పిల్లల భద్రతపై భరోసా ఇస్తున్న 'లోకస్'

కాబూల్‌‍లో ఉన్నపుడు రితేష్ అతి దగ్గరలో పేలిన బాంబ్‌పిల్లల భద్రతకు మరిన్ని చర్యలు అవసరమని తెలుసుకున్న వైనం చైల్డ్ సేఫ్టీ యాప్ తయారు చేసిన ఇద్దరు పేరెంట్స్

పిల్లల భద్రతపై భరోసా ఇస్తున్న 'లోకస్'

Sunday September 06, 2015,

4 min Read

చిన్నారులపై అకృత్యాలు జరగని రోజు ఒక్కటంటే ఒక్కటి కూడా ఉండదు. లక్షలు, కోట్ల కొద్దీ అనేక సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వాటిలో కొన్నింటినే మనం తెలుసుకుంటున్నాం. వాటిని కూడా అంతలోనే మర్చిపోతుంటాం కూడా.

image


చిన్నారుల భద్రత ఎంత అవసరమో ఇద్దరు పిల్లల తండ్రులైన రితేష్ పాండ్య, విశ్వనాథ్ వి. బలూర్‌లు గ్రహించారు. తమ పిల్లలు భద్రమైన పరిసరాల్లో ఉన్నారనే భరోసా కోరుకున్నారు వాళ్లు. వారిలోని ఈ తపనే లోకస్‌ను సృష్టించడానికి దారి చూపింది. మొబైల్ యాప్‌తో లింక్ చేసిన ఓ పరికరం ఈ లోకస్. తమ పిల్లలను ఎల్లవేళలా పర్యవేక్షించడానికి లోకస్ ఉపయోగపడుతుంది.

“పిల్లలకు తల్లిదండ్రులు అన్నీ ఇస్తారు. ఏం చేయాలో, ఏం చేయకూడదో చెబ్తారు. స్పర్శించడంలో సదుద్దేశ్యం, దురుద్దేశ్యాలని వివరిస్తారు. తాము బయటకు వెళ్లేపుడు పిల్లలకు మొబైల్ ఇచ్చి... ఏదైనా అర్జంట్ అయితే కాల్ చేయాలని చెబ్తారు. కానీ స్కూళ్లలో మొబైల్స్ వాడకం నిషేధం. అందుకే చిన్నారులకు పూర్తి స్థాయి భద్రత కల్పించే ఓ వ్యవస్థకు రూపకల్పన చేయాలని భావించాం” అని చెప్పారు రితేష్.
రితేష్ పాండ్య

రితేష్ పాండ్య


ప్రారంభానికి నాంది

మే 2, 2012న కాబూల్‌లో బాంబ్ పేలుడు సంభవించింది. తాలిబన్ల దాడిలో ఓ స్కూల్ సమీపంలో జరిగిన ఈ పేలుడు కారణంగా... అనేక మంది ప్రాణాలు పోయాయి. పిల్లలు, తల్లిదండ్రులు, భద్రతా సిబ్బంది మధ్య విపరీతమైన గందరగోళం, తొక్కిసలాట చేసుకున్నాయి. ఈ ఘటన జరిగినపుడు.. అక్కడకు దగ్గరలోనే ఉన్నాడు రితేష్.

ఆపద సమయాల్లో ,పిల్లలకు తమ తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నారో, పేరెంట్స్‌కి పిల్లలు ఎక్కడున్నారో తెలుసుకోగలిగేలా ఓ అత్యవసర సమాచార వ్యవస్థ ఎంత అవసరమో.... ఈ సంఘటన జరిగిన తర్వాత తెలిసొచ్చింది రితేష్‌కి. తన ఆలోచనను ఆచరణలో పెట్టేందుకు.. సాంకేతిక నిపుణుడైన సహ వ్యవస్థాపకుడి కోసం అన్వేషణ ప్రారంభించాడు రితేష్. కొన్నాళ్ల తర్వాత ఇండియాకి తిరిగొచ్చేసి, ఆన్‌మొబైల్ గ్లోబల్‌లో ఉద్యోగం చేయడం ప్రారంభించాడు. ఆ సమయంలోనే ఇంజినీరింగ్ విభాగానికి డైరెక్టర్‌గా ఉన్న విశ్వనాథ్‌తో పరిచయం అయింది.

మధ్యాహ్న భోజనం చేస్తున్నపుడు... ఓసారి తన ఆలోచనను విశ్వనాథ్‌తో పంచుకున్నాడు రితేష్.

