మీ ఫోటోలను ఫ్రీగా ప్రింట్ చేసి ఇంటికే డెలివర్ చేసే ‘జస్ట్ క్యాప్చర్’

కొత్త కాన్సెప్ట్‌తో అదరగొడుతున్న హైదరాబాద్ కుర్రాళ్లు..ఇద్దరు ఫౌండర్లూ ఐఐటి పూర్వ విద్యార్థులే..

మీ ఫోటోలను ఫ్రీగా ప్రింట్ చేసి ఇంటికే డెలివర్ చేసే  ‘జస్ట్ క్యాప్చర్’

Friday September 04, 2015,

2 min Read

ఒక ఫోటో వందల భావాలను పలికిస్తుంది. భావాలే కాదు.. అదే ఫోటోతో వంద రెట్ల బిజినెస్ కూడా చేయొచ్చంటోంది జస్ట్ క్యాప్చర్ డాట్ కామ్(justkapture.com). సెలబ్రిటీలు మాత్రమే కాదు సామాన్యుల ఫోటోలను కూడా వ్యాపార ప్రకటనల్లో ఉపయోగించేలా చేయడం ఈ హైదరాబాదీ స్టార్టప్ ముఖ్య ఉద్దేశం. మీరు ఫోటోను తీసుకోండి చాలు వాటి ప్రింటింగ్ బాధ్యత మేం తీసుకుంటాం. దాంతో పాటు కొన్ని ఫ్రీ కూపన్స్ అందిస్తామని అంటోంది. ఇదంతా ఎలాగంటే వారి కధను చెప్పుకొచ్చారీ ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థులు.

image


ఫ్రీగా ఎలా సాధ్యమైంది ?

మీ ఫోటోల వెనక ప్రకటనలను కలిపి ప్రింట్ చేస్తారు. మీ ఫోటోతోపాటు ప్రింటింగ్ ఖర్చులు ఆ ప్రకటన కంపెనీయే చూసుకుంటుందన్న మాట. ఇప్పటి వరకూ జస్ట్ క్యాప్చర్ వారు పది వాణిజ్య సంస్థలతో టై అప్ అయ్యారు. వీటిని పెంచుకుంటూ పోతున్నారు. మరో నాలుగు స్టార్టప్ కంపెనీలు వ్యాపార ప్రకటనలు చేసే పనిలో ఉన్నాయి. వాటికి కమిషన్ పే చేస్తారు.

”క్లయింట్స్ దగ్గరకు వెళ్లిన తొలి నాళ్లలోనే వారి దగ్గర నుంచి వచ్చిన రెస్పాన్స్ చాలా అద్భుతంగా అనిపించింది. ఫోటో గ్రాఫ్ వెనుక ప్రకటనలని పెడతాం అని చెప్పగానే వాళ్లూ ఎగ్జైట్ అయ్యారు ” అని అంటారు ఫౌండర్ మనీష్.

యూజర్లకు చేరువవడానికి ఇదొక సులభమైన ప్రక్రియగా వారు భావించారు. ఈరోజుల్లో డిజిటల్ మీడియా ఎంతలా వ్యాపించిందంటే ఫేస్ బుక్, ట్విట్టర్ , ఇన్‌స్టాగ్రాం లాంటి వాటిల్లో మాత్రమే జనం ఫోటోలను అప్ లోడ్ చేస్తున్నారు. ప్రింట్ చేసి ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేదు. పెళ్లిల్లు, లేదా ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే ఫోటో ప్రింటింగ్‌కు వెళ్తుంది. అలా ప్రింటింగ్ అనే మాట రాను రాను జనం మర్చిపోయే పరిస్థితి ఉందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదేమో !! దీన్నే ఓ అద్భుత అవకాశంగా తీసుకుంది జస్ట్ క్యాప్చర్. ప్రింటింగ్ చేసే అవసరం లేదు కనుక ఫ్రీగా హెచ్ డీ క్వాలిటీ ప్రింటింగ్ ఫోటోను ఇస్తామంటే చాలా మంది ట్రై చేస్తే ఏమవుతుందిలే అంటున్నారని మనీష్ వివరిస్తారు.

ఓ విభిన్నమైన అడ్వర్టైజింగ్ మీడియంని తీసుకురావాలన్నది మా ప్రధానమైన ఉద్దేశం- కో-ఫౌండర్ రాహుల్

ఫోటోగ్రాఫ్‌కి వెనుక ఉన్న స్పేస్‌లో యాడ్స్‌ని పోస్ట్ చేయడం. అది కూడా ఆ ప్రాంతానికి సంబంధించిన వ్యాపారానికి సంబంధించిన ప్రకటన. స్థానికులకు ఇది బాగా కనెక్ట్ అవుతుంది. భవిష్యత్ లో ఎడ్వర్టైజింగ్ ఇండస్ట్రీలో ఇదే తరహా మాడ్యూల్ వచ్చినా ఆశ్చర్య పోనక్కర్లేదని రాహుల్ అంచనా.

image


జస్ట్ క్యాప్చర్ టీం

మనీష్ అగర్వాల్, రాహుల్ అగర్వాల్‌లు కలసి మార్చి 2015లో జస్ట్ క్యాప్చర్‌ని ప్రారంభించారు. వీరిద్దరూ ట్రిపుల్ ఐటీ పూర్వ విద్యార్థులే. దాదాపు పదేళ్ల పాటు వివిధ కంపెనీల్లో పనిచేసిన అనుభవంతో హైదరాబాద్ కేంద్రంగా దీన్ని మొదలుపెట్టారు. ఇద్దరికీ ప్రాడక్ట్ డెవలప్‌మెంట్, బ్రాండింగ్, మార్కెటింగ్‌తో పాటు సేల్స్‌లో అనుభవం ఉంది. వీరితో పాటు అభిషేక్ ఆపరేషన్స్ చూస్తారు. కోర్ టీంలో మరో ఇద్దరు సభ్యులున్నారు. వీరంతా కలసి జస్ట్ క్యాప్చర్‌ను భారత దేశంలో ఉన్న ప్రీమియం ఫోటో ప్రింటింగ్ సర్వీసుగా మార్చాలని చూస్తున్నారు.

image


భవిష్యత్ ప్రణాళికలు

రోజుకి మూడు వేలకు పైగా యాక్టివ్ యూజర్లున్నారు. నెలకి 50శాతం గ్రోత్ ని నమోదు చేస్తున్నారు. ఇప్పటి వరకూ 1.52 లక్షల ఫోటోలను ప్రింట్ చేసి డెలివర్ చేశారు. ఇందులో ఫేస్ బుక్, ఇన్‌స్టాగ్రాంతో లాగిన్ అయి ఫోటో అప్ లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకూ హైదరాబాద్‌కే పరిమితమై ఉన్న యూజర్ బేస్‌ను బెంగళూరు సహా ఇతర ప్రాంతాలకు విస్తరించాలని చూస్తున్నారు. పూర్తిగా బూట్‌స్ట్రాప్డ్ కంపెనీ అయిన జస్ట్ క్యాప్చర్‌కు మనిష్, రాహుల్ సీడ్ ఫండింగ్ చేశారు. సీడ్ ఫండింగ్ అందుకున్న ఈ సంస్థ.. మరిన్ని నిధుల కోసం చూస్తోంది.