ఇన్ బ్రాండింగ్ గేమ్స్ తో గోల్ కొడుతున్నారు..!

ఇన్  బ్రాండింగ్ గేమ్స్ తో గోల్ కొడుతున్నారు..!

Thursday March 17, 2016,

3 min Read


బాహుబలి వీడియోగేమ్..! యుద్ధం మాంఛి రసపట్టులో ఉంది..! 

బాహుబలి కాలకేయుడ్ని చంపేందుకు కత్తిపైకెత్తాడు..!

బలంగా గాల్లోకి కత్తి దూశాడు... ! కానీ అంతలోనే సెల్ ఫోన్ స్క్రీన్ పై ... 

"మీ తలనొప్పిని తగ్గించే గొప్ప మందు" అంటూ యాడ్ ప్రత్యక్షం...

ఎంత సహనశీలికైనా ఆ పరిస్థితి క్రిటికలే.. ఫోన్ తీసి నేలకు కొట్టాలన్నంత కసి వస్తుంది..

ప్రకటన పూర్తయిన తర్వాత మళ్లీ గేమ్ అక్కడ్నుంచే ప్రారంభమైనా.. ఈ లోపే భల్లాలదేవ కాలకేయుడ్ని చంపేసినట్లు ...గేమ్ పై ఆసక్తిని ఆ ప్రకటన చంపేస్తుంది...

మొబైల్ గేమ్స్ లో వచ్చే వీడియోగేమ్స్ లో ప్రధానమైన సమస్య ఇదే. అయితే వాటికి ఆ ప్రకటనలే ఆదాయ వనరు కాబట్టి తీసేయలేరు... పెట్టకుండా గేమ్స్ తయారుచేసే పరిస్థితీ లేదు..

ఇప్పుడు నగరాల్లోని యువతలో అరవై శాతం మంది స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. అత్యధిక మంది ఫోన్లలో ఫేవరేట్ యాప్స్... గేమ్సే. క్యాండీ క్రష్ నుంచి రేసుల గేమ్స్ వరకూ అన్నీ ఉంటాయి. తమ మూడ్ కు తగ్గట్లుగా గేమ్స్ తో టైమ్ పాస్ చేస్తూంటారు. వీరందర్నీ కామన్ గా వేధించే ప్రాబ్లం.. ప్రకటనలు. సడెన్ గా మధ్యలో ఆగిపోయి ప్రకటనలు వచ్చేవి పూర్తిగా ఇరిటేట్ చేస్తే.. ఇక స్ర్కీన్ ను సగం కవర్ చేస్తూ వచ్చే పాప్ అప్స్, బ్యానర్ యాడ్స్ రకరకాలుగా చిరాకు పెట్టేస్తాయి. 

వీడియో గేమ్ ఆడేవాళ్ల అసహనం, చిరాకును లేకుండా చేయగలిగితే ఎదురే ఉండదని అంచనా వేశారు కొందరు కుర్రాళ్లు. జీరో యాడ్ గేమ్స్ కు రూపకల్పన చేశారు. అయితే ఆదాయ మార్గాన్నీ ఇందులో కనిపెట్టారు. అదే వీరిని విజయతీరాలకు చేరుస్తోంది.

PLAKC బృందం<br>

PLAKC బృందం


మొబైల్ మార్కెటింగ్ వైఫల్యంలోనే అవకాశం

భారతీయ ప్రకటన రంగంలో సింహభాగం పత్రికలు, టీవీల వాటానే. అయితే పత్రికలు చదవి, టీవీలు చూసేవారి సంఖ్య 34 నుంచి 35 మిలియన్ల మధ్యే ఉంటుందని అంచనా. అయితే మొబైల్ వాడేవారి సంఖ్య దాదాపు పదిరెట్లు ఎక్కువ ... అంటే 300మిలియన్ల కంటే ఎక్కువ. అయితే మొబైల్ యాడ్స్ వాటా మాత్రం కేవలం రెండు అంటే రెండు శాతమే. నిజానికి మొబైల్ లోనే రీచ్ ఎక్కువ ... కానీ ఎడ్వర్ టైజ్ మెంట్లు, ఇతర ప్రకటనల విషయంలో మాత్రం ఇప్పటికీ వైఫల్యమే. ఉత్తరప్రదేశ్ కు చెందిన కంప్యూటర్ సైన్స్ ఇంజినీర్ అర్జున్ చద్దా ఇదే విషయాన్ని గమనించాడు. గేమింగ్ రంగంలో ఆరేళ్ల అనుభవం ఉన్న అర్జున్ దీనిపైనే ఎక్కువగా ఆలోచించేవాడు. సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా ఉన్న ఐఐటీ -బాంబేలో పనిచేస్తున్న సమయంలో తన ట్రైనీల్లో ఒకరైన కొత్తపల్లి నిషాంత్ ఆలోచనలు కూడా తనలాంటివేనని గుర్తించాడు. అదే సమయంలో చేతాస్ బర్దియా అనే మరో మిత్రుడ్నీ కలుపుకున్నారు. ముగ్గురూ కల్సి ఓ స్టార్టప్ ప్రారంభించాలనే ప్రయత్నాలూ చేశారు. ఎన్నో అంచనాలతో వచ్చిన ఆకాష్ -2 ట్యాబ్ అట్టర్ ఫ్లాపవడం వారిని ఆలోచింప చేసింది. మరిన్ని క్వాలిటీస్ మంచి ట్యాబ్లెట్ పీసీని తామే తెస్తే ఎలా ఉంటుందని ఆలోచించారు. అయితే ఆదేశ్ శర్వాన్, అక్షయ్ రన్ దేవా అనే ఇద్దరు సీనియర్లను కలిసిన తర్వాత వారికి వెళ్లాల్సిన మార్గం బోధపడింది. మొబైల్ ఎడ్వర్ టైజింగ్ విషయంలో ఉన్న లూప్ హోల్ లో సక్సెస్ ను వెతకాలని నిర్ణయించుకున్నారు. దాని ప్రకారమే PLAKCని ఏర్పాటు చేశారు. PLAKC అంటే ప్రిఫరెన్స్ లైక్ నెస్ ఎవేర్ నెస్ నాలెడ్జ్ కన్విక్షన్.

