సకల కళల నిలయం లామకాన్

సకల కళల నిలయం లామకాన్

Thursday March 17, 2016,

3 min Read


సమయం సాయంత్రం ఆరు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 1. జీవీకే మాల్ ఎదురు గల్లీ. చుట్టూ ఖరీదైన ఆవాసల మధ్య ఉంటుందో బంగళా. చేతులు జోడించి స్వాగతం పలుకుతున్నట్టుగా దాని గేట్ తలుపులు. అడుగు పెట్టగానే సకల కళల చౌరస్తాలో నిలబడ్డ గర్వం.. ఒళ్లంతా పాకుతుంది.

ఓ కుర్రాడు సీరియస్ గా లాప్ టాప్ లో తలదూర్చేస్తాడు..

ఒకమ్మాయి ఫోన్ సైలెంట్ మోడ్ లో పెట్టి దాన్ని హాండ్ బ్యాగ్ లో పడేసి పుస్తకంలో మమేకమైపోతుంది...

నలుగురు స్నేహితులు ఒక స్టార్టప్ కంపెనీ గురించి మెట్ల మీద కూచొని డిస్కస్ చేస్తుంటారు...

ఒక ఔత్సాహిక ఫిల్మ్ మేకర్ తాను తీసిన డాక్యుమెంటరీని ప్రదర్శించే యాంగ్జయిటీలో ఉంటాడు..

లామకాన్. నిన్నటి హైదరాబాదును నేటి తరానికి పరిచయం చేసే వేదిక. లామకాన్ అంటే ఇల్లు కాదు. అదొక సర్వవ్యాపితం. సకల కళల సమ్మేళనం. వేయి ఆలోచనలకు.. లక్ష సంఘర్షణలకు వేదిక. చర్చలు సాగుతుంటాయి. సమాలోచనలు నడుస్తుంటాయి. అభిప్రాయాలు పరివ్యాప్తమవుతుంటాయి. హక్కులు గొంతు విప్పుతుంటాయి. బాధ్యతలు పిడికిళ్లు బిగిస్తుంటాయి. వేడివేడి సమోసా మధ్య చైతన్యం జ్వలిస్తుంది. పొగలుగక్కే ఇరానీ చాయ్ తో ఆపాటు కవిత్వం చిక్కబడుతుంది. ఒకపక్క సంగీత ఝరి ప్రవహిస్తుంటుంది. మరోపక్క అందెలరవళి ప్రతిధ్వనిస్తుంటుంది.

వీఐపీలు.. కామన్ మ్యాన్ అన్న తేడా లేదు. అందరికీ ఒకేరకమైన ఆతిథ్యం. బండమీద కూర్చో.. మెట్ల మీద కూర్చో.. అలా అని అక్కడ కూర్చోవడమంటే టైం పాస్ వ్యవహారం కాదు. పనీపాట లేని సొల్లుకబుర్లు అంతకన్నా కాదు. వికసించిన మనస్తత్వాలు చుట్టూ ఉంటాయి. కవి హృదయాలు చుట్టేస్తుంటాయి. ప్రగతి శీల భావాలు చూపులు తిప్పుకుంటాయి. వ్యవస్థ బహిర్గతం చేయని ఎన్నో విషయాలు చెవిని చేరుతుంటాయి. రేపటి ప్రణాళికలు సిద్ధమవుతుంటాయి. ప్రత్యామ్నాయ ఆలోచనలు పదునెక్కుతుంటాయి. ప్రజాస్వామిక వాతావరణంలో గొంతులు సవరించుకుంటాయి.

వెన్నెల రాత్రుల్లో ముషాయిరాలు వినొచ్చు. చల్లటి సాయంకాలాల్లో ఆరుబయట బండమీద కూర్చొని డాక్యుమెంటరీ వీక్షించవచ్చు. పగలంతా హాట్ హాట్ డిబేట్స్. ఈవినింగ్స్ కూల్ కూల్ కబుర్లు. అవసరమైతే సోషల్ డిబేట్లలో పాల్గొనవచ్చు. అణచివేత మీద ధిక్కార స్వరం వినిపించొచ్చు. అబ్ స్ట్రాక్ట్ పెయిటింగ్ కు కొత్త డెఫినెషన్ చెప్పొచ్చు. గుప్పిట విప్పని మెట్రోసెక్సువల్ పోయెట్రీలోని బ్యూటీని ఆవిష్కరించవచ్చు.

image


అన్యాయానికి గురవుతున్న వర్గాలను అక్కున చేర్చుకుంది లామకాన్. హక్కులకు భంగం కలిగినా, ప్రశ్నించే గొంతులను పాలకులు నొక్కినా, పక్కదారిపట్టిన వ్యవస్థ మీద ఆగ్రహం ప్రకటించాలన్నా.. లామకాన్ స్పందిస్తుంది. లామకాన్ రారమ్మంటుంది. వచ్చి మాట్లాడు అని పిలుస్తుంది. గొంతెత్తి నినదించు అని రెక్కపట్టి తీసుకెళ్తుంది. పిడికిలి బిగించు అని భరోసా ఇస్తుంది. స్వరం కలుపుతుంది. పదం కలుపుతుంది. పాదం కలుపుతుంది. మనతోపాటే నవ్వుతుంది. మనతోపాటే పాడుతుంది. మనం కోరుకునే కొత్త ప్రపంచాన్ని కళ్లముందు నిలుపుతుంది. విశాలమైన ఆడిటోరియం లేదు. అత్యాధునిక సౌండ్ బాక్సులు ఉండవు. ఏసీ హంగులు లేవు. ఆర్భాటపు ఛాయలు కానరావు. ఒక చెట్టు.. ఒక బండ.. ఒక కుర్చీ ఒక బెంచీ.. ఆకలైతే సమోసా.. మైండ్ ఫ్రెష్ అవవడానికి టీ. మెయిన్ రోడ్డే అయినా రణగొణ ధ్వనులు వినిపించవు. ఖరీదైన బంగళాయే.. కానీ అతి సామాన్యంగా కనిపిస్తుంది.

