పదేళ్లకే ‘C’ ప్రోగ్రాం, 12 ఏళ్లకు సిఈఓ –టెకీ బాయ్ రాహుల్ డొమినిక్

చిన్నప్పుడే కంప్యూటర్లతో ఆడేసుకున్నాడు.. పదేళ్లకే ఎన్ఐఐటిలో కోర్సు..అమ్మ ఇబ్బందిని చూసి గృహిణుల కోసం యాప్.. క్లాస్ రూములో ఏం చెప్పారో తెలుసుకునేందుకు మరో యాప్.. 

పదేళ్లకే ‘C’ ప్రోగ్రాం, 12 ఏళ్లకు సిఈఓ –టెకీ బాయ్ రాహుల్ డొమినిక్

Tuesday April 14, 2015,

3 min Read

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది... ఇది సర్వసాధారణం, అందరికీ తెలిసిన విషయమే. సాధారణంగా గొప్ప గొప్ప వ్యక్తులు వారి బాల్యంలో చేసిన మంచి పనులను గురించి వివరించడానికి ఇలా చెప్తూ ఉంటారు. మరి రాహుల్ డొమినిక్‌ను కూడా ఆ జాబితాలోకి చేర్చవచ్చా? అది నిర్ణయించే ముందు అసలు ఎవరు ఈ రాహుల్ డొమినిక్... తెలుసుకుందామా!!

రాహుల్ డొమినిక్... పదేళ్ల వయసులోనే కంప్యూటర్ ప్రోగ్రాములు రాయడం మొదలుపెట్టిన బాలమేధావి. తండ్రి కంప్యూటర్ పై పని చేసుకుంటుంటే చూసిన రాహుల్... పూర్తిగా అర్థం కాకపోయినా, ఆ కంప్యూటర్ స్క్రీన్ పైన జరుగుతున్న మార్పులపై ఆసక్తితో తండ్రిని, ఆయన పనిని అలాగే తదేకంగా పరిశీలించేవాడు. కుమారుడిలోని జిజ్ఞాసను గమనించిన ఆయన... ప్రోత్సహించడం మొదలుపెట్టారు. రాహుల్ కి కంప్యూటర్‌ని ఇచ్చి ఏం కావాలంటే అది చేయమనేవారు. ఏం చేసినా ఎప్పుడూ అడ్డుకోలేదు. అయితే కొన్నిసార్లు ఇది రాహుల్ తండ్రికి ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టేది.


రాహుల్ డొమినిక్

రాహుల్ డొమినిక్


“ఓసారి ఏంజరిగిందంటే... నేనూ అమ్మా కలిసి ఓసారి అమ్మ స్నేహితురాలి ఇంటికి వెళ్లాం. ఆమె సన్ మైక్రోసిస్టమ్స్‌లోని ఐటీ విభాగంలో పనిచేస్తుంది. మేం వెళ్లే సమయానికి ఆమె ఏదో కంప్యూటర్ ప్రోగ్రామ్‌పై పని చేస్తున్నారు. మమ్మల్ని చూసి ఆప్యాయంగా పిలిచి, కాఫీ తీసుకువస్తానని లోపలికి వెళ్లారు. కంప్యూటర్ చూస్తే నా చేతులు ఆగవు కదా! ఆమె కాఫీ తీసుకుని వచ్చేంతలో ఏదో చేశాను. కానీ ఏం చేశానో, ఎలా చేశానో తెలియదు... ఆమె సుమారు 18 గంటలపాటు కష్టపడి చేసిన పని మొత్తం డిలీట్ అయిపోయింది. ఇది జరిగినప్పుడు నాకు నాలుగేళ్లనుకుంట”… అంటూ తన బాల్యంలోని సంఘటనలను గుర్తుచేసుకుంటాడు రాహుల్.

పదేళ్ల వయసొచ్చాక ‘C’ ప్రోగ్రామింగ్ నేర్చుకోవడానికి ఎన్ఐఐటీలో చేరాడు రాహుల్. కానీ అక్కడి ఫ్యాకల్టీ, ఇతర సిబ్బంది ఎవరూ రాహుల్‌ని చేర్చుకునేందుకు ఒప్పుకోలేదు. ఏదో పిల్లాడు కంప్యూటర్ చూడటానికి సరదా పడుతున్నాడు అనుకున్నారు వారంతా. ఒక్క రోజు ఒక్క క్లాసులో కూర్చోపెడితే తనకు తానుగానే భయంతో పారిపోతాడు అని భావించారు. కానీ రాహుల్ కి ఆ క్లాసు ఆసక్తిగా ఉండటంతో రోజూ వచ్చి, మొత్తం కోర్సు పూర్తిచేశాడు. దీంతో ఆశ్చర్యపోవడం ఫ్యాకల్టీ వంతైంది.

