వరుస పెట్టుబడులతో దూసుకుపోతున్న లక్కీ లేడీస్

- వివిధ రంగాల్లో రాణిస్తున్న సీరియల్ మహిళా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు - అంతర్జాతీయంగానూ అఖండ ఖ్యాతి- ఫార్చ్యూన్ జాబితాల్లో ఘనమైన స్థానం

వరుస పెట్టుబడులతో దూసుకుపోతున్న లక్కీ లేడీస్

Saturday April 18, 2015,

4 min Read

మన చుట్టూ జరుగుతున్న చాలా విషయాల్ని మనం అంతగా పట్టించుకోం. మహిళల విషయమైతే చెప్పనే అక్కర్లేదు. వాళ్ళ విజయాలను కూడా ఉదాసీనంగా తీసుకునే తత్వం మనలో చాలామందికి ఉంటుంది. కానీ మన ఆలోచనల్ని మార్చే వాస్తవాలు చాలానే ఉన్నాయి. ప్రపంచంలోనే ఇతర ప్రాంతాల్లోని మహిళలందరికన్నా కూడా భారతీయ మహిళలే సాంకేతిక పురోగతి గురించి ఆసక్తి ఎక్కువగా చూపుతారని మీకు తెలుసా? పట్టణ మహిళా ఇంటర్నెట్ వినియోగదారుల్లో 30 శాతం పెరుగుదల ఉన్నట్టు ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఐఎఎంఎఐ) నివేదికలు వెల్లడిస్తున్నాయి. సరే, ఈ లెక్కలు ఘనంగానే ఉన్నాయి, కానీ ఇవి మనకి ఇంటర్నెట్ ఉపయోగించే మహిళల శాతాన్ని మాత్రమే చెబుతున్నాయి. వీరందరూ పరిశోధకులూ, వినియోగదారులూ, నిపుణులూ. అయితే, మహిళా పారిశ్రామికవేత్తల మాటేమిటి? ఈ అంశంలో మాత్రం పరిస్థితి నిరాశాజనకంగానే కనబడుతోంది. మహిళల్లో ఉద్యోగుల సంఖ్య క్రమేపీ పెరుగుతున్నప్పటికీ, దేశంలో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తల శాతాన్ని పరిశీలిస్తే తీసికట్టుగానే ఉంది పరిస్థితి. ఓ అంచనా ప్రకారం భారతదేశంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సంఖ్య 10 శాతమే.

image


ఏదిఏమైనా, ఈ చిన్న శాతాన్నే ఓ శక్తిగా మనం పరిగణనలోకి తీసుకోకతప్పదు. వివిధ రంగాల్లో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలతో మేం మాట్లాడాలనుకున్నప్పుడు, చాలా పేర్లు మా మనసులో మెదిలాయి. కేవలం ఒక్క కంపెనీలోనే కాకుండా అనేక కంపెనీల స్థాపనతో తమ సామర్థ్యం ప్రదర్శించిన ఔత్సాహిక పారిశ్రామికవేత్తల వివరాలు ఇక్కడ ఉన్నాయి. ఈ జాబితాలో ఉన్నదెవరంటే:

మీనా గణేశ్

కోల్‌కతా ఐఐఎంలో ఎంబిఎ పట్టా పుట్టుకున్న మీనా NIIFTలో చేరారు. ఆ తరువాత PWC, మైక్రోసాఫ్ట్ సంస్థల్తో పనిచేశారు. కస్టమర్ అసెట్ అనే బిపిఓ కంపెనీకి ఆమె సహవ్యవస్థాపకురాలు. ఆ సంస్థకు సాఫ్ట్ బ్యాంక్ క్యాపిటల్, న్యూస్ కార్ప్‌ల నుంచి నిధులు సమకూరాయి. ఈ కంపెనీని 2002లో ఐసిఐసిఐ బ్యాంక్ కొనుగోలు చేసింది. ఫస్ట్ సోర్స్ అనే బ్రాండ్‌గా అవతరించింది.

