కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి డేకేర్ సెంటర్లవైపు ఇద్దరు తల్లుల పయనం

కార్పొరేట్ పేరెంట్స్‌కు పిల్లల బాధ్యత అంత సులువు కాదు..ఎవరూ ఉద్యోగాలు వదులుకోలేని స్థితి..ఇంట్లో పెద్దవాళ్లు ఉన్నా వారూ చేసుకోలేరు..చిన్న వయస్సులో పిల్లల బుద్ధివికాసానికి డేకేర్ సెంటర్లే నయం..ఈ రంగంలో పుష్కలమైన అవకాశాలున్నాయని గుర్తించిన కార్పొరేట్ మదర్స్..ఉన్నతోద్యాగాలు వదిలేసి ఈ రంగంవైపు అడుగులు..కార్పొరేట్ కంపెనీలు కోరితే వాళ్ల ఆఫీసుల్లోనే డేకేర్ సెంటర్లు..ఢిల్లీ, ముంబైలో వేగంగా విస్తరిస్తున్న 'ది లిటిల్ కంపెనీ'..

కార్పొరేట్ ఉద్యోగాలు వదిలి డేకేర్ సెంటర్లవైపు ఇద్దరు తల్లుల పయనం

Tuesday July 07, 2015,

4 min Read

అనగనగా ఓ ఇద్దరు మిత్రులు. అమృత, బిందు. ఇద్దరీ కార్పొరేట్ ప్రపంచాన్ని ఏలుతున్న మహారాణులే. అత్యున్నత ఉద్యోగాలు చేస్తూ సత్తా చాటుకుంటున్నవారే. ప్రొఫెషనల్ లైఫ్‌లో ప్రమోషన్లతో పాటు పర్సనల్ లైఫ్‌లో ఇద్దరూ తల్లులయ్యారు. అంతే ఇక్కడ వరకూ సాగిన వారి కార్పొరేట్ జర్నీకి ఒక్కసారిగా బ్రేక్ పడింది. ఇద్దరూ ఫుల్ టైమ్ మదర్స్‌గా సెటిల్ కావాల్సి వచ్చింది. తీరా చూస్తే ముంబై నగరంలో ఎక్కడా తమను సంతృప్తి పరిచే చైల్డ్ డేకేర్ సెంటర్లు లేకపోవడం వాళ్లకు వెలితిగా అనిపించింది. అయితే అందరిలా కెరీర్‌కు పుల్ స్టాప్ పెట్టి ఇంటిపట్టున ఉండకుండా 'ది లిటిల్ కంపెనీ' పేరుతో ఓ డే కేర్ సంస్థనే మొదలుపెట్టేశారు. ఆఫీసులకెళ్లే కార్పొరేట్ తల్లులతో పాటు సాధారణ మహిళలకూ ఎంతో పెద్ద రిలీఫ్ ఇచ్చారు.

image


ఏంటి వీళ్ల స్పెషాలిటీ ?

సాధారణంగా ఇప్పుడు మార్కెట్లో ఉన్న డే కేర్ సెంటర్లు ఆఫర్ చేస్తున్నట్టు డేకేర్, ప్లేస్కూల్, యాక్టివిటీ సెంటర్ వంటి సేవలను ఆఫర్ చేస్తారు. వీటితో పాటు కార్పొరేట్ క్లైంట్స్ అయిన గోద్రెజ్, హిందుస్తాన్ యునిలివర్, లోరియాల్, రాయల్ బ్యాంక్ ఆఫ్ స్కాట్లాండ్, అమర్‌చంద్ మంగళ్‌దాస్‌ సంస్థలకు ఇన్ హౌస్ డేకేర్ సెంటర్లను నిర్వహిస్తారు. ప్రస్తుతం వీళ్లకు ముంబైలో మూడు సెంటర్లు, గుర్గావ్‌ డిఎల్ఎఫ్ సైబర్ సిటీలో ఒక సెంటర్ ఉంది.

అమృతా సింగ్ ఒక కామర్స్ గ్రాడ్యుయేట్. ఆమె బ్యాంకులు, టెక్స్‌టైల్ సంస్థలతో కలిసి పనిచేశారు. బిందు బిండే ఒక కెమికల్ ఇంజనీర్. ఆమె అంబుజా సిమెంట్స్, భారత్ పెట్రోలియం వంటి సంస్థల్లో పనిచేశారు. చైల్డ్ కేర్ సేవల్లోకి అడుగు పెట్టేముందు బిందు డే కేర్ మేనేజ్‌మెంట్‌ కోర్స్ పూర్తిచేశారు. ఇద్దరూ కలిసి తమ ఉద్యోగాలు వదిలేసి ఈ రంగంలోకి దిగిపోయారు.

