పండంటి డిజిటల్ పేమెంట్లకు పదకొండు తాయిలాలు!

డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తున్నాం- అరుణ్ జైట్లీ

పండంటి డిజిటల్ పేమెంట్లకు పదకొండు తాయిలాలు!

Thursday December 08, 2016,

2 min Read

పాత పెద్ద నోట్లు రద్దు చేయడంతో ఆన్ లైన్ లావాదేవీలు 20 నుంచి 40 శాతానికి పెరిగాయని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. కరెన్సీ రద్దు చేసి నెల రోజులు అవుతున్న సందర్భంగా ఆయన ప్రత్యేక మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నేపధ్యంలో క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్లను ప్రోత్సహించేందుకు జైట్లీ 11 సూత్రాలను వెల్లడించారు.

ప్రతి రోజు 4.50 కోట్ల మంది పెట్రోల్‌, డీజిల్‌ ఉత్పత్తులు కొనుగోలు చేస్తున్నారు. ఈ నెల రోజుల్లో 40 శాతం పెట్రోల్‌,డీజిల్‌ ఉత్పత్తుల కొనుగోళ్లు పెరిగాయి. గతంలో 18 వేల కోట్ల అమ్మకాలు జరిగాయి. ఈ నేపథ్యంలో డిజిటల్‌ మనీ కార్డుల ద్వారా పెట్రోల్‌, డీజిల్‌ కొనుగోలు చేస్తే 0.75 శాతం డిస్కౌంట్ ఇస్తామని కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. 10 వేల మంది జనాభా ఉన్న లక్ష గ్రామాలకు రెండు పీవోఎస్‌ మిషన్ల చొప్పున ఉచితంగా ఇస్తామని ప్రకటించారు. కిసాన్‌ క్రెడిట్‌ కార్డులున్న రైతులకు రూపే కార్డులు అందిస్తామని జైట్లీ తెలిపారు.

image


సబర్బన్‌ రైళ్లలో డిజిటల్‌ పేమెంట్ల ద్వారా మంత్లీ పాసులు, కార్డుల ద్వారా మంత్లీ, సీజన్‌ టికెట్లు కొనుగోలు చేస్తే 0.5 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని ఆర్ధిక మంత్రి ప్రకటించారు. డిజిటల్ మోడ్‌లో రైల్వే టికెట్లు కొనుగోలు చేస్తే రూ. 10 లక్షల ప్రమాద బీమా వర్తిస్తుందని అన్నారు. రైల్వే క్యాటరింగ్‌ డిజిటల్‌ మోడ్‌లో ఆర్డర్‌ చేస్తే 5 శాతం డిస్కౌంట్‌ వస్తుందని చెప్పారు. ఆన్‌లైన్‌ మోడ్‌లో జనరల్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటే ప్రీమియంపై 10 శాతం, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ తీసుకుంటే ప్రీమియంపై 8 శాతం డిస్కౌంట్‌ ఉంటుందని జైట్లీ ప్రకటించారు. డిజిటల్‌ మోడ్‌లో రూ.2 వేల లోపు లావాదేవీలకు సర్వీస్‌ ట్యాక్స్‌ లేదని స్పష్టం చేశారు. టోల్‌ప్లాజాల్లో టోల్‌ రేడియో ట్యాగ్‌ ద్వారా ఫీజు చెల్లిస్తే 10 శాతం డిస్కౌంట్‌ ఇస్తామన్నారు.

బ్యాంకుల్లో సరిపడా డబ్బులు అందుబాటులో ఉన్నాయన్న జైట్లీ .. కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో డిజిటల్‌ పేమెంట్లపై ఛార్జీలు ఎత్తివేశామని స్పష్టం చేశారు. ఆన్ లైన్ లావాదేవీలను పెంచేందుకు 11 కీలక నిర్ణయాలు తీసుకున్నామని.. డిజిటల్‌ మనీని ప్రోత్సహించాలన్నదే లక్ష్యమని జైట్లీ తెలిపారు. ఇప్పుడిప్పుడే డిజిటల్‌ మనీ దిశగా దేశం కదులుతోందని ఆయన అభిప్రాయ పడ్డారు. క్యాష్‌లెస్‌ లావాదేవీలను మరింత వేగవంతం చేయాలి జైట్లీ సూచించారు.

షెడ్యూల్‌ ప్రకారం లిక్విడ్ క్యాష్ అన్ని ప్రాంతాలకు సరఫరా అవుతోందని అరుణ్ జైట్లీ ప్రకటించారు. నగదు లావాదేవీల నిర్వహణ ఖర్చుతో కూడుకున్నది కాబట్టే డిజిటల్ పేమెంట్లను ప్రోత్సహిస్తున్నామని జైట్లీ స్పష్టం చేశారు.