ఎనిమిదేళ్లకే స్టార్టప్ ఐడియా.. పదమూడేళ్లకే సీఈవో

ఎనిమిదేళ్లకే స్టార్టప్ ఐడియా.. పదమూడేళ్లకే సీఈవో

Wednesday March 15, 2017,

3 min Read

పదమూడేళ్లంటే ఇంకా లోకం పోకడ తెలియని వయసు. చదువు, మార్కులు, ఆటలు, ఇల్లు తప్ప పెద్దగా బాహ్యప్రపంచం తెలియని కుర్రతనం. అలాంటి వయసులోనే ఆంట్రప్రెన్యూరియల్ జర్నీ మొదలుపెట్టాడు ఢిల్లీకి చెందిన అయాన్ చావ్లా. ఇంకా సూటిగా చెప్పాలంటే పదమూడేళ్లకే కంపెనీకి సీఈవో అయ్యాడు. ప్రస్తుతం ఇండియాలోనే యంగెస్ట్ సీఈవో అతను.

బేసిగ్గా స్టార్టప్ ఐడియాలు, వ్యాపారం చేయాలన్న ఆలోచలన్నీ క్యాంపస్ కెఫెటేరియాల్లోనో, నలుగురు స్నేహితులు కలిసిన సరదాగా మాట్లాడుకుంటున్న సమయంలోనో యువకుల మనసులో మెరుస్తాయి. ఎందుకంటే ఆ పీరియడ్ లోనే ఉద్యోగమా.. లేక వ్యాపారమా అన్న దిశగా మనసు ఆలోచిస్తుంది. కానీ విచిత్రంగా అయాన్ 9వ క్లాసులో ఉండగానే వ్యాపార సూత్రాలను ఒంటపట్టించుకున్నాడు. అది కూడా టెక్నాలజీ రిలేటెడ్ బిజినెస్. అమ్మానాన్నలు కంప్యూటర్ కొనిస్తే దాంతో వీడియో గేములు ఆడుకోవాల్సి వయసులోనే ఆంట్రప్రెన్యూర్ షిప్ గురించి ఆలోచించాడంటే అతని చిట్టి బుర్రలో ఎన్ని అద్భత ఐడియాలున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

image


అయాన్ ఎనిమిదేళ్ల వయసులో వాళ్ల ఫాదర్ ఒక కంప్యూటర్ కొనిచ్చాడు. వీడియో గేమ్స్ గట్రా ఆడుకోమని తెచ్చాడు. కానీ పిల్లోడు ఏం చేశాడో తెలుసా? గేమ్స్ ఆడే బదులు వాటిని ఎలా ఎడిట్ చేయాలా అని ఆలోచించాడు. అడోబ్ సాఫ్ట్ వేర్ సాయంతో మూవీస్ కూడా ఎడిట్ చేసేవాడు. అలా చేస్తేన్న టైంలోనే మెరుపులాంటి ఆలోచన వచ్చింది. వెబ్ సైట్లు, యాప్స్ ఎందుకు క్రియేట్ చేయకూడదు అని అనుకున్నాడు. ఒకపక్క చదువుతూనే మరోపక్క టెక్నాలజీ అంతు చూశాడు. పదమూడేళ్లు వచ్చేసరికి ఐడియా ఆంట్రప్రెన్యూరియల్ జర్నీకి ఊతమిచ్చింది.

ఏడాది పాటు దానిపైనే మనసు లగ్నం చేశాడు. ఎవరి సాయమూ తీసుకోలేదు. టెక్నాలజీ రిలేటెడ్ బుక్స్ అన్నీ తిరగేశాడు. మరింత సమచారం కోసం ఇంటర్నెట్లోనే వెతికాడు. తన గదిలో కూర్చుని ఒక్కడే టెక్నాలజీని డెవలప్ చేశాడు. అలా 2011లో లాంఛ్ అయింది ఏషియన్ ఫాక్స్ డెవలప్ మెంట్. సంస్థకు సంబంధించి ఫైనాన్స్ మేటర్, లీగల్ విషయాలన్నీ అయాన్ వాళ్ల అమ్మ చూసుకుంది. అయాన్ చేసే పనుల్లో ఏనాడూ ఆమె జోక్యం చేసుకోలేదు. కొడుకు గురించి పర్సనల్ కేర్ తీసుకుంది తప్ప, అతనికి ఎలాంటి సూచనలూ సలహాలు చేయలేదు. ఆమెకు ఈ టెక్నాలజీ గురించి బొత్తిగా తెలియదు కాబట్టి.