ఇక పన్నెండేళ్లప్పుడు ఎంట్రప్రెన్యూర్‌గా మారాడు రాహుల్. ఇదేంటి? పన్నెండేళ్లకే ఎంట్రప్రెన్యూర్ ఏమిటి? అనుకుంటున్నారా! ఇది నిజమే. ఆ అవకాశం ఎలా వచ్చిందంటే... రాహుల్‌కి పన్నెండేళ్లప్పుడు తండ్రి ఓ ఫైనాన్స్ కన్సల్టెన్సీని ప్రారంభించారు. ఆ కంపెనీకి అవసరమైన వెబ్ సైట్ రూపకల్పన బాధ్యతను రాహుల్ కి అప్పగించారు తండ్రి. తర్వాత డ్యూకో పెయింట్ అనే ఓ సాఫ్ట్‌వేర్ ను తయారు చేశాడు రాహుల్. దీని సహాయంతో పిల్లలు రంగులు, గ్రాఫిక్స్ వంటి అంశాలు నేర్చుకోవచ్చు. ఇది విడుదలైన కొద్ది రోజుల తర్వాత తెలిసిన విషయమేంటంటే దీన్ని పిల్లలు కంటే పెద్దలే ఎక్కువగా ఉపయోగిస్తున్నారని. దీన్ని ఓ సాఫ్ట్ వేర్ గా మొదట్లో రూపొందించినా తర్వాత కాలంలో విండోస్ అప్లికేషన్ గా అభివృద్ధి చేశారు.

అమ్మకు చేసిన సాయం

రాహుల్ తల్లి సిస్కోలో పనిచేస్తారు. ఎప్పుడూ తీరికలేని పని, హడావుడి. దీంతో ఇంట్లో వంట విషయానికి వచ్చేసరికి... ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియక ఎప్పుడూ సతమతమైపోతూ ఉండేవారు. అది చూసిన రాహుల్ కి వంటలు, విశేషాలను అందించేందుకు ఓ అప్లికేషన్ రూపొందిస్తే ఎలా ఉంటుందా అని ఓ ఆలోచన మెరిసింది. అలా చేయగలిగితే తన తల్లి లాంటి ఎందరో గృహిణులకు ఉపయుక్తంగా ఉంటుందనిపించింది. కొద్ది రోజుల్లోనే ఆ యాప్ ఆచరణ రూపం దాల్చింది.

‘వైర్డ్ ఇన్’... రాహుల్ డొమినిక్ కలల ప్రాజెక్టు. దీనికోసం రాహుల్ విపరీతంగా ఆలోచించిందేమీ లేదు. పరిశోధించింది అంతకన్నా లేదు. ఓసారి రాహుల్ తన స్నేహితులతో కలసి ఓ విహారయాత్రకు వెళ్లాడు. స్కూల్ ఎగ్గొట్టి అలా వెళ్లినందుకు... రాగానే ఆ రోజు స్కూల్లో జరిగిన క్లాసులు, హోమ్ వర్క్స్, నోట్స్... ఎవరిని అడగాలో తెలియదు. ఒకవేళ ఎవరైనా చెప్పినా అది ఎంతవరకూ కరెక్టో తెలియదు. వీటన్నింటితో రాహుల్‌కి బోర్ కొట్టింది. ఆ విసుగు నుంచి పుట్టిందే వైర్డ్ ఇన్ యాప్. ప్రతిరోజూ టీచర్లు తమ క్లాసు పూర్తయిన తర్వాత వారు చెప్పిన పాఠాలు, పిల్లలు చేసుకురావల్సిన హోమ్ వర్క్‌కి సంబంధించిన వివరాలను ఈ యాప్‌లో అప్ లోడ్ చేస్తారు. అది విద్యార్థులందరూ చూసి తదనుగుణంగా వర్క్ చేసుకుని తర్వాత రోజు స్కూలుకి వచ్చేవారు. ఇది రాహుల్ కెరీర్లోనే ఓ బిగ్ సక్సెస్.

వైర్డ్ ఇన్ అప్లికేషన్ పై టీచర్ల ఫీడ్ బ్యాక్ కోసం ఓ సర్వే నిర్వహించగా దాదాపు 86 శాతం మంది పూర్తి సంతృప్తి వ్యక్తం చేశారు. మిగిలిన 14 శాతం కూడా యాప్ పనితీరుపై ఎలాంటి విమర్శలూ చేయలేదు, వారికి దాని ధరకు సంబంధించి కొన్ని అభ్యంతరాలున్నాయి. అంటే వారు కూడా యాప్‌తో సంతృప్తి చెందినట్లే. ఈ యాప్‌లో ఎలాంటి అడ్వర్టైజ్‌మెంట్లూ లేకుండా విద్యార్థులకు అందించాలనేది రాహుల్ లక్ష్యం.

ప్రశాంత ప్రపంచానికీ మరో యాప్

రాహుల్ మరో ఆవిష్కరణ వెరి సేఫ్. ప్రపంచాన్ని ఓ అందమైన, ప్రశాంతమైన ప్రదేశంగా మార్చడానికి ఎప్పుడూ తాపత్రయపడుతూ ఉండేవాడు. ఆ లక్ష్యానికి ప్రతిరూపమే వెరి సేఫ్. మన చుట్టూ ఉన్న ప్రదేశాలు, నగరాలు లేదా దేశంలో ఏ ప్రదేశం నివాసానికి అనుకూలంగా ఉంటుంది? నేరాల రేటు ఎక్కడ తక్కువ ఉంటుంది? ఇలాంటి ఎన్నో అంశాలు ఈ ఆప్ ద్వారా కస్టమర్లకు ఉచితంగా అందుతున్నాయి.

పెద్ద పెద్ద ఎంట్రప్రెన్యూర్లకు సైతం సాధ్యంకాని ఆవిష్కరణలను పదహారేళ్లకే ఆవిష్కరించి శభాష్ అనింపించుకున్నాడు రాహుల్. భవిష్యత్తులో ఇంకా ఎలాంటి అద్భుతాలు రానున్నాయో, జస్ట్ వెయిట్