ఇన్ఫోసిస్ ఉద్యోగం వదిలి.. ఇంటికి సరుకులు డెలివర్ చేసే స్టార్టప్

ఇన్ఫోసిస్ ఉద్యోగం వదిలి.. ఇంటికి సరుకులు డెలివర్ చేసే స్టార్టప్

Saturday October 24, 2015,

3 min Read

విమానాన్ని క్యాచ్ చేసే హడావుడిలో శ్రీధర్.. స్టోర్‌లోనే ల్యాప్ టాప్ మర్చిపోయాడు. అయినా ఆయనేమీ టెన్షన్ పడలేదు. ఎందుకంటే ఆయన మొబైల్‌లో అర్బన్ హాపర్జ్ యాప్ ఉంది. ఆ యాప్ ద్వారా తన ల్యాప్ ట్యాప్ ఇంటికి పంపించే ఏర్పాటు చేశారాయన. మరో ఘటనలో ఓ వ్యక్తి తన తాళం చెవిల గుత్తిని ఎక్కడో మర్చిపోయాడు. ఎక్కడో గుర్తులేదు. అన్ని చోట్లా వెతికాడు. అయితే సూపర్ మార్కెట్ సూపర్‌వైజర్ అర్బన్‌ హాపర్జ్ ద్వారా ఆ కీస్‌ను పంపించారు.

‘‘ ఈ రెండు ఘటనలు మేం రూపొందించిన యాప్ ఎంత అవసరమో చెప్తోంది. లాంచ్ చేసిన రెండు నెలల్లోనే మా యాప్‌కు వివపరీతమైన రెస్పాన్స్ వచ్చింది ’’ అని అర్బన్‌ హాపర్జ్ వ్యవస్థాపకురాలు లక్ష్మీ పిళ్లై గుప్తా చెబ్తున్నారు. ఢిల్లీ, నోయిడాలతోపాటు గుర్గావ్‌లో కొన్ని ప్రాంతాల్లో ఈ యాప్ ద్వారా సేవలందిస్తున్నారు లక్ష్మీ.

లక్ష్మీ పిళ్లై గుప్తా, అర్బన్ హోపర్జ్ వ్యవస్థాపకురాలు

లక్ష్మీ పిళ్లై గుప్తా, అర్బన్ హోపర్జ్ వ్యవస్థాపకురాలు


స్వయం ఉపాధి అంటే ఇష్టపడే లక్ష్మీ .. ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో మంచి నెట్వర్క్ ఏర్పాటు చేసుకుని యాప్ ద్వారా సేవలందిస్తున్నారు. ‘‘ఈ-కామర్స్, క్లౌడ్ కిచెన్ వంటి రంగాలకు సేవలందిస్తున్నాం. మాది వెండార్ యాప్ కాదు. కస్టమర్లు వారు కోరుకున్న స్టోర్స్ నుంచి కావాలనుకున్న వస్తువులను డెలివరీ చేసేందుకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని లక్ష్మీ వివరించారు.

టెక్నాలజీ అంటే ప్రాణం..

లక్ష్మీ తండ్రి ఓ రీసెర్చర్. వీరిది కేరళ. పుట్టింది మాత్రం కోల్‌కతాలో, పెరిగింది ఢిల్లీ. కురుక్షేత్రలో ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రూమెంటల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారావిడ. ఇన్ఫోసిస్‌లో తన కెరీర్‌ను మొదలుపెట్టారు. జాబ్ చేస్తున్నప్పటికీ ఆమెకు మొదటి నుంచి బిజినెస్ అంటే ఎంతో ఆసక్తి. ఇన్ఫోసిస్ తర్వాత 2005లో బెంగళూరులో ఎస్ఏపీ ల్యాబ్స్‌లో ప్రొక్యూర్‌మెంట్ డొమైన్‌లో బాధ్యతలు నిర్వహించారు. 2010లో సోషల్ అంటర్‌ప్రైజ్ అటెరోలో ఐటీ అండ్ మార్కెటింగ్ హెడ్ గా చేరారు.

‘‘నేను చేరినప్పుడు మాది ఐదుగురు సభ్యుల బృందం. ఈ డొమైన్‌లో ఉన్న సమస్యలేంటో తెలుసు. భారత్‌లో కిందిస్థాయిలో ఎన్నో సమస్యలున్నాయని నాకు అర్థమైంది. ఆరంభంలో ఈ రంగంలో నేర్చుకునేందుకు ప్రయత్నించాను’’ అని లక్ష్మీ వివరించారు.

