పెళ్లి పనులన్నీ ఐదు నిమిషాల్లో చేసి చూపిస్తున్న మ్యారేజ్ సర్వీస్ స్టార్టప్స్..!!

పెళ్లి పనులన్నీ ఐదు నిమిషాల్లో చేసి చూపిస్తున్న మ్యారేజ్ సర్వీస్ స్టార్టప్స్..!!

Friday April 29, 2016,

4 min Read


"పెళ్లంటే నూరేళ్ల పంట.."

నిజమే కానీ... పెళ్లి చేయాలంటే..! తల ప్రాణం తోకకు రావాల్సిందే.. !

పెళ్లి చేసే పండితుడ్ని వెదుక్కోవడం దగ్గర్నుంచి చివరికి భోజనాల వరకు లెక్క వేసుకుంటే వందల్లో పనులు ఉంటాయి. వీటిలో ఎక్కడో ఓ చోట లెక్కతప్పడం... పెళ్లికి వచ్చిన అతిథుల ఎదుట తలకొట్టేసినట్లవడం.. పెళ్లివారికి ఎదురయ్యే అతి పెద్ద సమస్య.

ఈ సమస్యలన్నింటినీ పరిష్కరించేందుకు మేమున్నామని వస్తున్నాయి మ్యారేజ్ సర్వీసెస్ స్టార్టప్స్. జంటను వెతికిపెట్టే సేవలు ఎప్పుడో పీక్స్ చేరిపోయాయి. ఆ తర్వాత పెళ్లి చేసుకునే వ్యవహారంలో ప్రతీ విషయంలోనూ ఇప్పుడు పొరపాటు జరగకుండా సేవలు అందిస్తున్నాయి కొత్త తరం ప్రారంభించిన స్టార్టప్స్.

పెళ్లికార్డులు కొట్టించడం దగ్గర్నుంచి బట్టలు, సంగీత్ కార్యక్రమాలు, జ్యూయలరీ, అందరికీ నచ్చే వంటలు, కళ్యాణ మండపాలు... ఇలా చెప్పుకుంటూ పోతే.. కొత్తజంటల హనీమూన్ ఏర్పాట్లు చూడటం వరకు అన్నీ నిమిషాల వ్యవధిలో చేసిపెడుతున్నాయి.

సంప్రదాయ మ్యారెజ్ మార్కెట్ ను ఈ ఆన్ లైన్ స్టార్టప్స్ మెల్లగా కైవసం చేసుకుంటున్నాయి. మొదట్లో చిన్నగా ప్రారంభించినా.. ఇప్పుడు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి. ప్రతీ సేవను ఇంట్లో కూర్చుని ఒక్క క్లిక్ ద్వారా పొందేలా వీరు తమ టెక్నాలజీని డెవలప్ చేసుకుంటున్నారు. పెళ్లి సంబంధిత వస్తువులు కొనేందుకు వెళ్లే మార్కెట్లలో పడే నానా బాధలు పడనవసరం లేకుండానే అక్కడ లభించే వస్తువులు... ఇంకా చెప్పాలంటే అంతకంటే మించి.. వైడ్ రేంజ్ ఆఫ్ సెలక్షన్ ను అందుబాటులో ఉంచుతున్నారు.

వస్తువులే కాదు.. పెళ్లితో ముడిపడి ఉన్న ప్రతి సర్వీసును ఈ మ్యారేజ్ స్టార్టప్స్ అందిస్తున్నాయి. అందుకే ఇప్పుడు ఐదు రోజుల పెళ్లిని కూడా అద్భుతంగా చేసుకోవచ్చు ఐదు నిమిషాల్లో ఏర్పాటు చేసుకుని..! "పెళ్లి చేసి చూడు" అన్న చాలెంజ్ ను ఎవరూ ఊహించనంత సులువు చేసి చూపిస్తూ మార్కెట్ ను అమాంతం పెంచుకుంటున్నాయి కొన్ని స్టార్టప్స్.

