బడ్జెట్ హోటల్ సెక్టార్‌లో దుమ్మురేపుతున్న కిక్ స్టే

బడ్జెట్ హోటల్ సెక్టార్‌లో దుమ్మురేపుతున్న కిక్ స్టే

Thursday February 04, 2016,

4 min Read

బడ్జెట్ హోటల్స్.. నిన్నమొన్నటి వరకు ఎవరికీ పట్టని బిజినెస్. కానీ స్టార్టప్స్ ఆవిర్భావం తర్వాత బడ్జెట్ హోటల్స్ సెక్టారే మారిపోయింది. ఇప్పటికే ఈ రంగంలో ఓయో, వుడ్ స్టే, స్టేజిల్లా వంటి స్టార్టప్స్ అడుగుపెట్టగా ఇప్పడు అదే బాటలో పయనిస్తోంది కిక్ స్టే. నిన్నమొన్నటివరకు జెడ్ఓగా ఉన్న సంస్థ పేరు మార్చుకుని ఇప్పుడు కిక్ స్టేగా ఆవిర్భవించి, బడ్జెట్ హోటల్ రంగంలో అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది.

‘వ్యక్తిగత అనుభవాల ఆధారంగానే మంచి బిజినెస్ ఐడియాలు ఆవిర్భవిస్తాయి’.. వర్జిన్ ఫౌండర్ రిచర్డ్ బ్రాన్సన్ అభిప్రాయమిది. ఇదే సూత్రంతో కిక్ స్టే ఏర్పాటైంది.

కిక్ స్టే టీమ్

కిక్ స్టే టీమ్


కొన్నేళ్ల క్రితం జస్వీర్‌సింగ్ గుర్గావ్ వచ్చారు. అక్కడ పేయింగ్ గెస్ట్ (పీజీ) అకామిడేషన్‌ కోసం ఎంతో అన్వేషించారు. ఈ ప్రయత్నంలో ఆయన ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. ఈ వ్యక్తిగత అనుభవాలే పెయింగ్ గెస్ట్ రంగంలోకి ప్రవేశించేందుకు ఆయనను పురికొల్పాయి. తాను ఎదుర్కొన్న సమస్యలను ఇతరులు ఫేస్ చేయకుండా ఆయన నిలువరించగలిగారు.

తనకు ఐడియా వచ్చిన వెంటనే స్పేర్‌హౌజింగ్.కామ్ పేరుతో బిజినెస్ ప్రారంభించారు. ఈ సంస్థ ప్రాపర్టీ, పీజీ ఎకామిడేషన్ వ్యాపారం నిర్వహించేంది. కొన్నాళ్లు నడిపిన తర్వాత తన బిజినెస్ మోడల్‌ను గెస్ట్‌హౌజ్ చైన్‌కు మార్చారు జస్వీర్. దానికి జోజో.ఇన్(ZOZO.IN) అని పేరు పెట్టారు. అదే సమయంలో ఓయో రూమ్స్ కూడా హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో తమ సర్వీసులను ప్రారంభించింది. దీన్ని నిశితంగా గమనించిన జస్వీర్ బడ్జెట్ హోటల్ మార్కెట్‌లోకి ప్రవేశించాలని నిర్ణయించుకున్నారు. దీంతో అప్పటివరకు గెస్ట్‌హౌజ్‌ చైన్ బిజినెస్ చేస్తున్న జస్వీర్ తన రూటు మార్చి బడ్జెట్ హోటల్స్ రంగంలోకి అడుగుపెట్టారు. తనతోపాటు మరో ఇద్దరు కో ఫౌండర్లతో కలిసి జోజో స్టే పేరుతో 2015 జనవరిలో వ్యాపారాన్ని ప్రారంభించారు. గంటల ప్రాతిపాదికన రూమ్‌లను అద్దెకిచ్చే బిజినెస్‌లోకి మారిపోయారు. జూలైలో జోజో స్టేను ‌‘కిక్ స్టే’గా మార్చారు. అందుకు కారణం ఈ రంగంలో ఇప్పటికే ఉన్న కంపెనీలకు జెడ్‌ఓ రూమ్స్ సిమిలర్‌గా ఉండటమే. ఒక్క పేరే కాదు తన స్టార్టప్ బిజినెస్ మోడల్‌నే పూర్తిగా మార్చేశారు జస్వీర్. హాస్పిటాలిటీ రంగంలో పెను మార్పులు తీసుకురావాలన్న లక్ష్యంతో జస్వీర్ ఈ రంగంలోకి అడుగుపెట్టారు.

