రూ. 500 ఇవ్వండి.. ఒకరోజు ఖైదీగా ఉండండి..! ఇంట్రస్టింగ్ జైలు టూరిజం!!

0

సాధారణంగా ఏదైనా నేరం చేస్తేనో, చట్టాన్ని ఉల్లంఘిస్తేనో తప్ప జైలుకు వెళ్లే సందర్భాలు రావు. కానీ అక్కడ మాత్రం ఒక ఐదొందలు ఇస్తే చాలు.. ఒకరోజంతా జైల్లో పెట్టి పంపిస్తారు. వినడానికే విచిత్రంగా ఉంది కదా! అయితే ఒకసారి చదవండి.. ఇంకెంత తమాషాగా ఉంటుందో!

మెదక్ జిల్లా సంగారెడ్డి పాతజైలు గురించి వినే ఉంటారు. చాలా పురాతనమైంది. ఆమాటకొస్తే చంచల్ గూడ, రాజమండ్రి, వరంగల్ సెంట్రల్ జైళ్ల కంటే పాతది. 1796లో అప్పటి రాజులు తమ గుర్రాలను కట్టేయడం కోసం దీన్ని కట్టారు. కాలక్రమంలో తెలంగాణ సాయుధ పోరాటం, స్వాతంత్ర్యపోరాటంలో పాల్గొన్న వారిని శిక్షించేందుకు కారాగారంగా వాడారు. తర్వాత కాలంలో అది న్యాయశాఖ, ఆరోగ్య శాఖ కార్యకలపాల కోసం ఉపయోగించారు. స్వాతంత్య్రం అనంతరం 1977లో ఈ భవనాన్ని జైళ్లశాఖకు బదలాయించారు. అప్పటినుంచి సంగారెడ్డి జిల్లా జైలుగా మారిపోయింది. రెండు శతాబ్దాల నాటి కట్టడం కావడం.. రోజురోజుకు నేరస్తుల సంఖ్య పెరగడం.. జైళ్ల శాఖలో సంస్కరణలు అమల్లోకి రావడం.. తదితర కారణాల వల్ల జిల్లా జైలును కొత్త బిల్డింగులోకి తరలించారు.

సంగారెడ్డి శివారు లోని కంది గ్రామంలో 15 ఎకరాల విస్తీర్ణంలో కొత్త భవనాన్ని నిర్మించారు. దాంతో గత నాలుగు యేళ్లుగా ఈ పాత జిల్లా జైలు శిథిలావస్థకు చేరుకుంది. ఎంతో చరిత్ర కలిగిన సంగారెడ్డి పాతజైలు ఇలా అనాథగా మారిపోవడం జైళ్ల శాఖ డీజీ వినయ్ కుమార్ బాధకలిగించింది. చారిత్రక కట్టడమైనఈ భవనం శిధిలావస్ధకు చేరకుండా భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని అందించే కేంద్రంగా చేయాలన్న ఉద్దేశంతో జైలు ప్రాంగణాన్ని తెలంగాణ చరిత్రకు అద్దంపట్టే విధంగా మ్యూజియంగా మార్చారు. ప్రధానంగా స్వాతంత్ర్య పోరాటంలో మెదక్ జిల్లా పాత్ర, తెలంగాణ పోరాటం, ప్రత్యేక తెలంగాణ కోసం 1969 నుంచి ఇప్పటి వరకు సాగిన ఉద్యమరూపాలు, ప్రాణత్యాగలు చేసిన అమరుల ఫోటోలు, తెలంగాణ చరిత్రను భద్రపర్చారు.

