అసలైన ఆరడుగుల బుల్లెట్ !

బులెట్లతో అపురూప కళాఖండాల సృష్టికర్త - వాజిద్

1


వానాకాలం వచ్చిందంటే చాలు... పిలల్లంతా పేపర్లతో పడవలు చేసుకుని ఆడుకుంటారు. అవి రెండు నిమిషాలే ఈ నీళ్లలో ప్రయాణించినా వాళ్లకు అదో సరదా ! కానీ ఇక్కడో పిల్లాడు మాత్రం మామూలు పిల్లలకు భిన్నం. ఏకంగా నీటితో తేలియాడే ఓ షిప్‌నే తయారు చేశాడు. అక్కడ మొదలైన ఈ విభిన్నత అంచలంచెలుగా ఎదిగింది. తనలోని క్రియేటివిటీ ఆ గ్రామం, నగరం, పట్టణం, రాష్ట్రం దాటి ఇప్పుడు ఖండాంతరాలకు వ్యాపిస్తోంది. ఆర్ట్ అంటే కేవలం పెన్నులు, పెన్సిళ్లు, బ్రష్‌లతోనే కాదు బుల్లెట్లతో కూడా సాధ్యమని నిరూపించారు ఆ చిన్నప్పటి క్రియేటివ్ జీనియస్ వాజిద్ ఖాన్. కానీ మన దేశం మాత్రం ఇతడిని టాలెంట్‌ను ఇప్పటికీ గుర్తించలేదు.

పద్నాలుగేళ్లకే ప్రపంచంలోని అతిచిన్న ఎలక్ట్రిక్ ఐరన్ కనుగొని గిన్నీస్ బుక్‌లో చేరిన వాజిద్ పేరిట ఇప్పుడు ఎన్నో రికార్డులు ఉన్నాయి. తనఖాతాలో 200పైగా ఇన్వెన్షన్స్ ఉన్నాయి.

అందరిలానే వాజిద్‌ ఖాన్‌ది కూడా ఓ అతి సామాన్య ప్రయాణం. సోన్‌గిరి అనే ఓ మారుమూల గ్రామంలో పుట్టిన వాజిద్.. తన బాల్యాన్నంతా వానాకాలం చదువులు చెప్పే స్కూళ్లలోనే సాగించాడు. తన ఆలోచనలకు... ఆ స్కూల్ గోడలు.. అడ్డుగోడలుగా నిలిచినట్టు భావించినా వేరే మార్గం కనపడలేదు. ఎలాగోలా ఐదో తరగతి వరకూ అక్కడే సర్దుకుపోయినా.. ఇక వల్లకాదని వదిలేశాడు.. ఆ స్కూలునూ.. ఆ ఇంటిని కూడా.. !

ఆర్ట్‌తో అనుబంధం

''ఇంటి నుంచి బయటకు వెళ్లిపోయి.. నా హాబీకి మరింత పదును పెట్టేందుకు మా అమ్మ రూ.1300 ఇచ్చింది. అదే నా జీవితంలో అతిపెద్ద మలుపు. నేను ఏదో గొప్ప పని చేస్తాననే నమ్మకం మా అమ్మకు తప్ప ఎవరికీ లేదు'' అంటారు వాజిద్. తన ఎక్స్‌పరిమెంట్స్ చేసుకుంటూనే పొట్టపోసుకోవాల్సిన పరిస్థితి అది. పదహారేళ్ల పిల్లాడికి అది తలకు మించిన భారం. ఇదే సమయంలో అతనికి టెక్నికల్ రోబస్ ఆకర్షించాయి. అనుకోని అదృష్టం, స్నేహితుల అండతో అతడు అహ్మదాబాద్‌లోని ఎన్ఐఎఫ్‌లో చేరాడు.

''1998లో థర్మాకోల్‌పై ప్రయోగం చేశాను. ఆ తర్వాత మేకులతో పోట్రయిట్స్ తయారు చేయడం మొదలుపెట్టాను. వీటిపై మరింత పట్టుపెంచుకునేందుకు 2004లో ఇండోర్ వచ్చాను. ఇప్పుడు నాకు ముంబై సహా ఇండోర్‌లోనూ ఓ కేంద్రం ఉంది'' అంటారు వాజిద్.

2005లో వాజిద్ మేకులతో మహాత్మా గాంధీ పోట్రైట్ పూర్తిచేశారు. అది మూడేళ్ల శ్రమ. 1.25 లక్షల మేకులతో తయారైంది. అదే సమయంలో ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా కాన్వాస్‌పై అక్రైలిక్ కలర్స్ ఉపయోగించి చేసిన 3డి పెయింటింగ్‌ను రూపొందించారు. అయితే అది 2010లో రూ.20లక్షలకు అమ్ముడైన తర్వాత ఇతడికి గుర్తింపు వచ్చింది.


