అన్నిరంగాల్లో దూసుకుపోతున్న కోస్టల్ కర్నాటక !

0

కర్నాటక. పారిశ్రామికాభివృద్ధి దిశగా శరవేగంగా అడుగులు వేస్తున్న రాష్ట్రం. ఈ నేపథ్యంలోనే అంతర్జాతీయంగా పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా కర్నాటక గవర్నమెంటు ఇన్వెస్ట్ కర్నాటక సమ్మిట్ నిర్వహిస్తోంది. ఫిబ్రవరి 3 నుంచి 5 జరగనున్న ఈ సదస్సులో సగర్వంగా పాలుపంచుకుంటున్న యువర్ స్టోరీ- సమ్మిట్ పై స్పెషల్‌ ఫోకస్‌ చేసింది. ఇటు ఎడ్యుకేషన్ పరంగా, అటు సాంకేతికంగా, పారిశ్రామికంగా దూసుకుపోతున్న కోస్టల్ కర్నాటక పై యువర్‌ స్టోరీ ప్రత్యేక కథనం.

కొంకణ్ తీరం. ఈ పేరు చెప్పగానే ముందుగా గుర్తుకొచ్చేవి రారమ్మని పిలిచే అందమైన బీచ్ లు.. అలలు అలలుగా తలలూపే అందమైన కొబ్బరి తోటలు.. డిసెంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య మాటలకందని ప్రకృతి రమణీయత.. నోరూరించే సీ ఫుడ్.. మనో ఫలకం మీద సాక్షాత్కరిస్తాయి.

రాజధాని నగరం బెంగళూరులా డెవలప్‌ కాకపోయినా గతంతో పోల్చుకుంటే ప్రస్తుతం కర్నాటక తీర ప్రాంతంలోని నగరాలు అన్ని రంగాల్లోనూ దుసుకుపోతున్నాయి. ముఖ్యంగా మంగళూరు, ఉడిపి నగరాలు విద్యాపరంగానే కాక సాంకేతికంగానూ అభివృద్ధి దిశగా పరుగుపెడుతున్నాయి.

మంగళూరు

ఉప్పగాలితో సయ్యాటలాడే సముద్ర తీర ప్రాంతం. అదేపనిగా వింజారమలు వీచే కొబ్బరి చెట్ల సోయగాలు... సహ్యాద్రి కొండల ఒంపు సొంపులు, అంతెత్తు నుంచి దూకే సెలయేళ్లు. అహ్లాదపరిచే బీచ్ లు... ఆధ్యాత్మిక శోభను పంచే దేవాలయాలు. విద్యా సుంగధాలు వెదజల్లే విశ్వవిద్యాలయాలు.. ఉద్యోగ ఉపాధి అవకాశాలకు ఏమాత్రం లోటు లేని పరిశ్రమలు. వీటన్నింటికి తోడు కర్నాటకకు ముఖ్య రేవు పట్టణం. ఇలా ఒకటా రెండా. మంగళూరు వైభవం గురించి చెప్పడానికి.

బెంగళూరుకు 371 కిలోమీటర్ల దూరంలో ఉన్న మంగళూరులో 1974లో పోర్టు (ఎన్ఎంపీటీ) ఏర్పాటైంది. నాటి నుంచి నేటిదాకా అలుపెరుగని రేవు- భద్రత పరంగా ఢోకాలేదు. భారీ లిఫ్టు మెషీన్స్, పెద్దపెద్ద కార్గోలు, లిక్విడ్ కెమికల్స్.. ఇలా పోర్టు రౌండ్ ద క్లాక్ పనిచేస్తుంది.