కెరీర్‌కు బ్రేక్

2013లో కూతురు జన్మించడంతో ఎనిమిది నెలల పాటు లక్ష్మీ కెరీర్‌కు విశ్రాంతి ఇచ్చారు. ఆ తర్వాత మళ్లీ అదే కంపెనీలో చేరడంతో సిబ్బంది నుంచి ఘన స్వాగతం లభించింది. ఆమె క్యాబిన్‌ను చిన్నపాటి నర్సరీగా మార్చేశారు. మూడురోజుల పాటు తన కూతురుతోపాటు కార్యాలయానికి వెళ్లేవారు. మరో రెండు రోజులు ఇంటి నుంచే పనులు నిర్వహించేవారు. ‘‘డెలివరీ తర్వాత సిబ్బంది, యాజమాన్యం నుంచి నాకు లభించిన సపోర్ట్ అనిర్వచనీయం’’ అని అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు లక్ష్మీ.

image


పాప పుట్టిన తర్వాత విశ్రాంతి తీసుకున్న సమయంలో తన కెరీర్ గురించి ఆమె తీవ్రంగా ఆలోచించారు. ఆ సమయంలోనే ఢిల్లీ నగరవాసులు పడుతున్న కష్టాల గురించి కూడా ఆలోచించారు. అప్పుడే అర్బన్ హాపర్జ్ ఐడియా వచ్చింది. బిజినెస్ చేయాలన్న ఆమె స్వప్నం అర్బన్ హాపర్జ్‌తో సాకారమైంది. మెడిసిన్స్ నుంచి బేబీ ఫూడ్, ఆహార ధాన్యాలు ఇలా అన్ని రకాల వస్తువులను ఈ అర్బన్ హాపర్జ్ డెలివరీ చేస్తుంది. వినియోగదారులకు అనుకూలంగా పనులు చేసి పెడుతుంది. ప్రస్తుతం పేమెంట్ గేట్ వే‌ను ఇంటిగ్రేట్ చేయాలన్న ఆలోచనలో కూడా లక్మీ ఉంది. నలుగురు సభ్యుల బృందం ఈ సంస్థ వ్యవహారాలను పర్యవేక్షిస్తున్నది. వాస్తవిక దృక్పథంతో ప్రజలకు కనెక్ట్ అయ్యేందుకు ఈ యాప్‌ను రూపొందించినట్టు లక్ష్మీ చెప్తారు. వాస్తవానికి అర్బన్ హాపర్జ్ ఈ- కామర్స్ వెంచర్ కాదు. ఢిల్లీ ప్రజల అవసరాలను తీర్చేందుకు రూపొందించిన యాప్ మాత్రమే అని లక్ష్మీ అంటారు. మరోవైపు సంస్థ సేవలను మరిన్ని నగరాలకు కూడా విస్తరించాలని ఆమె భావిస్తున్నారు. ఐతే నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ లేదని, అందుకే విస్తరణపై అంత తొందరపడటం లేదంటారు.

‘‘ మా సంస్థ స్థితిగతులపై రోజువారీగా విశ్లేషణ చేసుకుంటున్నాం. ఓ వినియోగదారుడిగా, ప్రొఫెషనల్‌గా సంస్థ పనితీరును నేను అంచనా వేస్తుంటాను’’ అని ఈ 35 ఏళ్ల మహిళా వ్యవస్థాపకురాలు వివరించారు. తన అనుభవాలే తనకు మంచి పాఠాలని ఆమె చెప్తారు.

ముందున్న సవాళ్లు

సంస్థ ఫౌండర్ అయినప్పటికీ అందరు ఉద్యోగుల్లానే ఆమె పనిచేస్తుంటారు. ఆదివారాలు మాత్రం ఇంటికే పరిమితమవుతారు.

‘‘సంస్థను ప్రారంభించినప్పుడే ఆదివారాలు రెస్ట్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాను. కెరీర్-లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకోవడం ఎంతో అవసరం. ఓ సంస్థను ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఎందుకంటే పనిని ప్రేమిస్తాను’’ అని లక్ష్మీ చెప్పారు. బిజినెస్‌తోపాటు తన చిన్నిపాపతో గడిపేందుకు ఈమె ఇష్టపడుతుంటారు. కానీ బిజినెస్‌తో అంతగా సమయం దొరకకపోవడం ఆమెను బాధిస్తోంది.

‘‘వర్కింగ్ విమెన్‌గా ప్రతి ఒక్కరూ ఎన్నో సవాళ్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ ఎప్పుడో ఒకప్పుడు మంచి రోజులు వస్తాయి. అప్పటివరకు వేచి చూడకతప్పదు’’ అని లక్ష్మీ వివరించారు.