కోరిన సమయంలోనే మీ వస్తువులు డెలివర్ చేసే 'డోర్ గయ్'

కోరిన సమయంలోనే మీ వస్తువులు డెలివర్ చేసే 'డోర్ గయ్'

Saturday October 10, 2015,

3 min Read

ఆన్ లైన్‌లో ఆర్డర్ చేసిన వస్తువులు మనం ఇంట్లో లేనప్పుడో, ఆఫీసులోనో, బయటెక్కడో ఉన్నప్పుడో ఇంటికి వచ్చిన సందర్భాలు అనేకం. ప్రతీ ఒక్కరూ ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొనే ఉంటారు. ఇంట్లో ఎవరూ లేనప్పుడు డెలివరీ బాయ్ వస్తే ఆ పార్శిల్ ని తీసుకునేందుకు పడే ఇబ్బందులు అన్నీ ఇన్నీకావు. ఇరుగుపొరుగున ఉన్నవారికి ఫోన్ చేసి ఆ పార్శిల్ తీసుకోవాలని వారిని బతిమాలుకోవాల్సిందే. వాళ్లూ అందుబాటులో లేకపోతే ఇక ఆ తిప్పలే తిప్పలు. మళ్లీ రమ్మని డోర్ డెలివరీ బాయ్‌ని బతిమాలుతాం. వస్తువు ఆర్డర్ చేయడం సంగతేమో కానీ కేవలం పార్శిల్ తీసుకోవడం అనేది పెద్ద తతంగంలా మారిపోతోంది. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టే చక్కని పరిష్కారమే 'డోర్ గయ్'.

సాయంత్రం నుంచి అర్ధరాత్రి వరకూ డెలివరీ

గుర్గావ్‌కు చెందిన డోర్ గయ్ ఇ-కామర్స్ ఆర్డర్లను డెలివరీ చేసే సంస్థ. డెలివరీల్లో ఉన్న సమస్యలపై అధ్యయనం చేసి ఈ స్టార్టప్‌ను ఈ ఏడాది జులైలో ప్రారంభించారు అన్షుల్ గార్గ్. ఆ తర్వాత సుమిత్ బద్వాల్ ఈ సంస్థలో చేరారు. వీళ్లిదరూ కలిసి సరికొత్త కాన్సెప్ట్‌తో పార్శిల్ డెలివరీ వ్యవస్థనే మార్చేశారు. సాధారణంగా ఏ కొరియర్ సంస్థ అయినా ఉదయం పది నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు వస్తువుల్ని డెలివరీ చేస్తుంది. కానీ వీళ్లు ఈ సమయాన్ని పూర్తిగా మార్చేశారు. వినియోగదారుల సౌలభ్యాన్ని బట్టి ఈ కంపెనీ కొత్త డెలివరీ సమయాన్ని రూపొందించింది. సాయంత్రం ఆరు గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు డెలివరీ సమయాన్ని మార్చింది.

" అందుబాటులో లేనప్పుడు వచ్చే పార్శిళ్ల కోసం వృథా చేసుకునేంత సమయం జనం దగ్గర లేదు. వారి వర్క్ షెడ్యూళ్లకు, డెలివరీ సమయానికి మధ్య క్లాష్ వస్తోంది. ఆ ఇబ్బందుల్ని తప్పించేందుకే మేం ఈ కొత్త వేళల్ని తీసుకొచ్చాం" అంటారు డోర్ గయ్ కో-ఫౌండర్ అన్షుల్.

ఎలా పనిచేస్తుందంటే...

ముందుగా మీరు డోర్ గయ్‌లో రిజిస్టర్ చేసుకోవాలి. అప్పుడు మీకు ఓ పర్సనలైజ్డ్ షిప్పింగ్ అడ్రస్ లభిస్తుంది. మీరు ఆన్ లైన్‌లో వస్తువులు కొన్నప్పుడు మీ ఇంటి అడ్రస్ కాకుండా డోర్ గయ్ షిప్పింగ్ అడ్రస్ ఇవ్వాలి. ఆ వస్తువు డోర్ గయ్ గోడౌన్‌కు వస్తుంది. తర్వాత సంస్థ సిబ్బంది మీ వస్తువుల్ని అందుకొని మీకు సమాచారం ఇస్తారు. వాటిని వాళ్ల డిపోలో భద్రపరుస్తారు. సాయంత్రం ఆరు నుంచి అర్ధరాత్రి వరకు మీరు కోరుకున్న సమయంలోనే డెలివరీ చేస్తారు. వారంలో ఏడు రోజులూ ఈ సంస్థ పనిచేస్తుంది. మీకు కావాలనుకున్నప్పుడు పార్శిల్ మీ దగ్గరకు వస్తుంది. ఓ నెల తర్వాత వచ్చి డెలివరీ చెయ్యమన్నా చేస్తారు. ఫైనల్‌గా మీరు ఇంట్లో ఉన్నప్పుడే పార్శిల్ మీ ఇంటికి వస్తుంది. ఇది చాలా వినూత్నమైన ఆలోచన అంటారు ఫౌండర్లు. డెలివరీ సమస్యలకు ఇలాంటి పరిష్కారం మరెక్కడా లేదని గర్వంగా చెబుతారు.