జైళ్ల శాఖ సంస్కరణలో భాగంగా మ్యూజియం ఏర్పాటు చేయడంతో పాటు, ఇప్పుడు దేశంలోనే ఎక్కడలేని విధంగా ఫీల్ ద జైల్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 500 రూపాయలు చెల్లిస్తే చాలు.. ఒకరోజంతా జైలు జీవితం ఎలా వుంటుందో తెలుసుకోవచ్చు. వాళ్లను 24 గంటలపాటు ఒక ఖైదీగానే ట్రీట్ చేస్తారు. లాకప్ కేటాయిస్తారు. పూర్తిగా ఖైదీల తరహలోనే వేషధారణ ఉంటుంది. అంటే ఖాదీ నిక్కర్, ఖాదీ షర్టు, ప్లేటు, గ్లాసు, ముగ్గు, దుప్పటి.

ఇలా ఖైదీల మ్యానువల్ లో ఏవైతే ఉంటాయో అవన్నీ ఫీల్ ద జైల్ కోసం వచ్చిన వారికి ఉంటాయి. ఖైదీలకు ఎలాంటి భోజనం పెడతారో అచ్చంగా అదే తరహ తిండి పెడతారు. ఖైదీలు ఏలాంటి టైంటేబుల్ ఫాలో అవుతారో, వాళ్లూ అదే ఫాలో కావాలి. సూర్యోదయానికి ముందే ఖైదీ జీవితం మొదలవుతుంది. 

ఆరింటికి బారక్ తెరుస్తారు. అరగంట కాలకృత్యాలు. అందరిలాగే ఓపెన్ టాయిలెట్స్ వాడాలి. యోగా, మెడిటేషన్ తర్వాత 7 నుంచి 8 మధ్య స్నానాలు. 8 గంటలకు టిఫిన్. పదిన్నర వరకు స్టడీ అవర్. 11 నుంచి 12 మధ్య లంచ్. 12 నుంచి ఒంటిగంట వరకు రెస్ట్. మధ్యాహ్నం 1 నుంచి 4 వరకు మళ్లీ స్టడీ అవర్. టీ బ్రేక్ తర్వాత 4 నుంచి 5 వరకు పరేడ్. ఆరింటికల్లా డిన్నర్ పూర్తవుతుంది. ఆరున్నరకు బ్యారక్ తాళం పడుతుంది.

ఎట్టి పరిస్థితుల్లో మధ్యలో లాక్ ఓపెన్ చేయరు. అర్జెంట్ అయితే బ్యారక్ లోపలే టాయిలెట్స్ ఉంటాయి. అవి వాడుకోవాలి. ఒకరోజు ఖైదీ అనుభవం కోసం వచ్చిన వాళ్లు మొబైల్ తీసుకురావొద్దు. ఒకసారి లోపలకి ఎంటరై ఖైదీగా మారితే 24 గంటల పాటు తప్పకుండా ఉండి తీర్సాల్సిందే. మధ్యలో తూచ్ అంటానంటే కుదరదు. ఒకరోజు ఖైదీగా గడపడానికి వచ్చిన వారు.. సాధారణ ఖైదీల్లాగే ఎవరి పనులు వారే చేసుకోవాలి. బారక్ శుభ్రం చేసుకోవాలి. ప్లేట్లు, గ్లాసులు కడుక్కోవాలి.

ఇలాంటి తరహ జైలు ఎక్కడలేదు. జైళ్ల శాఖ సంస్కరణలో భాగంగా ఈ ప్రయత్నం చేశామని జైలు సూపరింటిండెంట్ అంటున్నారు. ఫీల్ ది జైల్ పేరుతో జైళ్ల శాఖ దేశంలోనే తొలిసారిగా తీసుకువచ్చిన ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ అందరినీ అట్రాక్ట్ చేస్తుంది. ఒక్క రోజు ఖైదీగా మారడానికి సిద్ధంగా ఉన్నవాళ్లందరికి స్వాగతం చెబుతున్నారు సంగారెడ్డి పాతజైలు అధికారులు. సో, మీలో ఎవరికైనా ఇంట్రస్ట్ ఉంటే ఒకరోజు ఖైదీగా ట్రై చేయండి.