ఒకప్పుడు ప్రొఫెసర్..ఇప్పుడు సక్సెస్ ఫుల్ ఆంట్రప్రెన్యూర్

ఒకప్పుడు ప్రొఫెసర్..ఇప్పుడు సక్సెస్ ఫుల్ ఆంట్రప్రెన్యూర్

Tuesday April 12, 2016,

3 min Read


కోట్లాది మంది వినియోగదారుల సమస్యను పరిష్కరించే ప్రోడక్ట్ సృష్టించే సత్తా మీకు ఉండొచ్చు. కానీ దాన్ని స్టార్టప్ గా మార్చి ఫండ్స్ సేకరించడం అంత తేలికకాదు. పెట్టిబడిదారులను ఒప్పించే క్రమంలో చుక్కలు కనిపిస్తాయి. చాలా టైం వేస్ట్ కావచ్చు. కస్టమర్లను సంపాదించడం మరీ కష్టం. ప్రవీణ్ భగవత్ కూడా అలాంటి కష్టాలనే ఎదుర్కొన్నారు. చివరికి మెక్ డొనాల్డ్ లాంటి బహుళజాతి కంపెనీలను తన కంపెనీ కస్టమర్ గా మార్చుకున్నారు.

పారిశ్రామికవేత్తగా ఎలా మారారంటే?

ప్రవీణ్ భగవత్ ఐఐటీ కాన్పూర్ లో చదువుకున్నారు. పీహెచ్ డీ పూర్తిచేశాక ఐబీఎం రీసెర్చ్ టీంలో చేరారు. వైఫైని సృష్టించిన టీంలో ఈయనొకరు. తన కొలీగ్స్ లోని చాలా మంది సిలికాన్ వ్యాలీ వెళ్లి… సొంత వ్యాపారాలు మొదలుపెట్టారు. ప్రవీణ్ కూడా ఏదో ఒకటి కొత్తగా చేయాలనుకున్నారు. కానీ న్యూయార్క్ విడిచిపెట్టలేక పోయారు. ఎందుకంటే ఆయన భార్య మెడికల్ కాలేజీలో పనిచేసేవారు. ఆ టైంలో నే డాట్ కాం బూమ్ వచ్చింది. అందుకే ఏదో ఒకటి సొంతంగా చేయకపోతే లాభం లేదనుకున్నారు.

సరికొత్తగా ఆలోచన

అందరిలా కాకుండా కాస్త డిఫరెంట్ గా ఆలోచించారు ప్రవీణ్. న్యూయార్క్ లో ఐబీఎం కంపెనీ కొలువుకు గుడ్ బై చెప్పేశారు. తాను చదువుకున్న ఐఐటీ కాన్పూర్ లో ప్రొఫెసర్ గా చేరారు. 2003లోనే కాన్పూర్ లోనే ఎయిర్ టైట్ నెట్ వర్క్స్ పేరుతో వై-ఫై టెక్నాలజీ కంపెనీ స్థాపించారు. ప్రవీణ్ సత్తాపై నమ్మకమున్న కొంతమంది- ఉద్యోగులుగా చేరారు.

తొలి అడుగులు

ప్రపంచంలో తొలిసారిగా వైఫై సృష్టించిన కోర్ టీంలో ఒకరు ప్రవీణ్. అందులో లోటుపాట్లేమిటో ప్రవీణ్ కు తెలుసు. అందుకే వై-ఫైని పూర్తి సెక్యూర్డ్ గా ఉండేలా తయారు చేయాలనుకున్నారు. కాన్పూర్ లోని తన టీం వై-ఫై సెక్యూరిటీ టెక్నాలజీని రూపొందించింది. కానీ దాన్ని మార్కెటింగ్ చేసుకుని బిజినెస్ రూపం ఇవ్వాలంటే డబ్బు కావాల్సివచ్చింది. ఆరేడు నెలల పాటు ప్రవీణ్ కి పట్టపగలే చుక్కలు కనిపించాయి.

తొలినాళ్లలో అందరూ సలహాలిచ్చేవారే గానీ, డబ్బుసాయం చేసేవారు మాత్రం కనిపించలేదు. స్టార్టప్ బోర్డులో టెక్నాలజీపై అవగాహన ఉండి, బాగా డబ్బున్న వ్యక్తి సభ్యుడిగా ఉంటే బాగుంటుందనుకున్నారు. సిలికాన్ వ్యాలీలో తన స్నేహితులతో మాట్లాడారు. సమీర్ పల్నీట్కర్ అనే వ్యక్తికి- ప్రవీణ్ ఐడియా నచ్చి బోర్డులో సభ్యునిగా చేరారు. టెక్ మహింద్రా సీఈఓ కిరణ్ దేశ్ పాండేతో భేటీ అయ్యారు. ఆయన కూడా బోర్డులో మెుంబరుగా ఉండేందుకు అంగీకరించారు. భారత్ లో ఫండ్స్ సేకరణ కష్టమని తెలియడంతో సిలికాన్ వ్యాలీవైపు చూడటం మొదలు పెట్టారు. సిలికాన్ వ్యాలీలోని ఒక వైర్ లెస్ కంపెనీలో సీఓఓగా పనిచేస్తున్న డేవిడ్ కింగ్ అనే వ్యక్తిని తన కంపెనీలో ఈసీఓగా నియమించుకున్నారు.

