మట్టి గణపతికి జై! చెట్టు గణపతికి జైజై!!

0

అసలే పొల్యూషన్ రోజురోజుకూ భయంకరంగా పెరిగిపోతోంది. గ్లోబల్ వార్మింగ్ భయపెడుతోంది. పచ్చదనం అంతకంతకూ కనుమరుగైపోతోంది. భూతాపం తగ్గిపోయి ఆహ్లాదకరమైన వాతావరణం ఏర్పడాలంటే గ్రీనరీ బాగా పెరగాలి. అందుకు విరివిగా చెట్లు పెంచాలి. ఆ ఉద్దేశంతోనే తెలంగాణ ప్రభుత్వం హరితహారం కార్యక్రమాన్ని చేపట్టింది. దాంతోపాటు పొల్యూషన్ తగ్గించడానికీ చర్యలు ప్రారంభించింది. గణేశ్ నవరాత్రులప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల వల్ల జరుగుతున్న పర్యావరణ కాలుష్యాన్ని నివారించడానికి సర్కార్ నడుం బిగించింది. ఒకవైపు మట్టి విగ్రహాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టడంతోపాటు హైదరాబాద్లో పెద్ద ఎత్తున మొక్కలు పెంచడానికి వినాయకచవితిని వేదికగా చేసుకుంది. షేర్ ఎ సర్వీస్ (share a service) సంస్థతో కలిసి ట్రీ గణేశ్ విగ్రహాలను పంపిణీ చేస్తోంది.

ట్రీ గణేశ్ పూర్తిగా ఎకో ఫ్రెండ్లీ విగ్రహం. మట్టితో వినాయకుడిని తయారు చేసి, విగ్రహం వెనక భాగంలో ఒక మొక్క నాటారు. ప్రతీ విగ్రహానికి ఒక మొక్క అమర్చి ఉంటుంది. ఒక అడుగు లోతు గుంతలో నీళ్లు పోసి అందులో ట్రీ గణేశ్ను ప్రతిష్టించాలి. రోజూ పూజ చేసేటప్పుడు మొక్కకు నీళ్లు పోయాలి. అలా మట్టి విగ్రహం కరిగిపోయి వినాయకుడు నిమజ్జనం అవుతాడు. ఆ మొక్కేమో చెట్టులా పెరుగుతుంది. మొత్తంగా ఇదీ కాన్సెప్ట్. నిత్యం పూజలందుకునే ఏకదంతుడు మన ఇంట్లోనే చెట్టు రూపంలో పెరిగి నీడనిస్తాడు.

షేర్ ఎ సర్వీస్ సంస్థకు చెందిన గౌరీ శంకర్, విశాల గుమ్ములూరు గత 15 ఏళ్లుగా పర్యావరణ హితం కోసం పనిచేస్తున్నారు. మట్టి గణేశ్ విగ్రహాలపై ఎన్నో అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. రెండేళ్ల నుంచి ట్రీ గణేశ్ విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఇటీవలే జీహెచ్ఎంసీ కోసం ప్రత్యేకంగా ఒక వర్క్ షాప్ నిర్వహించారు. అందులో ట్రీ గణేశ్ విగ్రహాల తయారీపై స్వయం సహాయక సంఘాలకు, విద్యార్థులకు శిక్షణ ఇచ్చారు. అందరూ కలిసి 2,500 ట్రీ గణేశ్ విగ్రహాలను తయారు చేశారు. శిల్పకళావేదికలో మంత్రి కేటీఆర్ చేతులమీదుగా ట్రీ గణేశ్ ప్రతిమలను విద్యార్థులకు పంపిణీ చేశారు.

ఈ వినాయక చవితికి ఇంటికొక ట్రీ గణేశ్ను ప్రతిష్టిస్తే లక్షలాది మొక్కలు ప్రాణం పోసుకుంటాయి. అటు దేవుడిని కొలిచినట్టూ ఉంటుంది. ఇటు పర్యావరణానికి బోలెడంత మేలు చేసిన తృప్తీ మిగులుతుంది.

Related Stories