“అవసరమైన సాంకేతికతపై కొంత పరిశోధన చేసిన తర్వాత.. ఇది సాధ్యమే అని అర్ధమైంది. అప్పుడు నా ప్రతిపాదనకు విశ్వనాథ్ సాంకేతిక అనుభవాన్ని జోడించి.. ఆలోచనకు ఓ రూపం ఇవ్వగలిగాం. ఇరువురం అభిప్రాయాలను పంచుకోవడం ద్వారా.. ఈ కాన్సెప్ట్‌ను మరింత సమర్ధవంతంగా రూపొందించగలిగామ”ని చెప్పారు రితేష్.

ఆ సమయంలో బెంగళూరులో ఈ స్కూల్‌లో చదువుతున్న విద్యార్ధిపై... లైంగిక వేధింపులు జరిగిన ఘటన బయటకు వచ్చింది. ఒకవేళ మేం తయారు చేయాలని అనుకున్న లోకస్ అప్పటికే పూర్తయ్యి.., ఆ ప్రొడక్ట్ వారి దగ్గర ఉంటే.. ఈ సమస్యకు సులభమైన పరిష్కారం లభించేదని మాకు అర్ధమైంది. దీని అవసరం ఈ సమయంలోనే మరింతగా తెలిసొచ్చింది. అంతే తాత్యా టెక్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఓ కంపెనీని ప్రారంభించి, కార్యాచరణ మొదలుపెట్టేశారు.

ఏమిటీ లోకస్ ?

జీపీఎస్, జీపీఆర్ఎల్ ఆధారంగా పనిచేసే.. స్కూల్ ఐడెంటిటీ కార్డ్ లాంటిదే లోకస్. ప్రతీ చిన్నారి దీన్ని సులభంగా మోసుకెళ్లచ్చు. ఇది ఎల్లప్పుడూ ఆయా చిన్నారులు ఏ ప్రాంతంలో ఉన్నారో... ముందుగా సెట్ చేసిన పేరెంట్స్ మొబైల్ యాప్‌కి అప్‌డేట్స్ పంపుతుంది. దీంతో తల్లిదండ్రులు.. నిరంతరం తమ పిల్లల భద్రతపై ఓ కన్నేసి ఉంచొచ్చు.

రియల్ టైంలో లొకేషన్‌ని షేర్ చేయడంతోపాటే... సేఫ్ జోన్, నాన్ సేఫ్ జోన్ ఆప్షన్లు కూడా ఉన్నాయి దీనిలో. ఒకవేళ ఆ చిన్నారి భద్రత లేని ఏరియాలోకి ప్రవేశిస్తే.. వెంటనే తల్లిదండ్రలను అలర్ట్ చేసేలా ఈ డివైజ్ రూపొందించారు. ప్రస్తుతం అయితే... తల్లిదండ్రలకు మొబైల్ ద్వారా ఎస్ఎంఎస్ పంపుతుందీ ఈ డివైజ్. ఒకవేళ చిన్నారుల దగ్గరున్న డివైజ్‌కి.. బ్యాటరీ అయిపోవచ్చినా, స్విచాఫ్ అయినా ఈ తరహా సందేశం అందుతుంది. పిల్లలు ప్రయాణిస్తున్న వాహనం స్పీడ్ లిమిట్‌కి మించి ప్రయాణించినా సరే.. అలర్ట్‌లు రావడం విశేషం.

ఇందులో సెట్ చేసిన ప్యానిక్ బటన్‌ని ప్రెస్ చేయడం ద్వారా.. తాము ప్రమాదంలో ఉన్నామనే సంకేతాన్ని పిల్లలు పేరెంట్స్‌కి పంపచ్చు. వెంటనే ఒక మొబైల్ కాల్ వారికి అందుతుంది. దీంతో పిల్లలున్న ప్రదేశంలో ఏం జరుగుతోందో తెలుసుకుని... అందుకు తగిన చర్యలు చేపట్టేందుకు తల్లిదండ్రులకు అవకాశం ఉంటుంది.

ఈ సేఫ్టీ ఫీచర్స్‌కి అదనంగా.. యాప్ ద్వారా పేరెంట్స్, టీచర్స్ ఒకరితో ఒకరు మెసేజెస్ ద్వారా సంభాషించుకోవచ్చు. స్కూల్ యాక్టివిటీస్, హోమ్‌వర్క్ లాంటి ఇతర సమాచారాని పంచుకోవచ్చు.