ఐటీ, వెబ్, మార్కెటింగ్ ప్రాడక్ట్స్, సర్వీసెస్ చూస్తుంది ఏషియన్ ఫాక్స్ డెవలప్మెంట్స్. దాంతో పాటు మరో మూడు సంస్థలు కూడా స్థాపించాడు. గ్లోబల్ వెబ్ మౌంట్, మైండ్ ఇన్ అడ్వర్టయిజింగ్ కంపెనీలను తర్వాతి రెండేళ్లలో ఏర్పాటు చేశాడు. వాటికోసం ఏనాడూ ఎవరినీ ఇన్వెస్ట్ చేయమని అడగలేదు. ఇంకో విచిత్రం ఏంటంటే అయాన్ ఖర్చుపెట్టింది కేవలం పదివేలు మాత్రమే.

మొదట్లో క్లయింట్స్ అయాన్ ని సంప్రదించేవారు కాదు. సంస్థ ఏజెంట్లతో మాట్లాడేవారు. ఎందుకంటే కుర్రాడికేం తెలుసు అనుకునేవారట. ఆ తర్వాత తెలిసింది వాళ్లకు తన కేపబిలిటీస్ ఏంటో. వీలు దొరికినప్పుడల్లా ఐటీ, మార్కెటింగ్ కి సంబంధించి ఇంటర్నట్లో సమచారం వెతుకుతాడు.

అతి చిన్న వయసులోనే మూడు కంపెనీలకు సీఈవో అయిన అయాన్ చావ్లాను ప్రపంచ వ్యాప్తంగా పేరు మోసిన కంపెనీలన్నీ కాన్ఫరెన్సులకీ, సెమినార్లకూ, వెబినార్లకు ఆహ్వానిస్తుంటాయి. యూనివర్శిటీలు కూడా రమ్మని పిలుస్తుంటాయి. ఆ మధ్య ద్రోణాచార్య ఇంజినీరింగ్ కాలేజీలో స్పీచ్ ఇచ్చే అవకాశం వచ్చింది. కెరీర్ ఫెస్ట్ ఈవెంట్ లో ఎందరో ప్రముఖ వ్యాపారేవేత్తలతో వేదిక పంచుకున్నాడు. ఫ్లోరిడాలో జరిగిన ఎంటర్ ప్రైజ్ కనెక్ట్ 2014-2015 అనే మెగా ఈవెంట్ లో మాట్లాడే అవకాశం వచ్చింది. రెండుసార్లు యంగ్ ఆంట్రప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్ అవార్డు గెలుచుకున్నాడు. ప్రధాని కార్యాలయం నుంచి అభినందనలు కూడా వచ్చాయి.

ఇక్రం అక్తర్ దర్శకత్వంలో, రాజేశ్ త్రిపాఠి నిర్మాతగా తెరకెక్కుతున్న ఇండియా మే లాహోర్ అనే సినిమాకు ఐటీ, ఆన్ లైన్ పార్ట్ నర్ గా ఏషియన్ ఫాక్స్ డెవలప్మెంట్స్ ఒప్పందం కుదుర్చుకుంది.

ప్రపంచ వ్యాప్తంగా లక్ష కస్టమర్లను రీచ్ అయ్యేనాటికి అయాన్ వయసు కేవలం 18 మాత్రమే. అమెరికా, యూకే, హాంగ్ కాంగ్, టర్కీలో బ్రాంచీలున్నాయి.

పార్టీలు, పబ్బులు చాలా తక్కువ అంటాడు అయాన్. తరచుగా గవర్నమెంట్ స్కూళ్లను సందర్శిస్తుంటాడు. అక్కడి వారితో తన అభిప్రాయాలను షేర్ చేసుకుంటాడు. భవిష్యత్ లో టెక్నాలజీ అవసరాలను పిల్లలకు చెప్పి ఎంకరేజ్ చేస్తుంటాడు.

నిజంగా అయాన్ లాంటి పిల్లలు లక్షల్లో ఒకరుంటారు. అంత చిన్న వయసులోనే టెక్నాలజీ లోతుల్ని అధ్యయనం చేసే కుర్రాళ్లు చాలా అరుదు. కాంపిటీటివ్ ప్రపంచంలోని నేటి తరం కుర్రాళ్లకు, యువ వ్యాపారవేత్తలకు అయాన్ ఒక రోల్ మోడల్. 

మా రోజువారీ వార్తాలేఖ కోసం సైన్ అప్ చేయండి