లేట్ నైట్‌లో హాట్ ఫుడ్‌తో ఆకలి తీర్చే 'శాంటా డెలివర్స్'

లేట్ నైట్‌లో హాట్ ఫుడ్‌తో ఆకలి తీర్చే 'శాంటా డెలివర్స్'

Sunday October 25, 2015,

3 min Read

బిజీలైఫ్ లో తిండీతిప్పలు మానేసి పనిచేసే వాళ్లను మనం చూస్తూనే ఉంటాం. పనిలో పడి అర్థరాత్రి వరకూ భోజనం గురించే పట్టించుకోరు. ఆ సమయంలో ఏ హోటల్ తెరిచుంటుందో తెలియదు. అంతే... ఆ పూటకి ఏదో తినేసి మమ అనిపించేస్తారు. ఇలా బిజీబిజీగా ఉంటూ భోజనాన్ని విస్మరించేవారికి నేనున్నాను అంటున్నాడు శాంటా. శాంటా అంటే క్రిస్‌మస్ పండక్కి గిఫ్టులిచ్చే శాంటా క్లాస్ గుర్తొచ్చాడా ? ఈ శాంటా కూడా అంతే. మీకు ఆకలేసే టైంకి ఠంచనుగా భోజనాన్ని తీసుకొచ్చి మీకు అందిస్తాడు. కోల్ కతాకు చెందిన ఇద్దరు ఎంబీఏ విద్యార్థుల మదిలో మెదిలిన ఆలోచనే శాంటా డెలివర్స్. కోల్ కతాలో ప్రారంభమైన ఫుడ్ టెక్ స్టార్టప్ లేట్ నైట్ ఫుడ్ డెలివరీతో కస్టమర్ల ఆకలి తీరుస్తోంది.

శాంటా డెలివర్స్ మొదలైంది ఇలా ?

ఆదర్శ్ చౌదరీ, హర్ష్ కందోయ్... ఇద్దరూ స్నేహితులు. 2014 డిసెంబర్‌లో క్యాట్ రిజల్ట్స్ వచ్చిన రోజునే శాంటా డెలివర్స్‌ని ప్రారంభించారు. క్యాట్ రిజల్ట్స్ అనుకున్నట్టుగా రాకపోవడంతో నిరాశ చెందిన ఆదర్శ్... ఈ స్టార్టప్‌కి రిబ్బన్ కట్ చేశారు. "అద్భుత ప్రయాణానికి ఇది ఆరంభం మాత్రమేనని నాకు నేనే చాలాసార్లు చెప్పుకున్నాను. ఏం జరిగినా దృఢంగా ఉండేందుకు ప్రయత్నించాను. దృష్టంతా ఈ ప్రాజెక్ట్ పైనే. శాంటా డెలివర్స్ కోసం నేను ఎంత చేయగలిగితే అంత చేయాలని నిర్ణయించుకొని ముందుకెళ్లా" అంటూ ఆ రోజుల్ని గుర్తుచేసుకుంటున్నాడు ఆదర్శ్. తల్లిదండ్రులు ఇచ్చిన లక్ష రూపాయల పెట్టుబడితో శాంటా డెలివర్స్‌ని ప్రారంభించారు వీరిద్దరు. మొదటి రోజు ఉదయం నాలుగ్గంటలకు ఆదర్శ్, హర్ష్ ఇద్దరూ కలిసి ఓ న్యూస్ పేపర్ ఏజెంట్ దగ్గరకెళ్లారు. 10 వేల పాంఫ్లెట్లు తీసుకెళ్లి పంచమని ఇచ్చారు. ఉదయం ఏడు గంటల వరకు ఏజెంట్ దగ్గరే ఉన్నారు. ప్రతీ న్యూస్ పేపర్ లో పాంఫ్లెట్ ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రారంభించిన మూడు రోజుల్లోనే శాంటా డెలివర్స్‌కు 20 ఆర్డర్లు వచ్చాయి. మొత్తం పదివేల రూపాయల సేల్స్ జరిగాయి.

"మొదట్లో రోజుకు కనీసం ఐదు ఆర్డర్లు వచ్చేవి. మొదటి నెలలో డెలివరీ బాయ్స్ దొరకకపోవడంతో మేమే స్వయంగా వెళ్లి కస్టమర్లకు ఫుడ్ పార్శిల్ డెలివరీ చేసేవాళ్లం. నిరంతరాయంగా మార్కెటింగ్ పైనే దృష్టిపెట్టాం. కాలేజీలు, ఆఫీసులకు వెళ్లి మా స్టార్టప్ గురించి పరిచయం చేశాం. తద్వారా ఆర్డర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది" అంటాడు హర్ష్.
ఆదర్శ్ చౌదరీ, హర్ష్ కందోయ్-కో ఫౌండర్లు

ఆదర్శ్ చౌదరీ, హర్ష్ కందోయ్-కో ఫౌండర్లు


శాంటా డెలివర్స్ పేరు ఎందుకంటే...?