దేశంలో బడ్జెట్ హోటల్స్ చాలావరకు అసంఘటితంగానే ఉన్నాయి. వారి విధానాలు కూడా అపారదర్శకంగానే ఉన్నాయి. ఇటీవలి కాలంలో ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్లు పెరిగిపోయినప్పటికీ, బడ్జెట్ హోటల్స్ మాత్రం ఓ బ్రాండ్ వాల్యూను కానీ, ట్రాన్సపరెన్సీని కాని సంపాదించలేకపోతున్నాయి. 

అయితే కొత్త తరం హోటల్ అగ్రిగేటర్స్ మాత్రం ఈ రంగాన్ని సమూలంగా మార్చేస్తున్నారు. అసంఘటితంగా ఉన్న బడ్జెట్ హోటల్స్ సమస్యలను సాల్వ్ చేయడంతోపాటు, నాణ్యత, నమ్మకం ఆన్‌లైన్ ట్రావెల్ ఏజెంట్ల మాదిరిగా కస్టమర్లకు విశ్వాసం కలిగించగలుతున్నారు. నిర్వహణ పనులను ప్రామాణికం చేయడం, తరుచుగా క్వాలిటీ పరీక్షలు నిర్వహించడం ద్వారా బడ్జెట్ హోటల్స్ ఎదుర్కొంటున్నకష్టాలను అధిగమించొచ్చు. ఇలా చేస్తే బడ్జెట్ హోటల్స్‌ను కో బ్రాండింగ్ మోడల్‌గా స్థిరీకరించొచ్చు అని కిక్ స్టే సీఈఓ జస్వీర్ వివరించారు.

హాస్పిటాలిటీ బ్యాక్‌గ్రౌండ్ నుంచి రావడం జస్వీర్, అతని టీమ్‌కు ఈ రంగంలో నిలదొక్కుకునేందుకు ఉపయోగపడింది. కస్టమర్ల అవసరాలు ఏంటో మేం అర్థం చేసుకోగలం. అలాగే హోటల్ ఓనర్లు ఏం ఆశిస్తున్నారో కూడా మాకు తెలుసు. ఇరువర్గాల అభిప్రాయాలు తెలిసిన కారణంగానే సంపూర్ణ దృష్టికోణంతో మంచి వ్యూహాలు రూపొందించగలుగుతున్నాం అని జస్వీర్ చెప్పారు.

బాలారిష్టాలు..

టాలెంట్‌ ఉన్న ఉద్యోగులను వెతుక్కోవడం ఏ సంస్థకైనా చాలా కష్టం. ముఖ్యంగా స్టార్టప్‌లకైతే ఇంకా కష్టం. నాన్ టెక్నికల్ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన కారణంగా నాకు మరింత కష్టమైంది. అయితే అనుభవం కలిగిన ఐటీ ప్రొఫెషనల్స్‌ను ఎంపికచేసుకోవడం, వారికి స్వేచ్ఛ ఇచ్చి పనిచేయడం కారణంగా మాకు ఎంతో ఉపయోగపడింది అని జస్వీర్ వివరించారు.

ఆరంభంలోనే సీడ్ ఫండింగ్‌..

రెండున్నర లక్షల డాలర్ల సీడ్ ఫండింగ్‌తో సంస్థ ప్రారంభమైంది. ఈ నిధులను టెక్నాలజీ, టీమ్ డెవలప్‌మెంట్ కోసం వెచ్చించారు. సంస్థను ప్రజల్లోకి తీసుకెళ్లెందుకు, బ్రాండ్‌ను పెంచుకునేందుకు ఇప్పుడు టీమ్ ప్రయత్నిస్తున్నది.

60 నగరాల్లో..

గుర్గావ్‌కు చెందిన ఈ స్టార్టప్ ఇప్పుడు 60 నగరాల్లో సేవలందిస్తున్నది. 250 హోటల్స్‌తో ఒప్పందం కుదుర్చుకున్నది. కార్పొరేట్లతో బల్క్ బుకింగ్స్ చేయడంపై ఇప్పుడు సంస్థ దృష్టి పెట్టింది. రెవెన్యూ షేరింగ్ ప్రాతిపదికన ఈ సంస్థ వ్యాపారం చేస్తున్నది. అద్దె రూపంలో వచ్చే ఆదాయంలో ఎక్కువ మొత్తాన్ని హోటల్ ఓనర్‌కు ఇస్తూ మిగిలిన భాగాన్ని కిక్ స్టే తీసుకుంటున్నది. మరికొంత మంది వెంచర్ క్యాపిటలిస్ట్‌లతో సంప్రదింపులు జరుపుతున్న కిక్ స్టే టీమ్, మరిన్ని పెట్టుబడులను ఆశిస్తున్నది. ఆపరేషన్స్, మార్కెటింగ్ కోసం నిధులు సమీకరించాలనుకుంటున్నది.