టెస్కోలో కూడా ఇదే క్రమాన్ని అనుసరించిన మీనా ఆ తర్వాత ట్యూటర్ విస్టాలో చేరారు. అది ఆమె భర్త స్థాపించిన కంపెనీ. అనంతరం మీనా, కృష్ణన్ గణేశ్ కలిసి న్యూఢిల్లీకి చెందిన పోర్టీ మెడికల్ అనే హెల్త్ కేర్ సంస్థను 2013 జూన్‌లో కొనుగోలు చేశారు. దీనికి మీనా సిఇఓ అయ్యారు.

వాలెరీ వేగనర్

ఈ మధ్య వార్తల్లో జిప్ డయల్ గురించి చదివే ఉంటారు. ట్విట్టర్ కొనుగోలు చేసిన మొట్టమొదటి భారతీయ కంపెనీ ఇది. మిస్ట్ కాల్స్ ఓ మొబైల్ మార్కెటింగ్, విశ్లేషణాత్మక ఉత్పత్తిగా మార్పుచెందే ఓ సృజనాత్మకమైన వేదికను జిప్ డయల్ అభివృద్ధి చేసింది. ఈ సంస్థకు పాలెరీ వేగనర్ సహవ్యవస్థాపకురాలు, సిఇఓ. స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయంలో డిగ్రీ అందుకున్న ఆమె తన వృత్తి జీవితపు తొలినాళ్ళలో ఈ-బే సంస్థలోనూ, సిలికాన్ వ్యాలీలో మరో రెండు కొత్త సంస్థల్లోనూ పనిచేశారు.

కవితా అయ్యర్

కవితా అయ్యర్ గురించి చెప్పాల్సిన విశేషాలు చాలానే ఉన్నాయి. సీరియల్ (వరుసగా పరిశ్రమలు ఏర్పాటు చేసిన) పారిశ్రామికవేత్త అయిన ఆమె రెండు బయోటెక్ కంపెనీలకు సహవ్యవస్థాపకురాలు. అయితే ఆమెకు ఘనత సాధించిపెట్టింది అది మాత్రమే కాదు. నలభయ్యేళ్ళ లోపు వారితో ఫార్ట్యూన్ ఇండియా 2014లో ప్రకటించిన నలభైమంది జాబితాలో చోటుచేసుకున్న ఏడుగురు మహిళల్లో ఆమె ఒకరు. ఏకైక సీరియల్ (వరుస పెట్టుబడుల) పారిశ్రామికవేత్త కూడా.

ఔత్సాహిక పారిశ్రామికవేత్తగా ఆమె ప్రయాణం ఇన్ బయోప్రోతో మొదలైంది. 2007లో ఆరంభమైన ఈ బయోటెక్ సంస్థ బయో-సదృశ అభివృద్ధి, ప్రాసెస్ డెవలప్‌మెంట్ సేవల మీద దృష్టి కేంద్రీకరించింది. అదృష్టవశాత్తూ దీనికి ఎక్సెల్ పార్టనర్స్ నుంచి 1.5 మిలియన్ డాలర్ల (రూ. 6.5 కోట్ల) పెట్టుబడి లభించింది. దీనితో సొంత ల్యాబరేటరీ ఏర్పాటుకూ, కీలకమైన ఉద్యోగ నియామకాలకూ, పరిశోధన, అభివృద్ధి విభాగంలో పెట్టుబడులకూ మార్గం సుగమమయింది. నాలుగేళ్ళ పాటు సాధించిన వృద్ధి లుపిన్, పనాసియా బయెటెక్ లాంటి భారీ ఫార్మా కంపెనీలతో అనేక విజయవంతమైన భాగస్వామ్యాలు ఏర్పరచుకోడానికి దారి తీసింది. 2011లో ఫార్మా రంగ దిగ్గజం స్ట్రైడ్స్ ఆక్రోల్యాబ్స్ కు 70 శాతం వాటాల్ని వారు విక్రయించారు. దీనితో మూడేళ్ళ కాలవ్యవధిలో రూ. 65 కోట్ల పెట్టుబడులు అందివచ్చాయి.

