సిక్కిం ప్రభుత్వం వందశాతం చిత్తశుద్ధితో వ్యవహరించింది. రాజకీయ లక్ష్యం ఉండబట్టే సిక్కిం ఆర్గానిక్ స్టేట్ గా చరిత్ర సృష్టించింది. SOM ప్రాజెక్టు కోసం అయిన రూ.66 కోట్ల రూపాయలను సిక్కిం ప్రభుత్వమే పూర్తిగా భరించింది. 24 మంత్రతో పాటు మరో 14 సంస్థలు ఈ ఆర్గానిక్ యజ్ఞంలో పాలు పంచుకున్నాయి.

లక్ష్యం సాధించడానికి ఆర్గానిక్ 24 మంత్ర టీం నాలుగేళ్ల పాటు పూర్తి స్థాయిలో తమ శక్తి సామర్థ్యాలను ఉపయోగించింది. సిక్కిం వాతావరణ పరిస్థితులతో పాటు గతంలో వారు తక్కువ మొత్తంలో పురుగుమందులు, రసాయనాలతో వ్యవసాయం చేయడం కూడా కలసి వచ్చింది- బాలసుబ్రమహ్మణ్యం, సీఈవో 24 మంత్ర ఆర్గానిక్
బాలసుబ్రమహ్మణ్యం, సీఈవో 24 మంత్ర ఆర్గానిక్

బాలసుబ్రమహ్మణ్యం, సీఈవో 24 మంత్ర ఆర్గానిక్


రైతు చేత... రైతు కోసం...

శ్రేష్ట నేచురల్ బయోప్రొడక్ట్స్ సంస్థను రాజ్ సీలం 2004లో ప్రారంభించారు. లాభాల కోసం ఈ సంస్థను ప్రారంభించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిపోతున్న సాగు ఖర్చులు, అవసరం లేకపోయినా విరివిగా వాడుతున్న ఎరువులు, రసాయనాలు, పురుగు మందుల కోసం రైతులు భారీ అప్పులు చేయడం వంటివి రాజ్ ను కదిలించాయి. ఈ పరిస్థితిని మార్చి చిన్న, సన్నకారు రైతుల జీవన స్థితిగతులను మెరుగుపరిచేందుకు శ్రేష్ట సంస్థను ప్రారంభించారు. ఇప్పుడీ సంస్థ 25 వేల మంది రైతులకు మార్గదర్శిగా నిలిచింది. వారందరినీ ఆర్గానిక్ కుటుంబం కిందకు తెచ్చింది. 15 రాష్ట్రాల్లో లక్షా యాభై వేల ఎకరాల్లో వారంతా ఆర్గానిక్ పంటలు పండిస్తున్నారు. వారి ఉత్పత్తుల్ని "24 మంత్ర ఆర్గానిక్" బ్రాండ్ కింద విక్రయిస్తున్నారు. 200కుపైగా ఆర్గానిక్ ఉత్పత్తుల్ని ప్రస్తుతం ఈ సంస్థ మార్కెట్ చేస్తోంది. ఇటీవలే "రెడీ టు కుక్" ఉత్పత్తుల్నీ ప్రవేశపెట్టింది. అయితే శ్రేష్ట సంస్థ లక్ష్యం మార్కెట్ వాటా, భవిష్యత్ ప్రణాళికలు కాదు. వారి మొదటి, చివరి లక్ష్యం రైతుల జీవన స్థితిగతులను మార్చడం.

చిన్న రైతులతో మేం వన్ టు వన్ కాంట్రాక్ట్ చేసుకుంటాం. ఆర్గానిక్ వ్యవసాయానికి అవసరమయ్యే ప్రతీ ఒక్కదాన్ని బయో ఫర్టిలైజర్స్, బయో ఫెస్టిసైడ్స్ సహా మేం సరఫరా చేస్తాం. రైతులు ఒక్క పైసా అప్పు చేయాల్సిన అవసరం రాదు. ముందుగానే 10 నుంచి 20 శాతం ప్రీమియం చెల్లిస్తాం. దళారులను ఆశ్రయించాల్సిన అవసరమే రాదు. భారీగా లాభాలను రైతు కళ్ల జూస్తాడు- బాలసుబ్రమహ్మణ్యం, సీఈవో 24 మంత్ర ఆర్గానిక్
image


రైతు విజయరహస్యం "24 మంత్ర"

పొలం నుంచి నేరుగా వంటగదికి అనే థీమ్ తో పనిచేసే శ్రేష్ఠ ఐదంచెల ప్రక్రియను ఫాలో అవుతుంది. రైతులను చిన్న గ్రూపులుగా ఏర్పాటు చేయడం ఆర్గానిక్ సాగుపై అవగాహన కల్పిస్తారు. రైతులు వ్యవసాయం ప్రారంభించిన తర్వాత ప్రతి దశలోనూ శ్రేష్ఠ సిబ్బంది పొలాలను పరిశీలిస్తారు. తగిన సూచనలు, సలహాలు ఇస్తారు. ఆర్గానిక్ సర్టిఫైడ్ ఎజెన్సీలు రైతు, భూమి, వాటర్, ఉత్పత్తి అన్నీ క్షుణ్ణంగాపరిశీలిస్తాయి. అంతా పూర్తయిన తర్వాత పురుగుమందుల అవశేషాలు ఉన్నాయో లేదో చూస్తారు. అన్నింటిలోనూ శ్రేష్ఠ సిబ్బంది రైతులకు సహాయకారిగా ఉంటారు. రైతులకు బాగా లాభదాయకమైన ధరలకు కొనుగోలు చేస్తారు.

శ్రేష్ఠ సంస్థ సక్సెస్ స్టోరీ పన్నెండేళ్లుగా కొనసాగుతోంది. సిక్కిం తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో శ్రేష్ఠ సంస్థ 20 వేల ఎకరాలను ఆర్గానిక్ ఫామింగ్ చేయడానికి అనువుగా మార్చేలా ఒప్పందం చేసుకుంది. తెలంగాణ ప్రభుత్వంతోనూ చర్చలు జరుగుతున్నాయి. మోదీ ప్రభుత్వం ఆర్గానిక్ ఫామింగ్ పై ప్రత్యేక విధానాలు ప్రకటిస్తుందని శ్రేష్ఠ యజమానులు భావిస్తున్నారు. కేంద్రం ఆర్గానిక్ పాలసీ ప్రకటించిన తర్వాత కీలకమైన బాధ్యతలు నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నామని శ్రేష్ఠ సంస్థ యజమానులు అంటున్నారు.

image