image


సెవన్ ప్రామిసెస్

పెళ్లికి అందరికీ అహ్వానాలు పంపించడం కామన్. ఇప్పుడు యువతరంతో పాటు పెద్దలు కూడా వెడ్డింగ్ కార్డులు ఎంతో వెరైటీ, లావిష్ గా ఆకట్టుకునేలా ఉండేలా రూపొందించాలని కోరుకుంటున్నారు. ఇప్పటి వరకు మెట్రో నగరాల్లో సైతం వెడ్డింగ్ కార్డులకే ప్రత్యేకమైన వ్యాపార ప్రాంతాలకు పరుగులు పెట్టాల్సి వచ్చేది. వెడ్డింగ్ కార్డులు అమ్మే షాపు వ్యక్తి ఏం చెబితే అది నమ్మాల్సిందే. ధర ఎంత చెబితే అంత చెల్లించాల్సిందే. పైగా మన అభిరుచి మేరకు మనం డిజైన్ చేయించుకోవడంలో చాలా రాజీపడాల్సి వస్తుంది. ఈ సమస్యను సంపూర్ణంగా పరిష్కరించే అభయం ఇస్తోంది "వెడ్డింగ్ ప్రామిసెస్" అనే స్టార్టప్. కేవలం వెడ్డింగ్ కార్డుల వరకే సేవలు అందిస్తున్న ఈ స్టార్టప్ కొన్ని వేల రకాల ఇన్విటేషన్ కార్డులను అందుబాటులో ఉంచింది. అన్ని రకాల బడ్జెట్ లో ఇవి లభిస్తున్నాయి. డిజైనర్ వెడ్డింగ్ కార్డ్స్ వీరి ప్రత్యేకత. ఆన్ లైన్ ఆర్డర్ ఇచ్చి రిలాక్స్ అయిపోవచ్చు.

బ్యాండ్ బాజా

ప్రపంచంలో మాంద్యం రాని రంగం ఏదైనా ఉంటే అది పెళ్లిళ్ల మార్కెటే. హిందూ వివాహ సంప్రదాయంలో హంగామా ఎక్కువ ఉంటుంది కాబట్టి మాంద్యం అనే ప్రశ్నే ఉండదు. అందుకే ప్రఖ్యాత సంస్థలన్నీ ఇందులోకి తమ వ్యాపారాలను విస్తరిస్తున్నాయి. ప్రముఖ మీడియా బ్రాండ్ ఎన్డీటీవీ గ్రూప్ కూడా మ్యారేజ్ సేవల స్టార్టప్ ప్రారంభించింది. బ్యాండ్ బాజా పేరుతో ప్రారంభించిన ఈ స్టార్టప్ ప్రత్యేకత డిజైనర్ దుస్తులు. ప్రస్తుతం దేశంలో టాప్ డిజైనర్లుగా ఉన్న నీతాలుల్లా, అంజు మోదీ, కిన్షాల్, ప్రమా, కైలీ అండ్ నేహా మోహతా లాంటి వారితో పాటు పదిహేను వందల మంది వెండర్స్ , లైఫ్ స్టైల్ డిజైనర్స్ తో బ్యాండ్ బాజా సేవలు అందిస్తోంది. దాదాపు ఐదు వేల ఉత్పత్తులు ఇప్పుడు బ్యాండ్ బాజాలో లభ్యమవుతున్నాయి.

దీంతో పాటు పెళ్లి కోసం వినియోగదారులు అవసరమైన చెక్ లిస్ట్ ను నమోదు చేసుకునే అవకాశాన్ని కూడా బ్యాండ్ బాజా కల్పిస్తోంది. అలాగే బడ్జెట్ మేనేజ్ చేసుకోవడంతోపాటు వినియోగదారులు ఉన్న ప్రాంతంలో ఉన్న మంచి వెండర్స్ ను సెలక్ట్ చేసుకోవడానకి కూడా సాయం చేస్తుంది. పెళ్లికి సంబంధించిన ప్రతి పనిని చక్కబెట్టుకునే సౌకర్యం బ్యాండ్ బాజా ఇస్తోంది. ఫోటోగ్రాఫర్స్, డీజేలు, వెడ్డింగ్ డెకార్స్, మేకప్ ఆర్టిస్టులు, ఇన్విటేషన్ కార్డులు.. ఇలా అన్నీ అవసరాలకు బ్యాండ్ బాజా వన్ స్టాప్ సొల్యూషన్ లా ఉంది.

ఫర్ మై షాదీ

పెళ్లి అన్న తర్వాత ఎన్నో బహుమతులు వస్తూంటాయి. వధూవరులిద్దరికీ బంధుమిత్రులు జీవితాంతం గుర్తుపెట్టుకునే బహుమతులు ఇవ్వాలని ఆశపడుతుంటారు. అయితే వధూవరుల అభిరుచులు తెలిసినప్పుడే వారు అలాంటి బహుమతులు ఇవ్వగలరు. ఇద్దరి అభిరుచుల్ని వారు చెబితే తప్ప అంచనా వేయలేం. ఈ సమస్యను పరిష్కరించడానికి వచ్చిన ఆన్ లైన్ స్టార్టప్ ఫర్ మై షాదీ. సుధామహేశ్వరి ప్రారంభించిన ఈ స్టార్టప్ లో కాబోయే జంట ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి. తమ అభిరుచులు, ఆలోచనలకు అనుగుణంగా గిఫ్ట్ లను సెలక్ట్ చేసుకోవాలి. వాటిని మిత్రులకు బంధువులు షేర్ చేయవచ్చు. కొత్త జంటకు బహుమతులు ఇవ్వాలనుకున్నవారు వారు రిజిస్టర్ చేసుకున్న వాటి లోనుంచి గిఫ్ట్ లను అందించవచ్చు. కొత్త జంటను కొత్త పద్దతిలో ఆశీర్వదించవచ్చు.

