బిలియన్ డాలర్ల బ్యూటీ మార్కెట్లోకి కొటక్ మహీంద్రా మాజీ ఎండి

విజయవంతమైన పారిశ్రామికవేత్తలతో సంప్రదించిన అనుభవం కాస్తా ఆమెను సొంతంగా వ్యాపార రంగంలో అడుగిడేలా చేశాయి. సౌందర్య, ఆరోగ్య సంరక్షణ రంగంలో ఆమె స్థాపించిన కంపెనీ నైకా.కామ్ ఇప్పుడు కొత్త శిఖరాలకు చేరుకుంది. 5 లక్షలకుపైగా సంతృప్తి చెందిన కస్టమర్లు కంపెనీ సొంతం. ఇదీ క్లుప్తంగా నైకా.కామ్ వ్యవస్థాపకురాలు ఫాల్గుణి నాయర్ గురించి పరిచయం.

బిలియన్ డాలర్ల బ్యూటీ మార్కెట్లోకి కొటక్ మహీంద్రా మాజీ ఎండి

Tuesday June 23, 2015,

4 min Read

ముంబై కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న నైకా.కామ్ సౌందర్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తులను విక్రయిస్తోంది. 300లకుపైగా బ్రాండ్స్‌కు చెందిన 15,000 పైగా ఉత్పత్తులను ఆన్‌లైన్లో అమ్ముతోంది. భారత్‌లో అగ్రస్థాయి బ్యూటీ డెస్టినేషన్‌గా వెలుగొందుతోంది. కస్టమర్లు నైకా వెబ్‌సైట్ ద్వారా ఉత్పత్తులను కొనుగోలు చేయడమే కాదు, అందంగా కనపడేందుకు కావాల్సిన సలహాలు, సూచనలు, టిప్స్, అప్‌డేట్స్ కోసం ఆధారపడ్డారని నైకా అంటోంది. కస్టమర్లకు సూచనలు ఇచ్చేందుకు 25 మంది నిపుణులు ఎల్లప్పుడు సిద్ధంగా ఉంటారు. మేకప్, స్కిన్ కేర్, ఫ్రాగ్రెన్స్, బాత్, బేబీ, లగ్జరీ, వెల్‌నెస్ ఇలా విభాగమేదైనా స్త్రీ, పురుషుల కోసం ఉత్పత్తులను ఆఫర్ చేస్తోంది. 900లకుపైగా నగరాలకు ఉత్పత్తులను అందిస్తోంది. ప్రముఖ కొరియర్ కంపెనీల సహకారంతో 9,000లకుపైగా పిన్ కోడ్స్‌కు కంపెనీ చేరుకుంది. ట్రై పేరుతో వర్చువల్ మేక్‌ఓవర్ టూల్, బ్యూటీబుక్ పేరుతో బ్లాగ్‌ను కూడా నిర్వహిస్తోంది.

ఫాల్లుని నాయర్, నైకా ఫౌండర్

ఫాల్లుని నాయర్, నైకా ఫౌండర్


బ్యాంకింగ్ టు బ్యూటీ బిజినెస్

ఫాల్గుని నాయర్ ఐఐఎం అహ్మదాబాద్‌లో ఐఐఎం గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకర్‌గా, బ్రోకర్‌గా 19 ఏళ్లపాటు కోటక్ మహీంద్రా గ్రూప్‌లో పనిచేశారు. యూఎస్, యూకేలో గ్రూప్ అంతర్జాతీయ కార్యకలాపాలను ఎనిమిదేళ్లపాటు నిర్వర్తించారు. ఆ తర్వాత ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ విభాగానికి అధిపతి అయ్యారు. ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్ బిజినెస్‌కు ఎండీగా 2005లో నియమితులయ్యారు. ఐపీవో బ్యాంకర్‌గా భారత్‌లో ప్రముఖ కంపెనీల్లో ఒకటిగా నిలపడంలో ఆమెది కీలక పాత్ర. కంపెనీల విలీనాలు, కొనుగోళ్ల వ్యవహారాలను విజయవంతంగా పూర్తి చేశారు. ఇప్పుడు పూర్తిగా భిన్నమైన రంగంలో విజయవంతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు.

అంకెల్లో కంపెనీ

హిందీ పదమైన నాయిక నుంచి నైకా వచ్చింది. నాయికా అంటే నటి, అందమైనది అని అర్థం. ప్యూపా నుంచి సీతాకోక చిలుకగా రూపాంతరం చెందడాన్ని లోగో సూచిస్తుంది. అంటే ఒక యువతి సైతం తన జీవితంలో పలు పాత్రలను పోషిస్తుందన్నది సంస్థ భావన. స్వేచ్ఛ, ఉద్యమం, శక్షి, లావణ్యాన్ని సీతాకోక చిలుక ప్రతిబింబిస్తుందని, అందుకే నైకా పేరును తీసుకున్నామని ఫాల్గుణి అంటారు. అక్టోబరు 24, 2012న దసరా సందర్భంగా కంపెనీ తన ప్రస్థానాన్ని ప్రారంభించింది. జూన్ 2014లో తొలిసారిగా నిధులను స్వీకరించింది. భారత్‌కు చెందిన ప్రముఖ ఇన్వెస్టర్ల బృందం నుంచి 3.2 మిలియన్ డాలర్లను సమీకరించింది. ఇప్పటి వరకు 30,000 కాజల్స్, 25,000 లిప్‌స్టిక్స్ విక్రయించింది.