కస్టమర్లు కోరుకున్నప్పుడు వారి ఆకలితీరుస్తాం, లేట్ నైట్‌లో కూడా ఫుడ్ డెలివరీ చేస్తాం కాబట్టి తాము శాంటా క్లాజ్ లాంటివాళ్లమన్నది ఫౌండర్ల నమ్మకం. అందుకే ఈ స్టార్టప్ కి శాంటా డెలివర్స్ అని పేరు పెట్టారు. సాయంత్రం ఐదు గంటల నుంచి అర్థరాత్రి మూడు గంటల వరకు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఫుడ్ డెలివరీ చేస్తారు. కానీ లేట్ నైట్ ఫుడ్ డెలివరీ వీరి ప్రత్యేకత. santadelivers.co.in లో లేదా యాండ్రాయిడ్ యాప్ ద్వారా ఆర్డర్లు ఇవ్వొచ్చు. ప్రస్తుతం వీరి టీంలో 14 మంది ఉన్నారు. వీరిలో ముగ్గురు పార్ట్‌నర్లు, ఒక మేనేజర్, ఐదుగురు డెలివరీ బాయ్స్, ముగ్గురు షెఫ్స్, ఇద్దరు హెల్పర్స్. "మేం ఏ రెస్టారెంట్‌తో టై-అప్ చేసుకోలేదు. ఏ హోటల్ నుంచి ఆహారం తీసుకొచ్చి డెలివరీ చేయం. కస్టమర్లకు ఏం కావాలన్నా వండిచ్చేది మేమే" అంటారు ఆదర్శ్. వీరి ఆదాయమంతా సేల్స్, డెలివరీలపైనే ఆధారపడి ఉంది. ప్రస్తుతం రోజుకు 40 నుంచి 45 ఆర్డర్లు వస్తున్నాయి. సగటున ఒక ఆర్డర్ కు 450 రూపాయలు. ఇలా నెలకు 13 వందల ఆర్డర్లు వస్తున్నాయి. నెలనెలా 20 శాతం వృద్ధి రేటు కనిపిస్తోంది. వీరికి రెండు ప్రత్యేకమైన కిచెన్‌లు ఉన్నాయి. ఇందులో ఒకటి వెజిటేరియన్, మరొకటి నాన్-వెజిటేరియన్.

ఊహించని మలుపు

వీరి డ్రీమ్ వెంచర్ పట్టాలెక్కి సవ్యంగా సాగుతున్న సమయంలో వీరి జీవితంలో ఊహించని మరో మలుపు ఎదురైంది. హర్ష్, ఆదర్శ్ లకు నర్సీ మోంజీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్‌లో ఎంబీఏ సీటు వచ్చింది. శాంటా డెలివర్స్ పై దృష్టి పెట్టడమా, ఎంబీఏ చెయ్యడమా అని తేల్చుకోవడం వీరికి పెద్ద సవాల్‌గా మారింది. కుటుంబ సభ్యులతో పలుమార్లు చర్చించిన తర్వాత హయ్యర్ ఎఢ్యుకేషన్ చేయడమే మంచిదని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే ఎంబీఏ చేస్తే స్టార్టప్‌ని మరో లెవెల్ కి తీసుకెళ్లొచ్చన్నది వీరి ఆలోచన. అయితే స్టార్టప్ వ్యవహారాలను చూసుకునేందుకు వీరి స్నేహితుడు పుల్కిత్ కేజ్రీవాల్ ఆసక్తి చూపించాడు. శాంటా డెలివర్స్‌కి కొత్త రూపు తీసుకొచ్చేందుకు పుల్కిత్ కేజ్రీవాల్‌ను ఈ వెంచర్‌లో భాగస్వామిని చేశారు. ప్రస్తుతం పుల్కిత్ ఆపరేషన్స్, మార్కెటింగ్ వ్యవహారాలు చూస్తున్నారు. ఎంబీఏ చదువుతూనే ఈ ఇద్దరూ శాంటా డెలివర్స్ కోసం ఎంతో కృషి చేశారు. డిజిటల్ మార్కెటింగ్, పబ్లిక్ రిలేషన్స్ కోసం కృషిచేసేవాళ్లు. టీంలోని ఆదిత్య అగర్వాల్, ప్రతీక్ చౌదరీ, గౌరవ్ ఝంఝన్ వాలా, హితేష్ అగర్వాల్‌లు టెక్నికల్ విషయాల్లో సలహాలు, సూచనలు ఇచ్చారంటూ మెచ్చుకుంటాడు ఆదర్శ్.

"ఆరు నెలల ప్రయాణంలో ఎంతో నేర్చుకున్నాం. మొదటి మూడు నెలలు మేం చాలా ఓపికగా ఉన్నాం. ఫోన్ ఎప్పుడు రింగ్ అవుతుందా, ఎవరు అర్డర్ ఇస్తారా అని ఎదురుచూసేవాళ్లం. పార్శిల్ తీసుకెళ్లడం, కస్టమర్ గుమ్మం వరకు వెళ్లి డెలివర్ చెయ్యడంలో మాకు అవరోధాలుండేవి. కానీ శాంటా డెలివర్స్ ఈ అవరోధాలన్నింటినీ అధిగమించింది." ఆంట్రప్రెన్యూరల్ ప్రయాణం గురించి ఆదర్శ్ చెప్పే మాటలివి.
image


ముందడుగు దిశగా...

ప్రస్తుతం శాంటా డెలివర్స్ కోల్‌కతాలోని సాల్ట్ లేక్, న్యూ టౌన్, సిల్వర్ స్ప్రింగ్, ఫూల్ బాగన్, లేక్ టౌన్ ప్రాంతాల్లో ఫుడ్ డెలివరీ చేస్తోంది. వచ్చే మూడేళ్లలో కోల్‌కతా అంతటా విస్తరించాలన్నది వీరి ఆలోచన. అంతే కాదు దేశంలోని ప్రముఖ పట్టణాల్లో అడుగుపెట్టాలనుకుంటున్నారు. "వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి నెలకు మూడు వేల ఆర్డర్లు అందుకుంటామన్నది మా అంచనా. రెవెన్యూపరంగా చూసుకుంటే నెలకు 13 లక్షలు ఉండొచ్చనుకుంటున్నాం" అంటారు పుల్కిత్.

website