ఎనిమిదేళ్ళలో వంద దేశాలకు విస్తరించిన స్టార్టప్

ఎనిమిదేళ్ళలో వంద దేశాలకు విస్తరించిన స్టార్టప్

Friday March 11, 2016,

4 min Read


ఎనిమిదేళ్ల క్రితం ఇద్దరు కుర్రాళ్ల మదిలో మెరిసిన చిన్న ఆలోచన ఇప్పుడు మహా వృక్షమయింది. ఇంతింతై..వటుడింతై అన్నట్లు బెంగళూరు నుంచి వంద దేశాలకు విస్తరించింది. ఈ కుర్రాళ్ల ఆలోచన వల్ల లాభపడింది వారిద్దరే కాదు... వంద దేశాల్లో వీరి సేవలు పొందున్నవారంతా. వేరేవారి సక్సెస్ లో ఉన్న లాజిక్ నే తమ విజయానికి సోపానాలుగా వాడుకుంటున్నారు.

లాజిక్ తో మ్యాజిక్

లాడ్జి, రెసిడెన్సీ, హెటల్. ఏ పేరుతో పిలిచినా రూములు అద్దెకిచ్చే బడ్జెట్ హోటల్స్ దేశవ్యాప్తంగా ప్రథమశ్రేణి నగరాల్లోనే కాదు.. ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఉంటాయి. ఓ రకంగా ఇవే ఎనభై ఐదు శాతం వరకూ ఉంటాయి. మిగతా పదిహేను శాతం లగ్జరీ సౌకర్యాలుండే స్టార్ హోటల్స్. ఈ తొంభై శాతం హోటల్సన్నీ ఎలాంటి సాఫ్ట్ వేర్ లేకుండానే మాన్యువల్ గా నడుస్తుంటాయి. పెన్ను, పేపర్ వర్క్ కామనే. కస్టమర్లను ఆకట్టుకునేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లంటూ ప్రత్యేకంగా ఉండవు. 

అయితే లాజిక్ ఉంటే అలాంటి బిజినెస్ లో మ్యాజిక్ చేవయచ్చని ఎనిమిదేళ్ల కిందట కనిపెట్టారు ఆదిత్య సంఘి, ప్రభాస్ భట్నాగర్ అనే ఇద్దరు కుర్రాళ్లు. ఈ సమస్య దేశంలోనే కాదు.. ప్రపంచవ్యాప్తంగా ఉందని గమనించారు. అప్పటికీ ఆన్ లైన్ వ్యవస్థ అంతగా ఊపందుకోలేదు. ఓ రకంగా చెప్పాలంటే అప్పట్లో ఆన్ లైన్ లో కొనడమో.. బుక్ చేసుకోవడమే చేశామంటే విచిత్రంగా చూసేవాళ్లు. అయితే పరిస్థితి మున్ముందుమారుతుందని... అది మార్కెట్ ను శాసిస్తుందని కచ్చితంగా అంచనా వేశారు. ధైర్యంగా ముందడుగు వేశారు. బెంగళూరు కేంద్రంగా "హోటలాజిక్స్" కి రూపకల్పన చేశారు. క్లౌడ్ బేస్డ్ ప్రాపర్టీ మేనేజ్మెంట్ అండ్ డిస్ట్రిబ్యూషన్ రంగంలోకి దిగారు.

"ఇది చాలా సింపుల్, ఈజీ, ఖర్చు లేని వ్యవహారం. అదే మార్కెట్లో బాగా పేరు తెచ్చుకున్న ఇతర సంస్థలతో పాటు కొత్త వినియోగదారులకు తమ బ్రాండ్ ను పరిచయం చేయవచ్చు. అందుకే మేము ముందుగానే గుర్తించాం. మా ప్రయత్నం చాలా పెద్దవిజయం సాధిస్తుందని భావించాం" ఆదిత్య, హోటలాజిక్స్ ఫౌండర్

హోటలాజిక్స్ టీం <br>

హోటలాజిక్స్ టీం


బెంగళూరు నుంచి గ్లోబల్ రేంజ్ కి ...