లామకాన్ అంటే సినిమా. లామకాన్ అంటే సాహిత్యం. లామకాన్ అంటే నాట్యం.. సంగీతం.. వ్యాపారం.. ఉద్యమం.. సోషలిజం.. సెక్యులరిజం.. ప్రజాస్వామ్యం.. వాక్ స్వాతంత్ర్యం.. ప్రత్యామ్నాయ ఆలోచనల సంగమం. ఒక నిశ్శబ్దాన్ని బద్దలు కొడుతూ బంజారాహిల్స్ అలాంటి ఖరీదైన నివాసాల సరికొత్త సాంస్కృతిక సంరంభం. సిటీ కల్చర్ లోనే ఒక నూతన విప్లవం.

మొయిద్ హసన్. ఒకప్పుడు శిలా ఉద్యమకారుడు. ఫోటోగ్రాఫర్. ఆయన ఇల్లే లామకాన్. హక్కుల ఉద్యమాలతో, ఉద్యమకారులతో హసన్కు అనుబంధం ఉంది. బాలగోపాల్, హరగోపాల్ వంటి మేధావుల ఆ ఇంట్లో గంటల తరబడి రోజుల తరబడి చర్చలు జరిపేవారు. 2004లో హసన్ మరణించిన తర్వాత అతని కుటుంబ సభ్యులు ఒక ట్రస్ట్ నెలకొల్పారు. అలా హసన్ ఇల్లు ఓపెన్ కల్చరల్ స్పేస్ గా మారిపోయింది.

ఫర్హాన్

ఫర్హాన్


వీకెండ్ వచ్చిందంటే చాలు ఎందరో రచయితలు, అప్ కమింగ్ ఫిల్మ్ మేకర్స్, స్ట్రగ్లింగ్ యాక్టర్స్ ప్రతిరోజు ఇక్కడకి వస్తుంటారు. ప్రతినెలా స్టార్టప్ శాటర్ డే జరుగుతుంది. మొదట్లో పదుల సంఖ్యలో వచ్చేవారు. ఇప్పుడు రష్ బాగా పెరిగింది. ఒకరకంగా చెప్పాలంటే స్టార్టప్ శాటర్ డేకి ఇదొక శాశ్వత అడ్డా.

ఇప్పుడైతే టీ హబ్ తో పాటు చాలా కో వర్కింగ్ స్పేస్ లు వచ్చాయి. కానీ అప్పట్లోనే నగరంలో స్టార్టప్ కల్చర్ లామకాన్ నుంచే ప్రారంభమైంది. మామూలు సమయాల్లో కూడా చాలామంది స్టార్టప్ పీపుల్ ఇక్కడకు వచ్చి వివిధ అంశాలపై చర్చిస్తూ ఉంటారు. లామకాన్ ప్రారంభించిన అసలు ఉద్దేశం లిబరల్ పాలిటిక్స్. ఈ విషయంలో ఇంకా వెనకబడి ఉన్నామని ఫర్హాన్ అంటున్నారు. లామకాన్ అంటే ఉదారవాద రాజకీయ అభిప్రాయం చెప్పుకొనే స్పేస్ గా మార్చాలనేది తమ లక్ష్యం అంటారాయన. ప్రతి ఏడాది ఓ అజెండా ఏర్పాటు చేసి వాటిపై ఈవెంట్స్ చేయాలని చూస్తున్నామన్నారు ఫర్హాన్. ప్రస్తుతం కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయని, త్వరలోనే వాటిని అధిగమిస్తామని అంటున్నారు. సాంప్రదాయ మ్యూజిక్ కి వెస్ట్రన్ మిక్స్ చేసి క్రాస్ పోల్స్ లాంటి ప్రక్రియలు ఇక్కడ చేపట్టాలని అనుకున్నారు.

undefined

undefined


చివరిగా లామకాన్ క్యాంటీన్ గురించి కూడా కొంత చెప్పుకోవాలి. పూర్తిగా ఆర్గానిక్ ఫుడ్ తో తయారు చేసిన రుచికరమైన వంటకాలు ఇక్కడ లభిస్తాయి. లామకాన్ టీ పాత తరం ఇరానీ కేఫ్ ను తలపిస్తుంది. క్యాంటీన్ లో ఉండే షెఫ్ కేకే అందించే సమోసా రుచిని మించింది లేదు. 50 రూపాయలకే అద్భుతమైన లంచ్ దొరుకుతుందిక్కడ.

డబ్బున్న వారికి మాత్రమే అందుబాటులో ఉండే విశాల ఆడిటోరియాలు, సభాప్రాంగణాలకు ప్రత్యామ్నాయంగా.. అత్యంత ఖరీదైన బంగళాల మధ్య అతిసామాన్యంగా ఉండి.. సామాన్యులకు ఆలంబనగా నిలిచిన ఈ సకల కళల నిలయం లామకాన్ పదికాలాలపాటు వర్ధిల్లాలి. జయహో లామకాన్.