ఇక ప్రభుత్వ రంగ సంస్థల విషయానికొస్తే- ఓఎన్జీసీకి అనుబంధంగా మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రో కెమికల్స్ లిమిటెడ్ (MRPL) పనిచేస్తోంది. ఈ రిఫైనరీ నుంచి ఏటా 15 మిలియన్ మెట్రిక్ టన్నుల ప్రొడక్షన్ ప్రాసెస్ అవుతుంది. దాంతో పాటు హైడ్రోక్రాకర్స్ ద్వారా ప్రీమియం డీజిల్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. మరో రెండు కేటలిస్ట్ రీ జెనరేటర్స్ ద్వారా శక్తివంతమైన ఇంధనం తయారవుతుంది. ఇదొక్కటి చాలు. స్కిల్డ్ పీపుల్ ఉన్నా, లేకపోయినా ఉద్యోగ ఉపాధి అవకాశాలు అక్కడ ఏ మేరకు ఉన్నాయో చెప్పడానికి. కేవలం స్థానికులకే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన కొన్ని వేల మందికి ఈ రిఫైనరీ, పోర్టు- బతుకుదెరువు చూపిస్తున్నాయి.

మంగళూరులో మరో చెప్పుకోదగ్గ పరిశ్రమ - మంగళూరు కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ (MCF). ఇది జువారి ఫెర్టిలైజర్స్ వారి అనుబంధ సంస్థ. ఒక్క కర్నాటకలోనే కాదు, మొత్తం దేశంలోనే అతిపెద్ద ఎరువుల కర్మాగారం ఇదే. దీని టర్నోవర్ ఏడాదికి రూ. 3వేల కోట్ల పైచిలుకు. కేవలం ఎరువులు, కెమికల్సే కాదు.. గ్రాన్యులేటెడ్ ఎరువులు (ఉండలు కట్టిన యూరియా లాంటిది) సూక్ష్మపోషకాలు, నేలను సారవంతం చేసే సాయిల్ కండీషనర్స్, మరికొన్ని ప్రత్యేక ఎరువుల్ని కూడా తయారు చేస్తుంది.

దక్షిణ కన్నడ మంగళూరు కేవలం పరిశ్రమలే ప్రసిద్ధి కాదు.. చదువులమ్మ ఒడి కూడా. క్వాలిటీ ఎడ్యుకేషన్ కు కేరాఫ్ మంగళూరు. అందుకే ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడ ప్రొఫెషనల్ కోర్సులు చేస్తుంటారు. కాన్వెంట్ స్కూల్ మొదలుకొని, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడికల్ ఇన్ స్టిట్యూట్స్, హెల్త్, మేనేజ్మెంట్, హాస్పిటాలిటీ, నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, సురక్తల్ (ఇంతకు ముందు ఇది కేఆర్ఈసీ) విద్యార్థుల ప్రతిభకు మెరుగులు దిద్దుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే దేశంలో టాప్ మోస్ట్ ఇంజినీరింగ్ కాలేజీలన్నిటికీ మంగళూరే పుట్టినిల్లు.

ఇక మెడికల్ ఇన్ స్టిట్యూట్స్ విషయానికొస్తే.. కస్తూర్బా మెడికల్ కాలేజీ (కేఎంసీ), ఏజే ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ మంగళూరులో పేరున్న మెడికల్ కాలేజీలు. ఇవేకాక, ఫాదర్ ముల్లర్ మెడికల్ కాలేజీ, కేఎస్ హెగ్డే మెడికల్ అకాడమీతో పాటు వైద్య విద్యనందించే అత్యుత్తమ విద్యా సంస్థలన్నీ మంగళూరులోనే ఉన్నాయి.

2013లో జీఐఆర్‌ఎం చేసిన సర్వే ప్రకారం బిజినెస్ పరంగా మంగళూరు దేశంలోనే 13వ స్థానంలో ఉండగా, కర్నాటక స్టేట్‌ లో రెండో ప్లేస్‌లో ఉంది. బెంగళూరు మొదటి స్థానంలో ఉంది. ఆ మాటకొస్తే సాంప్రదాయ వ్యాపారంలోనూ మంగళూరును మించిన లొకేషన్ లేదు. స్కూళ్లు, కాలేజీలు సొంతంగా ఆంట్రప్రెన్యూర్ షిప్ సెల్స్ నడుపుతూ స్టార్టప్ కంపెనీలకు ప్రోత్సాహాన్నిస్తున్నాయి. అయితే సరైన మెంటార్షిప్ లేక, ఏంజిల్ ఇన్వెస్టర్లు ముందుకు రాక, అనేక స్టార్టప్ కంపెనీలు మెయిన్ స్ట్రీమ్‌ లోకి రాలేదు. అదొక్కటి మినహా మంగళూరుకు ఏం తక్కువ లేదు. ట్రాఫిక్ ఫికర్‌ లేదు. రియల్ ఎస్టేట్ కూడా అందనంత దూరంలో ఏం లేదు. అన్ని ప్రాంతాలకు కనెక్టివిటీ ఉంది. బై రోడ్ చూసుకున్నా, ఎయిర్ వేస్ అయినా , సీ రూట్ అయినా- ప్రపంచంలో ఎక్కడికైనా మంగళూరు నుంచి వెళ్లొచ్చు.