ఒక్క గేమ్ - రెండు లాభాలు

PLAKC సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన వీడియోగేమ్స్ సరికొత్త ఆవిష్కరణగా నిలిచాయి. వీడియోగేమ్స్ లో ఇన్ బ్రాండింగ్ ద్వారా యాడ్స్ చొప్పించి.. ఎలాంటి ఆటంకాలు లేకుండా గేమ్ ను ముందుకు నడిపిస్తారు. ఒక్కమాటలో చెప్పాలంటే గేమ్ లో బ్రేకులుండవు. కానీ యాడ్స్ ఉంటాయి. ఇన్ బ్రాండింగ్ అన్నమాట. అంటే ఉదాహరణకు మనం కార్ రేసు గేమ్ ఆడుతున్నామనుకోండి. కారు మీద ఓ బ్రాండ్.. రోడ్డు పక్కన బిల్ బోర్డులపై మరో ప్రకటన... రోడ్డు పక్కన పచ్చిక బయళ్లపైన మరో ప్రకటన.. ఇలా గేమ్స్ లో ఇన్ బ్రాండింగ్ మార్కెట్ చేసుకుంటారు. దాంతో గేమ్ ఆడేవాళ్లకి బ్రేకుల నుంచి విముక్తి.. PLAKC కి ఆదాయం. ఈ టెక్నాలజీని అభివృద్ధి చేసుకోవడానికి వీరికి ఏడాదికిపైగా సమయం పట్టింది. PLAKC ని రెండు విభాగాలుగా మార్చారు. ఒక బ్రాండ్లు, ఎడ్వర్టైజర్ల కోసం ఒకటి... అలాగే గేమ్ డెవలపర్ల కోసం మరొకటి. గేమ్ డెవలపర్ల కోసం కావాల్సిన టెక్నికల్ కిట్లు, టూల్స్ మొత్తం PLAKC ఉచితంగా సరఫరా చేస్తుంది.

ఇన్ బ్రాండింగ్ వీడియోగేమ<br>

ఇన్ బ్రాండింగ్ వీడియోగేమ


మొబైల్ ప్రకటనల్లో మేం కొత్త దారి చూపించాం. వారి ప్రకటన మిలియన్ల మందికి ఇన్ బ్రాండింగ్ తో సులువుగా చేరువవుతుందని నిరూపించాం. పెద్దగా ఖర్చు కూడా లేకుండానే. ప్రకటనదారులను PLAKC ద్వారా మొబైల్ వినియోగదారులకు దగ్గర చేయాలమే మా లక్ష్యం... .. అర్జున్, కో ఫౌండర్ PLAKC

పెంచుకున్నన్ని ఆదాయ మార్గాలు

డెలవపర్ల, ప్రకటనదారుల కోసం వేర్వేరు పోర్టల్స్ ఉన్నాయి. అడ్వర్ టైజర్ తో జరిగే ఒప్పందంలో 70 శాతం డెవలపర్ కి, 30 శాతం జీరో యాడ్ గేమ్స్ కి చెందుతాయి. ఇప్పటికి డెవలపర్లకి టూల్స్ ఫ్రీగానే ఇస్తున్నప్పటికీ.. దీనిని కూడా ఆదాయవనరుగా మార్చుకునే ఆలోచనలో PLAKC ఉంది. ట్రేడ్ మార్క్ కి సంబంధించి పనులన్నీ పూర్తయిన తర్వాత ప్రపంచం నలుమూలలా స్టూడియోలు పెట్టాలనే ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే రోజుకు రెండు లక్షల యాక్టివ్ యూజర్స్ PLAKCకి ఉన్నారు. దీన్ని పదిలక్షలకు పెంచాలనే పట్టుదల కనబరుస్తున్నారు. గత జూలైలోనే ఎంజెల్ ఫండింగ్ పొందింది ఈ కంపెనీ.

వీరి కేటగరిలోనే మరికొన్ని పోటీ స్టార్టప్ లు కూడా పుట్టుకొచ్చాయి. ఇజ్రాయెల్ నుంచి వచ్చిన మీడియా స్పైక్, అమెరికాకు చెందిన ర్యాపిడ్ ఫైర్, గ్రీడిగేమ్స్ తదితర స్టార్టప్స్ పోటీ ఇస్తున్నాయి. అయితే ఆట ముందుగా ప్రారంభించామని... గోల్ కొట్టి తీరుతామని PLAKC బృందం ధీమాగా ఉంది.

http://plakc.com/