వీరు బెంగళూరులో తమ కార్యకలాపాలు ప్రారంభించినా క్లౌడ్ బేస్డ్ ప్రాపర్టీ మేనేజ్ మెంట్ సర్వీసు పొందడానికి భారత్ లోని చిన్న, మధ్య తరహా హోటల్స్ పెద్దగా ముందుకు రావని అంచనా వేశారు. అందుకే ఇతర దేశాలపైనే దృష్టి కేంద్రీకరించారు. అయితే వీరి వనరులకు ఇతరదేశాల్లో మార్కెటింగ్ చేసుకోవడం కష్టమైన పనే. దానికి కొత్త పెట్టుబడులు కూడా కావాలి. అలాంటి సమయంలో వీరికి 2010లో జరిగిన "హైటెక్ ట్రేడ్ షో" అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చింది. హాస్పిటాలిటీ టెక్నాలజీ షోల్లో ప్రపంచంలోనే అత్యంత పెద్దదిగా భావించే ఈ ట్రేడ్ షోలో.. వారు తమ ప్రాడక్ట్ ని ప్రదర్శించారు. కాకపోతే ఆ ట్రేడ్ షోలో ఏర్పాటు చేసుకోవడానికి సరైన స్టాల్ దొరకలేదు. కేవలం కేటాయించిన టేబుల్ వెనకాల "హోటలాజిక్స్ " పేరుతో ఓ ఫ్లెక్సీని మాత్రమే పెట్టుకోగలిగారు. అయితే పైపై మెరుగులను అక్కడ ఎవరూ చూడలేదు. వచ్చినవారంతా వీరి ఆలోచన... ఆచరణా విధానాన్నే చూశారు. ఫలితం ముంబై ఎంజెల్స్ నుంచి వీరి స్టార్టప్ కు కొంత పెట్టుబడి వచ్చింది.

మార్కెటింగ్ విషయంలోనూ వీరు సంప్రదాయ ధోరణులను పూర్తిగా వదిలేశారు. ఇండియాలో కూర్చునే ప్రపంచం అంతా అమ్మేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. ఇందుకోసం ఉచితంగా ట్రయల్ చేసుకునే అవకాశం ఇచ్చారు. సింపుల్, ఈజీ, ఖర్చు లేని వ్యవహారం అయిన హోటలాజిక్స్ తో తమ హోటల్ ని మేనేజ్ చేసుకునేలా ఒక్కసారి ట్రయల్ చేస్తే.. ఇక యజమానులు మనసు మార్చుకోరని వీరి గట్టి నమ్మకం. వీరి నమ్మకం వమ్ము కాలేదు. ఫ్రీ ట్రయల్ చూసిన వారిలో మెజారిటీ శాతం హోటలాజిక్స్ తో అసోసియేట్ అయిపోయారు.

హోటలాజిక్స్ మొట్టమొదటి కస్టమర్ గ్రీస్ లోని ఫరోస్ సూట్స్. హోటల్ నిర్వహణ కోసం మంచి క్లౌడ్ బేస్డ్ సర్వీస్ కోసం చూస్తున్న ఫరోస్ సూట్స్ యజమానులకు.. హోటలాజిక్స్ పర్ ఫెక్ట్ సొల్యూషన్ లా కనిపించింది. " నెట్ లో సెర్చ్ చేస్తూండగా హోటలాజిక్స్ గురించి తెలుసుకున్నాం. దీంట్లో విషయం ఉందని అర్థమయింది. చిన్న హోటల్స్ నిర్వహణకు అవసరమైన స్మార్ట్ ఫీచర్స్ అన్నీ ఇందులో ఉన్నాయి" అంటారు హోటలాజిక్స్ మొదటి కస్టమర్ ఫరోస్ సూట్స్ యజమాని

వంద దేశాలకు విస్తరణ

అక్కడ్నుంచి వారిక వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాలేదు. దుబాయ్ లోని" ఈ స్పేస్ హాలీడే హోమ్స్ "తో ఇటీవలే ఒప్పందం చేసుకోవడం ద్వారా వంద దేశాల్లో హోటలాజిక్స్ కు స్థానం కల్పించారు. అమెరికా నుంచి ఆఫ్రికా వరకు శ్రీలంక నుంచి రష్యా వరకు బడ్జెట్ హోటల్స్ అన్నీ వీరి సేవలు వినియోగించుకుంటున్నాయి.