ఉడిపి

ఇక ఉడిపి. బెంగళూరుకు వాయువ్య దిశలో 422 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉడిపి పేరు వినగానే- ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకృష్ణుడి దేవాలయం ఇస్కాన్ టెంపుల్ గుర్తుకొస్తుంది. వైష్ణవ గురువు, ఉడిపి కృష్ణ మఠాన్ని ఏర్పాటు చేసిన శ్రీ మాధావాచార్యుని స్వస్థలం కూడా ఇదే.

ఉడిపి వంటకాలను ప్రపంచ దేశాలన్నీ రుచి చూశాయి. ఈ ఫుడ్‌ కు చాలా మంది ఫిదా కావడంతో నగరం, పట్టణం అనే తేడా లేకుండా ప్రతి చోటా ఉడిపి ఫుడ్‌ పేరుతో చైన్‌ రెస్టారెంట్లు పుట్టుకొచ్చాయి. నిజానికి మసాలా దోశ ఇక్కడే పుట్టిందంటారు. ఉడిపిలోని దేవాలయాలు, బీచ్‌లు స్థానిక వంటకాలు పర్యాటకుల్ని కర్నాటకకు రారమ్మని పిలుస్తున్నాయి.

ఉడిపిలో భారీ స్థాయి పరిశ్రమలంటూ ఏవీ లేవు. వ్యవసాయం, చేపలు పట్టడం ఇక్కడి వారి ప్రధాన వృత్తి. ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్స్ కు అయితే కొదవే లేదు. నిజానికి ఉడిపిలో ఆదాయంలో ఎక్కువ భాగం ఈ రంగాల నుంచే వస్తోంది. ఇక పాల సహకార సంఘాలు, కాజు, పరిశ్రమ, ఫుడ్, హోటల్‌ ఇండస్ట్రీ ఎంతో మందికి ఉపాధి కల్పిస్తోంది.

కాలంతో పాటు మారుతున్న టెక్నాలజీని ఉడిపి అందిపుచ్చుకుంటోంది. ఈ మధ్య కాలంలోనే జిల్లా యంత్రాంగం, టూరిజం డిపార్ట్ మెంట్‌, మాల్పె బీచ్ డెవలప్‌ మెంట్ కమిటీ సంయుక్తంగా ఫ్రీ వైఫై పథకాన్ని ప్రకటించాయి. మాల్పే బీచ్ కు వచ్చే పర్యాటకులకు అరగంట పాటు 4జీ స్పీడ్‌తో ఉచిత వైఫై సేవలు అందిస్తున్నారు. పర్యాటకుల్ని ఆకర్షించేందుకు మరిన్ని చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