‘సౌందర్య ఉత్పత్తులు కొనేముందు కస్టమర్లకు సలహా అవసరం. తన చర్మానికి ఏవి సరిగ్గా నప్పుతాయనే విషయం తెలుసుకోవాలని కస్టమర్‌కు ఉంటుంది. అయితే మల్టీ బ్రాండ్ రిటైలర్లు, ఫార్మసీలు ఎటువంటి సూచనలు చేయరు. బ్రాండ్ స్టోర్లు తమ ఉత్పత్తుల గురించే ప్రచారం చేసుకుంటాయి. నిష్పాక్షికంగా సూచనలు చేసే మల్టీ బ్రాండ్ స్టోర్ అవసరాన్ని గుర్తించాను. సరైన ఉత్పత్తులను వారికి మార్గదర్శనం చేయాలి’ అని అంటారు ఫాల్గుణి. 

ఆధునిక మహిళకు కావాల్సిన ఉత్పత్తులను వారి ఇంటి వద్దే సంస్థ అందిస్తోంది. సౌందర్య, ఆరోగ్య సంరక్షణ ఉత్పత్తుల ఆన్‌లైన్ వేదికగా అగ్రస్థాయిలో నిలవాలనే లక్ష్యాన్ని కంపెనీ నిర్దేశించుకుంది.

యువతే కస్టమర్లు

అందంపై మక్కువ ఉన్న భారతీయ మహిళలే లక్ష్యంగా కంపెనీ సేవలందిస్తోంది. కస్టమర్లలో 75 శాతం మంది మహిళలే. 18-24, 24-34 ఏళ్ల మధ్య వయసున్న వారు ప్రధాన కస్టమర్లు. వినియోగదారులు సరైన ఉత్పత్తిని ఎంచుకోవడంలో కంపెనీ మార్గదర్శిగా ఉంటోంది. ఇదే నైకా ప్రత్యేకత. చర్మం తీరునుబట్టి కస్టమర్లకు కంపెనీ ఉత్పత్తులను సిఫార్సు చేస్తుంది. ఇందుకోసం బ్యూటీ బుక్ పేరుతో ఉత్పత్తుల రివ్యూ, టిప్స్, ట్రిక్స్‌ను అందిస్తోంది. ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలు మార్కెట్ ప్లేస్ మోడల్‌ను అనుసరిస్తున్నాయి. ఇందుకు భిన్నంగా నైకా తన ఉత్పత్తుల్లో 85 శాతం సరుకును తమ వేర్ హౌసుల్లో నిల్వ చేస్తోంది. వెబ్‌సైట్లో చూపిన ప్రతి వస్తువూ గిడ్డంగిలో ఖచ్చితంగా లభిస్తుంది. త్వరగా డెలివరీ చేసేందుకు ఈ విధానం దోహదం చేస్తుందని ఫాల్గుణి అంటారు.

ఎదురవుతున్న సవాళ్లు

కంపెనీ ప్రతి దశలోనూ విభిన్న సవాళ్లను ఎదుర్కొంది. తొలి దశలో వెబ్‌సైట్ అభివృద్ధి, నియామకంతోపాటు కస్టమర్లకు బ్రాండ్ అనుభూతి కలిగించడంపై కంపెనీ ఫోకస్ చేసింది. తర్వాతి దశలో కంపెనీ నిర్వహణ, సాంకేతికత, అలాగే కస్టమర్లకు ఎటువంటి అడ్డంకి లేకుండా ఉత్పత్తులు చేరడంపై దృష్టి పెట్టింది. చివరగా మార్కెటింగ్. నిరంతరం కొత్త పుంతలు తొక్కుతున్న ఇంటర్నెట్ వ్యాపారంలో.. పంపిణీ విధానాన్ని రోజూ మార్పులు చేశామని చెబుతున్నారు ఫాల్గుణి. డిజిటల్ రంగం అభివృద్ధితో తాము ఆసక్తికర అంశాలు నేర్చుకున్నామని అన్నారు. చెల్లింపుల విషయంలో కొన్ని సమస్యలు తలెత్తాయి. అయితే కస్టమర్లు సహృదయంతో మన్నించారని వివరించారు. హెచ్‌యూఎల్, ప్రోక్టర్ అండ్ గాంబుల్, లారియల్, జేఅండ్‌జే (న్యూట్రోజెనా), నివియా, లాక్సిటేన్, డేవిడాఫ్, కావిన్ క్లెయిన్ వంటి బ్రాండ్లతో కంపెనీ చేతులు కలిపింది.