'2001లో నేను, బిందు ఇద్దరూ ప్రెగ్నెంట్స్‌గా ఉండగా డే కేర్ సెంటర్ ఆలోచన ప్రాణం పోసుకుంది. భాగస్వామ్య సంస్థగా మొదలైన ఆ కంపెనీయే 2013లో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థగా ఎదిగింది. పదేళ్ల క్రితం ఇద్దరం చెరో రూ.5 లక్షలతో కంపెనీ ఏర్పాటు చేశాం. గతేడాది అది రూ.3 కోట్ల టర్నోవర్ దాటింది' అంటూ గర్వంగా చెబ్తారు అమృత.

బిజినెస్ టు బిజినెస్ మోడల్‌లో కార్పొరేట్ సంస్థలకు అవసరం కోసం వాళ్ల సెంటర్లోనో లేక దగ్గరలో కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. ఇక బిజినెస్ టు కస్టమర్ మోడల్‌ ఇండిపెండెంట్ డే కేర్ సెంటర్లను ఏర్పాటు చేస్తారు. పేరెంట్స్ ఎవరైనా వచ్చి ఎన్‌రోల్‌ చేసుకుని తమ పిల్లాడిని అక్కడ వదిలేసి వెళ్లొచ్చు.

image


బిందు చెబ్తున్నదాని ప్రకారం ఈ మధ్య కార్పొరేట్ రంగంలో బి2బి మోడల్ విపరీతమైన ఆదరణ పొందుతోంది. తమ దగ్గరున్న నిపుణులైన సిబ్బందిని వదులుకోలేక వాళ్లే డేకేర్ సెంటర్ల ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. 

'దీనికి కారణం ఈ మధ్య సీనియర్ స్థాయి సిబ్బందిలో మహిళల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. దీన్ని లీకింగ్ పైప్‌లైన్‌గా కార్పొరేట్ పరిభాషలో అభివర్ణిస్తారు. జాతీయ మానవ వనరుల శాఖ నిర్వహించిన ఓ సర్వేలో తేలిందేంటంటే దేశంలో 31 శాతం మంది ఉద్యోగులు... యాక్టివ్‌గా ఉన్నప్పటికీ అనేక కారణాలతో పనికి దూరమవుతున్నారు' అని చెబ్తారు.

ది లర్నింగ్ సెంటర్(TLC) కార్పొరేట్లతో కలిసి పనిచేస్తుంది. సదరు కంపెనీ వీళ్లకు నెలవారీ నిర్వాహణా ఖర్చులను అందజేస్తుంది. ఈ సేవలు ఉపయోగించుకునే ఉద్యోగులే డేకేర్ సెంటర్ నిర్వాహకులకు ఫీజ్ చెల్లించాల్సి ఉంటుంది. అయితే అందులో కొంత మొత్తాన్ని ఉద్యోగి పనిచేసే కంపెనీయే సబ్సిడీ రూపంలో TLCకి కడ్తుంది.

రక్షణే ప్రధానం

నాణ్యతే టిఎల్‌సి ముఖ్యలక్షణమని అమృత చెబ్తున్నారు. ప్రస్తుతం నిర్వహిస్తున్న కేంద్రాలన్నీ వాళ్లే సొంతంగా చూసుకుంటున్నారు. ఫ్రాంచైజీ మోడల్ లేదు. అన్నింటికంటే తల్లిదండ్రులకు ముందు తమపై భరోసా కలగాలి. అందుకోసం అక్కడి స్టాఫ్ సుశిక్షితులై ఉండాలి. తమ చంటిబిడ్డని అక్కడ వదిలేసి వెళ్లగలిగేంత ధైర్యాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అందుకే సూపర్‌విజన్‌లో తాము ఆ ప్రత్యేకత తీసుకురాగలిగామని చెప్తుంది టిఎల్‌సి. 6-18 నెలల చంటి పిల్లలకు 2:1 చొప్పున (ఇద్దరు పిల్లలకు ఒక కేర్‌టేకర్), 18 నెలలు నిండిన పిల్లలకైతే 5:1 లెక్కల నియమిస్తారు. అవసరాలు చూసుకోవడమే కాకుండా పిల్లల్లో బుద్ధి వికాసానికి, వాళ్ల ఆలోచనా శక్తి పెరగడానికి సుశిక్షితులైన ప్రొఫెషనల్స్, క్వాలిఫైడ్ ప్రాక్టీషనర్స్ ఉన్నారని బిందు చెబ్తున్నారు.

