మీ పాత గ్యాడ్జెట్స్‌ను మంచి ధరకు అమ్మిపెట్టే Budli.in

0

మీ స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ అమ్మాలనుకుంటున్నారా ? ఎక్కడ అమ్మాలో... అమ్మితే ఎంతొస్తుందో తెలియట్లేదా..? అసలు ఇప్పుడు మీ వస్తువు ధర ఎంత పలుకుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇలాంటి ప్రశ్నలన్నింటికీ సమాధానం చెప్పే వెబ్ సైట్ ఒకటుంది. మీ పాత గ్యాడ్జెట్స్‌కి ఎంత ధర వస్తుందో పక్కాగా లెక్కేసి మరీ చెప్పే రీ-కామర్స్ ప్లాట్‌ఫామ్ ఈ Budli.in

మీ నుంచి వేరొకరికి బదిలీ

Budli-హిందీలో బదిలీ అంటే మార్చు అని అర్థం. అంటే మీ దగ్గరున్న వస్తువుల్ని వేరొకరికి బదిలీ చేసి మీకు డబ్బులిచ్చే బాధ్యత Budli.in చూసుకుంటుంది. సాధారణంగా గ్యాడ్జెట్స్‌ని అమ్మేందుకు చాలా మంది quikr, olx లాంటి వెబ్ సైట్లను ఆశ్రయిస్తుంటారు. అక్కడ యాడ్ పోస్ట్ చేసి, అవి కావాలనుకునే వారికి అమ్ముతుంటారు. కానీ యాడ్ పోస్ట్ చేసే దగ్గర్నుంచి వస్తువు తిరిగి అమ్మే వరకు జరిగే తతంగమంతా కాస్త విసుగు తెప్పిస్తుంది. ఇలాంటి విసుగులు, చికాకులు లేకుండా గ్యాడ్జెట్స్‌ని అమ్మేందుకు ఓ పరిష్కారం కనుగొన్నారు రోహిత్ బగేరియా. Budli.in పేరుతో జూన్ 2013లో కోల్ కతాలో కొత్త వెంచర్ ప్రారంభించారు.

"నా ఫోన్ అమ్మితే ఎంత ధరొస్తుందో ?" ఈ ప్రశ్న ఇప్పటికే మీరు చాలాసార్లు వేసుకొని ఉంటారు. కానీ షాపుకెళ్లి ధర గురించి ఆరా తీసిన సందర్భాలు తక్కువ. ఒకవేళ షాపువరకు వెళ్లినా అక్కడ చెప్పే ధర విని ఖంగుతిని వెనుతిరిగి వచ్చిన సందర్భాలుంటాయి. ఇలాంటి ప్రయాసలేమీ లేకుండా మీ ఫోన్ అమ్మితే ఎంత ధర వస్తుందో ఆన్ లైన్లో చిటికెలో తెలుసుకోవచ్చు. ధర నచ్చితే అమ్మేయ్యొచ్చు. ఇది క్లాసిఫైడ్ వెబ్ సైట్లలా కాదు. కస్టమర్లు యాడ్ పోస్ట్ చెయ్యడం, ఆ డివైజ్ కొనాలనుకునే మరో కస్టమర్ కాల్ కోసం ఎదురుచూడడం లాంటివి అస్సలుండవు.

క్లిక్ చెయ్యండి... అమ్మేయ్యండి !

విస్తారమైన ఈ మార్కెట్లో యూజర్స్‌కి విశ్వసనీయమైన, అనుకూలమైన పరిష్కారం కావాలి. ధర తెలుసుకున్న తర్వాత ఆ డివైస్ అమ్మాలా వద్దా అన్నది కస్టమర్ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. ఇందులో ఎవరి ఒత్తిళ్లూ ఉండవు. మిగతా వెబ్ సైట్లల్లో కస్టమర్లు పొందిన అసౌకర్యాన్ని గుర్తించిన రోహిత్... అలాంటి చికాకులేవీ లేని Budli.in ను అలాంటి వెబ్ సైట్లకు ప్రత్యామ్నాయంగా కస్టమర్లకు పరిచయం చేశాడు. 

యూసీ బర్కిలీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాత... యూఎస్, ఇండియాల్లో సాఫ్ట్ వేర్, ఈ-కామర్స్, తయారీ సంస్థల్లో పనిచేశాడు రోహిత్. ఆ తర్వాత Budli.in ప్రారంభించాడు. ఈ వెబ్ సైట్ లో కేవలం కొన్ని క్లిక్స్ తోనే Budli.in లో గ్యాడ్జెట్స్ అమ్మడం చాలా సులువంటాడు రోహిత్. వెబ్ సైట్ ఓపెన్ చేయడం, మీ దగ్గరున్న ప్రొడక్ట్ ఏదో సెలెక్ట్ చేసుకోవడం, మిగతా వివరాలను టైప్ చేసి సబ్ మిట్ చేస్తే చాలు. మీ గ్యాడ్జెట్‌కి ఎంత ధరొస్తుందో వెంటనే తెలుసుకోవచ్చు. ఆ తర్వాత ఆ ధర నచ్చితే అప్పటికప్పుడే అమ్మొచ్చు కూడా. ఆ తర్వాత Budli.in బృందం మీ ఇంటి వాకిట్లోకి వచ్చి ప్రొడక్ట్‌ని తీసుకెళ్తారు. తనిఖీ కోసం పంపిస్తారు. ఇదంతా ఉచితంగా చెయ్యడం వీరి స్పెషాలిటీ. దేశంలోని అన్ని ప్రాంతాల్లో కొరియర్ సర్వీస్ ప్రొవైడర్లతో Budli.in ఒప్పందం చేసుకుంది. మీరు వాడిన గ్యాడ్జెట్ కండీషన్, మార్కెట్లో కొత్త మోడల్ ధర... ఈ రెండు ప్రధానమైన అంశాలు మీ ప్రొడక్ట్ ధరను నిర్ణయిస్తాయి. ఇక డబ్బులు ఆన్ లైన్ లో కానీ లేదా చెక్ రూపంలో కానీ వస్తాయి. సేకరించిన గ్యాడ్జెట్స్‌ని తిరిగి అమ్మేందుకు పలు మార్గాలను అనుసరిస్తోంది కంపెనీ.

