క్రిష్ణానది తీరాన ప్రతిధ్వనించిన నారీభేరీ

క్రిష్ణానది తీరాన ప్రతిధ్వనించిన నారీభేరీ

Sunday February 12, 2017,

2 min Read

ఆంధ్రుల రాజధాని అమరావతి వేదికగా మహిళా లోకం నినదించింది. నింగీనేలా మాదే అంటూ సరికొత్త చరిత్రకు నాంది పలికింది. క్రిష్ణానదీ తీరాన మూడు రోజుల పాటు జరిగిన జాతీయ మహిళా పార్లమెంటు సదస్సులో నారీ భేరీ ప్రతిధ్వనించింది. అర్ధవంతమైన చర్చలు, ఆకట్టుకునే ప్రసంగాలు ఆమె భవితకు బంగారు బాటలు వేశాయి. విద్యావేత్తలు, సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ఎందరో తమ అభిప్రాయాల్ని పంచుకున్నారు. తమతమ అంతరంగాలను ఆవిష్కరించారు. వివక్ష లేని సమాజం కోసం పోరాడాలని వక్తలంతా పిలుపునిచ్చారు. ప్రశ్నించే గొంతు మూగబోవద్దని ఖరాకండిగా చెప్పారు. సమానత్వం కోసం రాజీలేని పోరాటం చేయాలని స్ఫూర్తిదాయక ప్రసంగాలిచ్చారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ శాఖల సమన్వయంతో మూడు రోజుల పాటు నడిచిన మహా మేథోమథనం విజయవంతంగా ముగిసింది.

image


సదస్సు ముగింపు రోజు స్పీకర్ సుమిత్రామహాజన్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. చట్టసభల్లో రిజర్వేషన్ల అంశాన్ని ఆమె ప్రస్తావించారు. ఫలానా కావాలని దేబేరించాల్సిన అగత్యం మహిళకు లేదని అన్నారు. ఏదైనా గౌరవంగా సాధించుకోవాలని ఆమె సూచించారు. రిజర్వేషన్లు సాధించే టైం దగ్గర పడిందని స్పీకర్ అన్నారు. అన్ని రంగాల్లో రాణిస్తున్న మహిళలు సమాజానికి మంచి సారథులుగా ఉంటారని, వారిలో ఆ సత్తా ఉందని సుమిత్రా మహాజన్ ఆశాభావం వ్యక్తం చేశారు. సర్పంచులుగా, స్థానిక సంస్థల ప్రతినిధులుగా ఉన్న ప్రాంతాల్లో విద్య, వైద్యం, పరిశుభ్రత విషయాల్లో అగ్రగామిగా ఉన్నట్లు సర్వేలు తేల్చాయని ఈ సందర్భంగా స్పీకర్ గుర్తు చేశారు. మహిళా శక్తికి ఇంతకంటే ఉదాహరణ ఇంకేం కావాలని అన్నారు. అమరావతిలో ఈ సదస్సు నిర్వహించుకోవటం సంతోషంగా ఉందన్న స్పీకర్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబును అభినందించారు. తాము కూడా ఇలాంటి సదస్సుని అంతర్జాతీయస్థాయిలో నిర్వహించాలని భావిస్తున్నట్లు ఆమె తెలిపారు.

విజయవాడలో జరిగిన ఈ మూడు రోజుల సదస్సులో ఎన్నో అంశాలపై విస్తృతమైన చర్చలు జరిగాయి. ప్రత్యక్షంగా 22వేల మంది... సామాజిక మాధ్యమాల్లో 6కోట్ల మంది డిబేట్లను ఫాలో అయ్యారు, తొలుత 12వేల మంది వస్తారని అంచనా వేశారు. కానీ 22వేల మందికి పైగా విద్యార్థినులు పాల్గొన్నారు. దాదాపు 70మంది వరకూ ప్రముఖులు ప్రసంగించారు. 20మంది విద్యార్థినులకు వేదికపై మాట్లాడే అవకాశం లభించింది. 300 కాలేజిల నుంచి అమ్మాయిలు ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష్యంగా వీక్షించారు.