ఆరేళ్లకే చెఫ్ అవతారమెత్తిన చంటోడు

వంటలు అదరగొడుతున్న వండర్ కిడ్

ఆరేళ్లకే చెఫ్ అవతారమెత్తిన చంటోడు

Thursday January 12, 2017,

2 min Read

ఆరేళ్ల వయసంటే సరిగా అన్నం కూడా తినడం కాదు. రెండు నిమిషాలు స్పూన్ ని కూడా హాండిల్ చేయలేరు. అలాంటిది, వంటగదిలో రెసిపీలతో అదరగొడుతున్నాడంటే పూర్వజన్మలో పిల్లాడు నలమహారాజు అయివుంటాడు. హాఠ్.. పిల్లచేష్టలు అని కొట్టిపారేయకండి. చదివితే మీరే షాకైపోతారు.

నిహాల్ రాజ్. ఇండియాలోనే యంగెస్ట్ చెఫ్. యూ ట్యూబ్ కిచెన్ కింగ్. కేరళలోని కొచ్చికి చెందిన ఈ కుర్రాడు వరల్డ్ లోనే చేయితిరిగిన వంటగాడు. కిచా యూ ట్యూబ్ అని యూ ట్యూబులో కొట్టండి.. 14వేల మంది సబ్ స్క్రైబర్లు కనిపిస్తారు. మిక్కీ మౌజ్ మ్యాంగో ఐస్ క్రీం తయారు చేస్తే నాన్ ఎక్స్ క్లూజివ్ రైట్స్ కింద ఫేస్ బుక్ పిల్లోడికి రెండువేల డాలర్లు ఇచ్చింది.

image


మూడున్నర వయసప్పుడే కొడుకులో ఉన్న టాలెంట్ గమనించాడు తండ్రి రాజగోపాలన్ క్రిష్ణన్. వాళ్ల అమ్మతో కలిసి కిచెన్ లో సందడి చేస్తూ ఏదో వంటకం గురించి వివరించాడు. టీవీలో వంటల ప్రోగ్రాం చూసి అనుకరించాడు. అదంతా నాన్న వీడియో తీసి ఫేస్ బుక్ లో అప్ లోడ్ చేశాడు. దానికి బీభత్సమైన రెస్పాండ్ వచ్చింది. అప్పుడు అతనికి మెరుపులాంటి ఆలోచన వచ్చింది.

చిన్నారి చెఫ్ లు ప్రపంచం ఎక్కడెక్కడ ఉన్నారని వెతికగా.. ఈవెన్ ట్యూబ్ లో 9ళ్ల చిన్నారి తండ్రితో కలిసి ఆటబొమ్మలను రివ్యూ చేసే వీడియోలు కనిపించాయి. అలాంటిదే కొడుకు కోసం వంటల ఛానల్ పెడితే ఎలా వుంటుందని ఆలోచించాడు.

అలా మొదలైంది కిచాట్యూబ్ హెచ్ డీ అనే యూ ట్యూబ్ చానల్. మిక్కీ మౌజ్ ఐస్ క్రీం, ఓట్ మీల్ కుకీస్. ఐస్ క్రీం కేక్స్, కొబ్బరి పాయసం, రెయిన్ బో ఇడ్లీ వంటివి తయారు చేయడంలో పిల్లోడు కింగ్.

ఇంకేముంది నిహాల్ ఓవర్ నైట్ సెలబ్రిటీ అయ్యాడు. ఒకరోజు అమెరికాకు చెందిన బ్రాడ్ కాస్ట్ కంపెనీ నుంచి మెయిల్ వచ్చింది. మిక్కీ మౌజ్ ఐస్ క్రీం హక్కులు తమకు ఇవ్వాలని ఆ మెయిల్ సారాంశం. కట్ చేస్తే రెండు వేల డాలర్లు వళ్లో వచ్చివాలాయి. ఫేస్ బుక్ దాన్ని నాన్ ఎక్స్ క్లూజివ్ రైట్స్ కింద కొనేసింది.

image


కుర్రాడి సంపాదనలో కమర్షియల్ యాంగిల్ తో పాటు సామాజిక బాధ్యత కూడా దాగివుంది. వచ్చిన ఆదాయంలో కొంతభాగం ఆటిజంతో బాధపడే పిల్లలకోసం విరాళంగా ఇస్తాడు.

నిహాల్ తర్వాతి టార్గెట్ ద ఎల్లెన్ డీజెనరస్ షో. అది అమెరికాలో బాగా పాపులర్ అయిన టెలివిజన్ టాక్ షో. ఆ డ్రీం కూడా నిజం చేసుకున్నాడు. అందులో కేరళ సాంప్రదాయ వంటకమైన పుట్టు తయారుచేసి వావ్ అనిపించాడు.

ఒకటో తరగతి చదువుతున్న నిహాల్.. ఫోకస్డ్ చైల్డ్. ఇటు వంటల వీడియోలు, అటు చదువు, దాంతోపాటు ఆటలు.. ఏదీ మిస్ చేయడు. వారంలో రెండు మూడు గంటలు మాత్రమే యూ ట్యూబ్ కోసం కేటాయిస్తాడు. పేరెంట్స్ పెట్టుకున్న రూల్ అది.

కిచాట్యూబ్ ఎప్పుడైతే పాపులర్ అయిందో పిల్లాడికి ఆఫర్లు వెతుక్కుంటూ వచ్చాయి. కానీ తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. తర్వాత కుక్ విత్ కిచా అని మరో చానల్ రాబోతోంది. దాని ప్రత్యేకత ఏంటంటే.. ఎవరైనా ఫలనా వంట కావాలని అని అడిగితే ప్రత్యేకంగా అదే చేస్తాడు. ఇన్ సెర్చ్ ఆఫ్ పుట్టు అని మరో చానల్ త్వరలో ఎయిర్ కాబోతోంది.

వంటలొక్కటే కాదు. డబుల్ హార్స్ స్నాక్స్ కి మనోడు బ్రాండ్ అంబాసిడర్. దానికి సంబంధించిన ఒక షో ఇటీవల యూకేలో జరిగింది. అది త్వరలో టెలికాస్ట్ అవుతుంది. చిన్నారి ఫ్యాన్స్ అంతా దానికోసమే వెయిటింగ్.

అంత చిన్న వయసులోనే ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించడమంటే మాటలు కాదు. వజ్రాన్ని సరైన సమయంలో సానబట్టిన తల్లిదండ్రులు.. కొడుకుని ఒక రోల్ మోడల్ గా తీర్చిదిద్దడంలో సక్సెస్ అయ్యారు. పిల్లాడి స్వప్నానికి రెక్కలు తొడిగి ఎగురవేసి ఇప్పుడు గర్వంగా నవ్వుతున్నారు.