2004 నాటికి కాలిఫోర్నియా, పుణెలో ఎయిర్ టైట్ నెట్ వర్క్స్ ఆఫీసులు ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర తర్వాత ఫండింగ్ రావడం మొదలయ్యింది. ట్రైడెంట్, వాల్డన్ ఇంటర్నేషనల్, గ్రానైట్ క్యాపిటల్, బ్లూప్రింట్ వెంచర్స్ సంస్థలు 67 కోట్ల రూపాయల వరకు పెట్టుబడులు పెట్టాయి.

ఎదుగుదల

మెక్ డోనాల్డ్ లో 20 నిమిషాల పాటు గడిపిన మోజో నెట్ వర్క్స్ టీం- మిగతా ప్రోడక్ట్స్ కన్నా తమ వైఫై సెక్యూరిటీ సమర్థంగా పనిచేస్తుందని నిరూపించింది.

”మా తొలి క్లైంట్ మెక్ డోనాల్డ్. ఇందుకోసం చాలా కష్టపడ్డారు. మొత్తం మెక్ డొనాల్డ్ ఔట్ లెట్లలో మా వైఫై సెక్యూరిటీనే ఉపయోగిస్తున్నారు “ -డేవిడ్ కింగ్ 

2009 నాటికి వైఫై సెక్యూరిటీస్ వ్యాపారం లాభసాటిగా మారింది. ఫండింగ్ కూడా పెరిగింది. వై-ఫైని చాలా మంది ఉపయోగిస్తున్నా.. వై-ఫై సెక్యూరిటీ కోసం ఖర్చు చేసేందుకు సిద్ధంగా లేరు. డిఫెన్స్, హైసెక్యూరిటీ జోన్స్ లో ఉన్న వారు తప్పనిసరిగా ఈ వైఫై సెక్యూరిటీస్ పెట్టించుకుంటున్నారు.

image


ఎదుగుదల

ఐదేళ్ల పాటు మామూలుగా వ్యాపారం చేశాక, మరోసారి రీ-గ్రూప్ అవ్వాలని నిర్ణయించుకున్నారు. తాము అమ్మిన డివైసెస్ ను, వైఫై యాక్సెస్ పాయింట్లుగా మార్చగలరా అని కొన్ని కంపెనీలు కోరాయి. దీంతో వై-ఫై యాక్సెస్ సేవలను సైతం ప్రారంభించారు. తమ డివైసెస్ లో రెండు స్విచ్ లు పెట్టారు. ఒకటి వై-ఫై సెక్యూరిటీ స్పాట్ కాగా, రెండోది వై-ఫై యాక్సెస్ పాయింట్. చాలా కార్పొరేట్ కంపెనీలు మోజో నెట్ వర్క్స్ ను ఉపయోగించేందుకు ముందుకొచ్చాయి. ఒక సెంట్రల్ పాయింట్ నుంచి ఆపరేట్ చేయడం కష్టమనిపించింది. 2011లోనే క్లౌడ్ కంప్యూటింగ్ ప్రవేశపెట్టారు. ఈ ఏడాది మోజో టెక్నాలజీగా పేరు మార్చారు.

మోజో నెట్ వర్క్స్ ఇప్పుడు 50 శాతం వృద్ధి నమోదు చేసుకుంటోంది. టైమ్ వార్నర్ కేబుల్, FDA, హిల్టన్, ఓవర్ స్టాక్ , ఏడీపీలాంటి బడా కంపెనీలు సైతం మోజో నెట్ వర్క్స్ ను ఉపయోగించుకుంటున్నాయి.

వై-ఫై మార్కెట్

మార్కెట్స్ అండ్ మార్కెట్స్ రిపోర్టును పరిశీలిస్తే… 2020 నాటికి వైఫ్ మార్కెట్ విలువ 33.6 బిలియన్ డాలర్లు. ఆసియా ఫసిఫిక్ లో 22.6 శాతం, లాటిన్ అమెరికాలో 20.2 శాతం మేర వృద్ధిరేటు నమోదు చేసుకుంటోంది. ఇంటర్నెట్, స్మార్ట్ డివైసెస్ ఎక్కువవుతున్న కొద్దీ, వై-ఫై టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతోంది. AT&T, సిస్కో లాంటి కంపెనీలు ఈ రంగంలో దూసుకుపోతున్నాయి.

 ప్రవీణ్, సమీర్, దేశ్ పాండే 

 ప్రవీణ్, సమీర్, దేశ్ పాండే 


వై-ఫైని థర్డ్ పార్టీ హ్యాక్ చేయకుండా ఉండాలన్నా, సమర్థంగా పనిచేయాలన్నా భవిష్యత్ లో సెక్యూరిటీ తప్పనిసరిగా ఉండాల్సిందే. అందుకే వైఫై సెక్యూరిటీకి మంచి భవిష్యత్ ఉందని చెప్పవచ్చు.