సేంద్రియ వ్యవసాయం చేయడమే కాదు.. ఆర్గానిక్ పాఠాలు కూడా చెప్తున్నాడీ కుర్రాడు

2

పట్టుమని పదహారేళ్లు ఉండవు. పెద్దగా లోకం గురించి కూడా తెలియని వయసు. అయితేనేం? ఆ కుర్రాడి ఆశయం గొప్పది. అతడి ఆలోచన అంతకన్నా మహత్తరమైనది. చిన్న వయసులోనే సేంద్రియ వ్యవసాయం చేయడమంటే చిన్న విషయం కాదు. ఆ పిల్లాడికి ఉన్న సామాజిక స్పృహకు చేతులెత్తి మొక్కాలనిపిస్తుంది.

ఆర్య పూదోట! ఇంటి పేరును సార్థకం చేసిన బెంగళూరు కుర్రాడు. 16 ఏళ్ల వయసులోనే అతడు చేసిన అద్భుతాలు చూస్తుంటే ముచ్చటేస్తుంది. నలుగురితో నారాయణ అన్నట్టు కాకుండా దేశానికి ఏదైనా మేలు చేయాలన్నది ఆర్య ఆలోచన. అందుకే రసాయనిక ఎరువులతో కాకుండా సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇంటి ఆవరణలోనే తల్లి కూరగాయలు పెంచిన తీరు అతడికి బాగా నచ్చింది. అలా ఆర్గానిక్ ఫామింగ్ పై ఆసక్తి ఏర్పడింది. నెమ్మదిగా సేంద్రియ వ్యవసాయంలో మెళకువలు, పద్ధతులు, అందులో ఉన్న లాభాల గురించి అవగాహన పెంచుకున్నాడు. సేంద్రియ వ్యవసాయం అనగానే ముందుగా అందరూ వెన్నుతట్టారు. తీరా టైంకి ఎవ్వరూ సాయం చేయలేదు. ఇది వర్కవుట్ అవుతుందా? ఆర్యలో ఒక అంతర్మథనం. పట్టుదల ఉంటే ఎందుకు కాదు? ఎవరేమన్నా సేంద్రియ వ్యవసాయం చేసి తీరాలని డిసైడయ్యాడు. 2014లో ఒంటరిగానే మై ఆర్గానిక్ ఫాం పేరుతో వ్యవసాయం మొదలు పెట్టాడు.

ఇంట్లోనే చిన్న చిన్న కుండీల్లో, ఇంటి పెరట్లో సేంద్రియ పద్ధతిలో మొక్కలు పెంచుతున్నాడు. కుండీలో ఈ చిట్టి మొక్కకు కాసిన క్యాప్సికమ్స్ భలే ఉన్నాయి కదా. ఇదొక్కటే కాదు. టామాటా, క్యారెట్, దుంపలు, ఆకుకూరలు, బీరకాయలు, కాకర, బెండ, మిర్చీ లాంటి పంటలన్నీ సేంద్రియ పద్ధతిలోనే సాగు చేస్తున్నాడు. కుండీల్లో సేంద్రియ పద్ధతిలో మొక్కలు ఎలా పెంచుతున్నాడో ఒకసారి చూద్దాం. ముందుగా ఒక కుండీలో చిన్న చిన్న కంకర రాళ్లు వేయాలి. దాని మీద కాసింత ఇసుక పోయాలి. తర్వాత కోకోపీట్, వర్మీ కంపోస్ట్ రెంటినీ ఒక మిశ్రమంలా తయారు చేయాలి. ఆ మిశ్రమాన్ని కుండీలో పోయాలి. మధ్యలో విత్తనాలు నాటి పైన కాసిన్ని నీళ్లు పోయాలి. క్యాప్సికమ్ మొక్క అయితే నాలుగు నెలల్లో కాపుకొస్తుంది.