"లాజిస్టిక్స్ రంగంలో ప్రముఖ సంస్థలున్నాయి. దశాబ్దాలుగా సేవలందిస్తున్నారు. కానీ వినియోగదారుల సమస్యల్ని పరిష్కరించే దిశగా ఏ ఒక్క అడుగు వెయ్యలేదు. ఒక వేళ ఇదే సర్వీసును ఇతర లాజిస్టిక్స్ సంస్థలు ప్రారంభించాలనుకున్నా అది దాదాపు అసాధ్యమే. ఎందుకంటే ఆన్ లైన్‌లో ఇచ్చిన ఆర్డర్ ఏ కొరియర్ ద్వారా వస్తుందో తెలియదు. కాబట్టి ఆర్డర్ ఇచ్చిన ప్రతీసారి అకౌంట్ క్రియేట్ చేయడమో, యాప్ ఇన్స్టాల్ చేయడమో తప్పనిసరి అవుతుంది " -అన్షుల్.
image


డోర్ గయ్ బీటా వర్షన్ సమయంలో ప్రతీ రోజు 25 ప్యాకేజీల వరకు షిప్పింగ్ చేసేవాళ్లు. ఈ సర్వీసుకున్న ప్రత్యేకతతో ఆదరణ పెరుగుతోంది. ఒకరి ద్వారా మరొకరికి దీని గురించి తెలిసింది. లాంఛింగ్ తర్వాత రెండు వారాల్లోనే వంద డెలివరీలు చేశారు. ప్రస్తుతం 250 మందికి పైగా రిజిస్టర్డ్ యూజర్స్ ఉన్నారు. ఇప్పటికీ యూజర్ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. కోరుకున్న సమయానికి పార్శిల్ వస్తుంది కాబట్టి కాస్త అదనపు ఛార్జీలు చెల్లించక తప్పదు. ప్యాకేజీల సంఖ్య ఆధారంగా ఛార్జీలు వసూలు చేస్తుంటారు. ఒక్కో ప్యాకేజీ ధర 19 రూపాయల నుంచి ఉంటుంది. సైజ్‌ను బట్టి ఛార్జీ ఉంటుంది. సైజ్ పెరిగిన కొద్దీ ఛార్జీలు పెరుగుతాయి. ప్రస్తుతం ఎవరికైనా మొదటి షిప్‌మెంట్ ఫ్రీగా అందిస్తోందీ సంస్థ.

"పలు ఇ-కామర్స్ కంపెనీలతో మేం మాట్లాడుతున్నాం. వాళ్లు మా సర్వీసుకు డబ్బులు చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారు. తద్వారా రీ-రూటింగ్ ఫీజులు తగ్గుతాయని, కస్టమర్ సర్వీస్ లోడ్ తగ్గుతుందని, కంపెనీ ప్రతిష్ట తగ్గకుండా ఉంటుందని వాళ్లు ఆలోచిస్తున్నారు" -అన్షుల్.

మార్కెట్లో అవకాశాలు, కాంపిటీషన్

2013లో నిర్వహించిన ఓ సర్వే ప్రకారం ప్రతీ వంద కోట్ల డెలివరీల్లో 20 లక్షల వరకు మొదటి ప్రయత్నంలో డెలివరీ సక్సెస్ కాలేదని తేలింది. ఇది చాలా చిన్న పర్సెంటేజ్ అయినా 20 లక్షలు అంటే మామూలు సంఖ్య కాదు. కాబట్టి షిప్‌మెంట్లో సమస్యలు ఉన్నంతకాలం ఈ సెగ్మెంట్లో మంచి వ్యాపారావకాశాలున్నాయి. ఇ-కామర్స్ పరిశ్రమ అభివృద్ధి చెందుతున్నట్టుగానే, ఇ-కామర్స్ పై ఆధారపడ్డ లాజిస్టిక్స్ కూడా పెరిగింది. ఇ-కామ్ ఎక్స్ ప్రెస్, గో జావాస్, ఢెల్హివరీ, డాట్ జాట్ లాంటి బలమైన సంస్థలు... ఇ-కామర్స్ వ్యాపారులకు సప్లై చెయిన్ రూపొందించాయి. అయితే ఇప్పటికీ సమర్థవంతమైన పరిష్కారాలతో వచ్చే స్టార్టప్స్‌కి ఈ రంగంలో అనేక అవకాశాలున్నాయన్నది మా విశ్వాసం అంటారు అన్షుల్.

"మార్కెట్ లో మాకు ఎలాంటి స్పందన వస్తుందో మాకు ఇప్పటికీ తెలియదు. కాకపోతే మేమే మొదటిసారి ఈ బిజినెస్‌లోకి అడుగుపెట్టాం. కాబట్టి... అన్నీ మేం అనుకున్నట్టు జరిగితే ఎక్కువ శాతం మార్కెట్‌ను మేం ఆక్రమించుకోగలం" అని ధీమాగా ఉన్నారు అన్షుల్.

ప్రస్తుతం యూజర్ల సంఖ్య పెంచుకునేందుకు ప్రయత్నిస్తోంది డోర్ గయ్. దాంతో పాటు పెట్టుబడులను ఆకర్షించనుంది. ఈ మార్కెట్లో పెటుబడులు కీలకం. నిధుల సేకరణ లేకుండా ఎక్కువ దూరం వెళ్లలేమంటున్నారు ఫౌండర్లు. ప్రస్తుతం డోర్ గయ్ గుర్గావ్ నుంచి నడుస్తోంది. త్వరలో దేశ రాజధానికి మారనుంది. మొబైల్ యాప్ తయారు చేసే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న వెబ్ సైట్ కంటే... యాప్ బెటర్ అనుకుంటున్నారు.