ఖరీదైన ఆపరేషన్లు ఉచితం... మహిళలకోసం ప్రత్యేకం!!

0
వైద్యులంటే అపరబ్రహ్మలు. అదే కొంచెం సేవాదృక్పధం ఉంటే నిజంగా వాళ్లు దేవుళ్లతో సమానం. చిన్న చిన్న రోగాలకు ఉచిత వైద్యం చేసేవాళ్ల గురించే గొప్పగా చెప్పుకుంటాం... మరి లక్షలకు లక్షలు ఖర్చయ్యే అరుదైన ఆపరేషన్లను పైసా తీసుకోకుండా చేసేవారిని ఏ విధంగా కీర్తించాలి. ఇలాంటి వైద్య శ్రీమంతులు ఇప్పుడు ఇండియాలో వంద అత్యంత ఖరీదైన ఆపరేషన్లను ఉచితంగా నిర్వహిస్తున్నారు. అదీ కూడా మహిళలకు. పిల్లలకు.

గ్రహణం మొర్రి, కాలిన గాయాలు, యాసిడ్ దాడులకు గురైన వారికి ప్లాస్టిక్ సర్జరీలు అవసరమైనవారు మనదేశంలో లక్షల్లో ఉంటారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో, నిరుపేదలైన బాధితులకు చికిత్స చేయించుకునే అవకాశమే ఉండదు. కారణం ఇవి ఎంతో ఖరీదైనవి కాబట్టి. అందరికీ కాకపోయిన కొంత మందికైనా ఇలాంటి పేషంట్లకు ఉచితంగా ఆపరేషన్లు చేసేందుకు కొంతమంది వైద్యులు ముందుకొచ్చారు. ఫిబ్రవరి 28 నుంచి ఆపరేషన్లు ప్రారంభించారు. మహిళా దినోత్సవమైన మార్చి 8వ తేదీ వరకు వీటిని బెంగళూరులోని డబ్ల్యూ ప్రతీక్ష హాస్పిటల్ లో నిర్వహిస్తున్నారు. వందమంది మహిళలు, చిన్నారులకు ఆపరేషన్లు చేయాలని వైద్యుల బృందం నిర్ణయించుకుంది.

ప్రాజెక్టు రివైవ్ పేరుతో సేవా భావం ఉన్న వైద్యుల బృందం చేపట్టిన ఈ ఆపరేషన్లకు గ్రహణం మొర్రి, యాసిడ్ దాడులు, కాలిన గాయాలకు గురై బయటకు రాలేక, బాధపడుతున్నవారిని సర్జరీలకు ఎంపిక చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న పేదలకు అవకాశం కల్పిస్తున్నారు. డబ్ల్యూ ప్రతీక్ష హాస్పిటల్ దేశంలో అతి పెద్దదైన విమెన్ హాస్పిటల్స్ లో ఒకటి. ఈ ఆస్పత్రి మొదటి వార్షికోత్సవం కూడా మార్చి ఎనిమిదో తేదీనే. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని యాజమాన్యం ఈ బృహత్కర సేవా కార్యక్రమం చేపట్టింది. ఈ ప్రాజెక్టుకు డా. బిప్లవ్ అగర్వాల్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నారు.

ఆపరేషన్లు చేసేందుకు యూకే చెందిన ఇంటర్ ప్లాస్ట్ సంస్థ వైద్యుడు డా.చార్లెస్ వివా నేతృత్వంలో సీనియారిటీ, నైపుణ్యం కలిగిన వైద్యుల బృందం బెంగళూరు వచ్చింది. ఇంటర్ ప్లాస్ట్ యూకేలో రిజిస్టరైన అతిపెద్ద సామాజిక సేవా సంస్థల్లో ఒకటి. సేవా దృక్పధం కలిగిన వైద్యులంతా ఓ బృందంగా ఏర్పడి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ప్రతి ఏడాది రెండు వారాల పాటు ఈ ఇంటర్ ప్లాస్ట్ వైద్యనిపుణుల బృందం వివిధ దేశాల్లో ఉచితంగా సర్జీలు చేస్తుంది. ముఖ్యంగా వైద్య సౌకర్యాలకు దూరంగా ఉండే పేదలకు సేవలు అందించగలిగే ప్రాంతాలనే ఇంటర్ ప్లాస్ట్ వైద్యులు ఎంచుకుంటారు. గతంలో ఉగాండా, పాకిస్థాన్ లో ఆపరేషన్లు చేశారు. ఈ ఏడాది భారత్ లో సేవలు అందిస్తున్నారు.

ఈ ప్రాజెక్టులో రితింజలి ( హెల్పింగ్ హ్యాండ్స్ ) అనే స్వచ్ఛంద సంస్థ పాలు పంచుకుంటోంది. ఈ సంస్థ మోటో.. "సమాజం నుంచి తీసుకున్నదాంట్లో కొంత తిరిగిద్దాం..." అన్న కాన్సెప్ట్ తో రితింజలి సేవా కార్యక్రమాలు చేపడుతోంది.

భారత్ లో 28 లక్షల మంది పిల్లలు, పెద్దలు గ్రహణం మొర్రితో బాధపడుతున్నట్లు అంచనా. వీరంతా ఆర్థిక సమస్యలు, సరైన అవగాహన లేకపోవడం వల్ల చికిత్సకు దూరంగా ఉంటున్నారు. యాసిడ్ దాడుల్లో గాయపడిన వారు, కాలిన గాయాల బారిన పడిన వారు కూడా 3 లక్షల మందికిపైగానే ఉంటారని ఇండియన్ మెడికల్ జర్నల్ అంచనా. శరీరంలో అనూహ్యంగా పెరిగిపోయే కణుతుల బారిన పడేవారు కూడా చికిత్స కోసం భారీగా ఖర్చు చేయాల్సి వస్తోంది. పేదలకు ఇలాంటి వైద్యం అందని ద్రాక్షగా మారింది. సుదీర్ఘమైన వైద్య ప్రక్రియ ఉండే ఇలాంటి సర్జీలు పేదలకు పెనుభారమే.

ఈ వైద్య శ్రీమంతుల మొక్కవోని సేవా తత్పరతకు మీరూ చేయందించవచ్చు. పేషంట్లకు స్పాన్సర్ గా వ్యవహరించవచ్చు. ఈ ప్రాజెక్ట్ రివైవ్ మెసెజ్ ను స్ప్రెడ్ చేయడం ద్వారా ఇలాంటి సర్జరీలు అవసరం ఉన్నవారికి తెలుస్తుంది.. బాధాసర్పద్రష్టులకు కొత్త జీవితాలకు దారి చూపించినట్లవుతుంది.

డబ్ల్యూ ప్రతీక్ష ఉమెన్స్ హాస్పిటల్,బెంగళూరు
డబ్ల్యూ ప్రతీక్ష ఉమెన్స్ హాస్పిటల్,బెంగళూరు
డా.చార్లెస్ వివా
డా.చార్లెస్ వివా