ఏడాదిన్నరలో హైదరాబాద్ నుంచీ ఓ రెడ్ బస్ !

స్టార్టప్ కల్చర్ జోరందుకొంటోంది.ఇన్నేళ్ల నుంచి చేస్తున్న కృషికి త్వరలో ఫలితం.ఎంతో మంది నిపుణుల చేయూత అందుతోంది.హైదరాబాద్‌ను బెంగళూరుతో పోల్చలేం.1000 స్టార్టప్స్‌కు ఇప్పుడు భాగ్యనగరం వేదికైంది.రెండేళ్లలో స్టార్టప్స్ న్యూస్‌‌లో హైదరాబాద్ హెడ్ లైన్స్‌లో ఉంటుంది.యువర్ స్టోరీకి హైసియా అధ్యక్షుడు రమేష్ లోగనాధన్ ప్రత్యేక ఇంటర్వ్యూ

ఏడాదిన్నరలో హైదరాబాద్ నుంచీ ఓ రెడ్ బస్ !

Sunday May 24, 2015,

3 min Read

హైదరాబాద్‌లో స్టార్టప్ కల్చర్‌ జోరు పెరుగుతోంది. గతంతో పోలిస్తే ప్రభుత్వం, ఇంక్యుబేషన్ సెంటర్లు, వెంచర్ క్యాపిటలిస్టులు, సీడ్ ఫండింగ్ కంపెనీల నుంచి ప్రోత్సాహం కూడా పెరుగుతోందని అంటున్నారు హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (హైసియా) అధ్యకులు - ప్రోగ్రెస్ సాఫ్ట్‌వేర్ సొల్యూషన్స్ వైస్ ప్రెసిడెంట్ రమేష్ లోగనాధన్. ఇప్పటికీ ఇక్కడ ఎకో సిస్టమ్ ఎందుకు అంతంతమాత్రంగానే ఉంది ? దేశవ్యాప్తంగా ఇండస్ట్రీలో ఓ ట్రెండ్ సెట్ చేసే లాంటి కంపెనీ హైదరాబాద్ నుంచి ఎందుకు పుట్టుకురావడం లేదు ? బెంగళూరుతో పోటీపడకపోయినా ఎంతో కొంత పోటీ ఇచ్చే స్థాయికి ఈ నగరం ఎప్పుడు ఎదుగుతుంది అనే అంశాలపై ఆయన యువర్ స్టోరీతో ప్రత్యేకంగా సంభాషించారు.

రమేష్ లోగనాధన్, హైసియా అధ్యక్షులు

రమేష్ లోగనాధన్, హైసియా అధ్యక్షులు


హైదరాబాద్ ఏంజిల్స్, హైదరాబాద్ ఫర్ ఇన్నోవేషన్ సహా.. తెలంగాణ ప్రభుత్వ సహకారం, హైసియా లాంటి సంస్థ తోడ్పాటుతో హైదరాబాద్‌లో స్టార్టప్ వాతావరణం మెల్లిగా అనుకూలంగా మారుతోంది. త్రిపుల్ ఐటి, ఐఎస్‌బి వంటి సంస్థలు ఉండనే ఉన్నాయి. అందుకే బెంగళూరు తర్వాత హైదరాబాద్‌కు మాత్రమే ఆ అవకాశం ఉందంటున్నారు రమేష్. దేశవ్యాప్తంగా 3000 వరకూ స్టార్టప్ కంపెనీలు ఉంటే అందులో హైదరాబాద్‌లో ఎంతలేదన్నా 800 నుంచి 1000 వరకూ ఖచ్చితంగా ఉంటాయనేది ఆయన మాట. ప్రతీ నెలా రెండో ఆదివారం లామకాన్‌లో తాము నిర్వహించే కార్యక్రమాలకు 20-30 శాతం కొత్త ముఖాలు హాజరుబట్టి చూస్తుంటే జోరు పెరుగుతోంది అనేది ఆయన నమ్మకం.

బెంగళూరే ఎందుకు ఫోకస్ అవుతోంది ?