ప్రస్తుతమున్న సంప్రదాయ వ్యవసాయ పద్ధతుల్లో చాలా లోపాలున్నాయంటాడు ఆర్య. నిజమే. హానికరమైన ఎరువులు, రసాయనాల వాడకం వల్ల భూమి సహజత్వాన్ని కోల్పోతోంది. క్రమంగా నిస్సారమవుతుంది. పెస్టిసైడ్స్ ఉపయోగించి పండించిన కూరగాయలు, పండ్లు ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్నాయి. కేన్సర్ వంటి ప్రమాదకరమైన రోగాలకు కారణమవుతన్నాయి. ఈ పరిస్థితిపై ప్రజల్లో అవగాహన కల్పించి, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడమే మై ఆర్గానిక్ ఫాం ఉద్దేశమంటాడు ఆర్య. సేంద్రియ సేద్యానికి సంబంధించిన అనేక విషయాలు, పద్ధతులను మై ఆర్గానిక్ ఫాం యూ ట్యూబ్ చానల్ ద్వారా ప్రచారం చేస్తున్నాడు. అంతేకాదు, సేంద్రియ సేద్యం చేయాలని ఆసక్తి ఉన్నా.. అందుకు అవసరమైన ముడి సరుకు దొరకని వారి కోసం ది గ్రో బేసిక్ కిట్ ను అందిస్తున్నాడు. గ్రో బ్యాగ్, కొన్ని కూరగాయలు, పండ్ల విత్తనాలు, సేంద్రీయ ఎరువు ఈ కిట్లో ఉంటాయి. ఆర్గానిక్ ఫామింగ్ కు అవసరమైన అన్ని వనరులు ఒకే చోట దొరకడంతో జనం కూడా ఆసక్తి చూపిస్తున్నారు. కిట్ ధర 149 రూపాయలు.

మై ఆర్గానిక్ ఫాం ద్వారా పర్యావరణ పరిరక్షణకూ ఆర్యా పూదోట నడుం బిగించాడు. వేలాదిగా మొక్కలు పంపిణీ చేయడం, గ్రీనరీని పెంచడం, సేంద్రియ సేద్యంపై అవగాహన కల్పించడం.. ఇవీ అతడి లక్ష్యాలు. ఒక్క కర్ణాటకలోనే కాదు.. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారంలోనూ ఆర్య భాగస్వామి అయ్యాడు. 2016లో హైదరాబాద్ కేబీఆర్ పార్కులో వందలాది మొక్కలు పంపిణీ చేశాడు. తెలంగాణ, కర్ణాటక అటవీ శాఖలు ఆర్య ఆశయానికి అండగా నిలబడ్డాయి. కొంతమంది పర్యావరణ ప్రేమికులు కూడా అతడికి చేయూత అందిస్తున్నారు. మొక్కలు పంపిణీ చేయడం, నాటడమే కాకుండా వర్మీ కంపోస్ట్ పై కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నాడు. ఈ బుల్లి పర్యావరణ ప్రేమికుడిని ఇప్పటికే ఎన్నో అవార్డులు వరించాయి. ఆర్య కృషికి యునైటెడ్ నేషన్ ఎన్విరాన్ మెంట్ శాల్యూట్ చేసింది. 2015లో యునైటెడ్ స్టేట్స్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ పురస్కారంతో సత్కరించింది.

మై ఆర్గానిక్ ఫాంను భవిష్యత్ లో మరింత మందికి చేరువ చేయాలన్నదే ఆర్య ముందున్న లక్ష్యం. ఇప్పటికే చాలా మంది యువత అతడిని ఆదర్శంగా తీసుకుంటున్నారు. సీనియర్ సిటిజన్స్ కూడా అతడి బాటలోనే నడవడానికి సిద్ధమవుతున్నారు. చిన్న వయసులోనే పది మందికీ ఆదర్శంగా నిలుస్తున్న ఆర్యాకి హ్యాట్సాఫ్! 

Related Stories

Stories by team ys telugu