వినూత్న ఆవిష్కరణలకు వేదిక కాబోతున్న "సృజనాంకుర‌ -2017"

గుంటూరు విజ్ఞాన్ వర్సిటీలో అంతర్జాతీయస్థాయి ఈవెంట్

వినూత్న ఆవిష్కరణలకు వేదిక కాబోతున్న "సృజనాంకుర‌ -2017"

Thursday January 12, 2017,

2 min Read

మారుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలంటే చదువులు సాదాసీదాగా ఉంటే సరిపోవు. బుక్ నాలెడ్జ్ తో పాటు.. చేసే పరిశోధనలు కూడా అంతర్జాతీయ స్థాయిలో ఉండాలి. ఆలోచనలకు రెక్కలు తొడిగి ఆవిష్కరణలను ఆకాశం నిండా ఎగరేయాలి. అలాగని ఇంటర్నెట్, రోబోటిక్స్ అంశాలపై మాత్రమే పరిమితం అవుతామంటే కుదరదు. కూసింత పర్యావరణం మీద అవగాహన ఉండాలి. సామాజిక అంశాలనూ స్పృశించ‌గ‌ల‌గాలి. అప్పుడే మేథస్పు పరిపూర్ణమవుతుంది. విశ్వయవనిక మీద మన విజయపతాకం రెపరెపలాడుతుంది.

విద్యార్ధులను ఆ దృక్కోణంలో తయారు చేయాలనే సంకల్పంతో ..గుంటూరు విజ్ఞాన్ వర్సిటీ వేదికగా అంతర్జాతీయ స్థాయిలో జరగబోతోంది సృజనాంకుర‌ -2017 అనే అతిపెద్ద ఈవెంట్. నూతన ఆవిష్కరణలకు, అద్భుతమైన ఆలోచనలకు అది ఒక ప్లాట్ ఫాంగా నిలవబోతోంది. ఈ నెల 26 నుంచి 28వరకు 3 రోజుల పాటు జరగబోయే ఈవెంట్ కోసం దేశవిదేశాల నుంచి దాదాపు 10వేల మంది వస్తారని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. స్కిల్, డిజిటల్ ఇండియా, మేకిన్ ఇండియాలో భాగంగా జరిగే కార్యక్రమాల్లో 50కి పైగా అంశాల్లో పోటీలు ఉంటాయి. అంతేకాదు కాంపిటిషన్ లో నెగ్గిన వారికి రూ. 25 లక్షల నగదు బహుమతి కూడా అందజేస్తారు.

image


ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, రోబోటిక్స్, ఎంబెడెడ్ ఎలక్ట్రానిక్స్ వంటి సాంకేతిక అంశాలతో పాటు సామాజిక కోణంలో పర్యావరణం, జీవశాస్త్రం, ఆంట్రప్రెన్యూర్ యాంగిల్లో స్టార్టప్, బిజినెస్ ఐడియాలకు ఊతమిచ్చేలా పలు అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. అనేక అంశాల మీద వర్క్ షాప్ప్, గెస్ట్ లెక్చర్స్ ఉంటాయి.

ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో సాంకేతిక సమరానికి తెరతీశామని వర్సిటీ వైస్ ఛాన్స్ లర్ డా. తంగరాజ్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ప్రొఫెసర్లు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారని వర్సిటీ రిజిస్ట్రార్ ఎంఎస్ రంగనాథన్ అన్నారు.

ఇంకో విశేషం ఏంటంటే ఈ కార్యక్రమాన్ని ఆద్యంతం విద్యార్ధులే కో ఆర్డినేట్ చేసుకుని, వాళ్లే నిర్వహించబోతున్నారు. టెక్నికల్ సపోర్ట్ కూడా స్టూడెంట్సే చూసుకుంటున్నారు. దేవేంద్రరెడ్డి, లావణ్య గుంటూరు, రవిచంద్ర, జగదీశ్, గోల్డెన్ బాబు ఓవరాల్ కో-ఆర్డినేటర్స్ గా వ్యవహరిస్తారు. సాయి వినోద్, అఖిల్, రాఘవ, భాను టెక్నికల్ విషయాలు చూసుకుంటారు. ఈ కార్యక్రమంలో ఆటవిడుపుగా వినోద కార్యక్రమాలూ ఉంటాయి. పాల్గొనాలనుకునేవారు ఆన్ లైన్ ద్వారా పేరు రిజిస్టర్ చేసుకోవచ్చు.

వెబ్ సైట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.