డైనమిక్ ఐఏఎస్ అనుపమ అంటే అక్రమార్కులకు గుండెదడ

డైనమిక్ ఐఏఎస్ అనుపమ అంటే అక్రమార్కులకు గుండెదడ

Tuesday February 21, 2017,

2 min Read

ఐఏఎస్ అంటే అయ్యా ఎస్ అనే సర్వీస్ కాదు.. ఐఏఎస్ అంటే అక్రమార్కుల ఆటలు సాగనివ్వని సర్వీస్ అని నిరూపించే అతికొద్దిమంది జాబితాలో ముందు వరుసలో ఉంటారు యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ టీవీ అనుపమ. 2010 బ్యాచ్ కి చెందిన అనుపమ కేరళ ఫుడ్ కమిషనర్ గా చార్జ్ తీసుకోవడమే ఆలస్యం.. కల్తీ పదార్ధాల మీద కత్తి యుద్ధం ప్రకటించి అక్రమార్కుల గుండెల్లో సింహస్వప్నమై నిలిచారు. ఆఫీసర్ అన్న తర్వాత రాజకీయ ఒత్తిళ్లు, దందారాయుళ్ల బెదిరింపులు కామన్. కానీ అనుపమ వాటిని లెక్కచేయలేదు.

image


కేరళలో దశాబ్దాలుగా కల్తీ వ్యాపారం వేళ్లూనుకుంది. ముఖ్యంగా ఆహారపదార్ధాల్లో పురుగ మందు అవశేషాలు ఎక్కువయ్యాయి. అడిగేవాడు లేడు. దందా యదేచ్ఛగా సాగుతోంది. ఏడాదిన్నర క్రితం దాకా వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా సాగింది. ఎప్పుడైతే అనుపమ చార్జ్ తీసుకున్నారో అప్పటి నుంచి కల్తీ దందా బంద్ అయింది. ఒక ప్రముఖ ఫుడ్ బ్రాండ్ మీద రైడింగ్ కేరళలో సంచలనమైంది. దాడి చేయడమే కాదు.. హానికారక పదార్ధాల అవశేషాలను నిరూపించి మరీ ప్రాడక్ట్ మీద బ్యాన్ విధించారు. దాంతో మిగతా ట్రేడర్స్ గుండెల్లో గుబులు పుట్టింది.

అలా వన్ బై వన్ దాడులు. ఎక్కడా రాజీపడలేదు. ఎవరికీ బె దరలేదు. కూరగాయల దగ్గర్నుంచి అన్ని రకాల ఆహార పదార్ధాల మీద కీన్ అబ్జర్వేషన్. ఈ దాడుల్లో చాలాచోట్ల పళ్లు, కూరగాయలు పట్టుబడ్డాయి. విపరీతమైన ఫెస్టిసైడ్స్ వాడటం మూలంగా వాటిల్లో 300 శాతం హానికారకాలున్నట్టు తేలింది. సుమారు 6వేళ్ల శాంపిళ్లు సేకరించి కోర్టుకు సమర్పించింది. వివిధ ట్రేడర్లపై 750కి పైగా కేసులు నమోదు చేసింది.

దాడుల్లో రోజుకో దుర్మార్గం బయటపడేది. పురుగు మందుల అవశేషాలు విపరీతంగా కళ్లముందు కనిపిస్తున్నాయి. కానీ దానికి సొల్యూషన్ రెడీగా లేదు. ఏం చేయాలి? దాడులు.. శాంపిళ్లు.. కేసులు.. కోర్టులు.. ఇవి కాకుండా దీనికో పరిష్కారం కావాలి. అనుపమ ఆలోచనలు వేగంగా పరుగులు పెట్టాయి. జనాన్ని కూరగాయలు కొనకుండా ఆపలేం. అది ఒక్కరోజు కూడా సాధ్యం కాదు. వేరే మార్గం కావాలి. విపరీతమైన పురుగుమందులతో పండించిన కూరగాయలు తినడం వల్ల జరిగే దుష్పరిణామాలు జనానికి తెలియాలి. వాళ్లలో చైతన్యం తీసుకురావాలి. ముందు ఆ దారిలో నరుక్కుంటూ వస్తే ఆటోమేటిగ్గా సమస్య సాల్వ్ అవుతుంది. అడుగు ఆ దిశగా పడింది. సభలు, సమావేశాలు, చైతన్య ర్యాలీలు ఒకపక్క.. చెక్ పోస్టులు, మార్కెట్ల దగ్గర శాంపిళ్ల సేకరణ మరోపక్క.. ముప్పేట దాడి జరిగింది.

ఇలా చేస్తూనే పురుగుమందులు వాడకుండా అచ్చంగా కూరగాయలు ఎలా పండించుకోవచ్చో అవగహనా కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వం తరుపున సబ్సిడీకి విత్తనాలు సరఫరా చేశారు. ఫలితం అనూహ్యంగా మారింది. తమిళనాడు, కర్నాటక నుంచి వచ్చే కూరగాయల్లో దాదాపు 70 శాతం కొనుగోళ్లు పడిపోయాయి. ఇప్పుడు జనం కల్తీలేని కూరగాయల్ని తింటున్నారు.

2010 బ్యాచ్ అనుపమ, సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్ లో ఫోర్త్ ర్యాంకర్. తన దృష్టిలో చేసింది చాలా తక్కువ. చేయాల్సింది ఎంతో ఉంది. పబ్లిసిటీకి దూరంగా ఉంటారు. కనీసం పర్సనల్ ఫేస్ బుక్ పేజీ కూడా లేదు. నో ట్విటర్. ఎలాంటి అఫీషియల్ పేజీ లేదు.

పబ్లిక్ సర్వీస్ అంటే పబ్లిక్ కి సర్వీస్ చేయడమే అనే చిత్తశుద్ధి ఉన్న ఐఏఎస్ లు దేశంలో బహుకొద్దిమంది ఉంటారు. అందులో అనుపమ ఒకరు. ఆమెలాంటి డెడికేటెడ్ యంగ్ ఆఫీసర్లే దేశానికి కావల్సింది. అప్పుడే వ్యవస్థలో మార్పు కనిపిస్తుంది. చదివిన చదువుకి సార్ధకత వస్తుంది. శెభాష్ అనుపమ.