ఓడితే ఓడారు.. కానీ కోట్లాది భారతీయుల మనసులు గెలుచుకున్నారు

ఓడితే ఓడారు.. కానీ కోట్లాది భారతీయుల మనసులు గెలుచుకున్నారు

Monday July 24, 2017,

2 min Read

ఫైనల్ మ్యాచ్ ఓడితే ఓడారు. కానీ నూటా ముప్పయ్ కోట్ల భారతీయుల మనసులు మాత్రం గెలుచుకున్నారు. మిథాలీ సేన చూపించిన తెగువ, పోరాటం, ఆత్మవిశ్వాసం యావత్ మహిళా లోకానికి స్ఫూర్తి నింపింది. క్రికెట్ మక్కా లార్డ్స్ లో నరాలు తెగే ఉత్కంఠ పోరులో 9 పరుగుల తేడాతో వరల్డ్ కప్ చేజారింది. 

image


కెప్టెన్ మిథాలీ ఎంత గంభీరంగా కనిపించినా, ఆమె కళ్లలో బాధ భారతీయుల హృదయాలను కలచివేసింది. హర్మన్ ప్రీత్ కౌర్ చిన్నబుచ్చుకున్న తీరు కదిలించింది. వేదా కృష్ణమూర్తి నిర్వేదంగా నిలబడిన తీరుకి పాపం అనిపించింది. అయినా సరే, కప్ రాలేదన్న మాట ఇండియన్ల నోట వినిపించలేదు. ఫైనల్ దాకా వచ్చేందుకు ఎంత శ్రమించారో, ఎంత కఠోర సాధన చేశారో మ్యాచ్ చూసిన ప్రతీ ఒక్కరికీ తెలుసు. ఆటన్నాక గెలపు ఓటములు సహజం.

ఫైనల్ మ్యాచ్. ఒత్తిడి సహజం. దాని పాలు కాస్త ఎక్కువైంది. పరుగుల లక్ష్యం చిన్నదే. అయినా అనుకున్న శుభారంభం దక్కలేదు. మంధన సున్నా పరుగులకే వెనుదిరగడం.. వెంటనే మిథాలీ రనౌట్ అవడం.. జట్టుని మానసికంగా దెబ్బతీశాయి. అయినా పూనమ్ ఆడుతుందన్న నమ్మకం.. హర్మన్ మళ్లీ చెలరేగిపోతుందని భరోసా కలిగింది. 138 పరుగుల దగ్గర హర్మన్ ఔట్ కావడంతో జట్టు మళ్లీ కష్టాల్లో పడిందనిపించింది. కానీ వేద క్రిజ్ లోకి వచ్చీ రావడంతోనే స్కోర్ అదే వేగంతో ముందుకు కదిలింది. హమ్మయ్య ఫరవాలేదు అని ఊపిరి పీల్చుకునేలోపు 86 పరుగులు చేసిన పూనమ్ ఫెవిలియన్ బాట పట్టింది. 

నరాల తెగే ఉత్కంఠ. వేదకు దీప్తి శర్మ తోడైంది. అట్టడుగుకి జారిపోయిన ధైర్యం మళ్లీ ఎగతన్నింది. 19 పరుగులు వచ్చాయో లేదో దీప్తి ఔటైంది. గోస్వామి, శిఖా పాండే, గైక్వాడ్ ఇలా ఒకరి వెనుక ఒకరు సున్నా పరుగులకే ఔట్ కావడంతో టీమిండియా ఓటమి ఖరారైంది. 48.4 ఓవర్లలో 219 పరుగులు చేసి ఆలౌట్ అయ్యారు.

ఇంగ్లండ్ జట్టులో సారా టేలర్ 45 పరుగులు, నటాలీ 51 పరుగులతో ఫైనల్లో కీలక పాత్ర పోషించారు. ఇంగ్లండ్ పేస్ బౌలర్ ష్రబ్ షోల్ ఆరు వికెట్లు తీసి ఇండియా ఓటమిని శాసించారు.