66వ నెంబర్‌ నేషనల్‌ హైవే గుండా ఉడిపి వెళ్లే దారిలోని శాంతకట్టెలో నిర్మించిన మల్టీ స్టోరీడ్‌ బిల్డింగ్ ప్రతి ఒక్కరి దృష్టి ఆకర్షిస్తుంది.1996లో రోహిత్ భట్‌ స్థాపించిన రోబోసాఫ్ట్ టెక్నాలజీ హెడ్‌ కార్వర్‌ ఈ బిల్డింగ్‌లోనే ఉంది. సాఫ్ట్ వేర్ ప్రొడక్ట్స్ తో పాటు యాపిల్, IOS డివైజ్‌లకు అవసరమైన యాప్స్‌ ను ఈ కంపెనీ తయారుచేస్తోంది. పెద్ద పెద్ద నగరాలు, పట్టాణాల్లో హెడ్‌ క్వార్టర్స్‌ నిర్మించే సంప్రదాయాన్ని పక్కన బెట్టి చిన్న పట్టణంలోనే ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో ఏర్పాటైన రోబోసాఫ్ట్‌ టెక్నాలజీ ఉడిపికి తలమానికం. కంపెనీ స్థానికంగా ఉన్న ఎడ్యుకేషన్‌ ఇన్‌స్టిట్యూట్ల నుంచి ఉద్యోగుల్ని ఎంపికచేసుకోవడం మరో విశేషం.

ఇక ఉడిపికి దగ్గరలో ఉన్న మణిపాల్‌ యూనివర్సిటీ టౌన్‌ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఒకప్పుడు కొండలు, గుట్టలు, ముళ్ల చెట్లతో ఉన్న ఈ ప్రాంతం శరవేగంగా అభివృద్ధి చెందింది. ప్రస్తుతం అక్కడ 22 ఇన్‌స్టిట్యూషన్లు నడుస్తున్నాయి. ఈ మార్పు వెనుకున్న వ్యక్తి డా. T.M.A.పాయ్. 1953లో దేశంలో మొట్టమొదటి ప్రైవేట్‌ మెడికల్‌ కాలేజీ అయిన కస్తూర్బా మెడికల్‌ కాలేజ్ ఇక్కడే ఏర్పాటుచేశారు. ఆ తర్వాత ఐదేళ్లకు మణిపాల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ ప్రారంభమైంది.

ప్రస్తుతం మణిపాల్‌ యూనివర్సిటీ టౌన్‌లో వివిధ విభాగాల్లో దాదాపు 20వేల మంది స్టూడెంట్స్ విద్య అభ్యసిస్తున్నారు. కొత్త ఆవిష్కరణలు, టెక్నాలజీని ప్రోత్సహించేందుకు మణిపాల్ యూనివర్సిటీ బిజినెస్ ఇంక్యుబేటర్‌.. MUTBI ఏర్పాటు చేసింది. ఇది కొత్తగా బిజినెస్‌లోకి ఎంటరవ్వాలనుకునే స్టూడెంట్స్‌ తో పాటు ఫ్యాకల్టీకి అవసరమైన మౌలిక వసతులు, ఆర్థిక సాయం కూడా అందిస్తోంది.

ప్రపంచానికి అంతగా పరిచయంలేని మణిపాల్‌ యూనివర్సిటీ రెండేళ్ల క్రితం వరకు ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అందుకు కారణం మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్య నాదెళ్ల, నోకియా సీఈఓ రాజీవ్‌ సూరీ మణిపాల్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థులు కావడమే. వీరితో పాటు ఇంకా చాలామంది పూర్వ విద్యార్థులు వివిధ రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న ఇండియన్‌ చెఫ్‌, జునూన్‌ రెస్టారెంట్ల అధినేత వికాస్‌ ఖన్నా కూడా మణిపాల్‌ యూనివర్సిటీలోని గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్‌ (WGSHA) స్టూడెంట్.

ముగింపు

పెద్ద పెద్ద నగరాలు మాత్రమే కాదు.. టైర్ 2, టైర్ 3 సిటీలు కూడా ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకోగలవన్న విషయాన్ని కర్నాటక రుజువు చేసింది. మెరుగైన మౌలిక వసతులతో పాటు విద్యార్థుల సృజనాత్మకత వారిని ఉన్నత స్థాయికి చేర్చింది. వారి విజయగాధల స్ఫూర్తితో ముందుకెళ్లాలనుకుంటున్న వారికి అవసరమైన సహాయ సహకారాలందిస్తే- చిన్న పట్టణాలు, నగరాల్లో మరిన్ని సక్సెస్ స్టోరీలకు బాటలు పరుచుకుంటాయి.

Related Stories