వీళ్లు ట్రైనింగ్ ఇచ్చారంటే.. ఎలాంటి ఇంటర్వ్యూ అయినా సరే మీరు ఇరగదీస్తారు..

వీళ్లు ట్రైనింగ్ ఇచ్చారంటే.. ఎలాంటి ఇంటర్వ్యూ అయినా సరే మీరు ఇరగదీస్తారు..

Tuesday March 29, 2016,

3 min Read


ప్రతి ఏటా పది లక్షలకు పైగా విద్యార్థులు కాలేజీ నుంచి డిగ్రీ పట్టాలు పట్టుకొని బయటకు వస్తుంటే. అందులో 10 నుంచి 15 శాతం మాత్రమే ఉద్యోగాలు సంపాదిస్తున్నారు. క్యాంపస్ ఇంటర్వ్యూల్లో అయితే ఈ నిష్పత్తి ఇంకా తక్కుగా ఉంది. దీనంతటికీ కారణం విద్యార్ధులకు అవగాహన లేకపోవడం ఒక కారణమైతే వారికి సరైన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోవడం మరో రీజన్. సబ్జెక్టుల్లో 80-90 శాతం సాధించిన విద్యార్థి సైతం ఇంటర్వ్యూల్లో కనీస మార్కులు సాధించలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ప్రారంభమైందే టెస్ట్ మై ఇంటర్వ్యూ డాట్ కామ్. 

image


స్టార్టప్ పనితీరు

ప్రారంభించిన మూడు నెలల్లోనే 15వేల మంది విద్యార్థులు ఈ సైట్ లో రిజిస్ట్రర్ అయ్యారు. ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో కూడా ఈ సంస్థకు మంచి గుర్తింపు వచ్చింది . బడా సంస్థల్లో ఇంటర్వ్యూ ఇవ్వడానికి ముందు తాము చేపట్టిన ఇంటర్వ్యూ ఫేస్ చేసినప్పుడు వారి వీక్ పాయింట్స్ తెలుస్తాయని టెస్ట్ మై ఇంటర్వ్యూ మేనేజింగ్ డైరెక్టర్ మదన్ రెడ్డి అన్నారు.వాటి ద్వారా మెయిన్ ఇంటర్వ్యూలో అవి రిపీట్ కాకుండా ఉంటాయని అంటున్నారాయన. కాలేజీ విద్యార్థులకు క్యాంపస్ ఇంటర్వ్యూల గురించి పెద్దగా అవగాహన ఉండదు. అలాంటి వారికోసం తమ స్టార్టప్ పనిచేస్తుందని చెప్పుకొచ్చారు. తమ సైట్ ద్వారా ఇంటర్వ్యూలకు వెళ్లిన 1500 మందికి ఉద్యోగాలొచ్చాయంటున్నారు మదన్.

మాక్ ఇంటర్వ్యూలో సక్సెస్ అయినా కాకపోయినా, వారి తప్పొప్పులు తెలుసుకోవడం ద్వారా, తర్వాతి ఇంటర్వ్యూలో క్లియర్ చేసిన వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. తమ సక్సెస్ రేటు ఈ గుణాంకాలే చెబుతున్నాయని మదన్ అన్నారు.

image


ఆన్ లైన్.. ఆఫ్ లైన్ సేవలు

ఆన్ లైన్ సేవలకు మాత్రమే సేవలు అందించడానికి తాము ఈ స్టార్టప్ మొదలు పెట్టామని, కానీ తర్వాత ఆఫ్ లైన్ సేవలను కూడా అందించడానికి సిద్ధపడ్డామని మదన్ చెప్పారు. మా సేవలు కావాలని ఓ కాలేజీ నుంచి ఇన్విటేషన్ వచ్చిందని కూడా మదన్ వెల్లడించారు. అప్పుడు తమ సేవలు ఏ రకంగా విద్యార్థులకు చేరువయ్యాయో తెలిసొచ్చిందని అంటున్నారాయన. ఆన్ లైన్ కంటే ఆఫ్ లైన్ లో రిజిస్ట్రర్ అవుతున్న వారి సంఖ్య రోజు రోజుకీ పెరుగుతుందని చెప్పుకొచ్చారు మదన్.