2013లో థెరామైట్ నోవోబయోలాజిక్స్ కంపెనీ ఆరంభమయింది. దీనికి కవిత సహవ్యవస్థాపకురాలు. ఆరిన్ క్యాపిటల్, ఎక్సెల్ పార్టనర్స్, ఐడిజి వెంచర్స్, కర్నాటక రాష్ట్ర ప్రభుత్వ మద్దతున్న కిట్ వెన్ సంస్థల నుంచి రూ. 27.5 కోట్ల నిధుల్ని ఈ సంస్థ గత అక్టోబర్ లో సేకరించింది. 2014 జనవరిలో తమ కొత్త ల్యాబరేటరీని ఆరంభించింది.

కవిత కేవలం పారిశ్రామికవేత్త మాత్రమే కాదు, బహుముఖ ప్రజ్ఞాశాలి కూడా. అమె మారథాన్ రన్నర్, ఔత్సాహిక చిత్రకారిణి, ఔత్సాహిక నటి, మాజీ జిమ్నాస్ట్.

వాణి కోలా

అత్యంత విజయవంతమైన సీరియల్ పారిశ్రామికవేత్తగా ఖ్యాతి సంపాదించిన వాణి అనేక లాభదాయకమైన కంపెనీల్ని ప్రారంభించారు. 1996లో రైట్ వర్క్స్ అనే సంస్థను ఆమె స్థాపించారు. ఇది ఇ-ప్రొక్యూర్ మెంట్ కంపెనీ. ఈ కంపెనీని ఐసిజి, ఆ తర్వాత ఐ2 కొనుగోలు చేశాయి.

ఫైనాన్షియల్ కంప్లియన్స్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న సెర్టస్ సాఫ్ట్ వేర్ సంస్థ కూడా ఆమె ఏర్పాటు చేసిందే. దానికి 2001 నుంచి 2005 మధ్య ఆమె సిఇఓగా వ్యవహరించారు.

“నేను స్వాప్నికురాలిని. ఏదీ అసాధ్యం కాదన్నది నా విశ్వాసం. మన మనసులో ఏదైనా ఊహించుకున్నట్టయితే, దాన్ని మనం సాధించగలం’ అంటారు వాణి.

ప్రస్తుతం, ఇండోయుఎస్ వెంచర్ పార్ట్‌నర్స్‌కు సిఇఓగా, కలరీ క్యాపిటల్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు.

అంతర్జాతీయ స్థాయిలోనూ...

అంతర్జాతీయ స్థాయిలో కూడా అనేకమంది సీరియల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలున్నారు. అయితే, అత్యంత ప్రసిద్ధమైన కథల్లో అనితా రోడ్డిక్ కథ ఒకటి. ఆమె ది బాడీ షాప్ వ్యవస్థాపకురాలు. దీని మొదటి స్టోర్ 1976లో ఇంగ్లండ్‌లో ఏర్పాటైంది. 2006లో భారతదేశంలో కూడా ఇది ప్రవేశించింది. ఇప్పుడీ సంస్థకు భారతదేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా కూడా అనేక స్టోర్లున్నాయి. ఆర్థికమైన అవసరాలకోసం మొదటి స్టోర్స్‌ను అనిత ప్రారంభించారు. వ్యాపారం అద్భుతంగా సాగడంతో ఆరు నెలల్లోనే తరువాతి స్టోర్స్ తెరిచారు. 1991 నాటికల్లా ఈ సంస్థకు 700 శాఖలున్నాయి. 2006 మార్చి 17న ది బాడీ షాప్‌ను ఎల్ ఓరియల్ సంస్థ కొనుగోలు చేసింది.

వీళ్లే కాదు మీకు తెలిసిన మహిళా సీరియల్ ఔత్సాహిక పారిశ్రామికవేత్తల గురించి మాకు తెలియజేయండి.