గట్టిపోటీ..

బడ్జెట్ హోటల్ సెక్టార్ విలువ 25 నుంచి 40 బిలియన్ డాలర్ల వరకు ఉందని అంచనా. దీంతో ఈ రంగాన్ని క్యాష్ చేసుకునేందుకు వివిధ రకాల ప్లాట్‌ఫామ్స్‌తో స్టార్టప్స్ ముందుకొస్తున్నాయి. ఓయో రూమ్స్, వుడ్‌స్టే, స్టేజిల్లా వంటి సంస్థలు ఇప్పటికే ఈ రంగంలో అడుగుపెట్టాయి. మార్కెట్‌లో నాలుగో వంతును సొంతం చేసుకోవాలన్నదే తమ అభిమతమని కిక్ స్టే అంటున్నది. 2017 ఆర్థిక సంవత్సరంలో 180 కోట్ల ఆదాయాన్ని గడించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.

ఓయో రూమ్స్‌తోనే పోటీ..

ఈ రంగంలో ఇప్పటికే ఎన్నో సంస్థలు ఉన్నప్పటికీ, ఓయో రూమ్స్‌తోనే గట్టి పోటీ ఉంటుందని కిక్ స్టే భావిస్తున్నది. ‘‘ఓయో రూమ్స్‌కు గట్టి పోటీ ఇచ్చేందుకు కొత్త కొత్త విధానాలను ఆవిష్కరిస్తున్నాం. బడ్జెట్ హోటల్ మార్కెట్‌లో ఒక రాత్రికి ఒక రూమ్ అద్దె రెండు వేల నుంచి రెండున్నర వేల రూపాయల వరకు ఉంది’’ అని జస్వీర్ వివరించారు. బీ2బీ విధానంలో కస్టమర్లను ఆకర్షించాలని కిక్ స్టే లక్ష్యంగా పెట్టుకున్నది. కార్పొరేట్ సిటీస్‌లో కస్టమర్లను ఆకట్టుకోవాలనుకుంటున్నది. ప్రస్తుతం 50 కార్పొరేట్ కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకున్నామని కిక్ స్టే యాజమాన్యం చెప్తున్నది. ఈ రంగంలో నాణ్యతను మెంటైన్ చేయడం చాలా ముఖ్యమని జస్వీర్ అభిప్రాయపడుతున్నారు. ఇందుకోసం రెగ్యులర్‌గా క్వాలిటీ చెక్స్ చేయిస్తున్నామంటున్నారు.

యువర్‌స్టోరీ టేక్

బిలియన్ డాలర్ బడ్జెట్ హోటల్ ఇండస్ట్రీలో గత ఏడాదిలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఈ రంగంలోకి ఎన్నో కొత్త సంస్థలు అడుగుపెట్టాయి. టైగర్ గ్లోబల్, సాఫ్ట్‌బ్యాంక్ వంటి ఇన్వెస్టర్లు కూడా ఈ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తితో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఓయో రూమ్స్, జెడ్ ఓ రూమ్స్ మధ్య డీల్ కుదిరిందన్న వార్త చాలా ఆసక్తి రేపుతున్నది. ఆలస్యంగా అడుగుపెట్టినా, నిధులను సమీకరించడం, ఓయో నుంచి బిజినెస్‌ను పొందడం వంటి చర్యలు కిక్ స్టేపై ఆసక్తి రేకెత్తిస్తున్నాయి.

గత ఏడాది ఆగస్టులో ఆసమ్ స్టేను వుడ్‌స్టే సొంతం చేసుకుంది. అలాగే గత ఏడాది వేసవిలో ఆస్ట్రేలియాకు చెందిన స్టే వెల్ హాస్పిటాలిటీ కూడా భారత బడ్జెట్ రంగాన్ని సొంతం చేసుకునేందుకు ప్రయత్నించింది. 158 కోట్ల రూపాయలను పెట్టుబడులుగా పెట్టాలనుకుంది. ఆసక్తి కలిగించే అంశమేంటంటే.. ఆలస్యంగా ఈ రంగంలోకి అడుగుపెడుతున్న సంస్థలు.. ఇప్పటికే ఈ రంగంలో ఉన్న సంస్థలు చేస్తున్న తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నాయి. ఇప్పటికీ బడ్జెట్ హోటల్ రంగంలో ఎన్నో సంచలనాలకు అవకాశముంది. చాలా అంతర్జాతీయ సంస్థలు కూడా ఈ రంగంపై దృష్టిసారించాయి.

ఈ స్టోరీ కూడా చదవండి

ఈ స్టోరీ కూడా చదవండి