టెస్ట్ మై ఇంటర్వ్యూ టీం

టీం విషయానికొస్తే మదన్ రెడ్డి సంస్థ ఫౌండర్. కర్ణాటకలో బిటెక్ పూర్తి చేసిన తర్వాత దాదాపు పదమూడేళ్లు ఐటితో పాటు మీడియా రంగాల్లో పనిచేశారు. గతేడాది ఈ స్టార్టప్ ప్రారంభించాలని అనుకున్నప్పటికీ ఆరునెలల మార్కెట్ రీసెర్చి తర్వాత మొదలుపెట్టారు. ఇంజనీరింగ్ చదివిన తనలాంటి విద్యార్థులకు ఇలాంటి స్టార్టప్ అవసరం ఉందని అంటున్నారాయన. శ్రీధర్ టీంలో మరో మెంబర్. సంస్థకు కో ఫౌండర్ గా వ్యవహరిస్తున్నారు. గతంలో ఆయన మైక్రో సాఫ్ట్ లో పనిచేశారు. ఆయనకు కూడా 12 ఏళ్ల ఎక్స్ పీరియన్స్ ఉంది. వీళ్లిద్దరికీ కలిపి దాదాపు రెండున్నర దశాబ్దాల అనుభవం. ఇదే తమ పెట్టుబడి అంటున్నారు మదన్. దీంతో పాటు ఆఫ్ రోల్, ఆన్ రోల్ కలిపి దాదాపు మరో 10మంది టీంలో ఉన్నారు.

image


ప్రధాన సవాళ్లు

విద్యార్థులను మాక్ ఇంటర్వ్యూల దాకా తీసుకు రావడం పెద్ద చాలెంజ్ అంటున్నారు మదన్. కంపెనీ స్టాండర్డ్స్ లో ఇంటర్వ్యూ చేస్తారు కనక ఈ మాక్ ఇంటర్వ్యూ అటెండ్ అయితే.. తర్వాత మరింత కాన్ఫిడెంట్ గా మెయిన్స్ కు వెళ్లొచ్చు. ఈ కాన్సెప్ట్ ను విద్యార్థులకు అర్ధమయ్యేలా చెప్పడమే పెద్ద సవాల్. ప్రతీ కాలేజీ యాజమాన్యం ఆఫ్ లైన్ ఇంటర్వ్యూలనే ఇష్టపడుతోంది. దీన్ని అధిగమించడానికి టీంని మరింత పెంచుకోవాల్సి ఉందని మదన్ చెప్పారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఆఫ్ లైన్ సేవలు అందుబాటులో ఉండవు. అందుకే వారికి ఆన్ లైన్ సేవలు అందిస్తున్నామన్నారు.

లక్ష్యాలు, భవిష్యత్ ప్రణాళికలు

వచ్చే ఏడాదికల్లా తమ బ్రాండ్ పై ఓ ఫినిషింగ్ స్కూల్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు మదన్ తెలిపారు. ఓ సాధారణ స్టాఫింగ్ కంపెనీలాగ కాకుండా ఆర్గనైజ్డ్, ప్రొఫెషనల్ ఫినిషింగ్ కాన్సెప్ట్ తో రన్ అవుతున్న తమ స్టార్టప్ మరింత మంది విద్యార్థులకు చేరువ కావాలని చూస్తున్నారు.

ప్రస్తుతం పూర్తి బూట్ స్ట్రాపుడ్ కంపెనీగా ఉన్న టెస్ట్ మై ఇంటర్వ్యూ.. సిరీస్ రౌండ్ ఫండింగ్ కి సిద్ధంగా ఉంది. ఏడాది చివరికల్లా గణాంకాలు మరింత మెరుగ్గా ఉండబోతున్నాయి. ఫండ్ రెయిజ్ చేస్తే ఆంధ్ర, తెలంగాణకు పరిమితమైన సేవలను.. దేశవ్యాప్తం చేస్తామంటున్నారు మదన్.

“ఏదో ఒక స్టాఫింగ్ కంపెనీలాగ కాకుండా, విద్యార్థులకు కెరీర్ గైడెన్స్ తో పాటు సాఫ్ట్ స్కిల్స్, ప్రొఫెషనల్ స్కిల్స్ తో ఇంటర్వ్యూలకు తయారు చేయడమే తమ అంతిమ లక్ష్యం అని ముగించారు మదన్”