''గాంధీజీ పోట్రైట్‌కు రూ.50 లక్షలు ఇచ్చేందుకు జనం ముందుకు వచ్చారు, కానీ నేను దాన్ని అమ్మలేదు. అది నా మనస్సుకు చాలా దగ్గరైన ఆర్ట్'' అంటారు వాజిద్. మదర్ థెరిసా,జీసస్ క్రైస్ట్, ధీరూభాయ్ అంబానీ వంటి ప్రముఖుల పోట్రైట్స్‌ను కూడా ఇలా నెయిల్ ఆర్ట్ ద్వారా రూపొందించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న ప్రత్యేక బోర్డుపై మొదట పెన్సిల్ ఔట్ లైన్ వేసుకుని ఆ తర్వాత పనిమొదలుపెడ్తారు వాజిద్. పైకి పెన్సిల్ మార్కులు వేసుకున్నా.. మదిలో స్పష్టమైన చిత్రం ఉన్న తర్వాతే ఆర్ట్ మొదలుపెడ్తానంటున్నారు.

నెయిల్ ఆర్ట్‌లో నైపుణ్యం సాధించిన తర్వాత ఇక అక్కడే పరిమితం కాకుండా మరో అడుగు ముందుకు వేశారు. బ్లాక్ క్వారీ రాళ్లు, ఆటోమొబైల్ స్పేర్ పార్ట్స్, మెడికల్ ఎక్విప్‌మెంట్ ఉపయోగించి కూడా పోట్రైట్స్ తయారు చేయడం మొదలుపెట్టారు. సేవ్ గర్ల్ ఛైల్డ్ క్యాంపెయిన్ కోసం వైద్యపరికరాలతో ఓ అమ్మాయి ఏడుస్తున్న ఆర్టిఫ్యాక్ట్‌ తయారుచేసి అందరితో శభాష్ అనిపించుకున్నారు. ఇప్పుడు అన్నింటికంటే వాజిద్ బుల్లెట్ ఆర్ట్ చాలా ఫేమస్ అయింది.

''బుల్లెట్ అనేది హింసకు ప్రతిరూపం. గాంధీజీ మనకు అహింసా మార్గాన్ని బోధించారు. హింస వద్దని చెప్పేందుకే బుల్లెట్లతో గాంధీజీ బొమ్మను రూపొందించాను. అన్ని పోట్రైట్లలో నేను ఎక్కువగా బ్లాక్ ఉపయోగిస్తాను. ఎందుకంటే నలుపు ఓ బలమైన రంగు''.

2009లో నెయిల్ ఆర్ట్‌పై అతడు పేటెంట్ పొందారు. గిన్నీస్ బుక్‌తో పాటు గోల్డెన్ బుక్ ఆఫ్ వాల్డ్ రికార్డ్స్, లిమ్కా బుక్, ఇండియా బుక్ ఆఫ్ వాల్డ్ రికార్డ్స్, ఏషియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లోనూ తన పేరును చిరస్థాయిగా నిలిచేలా చేసుకున్నారు. తను సృష్టించిన 140 వినూత్న ఉత్పత్తులకు పేటెంట్లు పొందే పనిలో ఇప్పుడు బిజీబిజీ అయిపోయాడు వాజిద్. మేనేజ్‌మెంట్‌లో ఇన్నోవేషన్ అనే అంశంపై మార్చ్ 8,2015న అతడు ఐఐఎం ఇండోర్‌లో లెక్చర్ కూడా ఇచ్చారు.

ఈ పేరు, డబ్బు శాశ్వతం కాదని ఖురాన్ చెబ్తోంది. ఇతరుల కోసం బతకమని సూచిస్తోంది. అందుకే శారీరక దౌర్బల్యం ఉన్న వాళ్ల కోసం పాటుపడ్తున్నా అంటారు వాజిద్.

2022లో ఫిఫా వాల్డ్ కప్‌ కోసం ఓ విభిన్నమైన శిల్పాన్ని రూపొందించమని అతనికి ఓ ఆర్డర్ వచ్చింది. అంతేకాదు హాలీవుడ్‌లో కూడా త్వరలో వాజిద్ చిత్తరువులు ప్రదర్శితం కాబోతున్నాయి. ఈ ఏడాది ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలోనూ లెక్చర్ ఇచ్చేందుకు సన్నద్ధమవుతున్నారు వాజిద్.

అతని అత్యద్భుత ఆర్ట్ కోసం ఈ వీడియో చూడండి. 

Related Stories

Stories by Chanukya