నోటిమాటల ద్వారా ఇంతవరకూ టిఎల్‌సి ప్రచారం సాగుతూ వస్తోంది. కస్టమర్ల నమ్మకాన్ని ఏటికేడు నిలబెట్టుకుంటూనే వస్తున్నామని ఈ సోదర ద్వయం చెబ్తోంది. ఉద్యోగాలు చేసుకునే వాళ్లే కాకుండా కొంత మంది గృహిణులు కూడా వీళ్ల దగ్గర సేవలు పొందుతున్నారు. చదువుకునే వాళ్లు, హాబీగా ఏదైనా నేర్చుకోవాలనుకునేవాళ్లు, సెకెండ్ కెరీర్ ప్లాన్ చేసుకునే తల్లులు కూడా ఉంటున్నారు. ఇంకొంత మంది తల్లులైతే ఇతర పిల్లలతో కలిసి ఆడుకునేందుకు, వాళ్ల వయస్సు ఉన్న వాళ్లతో సమయం గడిపేందుకు తమ పిల్లలను ఇక్కడ వదిలివెళ్తున్నారు.

కొన్ని సందర్భాల్లో పిల్లల తల్లిదండ్రులు మా సిబ్బందికి డబ్బులు ఇస్తూ ఉంటారు. వీకెండ్స్ కూడా చూసుకోమని, వ్యాక్సినేషన్ వేయించేందుకు తీసుకెళ్లమని, రాత్రి డిన్నర్‌కు కూడా ఏదో ఒకటి తినిపించేయమని చెబ్తూ ఉంటారు. ఇది చూసి మాకు చాలా బాధేస్తూ ఉంటుంది. మా ఫిలాసఫీని పేరెంట్స్‌కు అర్థమయ్యేలా చెప్పలేకపోతున్నామా అనే అనుమానం కలుగుతూ ఉంటుందని అంటారు బిందు.

నలుగురు సభ్యుల నుంచి ఇప్పుడు రెండు నగరాల్లో టిఎల్‌సికి 130కిపైగా ఉద్యోగులు ఉన్నారు. అయితే కేవలం ఉద్యోగులను ఎంపిక చేసుకునేటప్పుడు కేవలం చదువును మాత్రమే చూడడంలేదనేది వీళ్ల మాట. 

ది లిటిల్ కంపెనీ మేనేజ్‌మెంట్ కోర్ టీమ్

ది లిటిల్ కంపెనీ మేనేజ్‌మెంట్ కోర్ టీమ్


'అన్నింటికంటే ముఖ్యంగా మా మైండ్‌సెట్‌కు తగినవారు, ఆర్గనైజేషన్ కల్చర్‌కు అలవాటు పడే ఆసక్తి ఉన్నవారినే ఎంపిక చేస్తున్నాం. నేర్చుకోవాలనే తపన ఉండే ఏ వయస్సులో అయినా ఏమైనా నేర్చుకోవచ్చు. కొంత బేసిక్ ఎడ్యుకేషన్ వచ్చి ఉండడంతో పాటు వాళ్ల సాఫ్ట్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, అకౌంటబులిటీని చూస్తాం అని చెప్తారు' అమృత.
టిఎల్‌సి సెంటర్లో పిల్లలు

టిఎల్‌సి సెంటర్లో పిల్లలు


ఇప్పుడు పది డే కేర్ సెంటర్ల ఏర్పాటు చేశాక, తర్వాతి లక్ష్యాన్ని అందుకోవడానికి టిఎల్‌సి ప్రణాళికలు రచిస్తోంది. త్వరలో ఒక ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్ ఏర్పాటు చేయాలని కూడా వీళ్లు భావిస్తున్నారు. పిల్లల వికాసం కోసం తల్లిదండ్రులకు ఇక్కడ శిక్షణ ఇవ్వాలని అనుకుంటున్నారు. 'వ్యాపారాన్ని విస్తరించాలని అనుకుంటున్నాం, కానీ నాణ్యత విషయంలో రాజీపడి మాత్రం చేయబోం అంటూ హామీనిస్తున్నారు' బిందు.