హైదరాబాద్‌ను బెంగళూరుతో పోల్చలేం. ''ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఏంజిల్ ఇన్వెస్టర్లు, వెంచర్ క్యాపిటలిస్టుల దృష్టి అంతా ఎప్పుడూ బెంగళూరుపైనే ఉంటుంది. ఎన్ఆర్ఐలు కూడా అక్కడే అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. అన్నింటికంటే ముఖ్యంగా అక్కడ ఇప్పటికే పూర్తిస్థాయిలో కల్చర్ అభివృద్ధి అయిన నేపధ్యంలో అక్కడి నుంచే అధిక సంస్థలు పుట్టుకొస్తున్నాయి. మీడియా కూడా అక్కడ ఎక్కువ దృష్టికేంద్రీకరించడమూ ఓ కారణమే. అయితే ఏడాదిన్నర రెండేళ్లుగా ఇక్కడ మెల్లిగా సిస్టమ్ డెవలప్ అవుతోంది. ఇప్పటికే 10కిపైగా సంస్థలు ఏంజిల్ రౌండ్ ఫండింగ్ పూర్తిచేసుకున్నాయి. ఐపే, కార్జ్, నెఫ్రోప్లస్,మ్యాప్ మై జీనోమ్ వంటి వాటి గురించి ప్రస్తావించుకోవచ్చు. రాబోయే రోజుల్లో రెడ్ బస్ స్థాయి లాంటి సంస్థ హైదరాబాద్ నుంచి పుట్టుకొస్తుందనే ధీమా నాకు ఉంది''.

భవిష్యత్ ఏంటి ?

''హైదరాబాద్ 4 ఇన్నోవేషన్, హైదరాబాద్ ఏంజిల్స్ సహా వివిధ సంస్థలు స్టార్టప్స్‌కు సంబంధించి తమ వంతు సాయాన్ని చేస్తున్నాయి. చాలా కంపెనీలు తమ శక్తిసామర్ధ్యాల మేరకు 'లెగ్ వర్క్' చేసుకుంటున్నాయి. వచ్చే ఏడాదిన్నర, రెండేళ్లలో అద్భుతమైన ఫలితాలను తప్పకుండా హైదరాబాద్ నుంచి చూస్తారు. మాలాంటి ప్రొఫెషనల్స్ అంతా ఇలాంటి మార్గదర్శక సంస్థలకు ఫౌండర్లుగా ఉండండతో తర్వాతి తరాలు ఎంతో ప్రయోజనం పొందుతాయి. రూ. 10-25 లక్షల వరకూ సీడ్ ఫండింగ్ చేసేందుకు హైదరాబాద్‌లో 10 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయి. మంచి ప్రాజెక్టుల కోసం అన్వేషణలో ఉన్నాయి. టి- హబ్ పేరుతో సిద్ధమవుతున్న ఇంక్యుబేషన్ సెంటర్ అతి త్వరలో ప్రారంభం కాబోతోంది. ఒక ప్రభుత్వం ఒక నిర్ణయాన్ని తీసుకుని దాన్ని ఏడాదిలోగా అమలు చేయడం నిజంగా గొప్ప విషయమే. రాబోయే రోజుల్లో ఎన్నో స్టార్టప్స్ అక్కడ కొలువుదీరతాయి ''.


చివరగా స్టార్టప్స్‌కు సలహా !

  • ఏదో ఒకటి చేయాలి, అందరికంటే భిన్నంగా ఉండాలనే తపన మాత్రం తప్పనిసరి. ''ఫైర్ ఇన్ ది బెల్లీ' లేకపోతే ఏమీ అవదు.
  • ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఇతరులను సంప్రదించే ఓపెన్ మైండ్ ఉండాలి.
  • మీ ప్రశ్నలకు మీరే సమాధానాలు వెతుక్కోవాలి. మీ గురించి, మీ తరపున ఊరికే ఆలోచించే వాళ్లు ఎవరూ ఉండరనే విషయం గుర్తుంచుకోండి.
  • ఇతరుల నుంచి ఎప్పుడు సమాధానాలు ఆశించవద్దు.
  • నిపుణులు కేవలం ప్రశ్నలు వేసినందుకైనా సంతోషించాలి.
  • అది అలా ఎందుకు కాకూడదు, ఇలానే ఎందుకు కావాలి. మరోలా జరిగితే పరిస్థితేంటి... అనే ప్రశ్నలూ మీకు పనికొస్తాయి. వాటికి సమాధానాలు వెతికే ప్రయత్నంలో మీ ఆలోచన సరళి మారుతుంది.
  • ఎప్పటికైనా ఒక్కటే మనం గుర్తుంచుకోవాలి. ప్రశ్నా మనదే.. సమాధానమూ మనదే.