ఫర్ మై షాదీ ఫ్లాట్ ఫామ్ ఈ తరహా స్టార్టప్ లలో మొట్టమొదటిది. ప్రత్యేకమైన బ్రాండ్లు, ఆనందకమైన క్షణాలు సృష్టించుకునే ప్రదేశాలను సందర్శించే ప్యాకేజీలు.. ఇలా వినూత్నమైన గిఫ్టులు ఈ ఫ్లాట్ ఫామ్ లో అందుబాటులో ఉంటాయి. పెళ్లి చేసుకునే జంటనే తమకు అవసరమైన వాటిని బహుమతుల కేటగిరిలో రిజిస్టర్ చేసుకోవడం వల్ల స్నేహితులు, బంధుమిత్రులు కూడా వాటిని అందజేయడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. దీంతో కొత్త జంట తమ కొత్త జీవితాన్ని కావాల్సిన విధంగా ప్రారంభించడానికి అవకాశం ఏర్పడుతుంది.

వెడ్డింగ్జ్

2015లో ముంబై కేంద్రంగా ప్రారంభమైన వెడ్డింగ్జ్ స్టార్టప్ చాలా వేగంగా విస్తరించింది. ఇప్పటికే పది మెట్రో నగరాల్లో సేవలు అందిస్తోంది. వెడ్డింగ్ వెండర్స్ , వెన్యూస్ అన్నీ ఒకే ఫ్లాట్ ఫామ్ కి తెస్తుంది. ఢిల్లీ, బెంగళూరు, గోవాల్లో ఇప్పటికే మంచి పేరు తెచ్చుకుంది. ఈ ఏడాది చివరి కల్లా చెన్నై, కోల్ కతా, హైదరాబాద్ తో పాటు ఇరవై నగరాలకు విస్తరించాలని ప్రణాళికలు సిద్దం చేసుకుంది. గత ఏడాది డిసెంబర్ లో పది లక్షల డాలర్ల పెట్టుబడిని యాంబిట్ క్యాపిటల్ అందించింది. మళ్లీ ఈ ఏడాది మొదట్లోనే సిక్స్త్ సెన్స్ వెంచర్స్ మరికొంత పెట్టుబడిని అందించడంతో విస్తరణ ప్రణాళికల్లో దూసుకెళ్తోంది.

భారత్ లో ఏడాది పది మిలియన్ల వివాహాలు జరుగుతున్నాయని అంచనా. వివాహ మార్కెట్ ప్రస్తుతం ఏడాదికి రూ.40 బిలియన్ల డాలర్ల స్థాయిలో ఉంది. ఈ మార్కెట్ ఏడాదికి ఇరవై ఐదు శాతం చొప్పున పెరుగుతోంది. వెడ్డింగ్ మూడ్, షాదీసాగా, బాలీవుడ్ షాదీస్ లాంటి మ్యారేజ్ సర్వీస్ స్టార్టప్స్ లో జోరుమీదున్నాయి. గుర్గావ్ కేంద్రంగా ప్రారంభమైన వెడ్ మి గుడ్ స్టార్టప్ కు రెండు కోట్ల డెభ్బై లక్షల రూపాయల ఫండింగ్ ను ఇండియన్ ఎంజెల్ నెట్ వర్క్ అందించింది. ఔట్ బాక్స్ వెంచర్స్ ఇచ్చిన పెట్టుబడితో షాదీసాగా మరిన్ని విభాగాలు, నగరాలకు సేవలు అందించేందుకు సిద్ధమయింది.

జీవితాంతం మెమరబుల్ గా ఉంచుకునేలా పెళ్లి చేసుకోవాలనే తాపత్రయం యువతలో పెరగడంతో పాటు.. తమ పిల్లల పెళ్లి ఘనంగా చేయాలని తల్లిదండ్రులు సైతం అనుకుంటుండటంతో మ్యారేజ్ మార్కెట్ అనూహ్యమైన వృద్దిని నమోదు చేస్తోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని కొత్త తరం అంట్రప్రెన్యూర్లు.. యువత ఆలోచనలు, అభిరుచులకు అనుగుణంగా ఏ మాత్రం కష్టపడకుండా.... అద్భుతమైన పెళ్లి అనుభవాన్ని అందించే బాధ్యతను తమ భుజాలపై వేసుకుంటున్నారు. దాంతో వీటికి ఆదరణ శరవేగంగా పెరుగుతోంది. కొన్నాళ్లకు ఈ పెళ్లి సేవల స్టార్టప్స్ మెట్రో నగరాల నుంచి ద్వితీయశ్రేణి నగరాలకూ విస్తరించవచ్చు.