image


ఇదీ నైకా బృందం

విభిన్న విద్యార్హతలు, అనుభవం ఉన్న సిబ్బందిని నైకా నియమించుకుంది. కంపెనీ సీటీవో ఐఐటీ మాజీ ఉద్యోగి. చీఫ్ బిజినెస్ ఆఫీసర్ గతంలో ఇ-కామర్స్ వ్యాపారం చేసినవారే. నిర్వహణ కార్యకలాపాలను పర్యవేక్షిస్తున్న వైస్ ప్రెసిడెంట్‌కు ఇ-కామర్స్ వెబ్‌సైట్లలో పనిచేసిన అనుభవం ఉంది. సమయానికి ఉత్పత్తులు కస్టమర్లకు చేర్చడం ఆయన విధి. సౌందర్య, ఆరోగ్య సంరక్షణకు సంబంధించిన సమగ్ర సమాచారమే నైకా విజయంలో కీలకంగా ఉంది. క్రియేటివ్ రైటర్లు కంపెనీ సొంతం. చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ యేల్‌లో పనిచేశారు. ఇక సిబ్బంది సంఖ్య అంచెలంచెలుగా పెరుగుతోంది. కొత్త నియామకాల్లోనూ నాణ్యతకు పట్టం కడుతోంది నైకా. ప్రతీ ఒక్కరిని 3 నుంచి 5 మందితో కూడిన బృందం ఇంటర్వ్యూ చేస్తుంది. అందరికీ నచ్చితేనే అభ్యర్థిని ఎంపిక చేస్తారు. అనుభవం ఉన్నవారికే కంపెనీ ప్రధాన్యతనిస్తోంది. అభ్యర్థుల్లో ఉద్యోగంపై అభిరుచి ఉందా లేదా అని పరీక్షిస్తున్నారు. విశ్వాసం, గౌరవం, ఆసక్తి, చొరవ, కొనసాగించే తత్వం వంటి గుణాలనూ పరిగణలోకి తీసుకుంటున్నారు.

స్నేహపూర్వక వాతావరణం

నైకాలో పూర్తిగా స్నేహపూర్వక వాతావరణం ఉంటుంది. భోజన ప్రియుల కార్యాలయంగా కంపెనీ మారిపోయింది. వారాంతాల్లో ఉల్లాసం కోసం ఆటలు కూడా ఉన్నాయి. విభిన్న మతాలకు చెందిన వారు ఇక్కడ పని చేస్తున్నారు. అన్ని పండుగలను జరుపుకుంటారు. సరదాగా ఫోటోలను తీయడం, వాటిని ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేయడం ఇక్కడి ఉద్యోగులకు పరిపాటి. అందరూ నైకాను ప్రేమించేవారే. చేతి గోళ్లపైన అందంగా చిత్రాలను వేసే ఆర్టిస్ట్ కంపెనీలో ఉన్నారు. ఉద్యోగులకు విచిత్రమైన బొమ్మలను వేసి వారిలో ఉల్లాసాన్ని నింపుతోంది ఈ కళాకారిణి.

ఇదీ పరిశ్రమ పరిమాణం

సౌందర్య, ఆరోగ్య సంరక్షణ పరిశ్రమ పరిమాణం భారత్‌లో రూ.50,000 కోట్లుంది. ఏటా 15-17 శాతం వృద్ధి చెందుతోంది. ఫ్యూచర్ గ్రూప్ ఒక్కటే బ్యూటీ విభాగంలో రూ.1,000 కోట్ల వ్యాపారం చేస్తోంది. బ్యూటీ లక్ష్యంగా ఇ-కామర్స్‌లో మల్టీ బ్రాండ్ రిటైల్ ఫార్మాట్ స్టోర్స్ భారత్‌లో లేవు. యూఎస్‌లో సెఫోరా, అల్టా, చైనాలో జుమీ పేరెన్నిక గలవి. టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. మార్కెట్లోకి కొత్త ఉత్పత్తులు వెల్లువలా వచ్చి పడుతున్నాయి. ఈ అంశమే పరిశ్రమకు జోష్‌నిస్తోంది. అంతర్జాతీయ ఉత్పత్తుల పట్ల కస్టమర్లకు అవగాహనా పెరుగుతోంది. అంతేకాదు కొత్త ఉత్పత్తులను కోరుతున్నారు కూడా.

మొబైల్ యాప్‌లోనూ

నైకా ఒక అడుగు ముందుకేసి మొబైల్ యాప్‌ను సైతం తీసుకొచ్చింది. 50,000 పైగా డౌన్‌లోడ్స్ నమోదయ్యాయి. లేటెస్ట్ అప్‌డేట్స్ కోసం యూట్యూబ్‌లో నైకా టీవీని సైతం వీక్షించొచ్చు. కొత్త బ్రాండ్లను ఎప్పటికప్పుడు జోడించడంలో టీం ఎప్పుడూ ముందుంటోంది. టెక్నాలజీని ఆసరాగా చేసుకుని కస్టమర్లతో అనుసంధానమవడం ఆనందంగా ఉందని అంటున్నారు ఫాల్గుణి. కంపెనీతో ముడిపడి ఉన్న కస్టమర్ల ద్వారా మార్కెట్ తీరు తెన్నులు తెసుకునేందుకు వీలైందని చెబుతున్నారు.

WEBSITE