రివర్స్ కామర్సే రీ-కామర్స్

ఈ ప్రక్రియనంతా రీ-కామర్స్ అని పిలుస్తున్నారు. అంటే రివర్స్ కామర్స్ అని అర్థం. ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్‌ని రికవర్ చేసే మాధ్యమంగా రీ-కామర్స్‌కు అర్థం చెబ్తోంది వికీపీడియా.

ఏ కంపెనీ నుంచైతే వస్తువును కొన్నారో తిరిగి అదే కంపెనీకి అమ్మే అవకాశం కల్పిస్తోంది రీ-కామర్స్. అందుకే ఈ మోడల్ ని C2B (కస్టమర్ టు బిజినెస్) మోడల్ అంటున్నారు. ఇండియాలో రీ-కామర్స్ ప్లాట్ ఫామ్ తొలినాళ్లలో వచ్చిన స్టార్టప్ Budli.in. తమ దగ్గరున్న స్మార్ట్ ఫోన్, ట్యాబ్, ల్యాప్ టాప్ లాంటి గ్యాడ్జెట్స్ కి ఎంత ధర వస్తుందో తెలుసుకోవడానికి ఈ వెబ్ సైట్ బాగా ఉపయోగపడుతుంది. తమ గ్యాడ్జెట్స్‌ని అమ్మడానికి quikr, olx లాంటి వెబ్ సైట్లను ఆశ్రయిస్తున్న వారంతా ఇప్పుడు Budli.in వైపు చూస్తున్నారు. quikr, olx లాంటివి ఆన్ లైన్ క్లాసిఫైడ్స్ . ఇక్కడ కస్టమర్లు పోస్ట్ చేసి, వారి పాతవస్తువులను అమ్ముతుంటారు. కంపెనీలతో సంబంధం ఉండవు. కానీ Budli.in లో కంపెనీలే నేరుగా కొంటాయి.

ఇ-కామర్స్ టు రీ-కామర్స్

"రీ-కామర్స్ కంపెనీలకు దారి చూపించిన ఘనత ఇ-కామర్స్ దే అని చెప్పుకోవాలి. ఎందుకంటే భారత దేశంలో ఏటా సుమారు పది కోట్ల కొత్త గ్యాడ్జెట్స్ అమ్ముడుపోతున్నాయి.కానీ వాడిన గ్యాడ్జెట్స్‌ని డిస్పోజ్ చేయడానికి ఉన్న మార్గాలు చాలా తక్కువ. భారతదేశంలో సెకండ్ హ్యాండ్ వస్తువులను చిన్న రీటైల్ షాపులు, రిపేర్ షాపుల్లో అమ్ముతుంటారు. ఇప్పుడు అలాంటి వాటినీ ఆన్ లైన్‌లో అమ్మడానికి అవకాశాలు కల్పిస్తున్నాం" అంటాడు రోహిత్.

ఇలాంటి రీ-కామర్స్ స్టార్టప్స్ మార్కెట్లో ఇన్నాళ్లూ లేవు. ఈ మధ్య కాలంలోనే మొదలవుతున్నాయి. రీ-కామర్స్ స్టార్టప్స్ ఇప్పుడిప్పుడే మొదలవుతున్నా ... అప్పుడే వీటికి మంచి స్పందన లభిస్తోంది. ముఖ్యంగా మెట్రోలు కాని నగరాలకు రీ-కామర్స్ విస్తరిస్తోంది.ప్రస్తుతం Budli.in స్టార్టప్ కు reglobe.in, YNew లాంటి మరి కొన్ని కంపెనీల నుంచి కాంపిటీషన్ ఉంది. ఇలాంటి కంపెనీలన్నీ భారతదేశంతో పాటు ఫ్రాన్స్, యూఎస్, జెర్మనీలో పనిచేస్తున్నాయి.

జీవనశైలిలో మార్పులు వస్తున్న కొద్దీ... భారతదేశంలో ఎలక్ట్రానిక్ వస్తువులను తరచూ మార్చేస్తున్నారు. కొత్తవి కొంటున్నారు. సగటున ప్రతీ ఒక్కరూ 13 నుంచి 18 నెలలకోసారి స్మార్ట్ ఫోన్ ను మారుస్తున్నారు. ఈ మార్పే రీ-కామర్స్ కంపెనీలకు మంచి అవకాశాలను కల్పిస్తోంది.