విశ్వనాథ్ బలుర్

విశ్వనాథ్ బలుర్


స్కూల్స్ ‌నుంచి ఆదరణ

లోకస్ ప్రారంభమై ఇప్పటికి ఏడాది పూర్తైంది. ఇప్పటివరకూ 40 స్కూల్స్‌ను, 700మంది పేరెంట్స్‌ను కలిశారు ఈ వ్యవస్థాపకులు. లోకస్‌ని ఉపయోగించడంపై 4 పాఠశాలలతో ఒప్పందం కూడా కుదుర్చుకున్నారు.

"స్కూళ్ల నుంచి అనుకున్న దానికంటే ఎక్కువగానే సానుకూల స్పందన వస్తోంది. ప్రస్తుతం ఎలక్ట్రానిక్ సిటీలోని సెయింట్ ఫ్రాన్సిస్ డెసేల్స్ పబ్లిక్ స్కూల్. రిచ్‌మండ్ రోడ్‌లోని కెథడ్రల్ స్కూల్, సంజయ్ నగర్ లోని శిక్షా సాగర్‌లతోపాటు.. మరికొన్ని విద్యా సంస్థలు కూడా... లోకస్‌ను ప్రవేశపెట్టేందుకు అంగీకరించాయి, ఒప్పందం చేసుకున్నాయి. అతి త్వరలో ఈ సంఖ్య 25కు చేరబోతోంది” అంటున్నారు విశ్వనాథ్.


స్కూల్స్ ద్వారా ఈ డివైజ్‌ను విద్యార్ధులకు అందేలా చేస్తున్నా.. వ్యక్తిగతంగా వినియోగించుకునేందుకు.. వెబ్‌సైట్ ద్వారా పేరెంట్స్ నేరుగా కొనుగోలు చేయచ్చు. గూగుల్ ప్లే ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునే అవకాశమున్నా... దీనికి డివైజ్‌‌ని కొనుగోలు చేసినపుడు ఇచ్చే ఐడీని లింక్ చేయాల్సి ఉంటుంది.

లోకస్ రూట్లో సవాళ్లు

ప్రస్తుతం లోకస్ టీంలో వ్యవస్థాకులతో కలిపి.. ఎనిమిది మంది టీం ఉన్నారు. వీరిలో విశ్వనాథ్‌తో కలిపి.. ఐదుగురు సాంకేతిక నిపుణులు ఉన్నారు. ఒకరు యూజర్ ఇంటర్‌ఫేజ్‌పై ఉండగా.. మరొకరు యూజర్ ఎక్స్‌పీరియన్స్‌పై వర్క్ చేస్తున్నారు. రితేష్‌తో కలిపి మరో ఇద్దరు సేల్స్, మార్కెటింగ్ విభాగాల్లో ఉన్నారు.

విశ్వనాథ్, రితేష్‌లకు ఈ ప్రయాణంలో ఎదురైన సవాళ్లు అనేకం ఉన్నాయి. “ఓ ఆలోచన నుంచి ఇక్కడి వరకూ చేసిన ప్రయాణం ఎంతో ఉత్సాహం ఇచ్చింది. ఈ జర్నీలో మాకు ప్రోత్సాహంతోపాటే.. అవరోధాలు కూడా ఎదురయ్యాయి. ముఖ్యంగా యాప్ అభివృద్ధి విషయంలో అనేక సవాళ్లను ఎదుర్కున్నాం”అని చెప్పారు రితేష్.

ఒక్క రూపాయి కూడా ఆదాయం లేకపోయినా... సుదీర్ఘ కాలం అభివృద్ధి కోసం వెచ్చించాల్సి రావడం... లోకస్ ఎదుర్కున్న మరో సమస్య.

“ఇది మా సొంత నిధులతో ఏర్పాటు చేసిన వెంచర్ అని టీం మొత్తానికి తెలుసు. అందుకే వారిలో నిరుత్సాహం కలగకుండా.. ఎప్పటికప్పడు వారికి ఉత్సాహం కలిగించేందుకు ప్రయత్నించాం. అభివృద్ధిపై, భవిష్యత్తుపై నమ్మకాన్ని కలిగించామ”ని చెప్పారు రితేష్.

తమ వెంచర్‌ను మరింత వేగంగా అభివృద్ధి చేసేందుకు తగిన ఇన్వెస్టర్ కోసం చూస్తున్నారు రితేష్, విశ్వనాథ్‌లు. ఈ టీం అభివృద్ధి చేస్తున్న మరో రెండు యాప్స్‌ కూడా ప్రస్తుతం డిజైనింగ్ స్థాయిలో ఉన్నాయి. వీటి వివరాలను త్వరలో వెల్లడిస్తామంటున్నారు రితేష్, విశ్వనాథ్‌లు.

వెబ్‌సైట్