" వచ్చే ఐదేళ్లలో చిన్న, మధ్య తరహా హోటళ్లు క్లౌడ్ బేస్డ్ ప్రాపర్టీ మేనేజ్ మెంట్ సర్వీసులు పొందడానికి సిద్ధమవుతాయి. ప్రపంచ మార్కెట్ లో పెరుగుతున్న అవకాశాలు అందిపుచ్చుకోవాలంటే తప్పదు. దీని హోటలాజిక్స్ సింపుల్, స్మూత్ గా చేసి పెడుతుంది " ప్రభాస్, కో ఫౌండర్, హోటలాజిక్స్

హోటలాజిక్స్ టీం <br>

హోటలాజిక్స్ టీం


రాకెట్ వేగంతో వృద్ధి                           

వినియోగదారులను ఆకర్షించడంలో హోటలాజిక్స్ గత మూడు త్రైమాసికాల్లో యాభై శాతం వృద్ధిని నమోదు చేసింది. గత ఏడాదిగా కొన్ని ముఖ్యమైన మార్కెట్లలో చైన్ హోటల్స్, బ్రాండెడ్ హోటల్స్ కు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చారు. ఇప్పటికే హోటల్ యజమానులతో వ్యాపార బంధాలను పెట్టుకున్నవారితో అసోసియేట్ అయి మరింత మంది హోటలీయర్స్ ను ఆకర్షించడంలో సఫలమయ్యారు. ఇటీవలి కాలంలో మంచి వృద్ధి రేటుని నమోదు చేశారు. రచ్చగెలిచి ఇంట గెలిచినట్లు.. గత రెండు మూడేళ్లలో భారత్ లో అత్యధిక బడ్జెట్ హోటళ్లతో అసోసియేట్ అయ్యారు. యూరప్, సౌత్ ఈస్ట్ ఏషియా, అమెరికా, కరీబియన్ దేశాలు హోటలాజిక్స్ కు ప్రధాన మార్కెట్ గా ఉన్నాయి. ఇదే తరహా సేవలు అందించే కొన్ని ఇతర సంస్థలతోనూ చేతులు కలిపి మార్కెట్ వాటా పెంటుకుంటున్నారు.

హోటలాజిక్స్ సేవలు పొందుతున్నవారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా వీరు మౌలిక సదుపాలయాలను ఏర్పాటు చేసుకున్నారు. పూర్తిస్థాయి సామర్థ్యం గల సర్వర్స్, చిన్నపాటి అసౌకర్యం కూడా కలిగించని సాఫ్ట్ వేర్ రక్షణ వీరికి అదనపు బలాలు. అందుకే వినియోగదారుల నుంచి చిన్నపాటి కంప్లయింట్ వచ్చినా తక్షణమే స్పందిస్తారు. చాలా తక్కువ సర్వీస్ చార్జ్ వసూలు చేస్తున్నారు. హోటలియర్స్ సైతం తమ సమయంలో 75 శాతం ఆదా అవుతోందని సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

ప్రపంచం అంతా ఆన్ లైన్ కు శరవేగంగా కనెక్ట్ అవుతోంది. దీనికి ఇప్పుడు చిన్నా, పెద్ద అనే తేడా ఉండటం లేదు. ఇలాంటి చోట్ల... ప్రపంచ మార్కెట్ తో అనుసంధానమై అవకాశాలను పెంచుకోవడానికి "హోటలాజిక్స్" చక్కని దారి చూపిస్తోంది. ఈ దారి చిన్న, మధ్య తరహా వ్యాపార సంస్థలనే కాదు.. హోటలాజిక్స్ ను సైతం అందనంత ఎత్తుకు తీసుకుపోతుంది.